సాక్షి, హైదరాబాద్: మార్చిలో నిర్వహించాల్సిన టెన్త్ వార్షిక పరీక్షలపై ఉన్నతాధికారులు సమాలోచనలు చేస్తున్నారు. ఆరు పేపర్లా? 11 పేపర్లతో పరీక్ష నిర్వహించాలా? అనే అంశంపై తర్జన భర్జనలు పడుతున్నారు. గురువారం సమావేశమైన రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) అధికారులు.. ఈ ఏడాది వరకు 11 పేపర్లతోనే పరీక్షలు నిర్వహిస్తేనే బాగుంటుందని అభిప్రాయపడినట్టు తెలిసింది.
క్షేత్రస్థాయిలో ప్రధానోపాధ్యాయులు ఇచ్చిన సలహా మేరకు ముందుకు వెళ్ళాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు విద్యాశాఖకు ప్రతిపాదనలు పంపేందుకు ఎస్‌సీఈఆర్‌టీ సిద్ధమైనట్లు తెలిసింది. అయితే పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు మాత్రం ఈ ప్రతిపాదనలపై విముఖత వ్యక్తం చేస్తున్నారు. 11 పేపర్లకు బదులు ఆరు పేపర్లతోనే పరీక్షలు జరపాలని భావిస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు. ఇలా ప్రతి సందర్భంలోనూ ఎస్‌సీఈఆర్‌టీ, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ మధ్య సమన్వయం కొరవడుతుండటం గమనార్హం.
తొలుత 11 పేపర్లకే షెడ్యూల్!
ఈ ఏడాది స్కూల్స్ ఆరంభంలోనే 9, 10 తరగతులకు పరీక్షలపై పాఠశాల విద్యాశాఖ స్పష్టత ఇచ్చింది. గతంలో మాదిరి 11 పేపర్లతోనే పరీక్షలు ఉంటాయని తెలిపింది. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేసింది. ఇందుకు అనుగుణంగానే నవంబర్ 1వ తేదీ నుంచి జరిగే ఎస్‌ఏ– 1 పరీక్ష ప్రశ్నపత్రాలను జిల్లా అధికారులు రూపొందించి, కొన్ని చోట్ల ప్రింటింగ్‌కు కూడా పంపారు.
అయితే ఈ సమయంలోనే ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కరోనా సమయంలో ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించారు. ఇప్పుడు కూడా అదే మాదిరిగా విద్యార్థులకు సరళంగా ఉండేలా, వారిపై భారం తగ్గించేలా ఆరు పేపర్లతో పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు.
హెచ్‌ఎంల్లో వ్యతిరేకత
11 పేపర్లకు సిద్ధమైన నేపథ్యంలో, ప్రశ్నపత్రాల ప్రింటింగ్‌కు ఆర్డర్లు కూడా ఇచ్చిన తర్వాత పేపర్లు తగ్గించడం ఇబ్బంది కల్గిస్తుందని పలు జిల్లాల హెచ్‌ఎంలు అభిప్రాయపడ్డారు. దీనివల్ల విద్యార్థులు కూడా గందరగోళంలో పడే వీలుందని స్పష్టం చేశారు. దీంతో ఎస్‌ఏ–1 వరకూ 11 పేపర్లతో పరీక్షలు నిర్వహించి, ఎస్‌ఏ–2 (వార్షిక పరీక్షలు) మాత్రం ఆరు పేపర్లతో నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. దీనిపై ఎస్‌సీఈఆర్‌టీ జిల్లాల వారీగా అభిప్రాయాలు తెలుసుకుంది.
వార్షిక పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఎస్‌ఏ–1 తోడ్పడుతుందని, ఎస్‌ఏ–1 ఒక రకంగా, ఎస్‌ఏ–2 మరో రకంగా ప్రశ్న పత్రాలు ఉంటే విద్యార్థులు ఇబ్బందుల్లో పడే వీలుందనే అభిప్రాయం వ్యక్తమైంది. దీన్ని ఆధారంగా చేసుకునే ఎస్‌సీఈఆర్‌టీ రెండు పరీక్షలను 11 పేపర్లతోనే నిర్వహిస్తే బాగుంటుందనే ప్రతిపాదనను సిద్ధం చేసింది. కానీ పాఠశాల విద్యాశాఖ విముఖత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. దీనిపై నాన్చకుండా విధానం ఏదైనా ముందే స్పష్టత ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. అప్పుడే ఆ మేరకు వార్షిక పరీక్షలకు సిద్ధమయ్యే వీలుంటుందని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment