THUMMALA papireddy
-
70% సిలబస్‌తోనే ఇంటర్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్, ఎంసెట్ పరీక్షల్లో పరిగణనలోకి తీసుకోవా ల్సిన సిలబస్ ఖరారైంది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో 70% సిలబస్ తోనే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెకండియర్ పరీక్షలు నిర్వహించే 70% సిలబస్‌ను ఎంసెట్‌కు పరిగణనలోకి తీసుకోనుంది. ఫస్టియర్‌కు సంబంధించి గత మార్చిలోనే విద్యార్థులు పరీక్షలు రాసినందున ప్రథమ సంవత్సరంలోని పూర్తి సిలబస్‌ను ఎంసెట్‌లో పరిగణనలోకి తీసుకోనున్నారు. విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, మండలి కార్యదర్శి శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు. కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితులు, విద్యా బోధనకు ఏర్పడిన ఆటంకాలపై చర్చించారు. ముఖ్యంగా ఇంటర్మీడియట్, ఎంసెట్‌కు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. సిలబస్‌కు సంబంధించిన విధానం 2020–21 విద్యా సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. మరోవైపు ప్రస్తుతం ఎంసెట్ ర్యాంకుల ఖరారులో ఇంటర్మీడియట్ మార్కులకు ఇచ్చే 25 శాతం వెయిటేజీని తొలగించేది లేదని, యథాతథంగా కొనసాగించాలని కమిటీ నిర్ణయించింది. ప్రశ్నల సంఖ్య పెంపు.. ఇంటర్మీడియట్లో ప్రశ్నల సంఖ్యను పెంచి, విద్యార్థులకు ఎక్కువ ఆప్షన్లు ఉండేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. దీంతో ఇంటర్ వార్షిక పరీక్షల్లో ప్రశ్న పత్రాల్లో విద్యార్థులకు ఇచ్చే ప్రశ్నల సంఖ్యను రెట్టింపు చేయడం ద్వారా విద్యార్థులకు ఎక్కువ చాయిస్ ఉండనుంది. కరోనా కారణంగా ప్రత్యక్ష బోధన లేకపోవడం, గత సెప్టెంబర్ 1 నుంచి జనవరి 31 వరకు ఆన్లైన్/ డిజిటల్ బోధన మాత్రమే కొనసాగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఆ పాఠాలు ఎంత మేరకు అర్థం అయ్యాయనే గందరగోళం ఉంది. అందుకే విద్యార్థులపై పరీక్షల ఒత్తిడి తగ్గించేందుకు 30 శాతం సిలబస్ తగ్గింపుతో పాటు చాయిస్ ఎక్కువ ఉండేలా చర్యలు చేపట్టింది. ఎంసెట్‌లోనూ ఎక్కువ చాయిస్.. ఎంసెట్‌లోనూ విద్యార్థులకు ఎక్కువ చాయిస్ ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ప్రస్తుతం 160 ప్రశ్నలకు 160 మార్కుల విధానం ఉంది. అయితే ఈ సారి విద్యార్థులకు ఎక్కువ చాయిస్ ఉండేలా చర్యలు చేపట్టే ఆలోచనల్లో అధికారులు ఉన్నారు. 180 ప్రశ్నలు ఇచ్చి 160 ప్రశ్నలకు సమాధానాలు రాసే విధానం తీసుకొచ్చే అవకాశముంది. ప్రస్తుతం దీనిపై అధికారికంగా నిర్ణయం తీసుకోలేదు. వచ్చే 10 రోజుల్లో ఎంసెట్ కన్వీనర్‌ను ఉన్నత విద్యా మండలి నియమించనుంది. ఆ తర్వాత ప్రశ్నపత్రం, ఆప్షన్లు తదితర అంశాలపై ఓ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీనే తుది నిర్ణయం తీసుకోనుంది. జూన్ 14 తర్వాత ఎంసెట్ ‘ఇంటర్ వార్షిక పరీక్షల్లో భాగంగా ప్రధాన సబ్జెక్టుల పరీక్షలు మే 13తో పూర్తవుతాయి. కాబట్టి విద్యార్థులు ఎంసెట్‌కు సిద్ధం అయ్యేందుకు 4 వారాల గడువు ఇస్తాం. జూన్ 14 తర్వాత ఎంసెట్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉంటాం. అయితే ఆన్లైన్ పరీక్షలను నిర్వహించే సాంకేతిక సంస్థ అయిన టీసీఎస్ స్లాట్స్‌ను బట్టి పరీక్షల తేదీలు ఖరారు చేస్తాం.’ – ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి -
9 నుంచి ఇంజనీరింగ్ ప్రవేశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 9 నుంచి ఇంజనీరింగ్ ప్రవేశాలు చేపట్టాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఖరారు చేసింది. గతేడాది విధానంలోనే ఈసారి కూడా ప్రవేశా లు చేపట్టాలని నిర్ణయించారు. రెండు దశల కౌన్సెలింగ్ తరువాత వచ్చే నెల 4న స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పించనున్నారు. స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలను https://tseamcet.nic.in వెబ్సైట్లో అందుబాటు లో ఉంచనున్నారు. నవంబర్ 5వ తేదీ నాటికి ప్రవేశాలు పూర్తయితే ఇంజనీరింగ్ తరగతులను నవంబర్ 10 లేదా 15వ తేదీ నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. అయితే దీనిపై అధికారిక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. (చదవండి: ‘అడ్వాన్స్డ్’లో తెలుగోళ్లు) సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు 36 హెల్ప్‌లైన్ కేంద్రాలు కరోనా నిబంధనలు పాటిస్తూనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. ఇందుకోసం 36 హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. నిర్ణీత తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్ట నుంది. ప్రతి అర గంటకో స్లాట్ ఉండేలా కస రత్తు చేసింది. విద్యార్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో హెల్ప్‌లైన్ సెంటర్, తేదీ, సమయాన్ని పేర్కొంటూ ఆన్లైన్ ద్వారానే స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా సమయాల్లో సంబంధిత హెల్ప్‌లైన్ కేంద్రానికి వెళ్లి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసుకొనేలా కమిటీ ఏర్పాట్లు చేసింది. ప్రాసెసింగ్ ఫీజును ఎస్సీ, ఎస్టీలకు రూ. 600గా, ఇతర విద్యార్థులకు రూ. 1200గా నిర్ణయించింది. కౌన్సెలింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను వెబ్సైట్లో బుధవారం అందుబాటులో ఉంచనుంది. (చదవండి: డబ్బులు ఎవ్వరికీ ఊరికే రావు: సజ్జనార్) -
1,41,340 మందికి సీట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన మొదటి దశ ఆన్లైన్ ప్రక్రియలో 1,41,340 మంది విద్యార్థులకు సీట్లు లభించాయి. ఈ మేరకు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) సోమవారం సీట్ల కేటాయింపును ప్రకటించింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్, దోస్త్ కన్వీనర్, మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, సీజీజీ డీజీ రాజేంద్ర నిమ్జే, కళాశాల విద్య ఏజీవో బాలభాస్కర్ తదితరులు వివరాలు వెల్లడించారు. మొదటి దశలో 1,71,275 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, 1,53,323 మంది ఆప్షన్లు ఇచ్చుకున్నారు. వీరిలో 1,41,340 మందికి సీట్లు లభించాయి. ఈసారి సీట్లు పొందిన వారిలో బాలికలే అత్యధికం. మొదటి ఆప్షన్ కాలేజీల్లోనే అధిక శాతం మందికి.. ఈసారి తక్కువ వెబ్ ఆప్షన్లు ఇచ్చినందున 11,983 మందికి సీట్లు లభించలేదు. విద్యార్థులు ఎంచుకున్న జిల్లా, కోర్సు, ప్రభుత్వ కాలేజీలో సీట్లు పొందిన వారు 282 మంది ఉన్నారు. ఈసారి కొత్తగా ప్రవేశపెట్టిన బీఎస్సీ డేటా సైన్స్ కోర్సులో మొత్తం 6,780 సీట్లు అందుబాటులో ఉండగా, 2,598 మందికి సీట్లు లభించాయి. సీట్లు పొందిన మొత్తం విద్యార్థుల్లో 65,167 మంది (46.10శాతం) బాలురు, 76,173 మంది (53.90 శాతం) బాలికలు ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 982 కాలేజీల్లో 4,07,390 సీట్లు ఉండగా, మొదటి దశ సీట్ల కేటాయింపు 1,41,340 (34.69 శాతం) తరువాత ఇంకా 2,66,050 సీట్లు ఖాళీగా ఉన్నాయి. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం వల్ల ఈసారి విద్యార్థులు కొత్త కాంబినేషన్లు ఎంచుకున్నారు. గతేడాది 174 రకాల కాంబినేషన్లతో కోర్సులు ఉంటే ఈసారి 501 రకాల కాంబినేషన్లతో కోర్సులు అందుబాటులోకి తెచ్చారు. ఇక ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల్లో ఎక్కువగా బాలికలే ఉన్నారు. వారిలో అధికశాతం మందికి యూనివర్సిటీ కాలేజీలు, నిజాం కాలేజీల్లో సీట్లు లభించాయి. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. మొదటి దశ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు కచ్చితంగా మొదట ఫీజు చెల్లించి సీటు కన్ఫర్మ్ చేసుకోవాలని, అలా చేయకపోతే ఈ సీటు ఉండదని దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి పేర్కొన్నారు. ‘విద్యార్థులు సీటు కన్ఫర్మ్ చేసుకున్న తరువాత రెండో దశ, మూడో దశ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. ఇపుడు నచ్చిన కాలేజీలోనే సీటు వచ్చిందనుకుంటే రెండు, మూడు దశల కౌన్సెలింగ్‌లో పాల్గొనవద్దు. ప్రస్తుత కాలేజీ నచ్చకపోతేనే రెండో దశ కౌన్సెలింగ్‌లో ఇంతకంటే నచ్చిన కాలేజీల్లో మాత్రమే ఆప్షన్లు ఇచ్చుకోవాలి. అపుడు ఆ కాలేజీలో సీటు వస్తే సరే. లేదంటే ఇపుడున్న సీటు అలాగే ఉంటుంది. ఒకవేళ రెండు మూడు దశల్లో ఇపుడు సీటు వచ్చిన కాలేజీ కంటే సాధారణ కాలేజీలకు ఆప్షన్ ఇస్తే, వాటిల్లో ఏదేని కాలేజీల్లో సీటు లభిస్తే ఇపుడు వచ్చిన సీటు ఆటోమెటిక్‌గా రద్దు అవుతుంది. కాబట్టి తమకు బెటర్ అనుకున్న దానికే ఆప్షన్ ఇవ్వాలి. ఇపుడు చెల్లించిన ఫీజు విషయంలో ఎలాంటి ఆందోళన అక్కర్లేదు. రెండు, మూడు దశలో సీటు వచ్చినా ఆ కాలేజీ ఫీజు ప్రకారమే ఇపుడు చెల్లించిన మొత్తాన్ని సర్దుబాటు చేస్తారు. సీట్లు పొందిన విద్యార్థులకు ఎస్ఎంఎస్ ద్వారా మొబైల్‌కు వస్తాయి. దోస్త్ వెబ్సైట్లో విద్యార్థులు లాగిన్ అయి సీటు కేటా యింపు ఫీజు రూ. 500/రూ.1000 చెల్లించి ఈనెల 26లోగా సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా సీటు కన్ఫర్మ్ చేసుకోవాలి’అని సూచించారు. -
విద్యార్థుల భవిష్యత్తు కోసమే...
సాక్షి, హైదరాబాద్: ‘ప్రస్తుత పరిస్థితుల్లో రిస్క్ అయినా పకడ్బందీ ఏర్పాట్ల మధ్య ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) నిర్వహణకు చర్యలు చేపట్టాం. జూలై 1 నుంచి సెట్స్ ప్రారంభమవుతాయి. విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించే వాటి నిర్వహణకు పక్కాగా చర్యలు చేపడుతున్నాం’అని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి చెప్పారు. ‘ఇప్పుడు సెట్స్ నిర్వహించకపోతే ప్రవేశాలపై తీవ్ర ప్రభావం ఉంటుంది. దాంతో పిల్లలు ఒక విద్యా సంవత్సరం నష్టపోయే ప్రమాదం ఏర్పడవచ్చు. ఈ నష్టాన్ని ఆపలేకపోయామనే బాధ మమ్మల్ని వెంటాడకూడదు. అందుకే ధైర్యంగా ముందడుగు వేస్తున్నాం. ఒక్కో విద్యార్థి మూడు గంటల పాటు హాజరయ్యే పరీక్షల నిర్వహణకు అన్ని రకాల జాగ్రత్తలతో ముందుకు సాగుతున్నాం’అని వివరించారు. రాష్ట్రంలో నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు 4,68,271 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఆయా పరీక్షల ఏర్పాట్లపై పాపిరెడ్డి ‘సాక్షి’తో చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే.. అడుగడుగునా శానిటైజేషన్.. సెట్స్‌కు హాజరయ్యే విద్యార్థులు మాస్క్‌లు, గ్లౌజులు ధరించడం తప్పనిసరి. పరీక్ష కేంద్రాల్లో అడుగడుగునా శానిటైజ్ చేస్తాం. గేట్ దగ్గరి నుంచి మొదలు.. ల్యాబ్స్, బాత్రూమ్లు ప్రతిచోటా శానిటైజర్లను ఉంచుతాం. ఆయా చోట్ల సిబ్బందిని నియమించి శానిటైజర్ వేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం. లేదా విద్యార్థులు సొంతంగా శానిటైజర్ బాటిల్స్, చిన్న వాటర్ బాటిల్ వెంట తెచ్చుకోవచ్చు. పరీక్ష హాల్ ఎక్కడో బోర్డులు, పోస్టర్ల ద్వారా ప్రదర్శన పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల వెంట తల్లిదండ్రుల్లో ఒక్కరే రావాలి. వారిని కూడా సెంటర్‌కు 200మీ. నుంచి 300 మీటర్ల దూరంలోనే ఆపేస్తాం. ఏ హాల్‌టికెట్ నంబరు నుంచి ఏ నంబరు వరకు ఏ రూమ్‌లో పరీక్ష రాయాలో బోర్డులను ఏర్పాటు చేస్తాం. పరీక్ష కేంద్రం బయటా ఇవి ఉంటాయి. విద్యార్థులు ఎవరి దగ్గరికి వెళ్లక్కర్లేకుండా, ఎవరిని అడగక్కర్లేకుండా ఈ చర్యలు చేపడుతున్నాం. ప్రతీ సెషన్‌కు మధ్య 3 గంటల వ్యవధి పరీక్ష హాల్లోనూ పక్కాగా శానిటైజేషన్ చేస్తాం. భౌతికదూరం పాటించేలా చూస్తాం. ఆన్లైన్ పరీక్షలు కాబట్టి ప్రతి ఇద్దరు విద్యార్థుల మధ్య దూరం ఎక్కువగా ఉండేలా చూస్తాం. విద్యార్థి ముందు భాగంలో కంప్యూటర్ స్క్రీన్ ఉంటుంది. దాని వెనుక చెక్క బోర్డు అడ్డుగా ఉంటుంది. ల్యాబ్‌లో క్యాబిన్ తరహాలోనే ఉంటుంది. పరీక్ష పూర్తయ్యాక కూడా ఆ కేంద్రంలోని ఏ ల్యాబ్ విద్యార్థుల తరువాత ఏ ల్యాబ్ వారు వెళ్లాలనేది నిర్ణయిస్తాం. వాటికి నంబరింగ్ ఇస్తాం. అంతా ఒకేసారి బయటకు వెళ్లకుండా, ఒకరి దగ్గరకు ఒకరు వెళ్లకుండా చూస్తాం. బయటకు వెళ్లాక కూడా తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతర పిల్లలతో కలవకుండా వెంటనే తీసుకెళ్లాలి. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలుంటాయి. ఒక సెషన్ పరీక్ష పూర్తయ్యాక కంప్యూటర్, కీబోర్డు, మౌస్, టేబుల్, చైర్తోపాటు ఆ హాల్ అంతా, కింద ఫ్లోర్‌తో సహా శానిటైజ్ చేస్తాం. ఆ తరువాత మధ్యాహ్నం పరీక్షకు సిద్ధం చేస్తాం. ఉదయం సెషన్‌కు మధ్యాహ్నం సెషన్‌కు మధ్య మూడు గంటల వ్యవధి ఉంటుంది. విద్యార్థుల మేలు కోరే.. సెట్స్ నిర్వహణ ఇప్పుడు చేపట్టకపోతే ఎప్పుడు నిర్వహించాల్సి వస్తుందో తెలియదు. విద్యార్థులకేమో త్వరగా పరీక్ష పూర్తి కావాలని ఉంది. మేలో జరగాల్సిన పరీక్ష వాయిదా పడి నెలన్నర దాటిపోయింది. ఇంకా ఎన్ని రోజులు ప్రిపేర్ కావాలనే ఆందోళన వారిలో ఉంది. ఇప్పుడు నిర్వహించకుండా వాయిదా వేస్తే మళ్లీ అక్టోబరుకు వెళ్లాల్సి రావచ్చు. దానివల్ల విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతారు. అప్పుడు నిర్వహణ సాధ్యమవుతుందో లేదో తెలియదు. అందుకే విద్యార్థుల కోసం సెట్స్ నిర్వహించక తప్పడం లేదు. వీలైనంత మందికి సెంటర్ల మార్పు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు పలువురు లాక్‌డౌన్‌కు ముందు ఎంసెట్, ఇతర సెట్స్‌కు దరఖాస్తు చేశారు. అపుడు హైదరాబాద్‌లో పరీక్ష రాసేలా సెంటర్‌ను ఎంచుకున్నారు. తరువాత లాక్డౌన్ కొనసాగడంతో ఏపీకి వెళ్లిపోయారు. ఇప్పుడు వారు ఏపీలో తమ ప్రాంతాల్లో పరీక్షలు రాస్తామని, తెలంగాణకు రాలేమని, బస్సులు నడవడం లేదని అంటున్నారు. వారు కోరుకున్నట్లుగా పరీక్ష కేంద్రాలను మార్పు చేశాం. తెలంగాణలోనూ మార్పులు చేశాం. కాలేజీ హాస్టళ్లలో ఉన్న వారు మొదట్లో హైదరాబాద్ కేంద్రం పెట్టుకున్నారు. తరువాత జిల్లాలకు మార్చుకున్నారు. ఇలా పరీక్ష కేంద్రాలను దాదాపు 20 వేల మందికి మార్చాం. వీలైనంత వరకు, విద్యార్థులకు సమీపంలోనే పరీక్ష కేంద్రాలను కేటాయించాం. కంప్యూటర్లు, ఇంటర్నెట్ సదుపాయం లేకపోతే ఇతర ప్రాంతాల్లో కేంద్రాలను వేశాం. విద్యార్థులు ఆందోళన చెందకుండా, తగిన జాగ్రత్తలు, భౌతికదూరం పాటిస్తూ పరీక్షలకు హాజరు కావాలి. -
20 నుంచి ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: యూజీ, పీజీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు, ఆయా విద్యార్థుల బ్యాక్లాగ్ పరీక్షలను వచ్చే నెల 20 నుంచి నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి స్పష్టం చేశారు. మిగతా సెమిస్టర్ల పరీక్షలను కాలేజీలు ప్రారం భమయ్యాక నవంబర్/ డిసెంబర్లో నిర్వహిం చుకోవాలని వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం మార్గదర్శకాలను యూనివర్సిటీలకు జారీ చేసినట్లు తెలిపారు. అవసరమైతే వర్సిటీలు వాటిని తమ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్, బోర్డు ఆఫ్ స్టడీస్‌లో ఆమోదం తీసుకొని అమలు చేయాలని వెల్లడించారు. మార్గదర్శకాలివే.. ► పరీక్ష సమయాన్ని 3 గంటల నుంచి 2 గంటలకు తగ్గించాలి. అందుకు అనుగుణంగా ప్రశ్న పత్రాన్ని మార్పు చేయాలి. వీటి రూపకల్పన ఆయా యూనివర్సిటీలే చేసుకోవాలి. ► బ్యాక్‌లాగ్‌లతో సహా అన్ని యూజీ, పీజీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు జూన్ 20వ తేదీ నుంచి నిర్వహించుకోవాలి. మిగతా సెమిస్టర్ల పరీక్షలను కాలేజీలు తెరిచాక నవంబర్, డిసెంబర్లో ఒక సెమిస్టర్ తర్వాత మరో సెమిస్టర్ పరీక్షలను నిర్వహించాలి. బ్యాక్‌లాగ్‌ల సంఖ్యతో సంబంధం లేకుండా మిగతా సెమిస్టర్ల విద్యార్థులను పై సెమిస్టర్‌కు ప్రమోట్ చేయాలి. ► సంప్రదాయ డిగ్రీల విషయంలో ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించాలి. ఒక సెషన్లో బీకాం విద్యార్థుల్లో సగం మందికి పరీక్షలు నిర్వహిస్తే, ఇతర కోర్సుల (బీఏ, బీఎస్సీ) సగం మందికి పరీక్షలు నిర్వహించాలి. మరొక సెషన్లో ఆయా కోర్సుల్లో మిగిలిన సగం మందికి పరీక్షలు నిర్వహించాలి. ఈ కోర్సుల ప్రాక్టికల్స్ నిర్వహణను సంబంధిత కాలేజీలకు వదిలేయాలి. ఇంటర్నల్స్, ఎక్స్‌టర్నల్స్ పరీక్షల నిర్వహణకు ఎగ్జామినర్లను సంబంధిత ప్రిన్సిపాళ్లే నియమించుకుంటారు. ► ప్రాజెక్టులు, వైవా, సెమినార్స్ వంటికి ఆన్లైన్లోనే నిర్వహించాలి. పీహెచ్డీ విద్యార్థులకు సంబంధించి సెమినార్లు, వైవా విషయంలో యూజీసీ నిబంధనలను అమలు చేయాలి. ఆన్లైన్లోనే నిర్వహించాలి. -
ఎంసెట్ 15 రోజులు వాయిదా
సాక్షి, హైదరాబాద్: లాక్‌డౌన్‌ను ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించిన నేపథ్యంలో ఎంసెట్, ఈసెట్ తదితర సెట్లను 15 రోజుల పాటు వాయిదా వేయనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి పేర్కొన్నారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్ష ఈసెట్‌ను మే 2న నిర్వహించాల్సి ఉంది. అలాగే ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 4, 5, 7, 9, 11 తేదీల్లో ఎంసెట్ నిర్వహించాల్సి ఉంది. అయితే లాక్‌డౌన్‌ను ముందుగా ఈనెల 14వ తేదీ వరకు ప్రకటించిన నేపథ్యంలో అన్ని ప్రవేశ పరీక్షల (సెట్స్) దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 20వ తేదీ వరకు ఉన్నత విద్యామండలి పొడిగించింది. అయితే శనివారం లాక్‌డౌన్‌ను ఈ నెల 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తామని పాపిరెడ్డి తెలిపారు. దాదాపు అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా పడతాయని పేర్కొన్నారు. అయితే ఈ వాయిదా ప్రభావం విద్యా సంవత్సరంపై లేకుండా అన్ని చర్యలు చేపడతామని, ఇబ్బందేమీ ఉండదని వెల్లడించారు. వివిధ సెట్లలో ముందుగా నిర్వహించాల్సిన ఈసెట్, ఎంసెట్ వాయిదా పడనుండగా, ఆ తర్వాత మే 13 నుంచి నిర్వహించాల్సిన పీఈసెట్, 20, 21 తేదీల్లో నిర్వహించాల్సిన ఐసెట్, 23న నిర్వహించాల్సిన ఎడ్‌సెట్, 27న నిర్వహించాల్సిన లాసెట్, 28 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించాల్సిన పీజీఈసెట్ కూడా వాయిదా పడే అవకాశం ఉంది. -
కరోనాపై పరిశోధన చేస్తున్నారా?
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థల్లో పూర్తి కాని సిలబస్‌ను ఆన్లైన్లో పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని యూనివర్సిటీల రిజిస్ట్రార్లను గవర్నర్, యూనివర్సిటీల చాన్స్‌లర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశించారు. ఇందుకోసం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ప్రవేశపెట్టిన ఆన్లైన్ పోర్టల్స్, స్వయం మూక్స్ వంటి దూరవిద్య పోర్టల్స్, యూనివర్సిటీల పోర్టల్స్ సహకారంతో సిలబస్ పూర్తి చేయాలని సూచించారు. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, యూనివర్సిటీల రిజిస్ట్రార్లతో తమిళిసై సోమవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థల్లో సిలబస్ ఎంతవరకు వచ్చిందనే దానిపై సమీక్షించారు. తమ సొంత ఆన్లైన్ సర్వీసులతోపాటు ఏఐసీటీఈ, యూజీసీ పోర్టల్స్ ద్వారా సిలబస్‌ను పూర్తి చేస్తామని రిజిస్ట్రార్లు ఆమెకు తెలిపారు. మరోవైపు వర్సిటీల్లో కోవిడ్ సంబంధిత పరిశోధనలు, అధ్యయనాలేమైనా జరుగుతున్నాయా అని గవర్నర్ ఆరా తీశారు. తాము దీనిపై విశ్లేషిస్తున్నామని, శాంపిల్స్ సేకరించి పరిశీలిస్తున్నామని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు చెప్పినట్టు తెలిసింది. కరోనా కట్టడి చర్యలు, సహాయక కార్యక్రమాల్లో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థుల సేవలను ఉపయోగించుకోవాలని గవర్నర్ సూచించారు. -
ప్రవేశ పరీక్షల షెడ్యూల్లో మార్పు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే విద్యాసంవత్సరంలో వివిధ వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్లో నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) షెడ్యూలు మారింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన సెట్స్ కన్వీనర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఎంసెట్‌ను ఈ ఏడాది మే 5, 6, 7 తేదీల్లో నిర్వహించాల్సి ఉంది. అయితే పలు సాంకేతిక కారణాల వల్ల ఎంసెట్‌ను (ఇంజనీరింగ్) మే 4వ తేదీ నుంచే ప్రారంభించాలని నిర్ణయించారు. 4వ తేదీన రెండు సెషన్లుగా, 5వ తేదీన ఒక సెషన్‌గా, 7వ తేదీన రెండు సెషన్లుగా పరీక్షలను నిర్వహించేలా షెడ్యూలును సవరించారు. 8వ తేదీ కూడా ఎంసెట్ నిర్వహణ కోసమే రిజర్వు చేశారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఎక్కువగా ఉంటే 8వ తేదీన కూడా ఇంజనీరింగ్ ఎంసెట్‌ను నిర్వహిస్తారు. మే 25వ తేదీన లాసెట్, పీజీ లాసెట్ పరీక్షలను నిర్వహిస్తామని ప్రకటించినప్పటికీ రంజాన్ నేపథ్యంలో లాసెట్, పీజీ లాసెట్ పరీక్షలను మే 27వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. మే 27 నుంచి నిర్వహించాల్సిన పీజీ ఈసెట్ పరీక్షలను సవరించిన షెడ్యూలు ప్రకారం మే 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇక ఎంసెట్ (అగ్రికల్చర్) పరీక్ష, ఈసెట్, పీఈ సెట్, ఐసెట్, ఎడ్‌సెట్ పరీక్షలను ముందుగా ప్రకటించిన తేదీల్లోనే నిర్వహించాలని నిర్ణయించారు. సాంకేతిక కారణాలు, రంజాన్ నేపథ్యంలో ఈ మార్పులు చేసినట్లు ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి వెల్లడించారు. ఆన్లైన్ పరీక్షలు అయినందునా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. వికలాంగులకు ఫీజు రాయితీపై ఆయా సెట్స్ కమిటీల సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. పరీక్ష ఫీజులను పెంచబోమని స్పష్టం చేశారు. ఫేసియల్ రికగ్నైషన్.. ఈసారి అన్ని ప్రవేశ పరీక్షల్లో విద్యార్థులకు ఫేషియల్ రికగ్నైష న్ విధానం అమలు చేయాలని భావిస్తున్నామన్నారు. దాని ద్వారా పరీక్షల్లో ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాసే విధానాన్ని అడ్డుకోవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తుల సమయంలో విద్యార్థుల ముఖం, కళ్లు స్కాన్ చేసి, వాటి ఆధారంగానే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించేలా చర్యలు చేపట్టాలని భావి స్తున్నట్లు చెప్పారు. దీనిపై త్వరలోనే తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ (టీఎస్టీఎస్)తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. -
డిగ్రీ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా!
సాక్షి, హైదరాబాద్: వచ్చే జూన్‌లో ప్రారంభం కానున్న కొత్త విద్యా సంవత్సరంలో (2020–21) రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా అమలు చేయాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. గతేడాదే మేనేజ్మెంట్ కోటా అమలు కోసం యాజమాన్యాలు విజ్ఞప్తి చేసినా ఆచరణకు నోచుకోలేదు. ఎట్టకేలకు వచ్చే విద్యా సం వత్సరం నుంచి అమలుకు ఓకే చెప్పింది. దీంతో డిగ్రీ కాలేజీల్లోని 30 శాతం సీట్లను యాజమాన్యాలే భర్తీ చేసుకునేలా అనుమతి ఇవ్వనుంది. మేనేజ్మెంట్ కోటా ద్వారా చేరే విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదు. దీంతో ప్రభుత్వంపై ఆర్థిక భా రం ఉండదనే ఆలోచనతో ఈ నిర్ణయానికి వచ్చింది. మరోవైపు ఈ నిర్ణయంతో ఆర్థిక స్తోమత కలిగిన విద్యార్థులు తాము కోరుకున్న కాలేజీల్లో చేరే వీలు ఏర్పడనుంది. అలాగే వచ్చే సంవత్సరంలో వంద శాతం విద్యార్థులు చేరిన కోర్సులకు అదనపు సెక్షన్లను ఇవ్వాలని, కొత్త కోర్సులకు అనుమతి ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగా మంగళవారం రాష్ట్రంలోని 9 ప్రైవేటు అటానమస్ కాలేజీ యాజమాన్య ప్రతినిధులతో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫె సర్ తుమ్మల పాపిరెడ్డి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి సమావేశమై చర్చించారు. ఆయా కాలేజీల్లో ఉన్న కోర్సులు, వాటి నిర్వహణ, సిలబస్, పరీక్షల నిర్వహణ, సబ్జెక్టు కాంబినేషన్, మార్కెట్లో వాటికి ఉన్న డిమాండ్, ఆయా యాజమాన్యాలు చేపడుతున్న చర్యలపై చర్చించారు. ప్రైవేటు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఉపాధినిచ్చే కోర్సులను అనుమతించడం ద్వారా విద్యార్థులకు ఉపాధి అవకాశాలను అందుబాటులోకి తేవాలన్న నిర్ణయానికి వచ్చారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో ఈడబ్ల్యూఎస్‌ను అమలు చేస్తారు. అటానమస్ కాలేజీల్లో రెండేళ్లే భాషా సబ్జెక్టులు అటానమస్ డిగ్రీ కాలేజీల్లో ఇంగ్లిష్, తెలుగు వంటి భాషలను ఇకపై మూడేళ్లు చదవాల్సిన అవసరం లేకుండా నిబంధనలను సడలించనున్నారు. డిగ్రీలో భాషా సబ్జెక్టులు మూడేళ్లు ఉన్న కారణంగా ప్రధాన సబ్జెక్టులకు సమయం సరిపోవడం లేదని అటానమస్ కాలేజీలు ఉన్నత విద్యా మండలి దృష్టికి తెచ్చాయి. దీంతో ఆయా కాలేజీల్లో భాషా సబ్జెక్టులను రెండేళ్లు మాత్రమే చదివేలా చర్యలు చేపడతామని మండలి హామీ ఇచ్చింది. అయితే భాషా సబ్జెక్టులకు ప్రస్తుతం ఉన్న 20 క్రెడిట్స్ నిబంధనను అలాగే కొనసాగించాలని స్పష్టం చేసింది. భాషా సబ్జెక్టుకు 20 క్రెడిట్స్ లేకపోతే విద్యార్థి ఆ భాషలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసే వీలు ఉండదు. కాబట్టి ప్రస్తుతం ఉన్న క్రెడిట్స్‌ను యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించింది. -
రాష్ట్రంలోనూ 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ (ఈడబ్ల్యూఎస్) కోటా అమలు చేయడానికి ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టింది. ఆయా సంస్థల్లో 10 శాతం సీట్లను పెంచి ఈ కోటాను అమలు చేయాలని నిర్ణయించింది. కేంద్ర విద్యా సంస్థల్లో గతేడాది నుంచి ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేస్తున్న కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్డీ).. వచ్చే విద్యా సంవత్సరం నుంచి (2020–21) అన్ని రాష్ట్రాల్లోని విద్యా సంస్థల్లో ఈ కోటా అమలు చేయాలని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేయడానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ప్రభుత్వ కాలేజీలకు ప్రయోజనం ఈడబ్ల్యూఎస్ కోటా అమల్లోకి వస్తే రాష్ట్రంలోని వృత్తి, సాంకేతిక విద్యా సంస్థల్లో సీట్లు పెరగనున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఇంజనీరింగ్, ఫార్మసీ, బీఈడీ, లా, పీజీ కాలేజీల్లో సీట్లు పెరుగుతాయి. 15 ఏళ్లుగా ఒక్క సీటు కూడా పెరగని ప్రభుత్వ కాలేజీల్లో 10 శాతం సీట్లు కొత్తగా అందుబాటులోకి వస్తే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులకు మరింత ప్రయోజనం చేకూరనుంది. జేఎన్టీయూ, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో 300కు పైగా సీట్లు అదనంగా లభిస్తాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని 14 ఇంజనీరింగ్ కాలేజీల్లో 3,071 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటు కాలేజీల్లోనూభారీ పెరుగుదల కోటా అమలుతో ప్రైవేటు కాలేజీల్లో కూడా భారీగా సీట్లు పెరిగే అవకాశం ఉంది. అయితే ఆ నిబంధనను ప్రైవేటు విద్యా సంస్థల్లో అమలు చేయాలా.. వద్దా అనేది సర్కారు తేల్చాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నత విద్యా కోర్సుల్లో మొత్తం 6,52,178 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అందులో డిగ్రీలోనే 4,43,269 సీట్లు ఉండగా.. వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో 2,08,909 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం డిగ్రీ కోర్సులకు సంబంధించిన సీట్లు సగం కూడా భర్తీ కావడం లేదు. ఈ నేపథ్యంలో డిగ్రీ సీట్ల పెంపు అవసరం లేదని ప్రభుత్వం భావిస్తోంది. ఇక వృత్తి విద్యా కోర్సుల్లో 10 శాతం సీట్లను పెంచితే అదనంగా 20,890 సీట్లు అందుబాటులోకి వస్తాయి. -
డిగ్రీలో లక్ష మందికి సీట్లు
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల్లో భాగంగా మొదటి దశ సీట్ల కేటాయింపు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) ప్రకటించింది. డిగ్రీలో ప్రవేశాల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,21,363 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా 1,11,429 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. అందులో మొదటి దశలో 1,05,433 మంది దోస్త్ సీట్లను కేటాయించింది. 5,996 మంది విద్యార్థులు సరిపడా ఆప్షన్లు ఇచ్చుకోని కారణంగా ఏ కాలేజీలోనూ వారికి సీట్లు లభించలేదని పేర్కొంది. ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కళాశాల విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్‌తో కలిసి దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి వివరాలు ప్రకటించారు. మొదటి పది సీట్లు అమ్మాయిలకే.. ఇంటర్మీడియట్లో అత్యధిక మార్కులతో మొదటి 10 సీట్లు అమ్మాయిలు సాధించారు. మొత్తం 75,184 మంది విద్యార్థులు తాము ఇచ్చుకున్న మొదటి ఆప్షన్ ప్రకారమే సీట్లు లభించాయి. మరో 30,459 మంది విద్యార్థులకు రెండో ఆప్షన్ ప్రకారం సీట్లు కేటాయించారు. సొంత జిల్లాల్లోని కాలేజీల్లో ప్రవేశాల కోసం ఆప్షన్లు ఇచ్చుకున్న 424 మందికి సీట్లు లభించాయి. మొత్తంగా సీట్లు పొందిన విద్యార్థుల్లో 40,375 మంది (38.3 శాతం) బాలురు ఉండగా, 65,058 మంది బాలికలు ఉన్నారు. 15లోగా వెబ్ ఆప్షన్లు డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల్లో భాగంగా రెండో దశ కౌన్సెలింగ్‌లో వెబ్ ఆప్షన్ల ప్రక్రియను కూడా సోమవారం నుంచే దోస్త్ ప్రారంభించింది. విద్యార్థులు ఈ నెల 15లోగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేలా ఏర్పాట్లు చేసింది. ఇంతకుముందు రిజిస్టర్ చేసుకోని విద్యార్థులు రూ.400 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకొని 15లోగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించింది. వారికి ఈనెల 20న రెండో దశ సీట్లు కేటాయిస్తామని వెల్లడించింది. ఎంసెట్ తరహాలో సెల్ఫ్ రిపోర్టింగ్: మిట్టల్ ఎంసెట్, ఈసెట్ తరహాలోనే డిగ్రీలోనూ సెల్ఫ్ రిపోర్టింగ్ విధానాన్ని ఈ సారి అమల్లోకి తెచ్చినట్లు కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ వెల్లడించారు. విద్యార్థులు కాలేజీలకు వెళ్లాల్సిన అవసరం లేదని, ఆన్లైన్లోనే సెల్ఫ్ రిపోర్ట్ చేయాలని సూచించారు. కాలేజీల్లో ఇప్పుడు ఒరిజినల్ సర్టిఫికెట్లు కూడా ఇవ్వొద్దని స్పష్టం చేశారు. తర్వాత కూడా టీసీ మినహా ఏ ఒరిజినల్ సర్టిఫికెట్ కూడా కాలేజీల్లో ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. తమకు లభించిన కాలేజీలో చేరాలనుకుంటే జూలై 1 నాటికి కాలేజీలో చేరాలని సూచించారు. అదే రోజు నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని వివరించారు. దోస్త్ పరిధిలోని కాలేజీల్లో చేరితే నో ఫీజు: పాపిరెడ్డి దోస్త్ పరిధిలో లేకుండా, కోర్టును ఆశ్రయించిన సొంతంగా ప్రవేశాలు చేపట్టే కాలేజీల్లో విద్యార్థులు చేరితే వారికి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదని పాపిరెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. దోస్త్ కన్వీనర్ ద్వారా చేపట్టే ప్రవేశాలకే ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందన్నారు. అయితే మైనారిటీ కాలేజీలను మాత్రం ప్రభుత్వమే దోస్త్ నుంచి మినహాయించిందన్నారు. కౌన్సెలింగ్ తర్వాత మిగిలే సీట్లను స్పాట్ అడ్మిషన్లుగా యాజమాన్యా లు భర్తీ చేసుకునే అంశం ప్రభు త్వం పరిశీలనలో ఉందన్నారు. 15 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ సీట్లు లభించిన విద్యార్థులు తమ దోస్త్ వెబ్సైట్ ద్వారా (ఆన్లైన్లో) ఈనెల 15లోగా సెల్ఫ్ రిపోర్టి ంగ్ చేయాలని దోస్త్ కన్వీనర్ ఆర్.లింబాద్రి పేర్కొన్నారు. లేకపోతే ఆ సీటు రద్దు అవుతుందన్నారు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసే సమయంలో ప్రభుత్వ కాలేజీల్లో సీటు వచ్చి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత కలిగిన వారు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వ కాలేజీల్లో సీటు వచ్చి ఫీజు రీయింబర్స్మెంట్ రాని వారు రూ.వెయ్యి చెల్లించాలని సూచించారు. ప్రైవేటు కాలేజీల్లో సీట్లు వచ్చి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన వారు రూ.500, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులు కాని వారు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన విద్యార్థులు ఆ కాలేజీ వద్దనుకుంటే, వేరే కాలేజీకి వెళ్లాలనుకుంటే రెండో దశ కౌన్సెలింగ్‌లో అంతకంటే మెరుగైన కాలేజీలకు మాత్రమే ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. మొదటి దశలో వెబ్ ఆప్షన్లు ఇచ్చినా సీటు లభించని వారూ రెండో దశలో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని వివరించారు. -
28 నుంచి ఎడ్‌సెట్ దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కోర్సులో ప్రవేశాల కోసం మే 31న నిర్వహించనున్న ఎడ్‌సెట్–2019 ప్రవేశపరీక్ష దరఖాస్తులను ఈ నెల 28 నుంచి స్వీకరించాలని సెట్ కమిటీ నిర్ణయించింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన గురువారం సెట్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎడ్‌సెట్ షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఎడ్‌సెట్ నోటిఫికేషన్‌ను ఈ నెల 25న జారీ చేయాలని నిర్ణయించారు. విద్యార్థులు ఆన్లైన్లో (https://edcet. tsche.ac.in) ఈ నెల 28 నుంచి ఏప్రిల్ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పాపిరెడ్డి వెల్లడించారు. రిజిస్ట్రేషన్ ఫీజును రూ.650గా కమిటీ నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీలు రూ.450 చెల్లించాలని పేర్కొంది. రూ.500 ఆలస్య రుసుముతో విద్యార్థులు ఏప్రిల్ 20 వరకు, రూ.1,000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 30 వరకు, రూ.2 వేల ఆలస్య రుసుముతో మే 4 వరకు దరఖాస్తు చేసుకునేందుకు కమిటీ నిర్ణయించింది. ఆన్లైన్లో రెండు షిఫ్టుల్లో.. ఆన్లైన్ ప్రవేశ పరీక్షను మే 31న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు షిఫ్టుల్లో నిర్వహించాలని సెట్ కమిటీ నిర్ణయించింది. వాటి ఫలితాలను జూన్ 15న ప్రకటించేలా షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఈ పరీక్షల నిర్వహణ కోసం ప్రాంతీయ కేంద్రాలుగా తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్, నల్లగొండ, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, కోదాడ, ఆదిలాబాద్.. ఏపీలోని విజయవాడ, కర్నూలును ఎంపిక చేసింది. సమావేశంలో ఉస్మానియా వర్సిటీ వీసీ ఎస్.రామచంద్రం, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ఆర్.లింబాద్రి, వెంకటరమణ, మండలి కార్యదర్శి శ్రీనివాసరావు, ఎడ్‌సెట్ కన్వీనర్ మృణాళిని తదితరులు పాల్గొన్నారు. 25 నుంచి పీఈసెట్‌కు.. డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (డీపీఈడీ), బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 15 నుంచి నిర్వహించనున్న ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్‌కు (పీఈసెట్–2019) ఈ నెల 25 నుంచి దరఖాస్తులను స్వీకరించాలని సెట్ కమిటీ నిర్ణయించింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి అధ్యక్షతన గురువారం హైదరాబాద్‌లో జరిగిన సెట్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నోటిఫికేషన్‌ను ఈ నెల 18న కమిటీ జారీ చేయనుంది. ఈ నెల 25 నుంచి ఏప్రిల్ 13 వరకు ఆన్లైన్లో ఈ దరఖాస్తులను స్వీకరించనుంది. రిజిస్ట్రేషన్ ఫీజును రూ.800గా నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీలు రూ.400 చెల్లించాలని పేర్కొంది. సమావేశంలో మహాత్మాగాంధీ వర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, పీఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ వి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఐసెట్‌లో 90 శాతం మంది అర్హత
సాక్షి, హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి ఫలితాల ను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గత నెల 23, 24 తేదీల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 61,439 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, 55,191 మంది హాజరయ్యారని తెలిపారు. అందులో 49,812 మంది (90.25 శాతం) అర్హత సాధించినట్లు తెలిపారు. త్వరలో నిర్వహించే సెట్ కమిటీ సమావేశంలో.. ప్రవేశాల కౌన్సెలింగ్ తేదీలను నిర్ణయిస్తామని వివరించారు. గతేడాది 304 ఎంబీఏ కాలేజీల్లో 32 వేల సీట్లు, 49 ఎంసీఏ కాలేజీల్లో 5,846 సీట్లు అందుబాటులో ఉన్నాయని, ఈసారి యూనివర్సిటీలు ఇచ్చే గుర్తింపును బట్టి సీట్ల సంఖ్య తేలుతుందని ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యశర్మ తెలిపారు. కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ పాల్గొన్నారు. ఫిర్యాదులు వస్తే చర్యలు: పాపిరెడ్డి ఇంజనీరింగ్ ప్రవేశాల్లో భాగంగా మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారంటూ వస్తున్న వార్తలు ఊహాగానాలేనని పాపిరెడ్డి స్పష్టం చేశారు. ఏదైనా కాలేజీపై ఫిర్యాదులు వస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటామని, వాటికి ఆధారాలు ఉండాలని తెలిపారు. మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి నిబంధనలు జారీ చేశామని, వాటి ప్రకారమే ప్రవేశాలు చేపట్టాలని పేర్కొన్నారు. బీటెక్ విద్యార్థులు కూడా.. ఎంబీఏ, ఎంసీఏ చదివేందుకు బీకాం విద్యార్థులు అత్యధికంగా దరఖాస్తు చేసుకోగా.. తర్వాతి స్థానంలో బీఎస్సీ, బీటెక్ విద్యార్థులు ఎక్కువగా దరఖాస్తు చేసుకున్నారు. అర్హత సాధించిన వారిలోనూ బీఎస్సీ, బీటెక్ విద్యార్థులు ఎక్కువ మందే ఉన్నారు. -
పూర్వీకుల జాడ దొరికిందోచ్!
వైఎస్ఆర్ జిల్లా ,చింతకొమ్మదిన్నె : పూర్వీకుల జాడ(చిరునామా) కోసం కొన్ని సంవత్సరాలుగా గాలిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డికి ఎట్టకేలకు వారు దొరకడంతో ఆయన ఆనందానికి హద్దులు లేవు. తెలంగాణలోని తమ వంశస్తులతో కలసి గురువారం మండలంలోని బయనపల్లి గ్రామానికి చేరుకున్నారు. అనంతరం తుమ్మల మల్లారెడ్డి, తుమ్మల బాలమల్లారెడ్డి, తుమ్మల యల్లారెడ్డి అనే వృద్ధులను కలసి పూర్వీకుల గురించి ఆరాతీశారు. నాలుగు తరాల క్రితం తమ తాతలది ఇదే గ్రామమని అని తెలుసుకుని మురిసిపోయారు. తమ పెద్దలు ఇక్కడి నుంచి తెలంగాణకు వలస వెళ్లినట్లు భావిస్తున్నారు. అనంతరం పాపిరెడ్డి మాట్లాడుతూ తుమ్మల వంశస్తుల అభివృద్ధికి తోడ్పాటును అందిస్తామని అన్నారు. ఆయనతో పాటు తెలంగాణ నుంచి తుమ్మల రాజిరెడ్డి, జనార్దన్‌రెడ్డి, మోహన్‌రెడ్డిలు గ్రామాన్ని సందర్శించారు. -
వచ్చే నెలలో సెట్స్ తేదీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 2018–19 విద్యా సంవత్సరంలో నిర్వహించే వివిధ ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్) తేదీలను వచ్చే నెలలో ఖరారు చేయాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. వచ్చే నెల మొదటి వారంలో సెట్లవారీగా కమిటీలను ఏర్పాటు చేసి, రెండో వారంలో పరీక్షల నిర్వహణ తేదీలను ఖరారు చేయనుంది. ఈసారి ఉమ్మడి ప్రవేశ పరీక్షలన్నింటినీ ఆన్లైన్లో నిర్వహించాలని, నిర్వహణ బాధ్యతను ప్రైవేటు సంస్థ అయిన టీసీఎస్‌కు అప్పగించాలని నిర్ణయించడంతో ఆన్లైన్ ప్రవేశ పరీక్షల ప్రాసెస్ ఫీజు రూ. 50 నుంచి రూ. 100 వరకు పెరిగే అవకాశం ఉంది. అయితే పెంపు ఒకవేళ నామమాత్రంగా ఉంటే ఆ భారాన్ని స్వయంగా భరించాలని, ఎక్కువ భారం అయితే విద్యార్థుల నుంచి వసూలు చేసే ఫీజును పెంచాలని ఉన్నత విద్యామండలి యోచిస్తోంది. విధివిధానాలకు కమిటీ... ప్రవేశ పరీక్షల విధివిధానాలను ఖరారు చేసేందుకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి నేతృత్వంలో ఇద్దరు వైస్చైర్మన్లు, మరో 12 మంది సభ్యులతో సోమవారం కమిటీ ఏర్పాటైంది. ఆంధ్రప్రదేశ్‌లో గతేడాది ఆన్లైన్లో ప్రవేశపరీక్షలను విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో వారు అనుసరించిన విధానాలను ఈ కమిటీ అధ్యయనం చేసి పరీక్షల నిర్వహణకు చేపట్టాల్సిన చర్యలను టీసీఎస్‌కు వివరించనుంది. ఇందులో భాగంగా కమిటీ మొదటి సమావేశం ఈ నెల 27న నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. ఆన్లైన్ ద్వారా పేపర్ లీకేజీకి చెక్: పాపిరెడ్డి ఆన్లైన్ ప్రవేశ పరీక్షలతో పేపర్ లీకేజీ వంటి ప్రధాన సమస్యను అధిగమించవచ్చని, ముద్రణ, పంపిణీ సమయంలో లీకేజీ బెడద ఉండదని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ఆన్లైన్ పరీక్షలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు మాక్ పరీక్షలు నిర్వహిస్తామని, ప్రతి ప్రవేశపరీక్షకు సంబంధించిన వెబ్సైట్లో మాక్ ఆన్లైన్ టెస్టు లింక్‌ను ఇచ్చి విద్యార్థులు ప్రిపేర్ అయ్యేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. -
ఆవిష్కరణలు ప్రోత్సహించేలా సిలబస్
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యలో సంప్రదాయ కోర్సులే కాదు.. సాంకేతిక విద్యా కోర్సులు చదివే యువత ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించేలా సిలబస్‌లో సమూల మార్పులు చేయాలని ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయించింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన పారిశ్రామిక ప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సమావేశం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. పరిశ్రమ అవసరాలు.. అందుకు అనుగుణంగా ఉన్నత విద్యా కోర్సుల్లో, సిలబస్‌లో తీసుకురావాల్సిన మార్పులు, ఆవిష్కరణలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యాలపై ఈ సమావేశంలో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నట్లు పాపిరెడ్డి వెల్లడించారు. ముఖ్యంగా మూడు రంగాలకు సంబంధించి మూడు వర్కింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఉస్మానియా, కాకతీయ, జేఎన్టీయూ, ఆర్‌జీయూకేజీ, జేఎన్ఏఎఫ్ఏయూలో ఇంక్యుబేటర్లు ఏర్పాటు చేయాలని, ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి, నిధుల కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీకి పంపించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో అన్ని వర్సిటీల్లోనూ దశలవారీగా ఇంక్యుబేటర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. భేటీలో తీసుకున్న మరిన్ని నిర్ణయాలు.. ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేయడంతోపాటు, స్టార్టప్‌లపై విద్యార్థులు దృష్టి సారించే అంశాన్ని కరిక్యులమ్‌లో పొందుపరచాలని నిర్ణయించారు. స్టార్టప్‌లపై పని చేసే విద్యార్థులకు ఏడాది సమయం ఇవ్వాలని, వారు ఆ కాలంలో కాలేజీలో ఉన్నట్లుగా పరిగణించాలని నిర్ణయించారు. వీటికి సంబంధించిన విధివిధానాలను రూపొందించేందుకు వర్కింగ్ కమిటీని త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు. మారుతున్న పారిశ్రామిక అవసరాలు, టెక్నాలజీలో మార్పులకు అనుగుణంగా కోర్సుల వారీగా సిలబస్‌లో తీసుకురావాల్సిన మార్పులపై వర్సిటీల బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్లతో మరో వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. అలాగే ప్రతిభావంతులైన విద్యార్థులు చదువుకుంటూనే ఇండస్ట్రీలో పనిచేసే వీలు కల్పిస్తూ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. దీని విధివిధానాల కోసం మరో వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ మూడు వర్కింగ్ కమిటీల్లోనూ విద్యారంగానికి చెందిన వారే కాకుండా నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వ అధికారులు, ఇండస్ట్రీ వర్గాలు భాగస్వాములను చేయాలని నిర్ణయించారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థుల ఆవిష్కరణలకు అవకాశం కల్పిస్తూ గ్రామీణ వర్సిటీల్లోనూ ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర ఉద్యోగాలే కాకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలపై రానున్న రోజుల్లో యువతకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. అలాగే ఫార్మా, ఆటోమోటివ్, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్, బిజినెస్, ఐటీ తదితర రంగాల్లో ఉన్న అవకాశాలు, అందుకు అనుగుణంగా ఉన్నత విద్యా కోర్సుల సిలబస్‌లో తేవాల్సిన మార్పులపైనా చర్చించారు. ఈ సమావేశంలో ఐటీ కార్యదర్శి జయేశ్‌రంజన్, గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ హరిప్రీత్‌సింగ్, ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ, హైదరాబాద్ ట్రిపుల్ఐటీ ప్రొఫెసర్ రమేశ్, లోకనాథం, టీహబ్, నాస్కామ్, ఫిక్కీ, సీఐఐ, టీశాట్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
12 నుంచి ఎడ్‌సెట్ దరఖాస్తులు
ఎడ్‌సెట్–2017 షెడ్యూలు జారీ సాక్షి, హైదరాబాద్: బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో (బీఎడ్) ప్రవేశాలకు జూలై 16న నిర్వహించనున్న ఎడ్‌సెట్– 2017 షెడ్యూల్‌ను సెట్ కమిటీ గురువారం జారీ చేసింది. ఎడ్‌సెట్ నోటిఫికేషన్‌ను ఈ నెల 11న విడుదల చేయాలని నిర్ణ యించింది. అభ్యర్థులు ఈ నెల 12 నుంచి ఆన్లైన్లో (్ఛఛీఛ్ఛ్టి.్టటఛిజ్ఛి.్చఛి.జీn) దరఖాస్తు చేసుకునేలా చర్యలు చేపట్టింది. గురువారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ. తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన సెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీలకు రూ.200, ఇతరులకు రూ.400 రిజిస్ట్రేషన్ ఫీజుగా నిర్ణయించింది. జూలై 6లోగా ఆలస్య రుసుము లేకుండా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని, దరఖాస్తులను సమర్పించాలని సూచించిం ది. రూ.500 ఆలస్య రుసుముతో జూలై 7, 8వ తేదీల్లో రిజిస్ట్రేషన్ చేసుకో వచ్చని చెప్పింది. ఎడ్‌సెట్ పరీక్షను జూలై 16న 11 నుంచి ఒంటిగంట వరకు 14 కేంద్రాల్లో నిర్వహించనుంది. ఫలితాలను జూలై 28న ప్రకటించనుంది. నేడు లాసెట్ ఫలితాలు..!: ఈ నెల 9వ తేదీన లాసెట్ ఫలితాలు విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.