బంజారాహిల్స్(హైదరాబాద్): తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కార్యాలయ సిబ్బందిమంటూ పరిచయం చేసుకుని ప్రముఖ షూస్ తయారీ కంపెనీని మోసం చేసిన ఏడుగురు వ్యక్తులపై బంజారాహిల్స్‌పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర శిక్షా అభియాన్ పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో షూస్, స్కూల్ బ్యాగ్స్ పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన ఆర్డర్‌ను తమకు కేటాయించాలని హరియాణా రాష్ట్రంలోని కర్నైల్ పట్టణానికి చెందిన లిబర్టీ షూస్ లిమిటెడ్ సంస్థ 2019 డిసెంబర్‌లో రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేసింది.
కొన్ని రోజుల తర్వాత విద్యాశాఖ మంత్రి పర్సనల్ అసిస్టెంట్‌ను అంటూ జీకే.కుమార్, సెకండ్‌పర్సనల్ అసిస్టెంట్ అంటూ బెల్లి తేజ, పోలిటికల్ సెక్రటరీ అంటూ ప్రవీణ్‌వర్మ తదితరులు లిబర్టీ సంస్థ ప్రతినిధి కమల్ ధవన్‌కు ఫోన్ చేశారు. షూస్ కాంట్రాక్ట్ విషయంపై మాట్లాడదామంటూ హైదరాబాద్‌కు పిలిపించారు. కాంట్రాక్ట్ విషయం ఫైనల్ చేస్తామని దీనికోసం ప్రాసెసింగ్ ఫీజులతో పాటు ఇతర చార్జీల కింద ఇవ్వాలంటూ రూ.17.66 లక్షలు వసూలు చేశారు.
చదవండి: HYD: మలక్‌పేట్‌లో కలకలం.. మొండెం లేని మహిళ తల లభ్యం
వివిధ అకౌంట్ నెంబర్లకు ఈ డబ్బును పంపించాలని సూచించారు. వారి సూచనల మేరకు డబ్బు చెల్లించిన లిబర్టీ సంస్థ ప్రతినిధులు ఏళ్లు గడుస్తున్నా కాంట్రాక్ట్ రాకపోవడంతో అనుమానం వచ్చి వాకబు చేయగా కుమార్ అనే వ్యక్తి గతంలో పనిచేసిన మాట వాస్తవమేనని, అతడిని ఉద్యోగంలోంచి తొలగించారని తేలింది. దీంతో తమను మోసం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని లిబర్టీ షూస్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధి కమల్ ధావన్ సోమవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జీకే.కుమార్, బెల్లితేజ, ప్రవీణ్‌వర్మ, స్వాతి, విక్రమ్ పురి, అంజనేయులు, రమేష్ రెడ్డి అనే వ్యక్తులపై ఐపీసీ 406,420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment