( ఫైల్ ఫోటో )
సాక్షి, హైదరాబాద్: కోర్టు తీర్పుతో టీచర్ల బదిలీ ప్రక్రియకు మళ్ళీ బ్రేక్ పడింది. సగం వరకూ వచ్చిన షెడ్యూల్‌ను మధ్యలోనే నిలిపివేయాలని అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం విడుదల చేయాల్సిన సీనియారిటీ జాబితాను తక్షణమే నిలిపివేయాలని పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన సోమవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
►317 జీవో ద్వారా కొత్త జిల్లాలకు వెళ్ళిన టీచర్లకు బదిలీ అవకాశం లేకుండా, రెండేళ్ళ కనీస సర్వీసు నిబంధన పెడుతూ విద్యాశాఖ ఇటీవల జీవో ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ కొంతమంది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వారికి అనుకూలంగా కోర్టు తీర్పు ఇవ్వడంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు సోమవారం రాత్రి 11 గంటల వరకూ చర్చలు జరిపారు.
విషయాన్ని ప్రభుత్వానికి చేరవేయడంతో బదిలీ ప్రక్రియ నిలిపివేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ అధికారులకు చెప్పినట్టు తెలిసింది. దీంతో మంగళవారం విడుదల చేయాల్సిన బదిలీ జాబితాను నిలిపివేయాలని విద్యాశాఖ నిర్ణయించినట్టు సమాచారం. కోర్టు తీర్పు తుది కాపీ ఇంకా అందలేదని, మంగళవారం కాపీ వచ్చిన తర్వాత తీర్పుపై అప్పీలుకు వెళ్ళడమా? తీర్పును అమలు చేయడమా? అనేది ఆలోచిస్తామని పాఠశాల విద్య ఉన్నతాధికారి తెలిపారు.
ఈ ఏడాదికి బదిలీలు లేనట్టే!
కోర్టు తీర్పు ప్రకారం కొత్త జిల్లాలకు వెళ్ళిన టీచర్లకు బదిలీ అవకాశం ఇవ్వడం ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పనికాదని అధికారులు అంటున్నారు. బదిలీ అవకాశం లేని టీచర్లు దాదాపు 25 వేల మంది ఉంటారు. కోర్టు తీర్పుకు అనుగుణంగా వెళ్ళాలంటే మళ్ళీ కొత్తగా షెడ్యూల్ ఇవ్వాల్సి ఉంటుంది. బదిలీ ప్రక్రియకు అనుసరించే సాఫ్ట్‌వేర్ మొత్తం మార్చాల్సిన అవసరం ఏర్పడుతుంది. 317 జీవో ప్రకారం వెళ్ళిన టీచర్ల ఉమ్మడి జిల్లాలోని సీనియారిటీ మళ్ళీ లెక్కగట్టాలి. ఈ ప్రక్రియకు కనీసం రెండు నెలల సమయం పడుతుందని భావిస్తున్నారు.
►బదిలీల ప్రక్రియ గత నెల 28న మొదలైంది. దాదాపు 59 వేల మంది టీచర్లు బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీళ్ళలో ఎవరైనా కోర్టుకు వెళ్ళినా సమస్య మళ్ళీ జటిలమయ్యే అవకాశం కల్పిస్తోంది. అలా కాకుండా అంతా సవ్యంగా సాగినా... రెండు నెలలు పడుతుంది. ఈ లోగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వీలుంది. ఈ సమయంలో బదిలీలకు సంబంధించిన షెడ్యూల్ ఇవ్వడం సాధ్యం కాదు. కాబట్టి బదిలీల వ్యవహారం ఈ ఏడాది ఉండకపోవచ్చనే వాదన విన్పిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment