మంత్రి సబితకు వినతిపత్రం సమర్పిస్తున్న పీఆర్టీయూటీఎస్ నేతలు
సాక్షి, హైదరాబాద్: ఈ నెలాఖరులోగా ప్రభుత్వ, పంచాయతీరాజ్, ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ మొదలవుతుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తమకు తెలిపినట్లు పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డితో కలిసి సంఘం నేతలు సోమవారం మంత్రిని కలిసి, ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులపై వినతిపత్రం అందించారు.
ఈ సందర్భంగా మంత్రి మోడల్ స్కూల్ టీచర్ల బదిలీలు కూడా చేపడతామని భరోసా ఇచ్చినట్లు చెప్పారు. వారం రోజుల్లో సీనియారిటీ జాబితా రూపొందించేలా డీఈవోలకు ఆదేశాలు జారీ చేస్తామని మంత్రి తెలిపారన్నారు. పరస్పర బదిలీలకు సంబంధించిన ఒప్పందపత్రం సమర్పించిన వారికి వెంటనే ఉత్తర్వులివ్వాలని సీఎస్ సోమేశ్‌కుమార్‌ను కోరగా, దానికి ఆయన సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. జీఏడీ ఆమోదం లభించిన తర్వాత ఆర్థిక శాఖ ఆమోదంతో ఒకట్రెండు రోజుల్లో అవసరమైన ఉత్తర్వులు అందనున్నాయని తెలిపారు. సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ బదిలీల షెడ్యూల్డ్ ఈ వారంలో వెలువడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment