సాక్షి, హైదరాబాద్: వచ్చే జూన్‌లో ప్రారంభం కానున్న కొత్త విద్యా సంవత్సరంలో (2020–21) రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోటా అమలు చేయాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. గతేడాదే మేనేజ్‌మెంట్ కోటా అమలు కోసం యాజమాన్యాలు విజ్ఞప్తి చేసినా ఆచరణకు నోచుకోలేదు. ఎట్టకేలకు వచ్చే విద్యా సం వత్సరం నుంచి అమలుకు ఓకే చెప్పింది. దీంతో డిగ్రీ కాలేజీల్లోని 30 శాతం సీట్లను యాజమాన్యాలే భర్తీ చేసుకునేలా అనుమతి ఇవ్వనుంది. మేనేజ్‌మెంట్ కోటా ద్వారా చేరే విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించదు.
దీంతో ప్రభుత్వంపై ఆర్థిక భా రం ఉండదనే ఆలోచనతో ఈ నిర్ణయానికి వచ్చింది. మరోవైపు ఈ నిర్ణయంతో ఆర్థిక స్తోమత కలిగిన విద్యార్థులు తాము కోరుకున్న కాలేజీల్లో చేరే వీలు ఏర్పడనుంది. అలాగే వచ్చే సంవత్సరంలో వంద శాతం విద్యార్థులు చేరిన కోర్సులకు అదనపు సెక్షన్లను ఇవ్వాలని, కొత్త కోర్సులకు అనుమతి ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగా మంగళవారం రాష్ట్రంలోని 9 ప్రైవేటు అటానమస్ కాలేజీ యాజమాన్య ప్రతినిధులతో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫె సర్ తుమ్మల పాపిరెడ్డి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి సమావేశమై చర్చించారు.
ఆయా కాలేజీల్లో ఉన్న కోర్సులు, వాటి నిర్వహణ, సిలబస్, పరీక్షల నిర్వహణ, సబ్జెక్టు కాంబినేషన్, మార్కెట్‌లో వాటికి ఉన్న డిమాండ్, ఆయా యాజమాన్యాలు చేపడుతున్న చర్యలపై చర్చించారు. ప్రైవేటు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఉపాధినిచ్చే కోర్సులను అనుమతించడం ద్వారా విద్యార్థులకు ఉపాధి అవకాశాలను అందుబాటులోకి తేవాలన్న నిర్ణయానికి వచ్చారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో ఈడబ్ల్యూఎస్‌ను అమలు చేస్తారు.
అటానమస్ కాలేజీల్లో రెండేళ్లే భాషా సబ్జెక్టులు
అటానమస్ డిగ్రీ కాలేజీల్లో ఇంగ్లిష్, తెలుగు వంటి భాషలను ఇకపై మూడేళ్లు చదవాల్సిన అవసరం లేకుండా నిబంధనలను సడలించనున్నారు. డిగ్రీలో భాషా సబ్జెక్టులు మూడేళ్లు ఉన్న కారణంగా ప్రధాన సబ్జెక్టులకు సమయం సరిపోవడం లేదని అటానమస్ కాలేజీలు ఉన్నత విద్యా మండలి దృష్టికి తెచ్చాయి.
దీంతో ఆయా కాలేజీల్లో భాషా సబ్జెక్టులను రెండేళ్లు మాత్రమే చదివేలా చర్యలు చేపడతామని మండలి హామీ ఇచ్చింది. అయితే భాషా సబ్జెక్టులకు ప్రస్తుతం ఉన్న 20 క్రెడిట్స్ నిబంధనను అలాగే కొనసాగించాలని స్పష్టం చేసింది. భాషా సబ్జెక్టుకు 20 క్రెడిట్స్ లేకపోతే విద్యార్థి ఆ భాషలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసే వీలు ఉండదు. కాబట్టి ప్రస్తుతం ఉన్న క్రెడిట్స్‌ను యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment