టీచర్ల బదిలీలకు గ్రీన్‌ సిగ్నల్‌ పదోన్నతులకూ ఓకే | Telangana Govt Green Signal On Teachers Transfers And Promotions | Sakshi
Sakshi News home page

టీచర్ల బదిలీలకు గ్రీన్‌ సిగ్నల్‌ పదోన్నతులకూ ఓకే

Published Tue, Jan 17 2023 1:05 AM | Last Updated on Tue, Jan 17 2023 3:35 PM

Telangana Govt Green Signal On Teachers Transfers And Promotions - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పదోన్నతులు, బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఉపాధ్యాయ వర్గాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. మంగళ, బుధవారాల్లో ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ విడుదలవుతుందని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆశిస్తున్నారు.  విధి విధానాలు ఎలా ఉంటాయని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతిని పురస్కరించుకుని మంత్రులు హరీష్‌రావు, సబిత ఇంద్రారెడ్డి ఆదివారం ఆయా సంఘాల నేతలతో సమాలోచనలు జరిపారు.

అనంతరం బదిలీలు, పదోన్నతులకు సీఎం కేసీఆర్‌ అంగీకారం తెలిపారని, త్వరలోనే షెడ్యూల్‌ విడుదల చేస్తామని సబిత తెలిపారు. కస్తూరీ బా గాంధీ బాలికల విద్యాలయంలో కూడా ఇది అమలవుతుందని ఆమె చెప్పారు. సంక్రాంతి కానుకగా ఈ శుభవార్త చెబుతున్నట్టు ఆమె పేర్కొన్నారు. టెన్త్‌ పరీక్షల షెడ్యూల్‌ ప్రకటించడం... ఇతర తరగతుల పరీక్షలు త్వరలో జరుగుతున్న కారణంగా ట్రాన్స్‌ఫర్లు,  ప్రమోషన్లు ప్రకటించినా, ఏప్రిల్‌ తర్వాతే వీటిని అమలు చేస్తామని తెలిపారు. అయితే ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియను ఫిబ్రవరి రెండో వారం కల్లా పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు.

ప్రమోషన్లు ఎంతమందికి?
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 1.05 లక్షల మంది ఉపాధ్యాయులున్నారు. వీటిల్లో 18 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం 12 వేల పోస్టులే ఖాళీగా ఉన్నాయని అసెంబ్లీలో తెలిపింది. 317 జీవో అమలు తర్వాత దీనిపై స్పష్టమైన లెక్కలు తీయాల్సి ఉంది.  ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 7111 ఖాళీలున్నాయి.

సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ (ఎస్‌జీటీ)లకు పదోన్నతులు కల్పించడం ద్వారా 70  శాతం ఖాళీలు భర్తీ చేస్తారు. మిగిలిన 30 శాతం డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తారు. ఈ క్రమంలో 5 వేల మంది ఎస్‌జీటీలకు స్కూల్‌ అసిస్టెంట్స్‌గా పదోన్నతి లభిస్తుంది. ప్రాథమిక పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయ పోస్టులు 2084 ఖాళీలున్నాయి. వీటిని ఎస్‌జీటీల ద్వారా భర్తీ చేస్తారు. ఉన్నత పాఠశాలల్లో 1948 పోస్టులు ఖాళీ ఉన్నాయి. వీటిని ప్రస్తుతం ఉన్న స్కూల్‌ అసిస్టెంట్స్‌ ద్వారా భర్తీ చేయాల్సి  ఉంటుంది. ఇలా మొత్తం 9 వేల మందికిపై ఉపాధ్యాయులకు ప్రమోషన్లు లభిస్తాయి. 

కోర్టు వివాదాల తర్వాతే ఎంఈవోలు, డిప్యూటీ డీఈవోల భర్తీ
మండల విద్యాశాఖాధికారులు, డిప్యూటీ జిల్లా విద్యాశాఖాధికారులు, భాషా పండితుల అప్‌గ్రేడ్‌ వ్యవహారం చేపట్టేందుకు ప్రభుత్వం సాహసించడం లేదు. రాష్ట్రంలో 443 ఎంఈవో పోస్టులున్నాయి. కానీ ఇప్పుడు పనిచేస్తున్న ఎంఈవోలు 21 మంది మాత్రమే. డిప్యూటీ డీఈవో పోస్టులు 78 ఉంటే 18 మంది మాత్రమే పని చేస్తున్నారు.

ఎంఈవో పోస్టులను నేరుగా ఎంపికైన ప్రభుత్వ హెచ్‌ఎంల ద్వారానే భర్తీ చేయాలని ప్రభుత్వ టీచర్లు డిమాండ్‌ చేస్తున్నారు. స్థానిక సంస్థల పాఠశాలలకూ ఈ అవకాశం ఇవ్వాలని మరికొన్ని సంఘాలు పట్టుబడుతున్నాయి. ప్రస్తుతం వివాదం కోర్టు పరిధిలో ఉంది. భాషా పండితుల విషయం కూడా న్యాయస్థానంలో ఉంది. ఈ కారణంగా కోర్టు వివాదం ముగిసిన తర్వాతే ఈ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. 

ఎన్నికల కోసమేనా?
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మార్చిలో ఈ ఎన్నిక జరిగే వీలుంది. మరోవైపు సాధారణ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే 317 జీవో కారణంగా ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. 2015లో ప్రమో షన్లు, బదిలీలు చేపట్టారు. 2017లో మరోసారి బదిలీలు మాత్రమే జరిగాయి.

అప్పట్నుంచి బది లీలు, పదోన్నతులు లేవు. ఈ ప్రభావం ఎమ్మెల్సీ, సాధారణ ఎన్నికలపై ఉంటుందని ప్రభుత్వం సందేహిస్తోందని, అందుకే హడావుడిగా ఉపాధ్యా యవర్గాలను  ఆకర్షించేందుకు ప్రకటన చేశారని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. 317 జీవో కారణంగా జరిగిన బదిలీల్లో 13 జిల్లాల్లో స్పౌజ్‌ కేసులను పరిష్కరించలేదని, ఇప్పుడు బదిలీలు ఎలా చేపడతారని మరికొంతమంది అంటున్నారు.

ఖాళీలన్నీ భర్తీ చేయాలి 
బదిలీలు, పదోన్నతులు ఇవ్వాలనే నిర్ణయం మంచిదే. దీంతో పాటు స్కూళ్ళలో అన్ని స్థాయి ల్లో ఖాళీలు భర్తీ చేయాలి.. అప్పుడే విద్యా వ్యవస్థలో మార్పు సాధ్యం. ఎంఈవో, డిప్యూటీ డీఈవో వంటి పర్యవేక్షక పోస్టులను విస్మరించకూడదు.
– పి రాజభాను చంద్ర ప్రకాశ్, తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్‌ హెచ్‌ఎంల సంఘం అధ్యక్షుడు

మంచి నిర్ణయం 
ఉపాధ్యాయ సంఘాలకు ఈ తరహా తీపి కబురు ఇచ్చిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. పాఠశాలల్లో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఈ ప్రక్రియ పూర్తి చేయాలనే నిర్ణయం సమర్థనీయం. 
– బీరెల్లి కమలాకర్, పింగిలి శ్రీపాల్‌ రెడ్డి (పీఆర్‌టీయూటీఎస్‌ నేతలు) 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement