సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. ఈ నెల 27 నుంచి ఈ ప్రక్రియ మొదలుకానుంది. 37 రోజుల్లో దీన్ని పూర్తి చేయనున్నారు. వీలైనంత త్వరగా అధికారిక షెడ్యూల్ విడుదల చేయాలని విద్యాశాఖ అధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఈ మేర కు మంత్రి కార్యాలయం ఒక ప్రకటన వెలువరించింది. శుక్రవారం సాయంత్రం మంత్రి సబిత విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమాలోచనలు జరిపారు. కాగా కొన్ని మార్పుచేర్పులతో శని వా రం షెడ్యూల్‌ను విడుదల చేస్తామని అధికారులు తెలిపాయి. దీనికి గతంలో బదిలీలపై విధించిన నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేయాల్సి ఉంది.
కలెక్టర్ కన్వీనర్‌గా..
టీచర్ల బదిలీలు, పదోన్నతులపై కొన్ని రోజులుగా అధికారవర్గాలు తీవ్ర కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఉపాధ్యాయ సంఘాలతో ఉన్నతాధికారులు విస్తృతంగా చర్చలు జరిపారు. గతానికి భిన్నంగా బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలో కలెక్టర్లకు కీలక బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. ప్రతి జిల్లాలోనూ కలెక్టర్ కన్వీనర్‌గా, జిల్లా పరిషత్ చైర్మన్, సీఈవో సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టే ఆలోచనలో ఉన్నారు. గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ టీచర్ల బదిలీలు, పదోన్నతుల్లో ముఖ్య భూమిక పోషించేవారు. దీనివల్ల అనేక సమస్యలు వచ్చాయని, ఐఏఎస్‌లకు బాధ్యత అప్పగిస్తే ఎలాంటి తలనొప్పులు ఉండవని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది.
ప్రమోషన్లకు అర్హుల జాబితా సిద్ధం
ఎస్‌జీటీల నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా, ఎస్‌ఏల నుంచి హెచ్‌ఎంలుగా పదోన్నతి కల్పించేందుకు అర్హత గల వారి జాబితాను శుక్రవారం అధికారులు సిద్ధం చేశారు. జిల్లాల వారీగా వీటిని కలెక్టర్ల పరిశీలనకు పంపుతున్నట్టు ఓ అధికారి తెలిపారు. మార్గదర్శకాలపై ఇంకా కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే కోర్టు వివాదాలున్న కారణంగా భాషా పండితుల విషయంలో బదిలీలు, పదోన్నతులు చేపట్టే అవకాశం లేదని అధికార వర్గాలు తెలిపాయి. కాగా షెడ్యూల్ విడుదల రోజునే ఉపాధ్యాయ ఖాళీలను ప్రకటించే అవకాశం ఉందని ఉపాధ్యాయ సంఘాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment