సమావేశంలో మాట్లాడుతున్న పాపిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యలో సంప్రదాయ కోర్సులే కాదు.. సాంకేతిక విద్యా కోర్సులు చదివే యువత ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించేలా సిలబస్‌లో సమూల మార్పులు చేయాలని ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయించింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన పారిశ్రామిక ప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సమావేశం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. పరిశ్రమ అవసరాలు.. అందుకు అనుగుణంగా ఉన్నత విద్యా కోర్సుల్లో, సిలబస్‌లో తీసుకురావాల్సిన మార్పులు, ఆవిష్కరణలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యాలపై ఈ సమావేశంలో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నట్లు పాపిరెడ్డి వెల్లడించారు.
ముఖ్యంగా మూడు రంగాలకు సంబంధించి మూడు వర్కింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఉస్మానియా, కాకతీయ, జేఎన్‌టీయూ, ఆర్‌జీయూకేజీ, జేఎన్‌ఏఎఫ్‌ఏయూలో ఇంక్యుబేటర్లు ఏర్పాటు చేయాలని, ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి, నిధుల కోసం డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీకి పంపించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో అన్ని వర్సిటీల్లోనూ దశలవారీగా ఇంక్యుబేటర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు.
భేటీలో తీసుకున్న మరిన్ని నిర్ణయాలు..
ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేయడంతోపాటు, స్టార్టప్‌లపై విద్యార్థులు దృష్టి సారించే అంశాన్ని కరిక్యులమ్‌లో పొందుపరచాలని నిర్ణయించారు. స్టార్టప్‌లపై పని చేసే విద్యార్థులకు ఏడాది సమయం ఇవ్వాలని, వారు ఆ కాలంలో కాలేజీలో ఉన్నట్లుగా పరిగణించాలని నిర్ణయించారు. వీటికి సంబంధించిన విధివిధానాలను రూపొందించేందుకు వర్కింగ్ కమిటీని త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు. మారుతున్న పారిశ్రామిక అవసరాలు, టెక్నాలజీలో మార్పులకు అనుగుణంగా కోర్సుల వారీగా సిలబస్‌లో తీసుకురావాల్సిన మార్పులపై వర్సిటీల బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్లతో మరో వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. అలాగే ప్రతిభావంతులైన విద్యార్థులు చదువుకుంటూనే ఇండస్ట్రీలో పనిచేసే వీలు కల్పిస్తూ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. దీని విధివిధానాల కోసం మరో వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ మూడు వర్కింగ్ కమిటీల్లోనూ విద్యారంగానికి చెందిన వారే కాకుండా నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వ అధికారులు, ఇండస్ట్రీ వర్గాలు భాగస్వాములను చేయాలని నిర్ణయించారు.
మరోవైపు గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థుల ఆవిష్కరణలకు అవకాశం కల్పిస్తూ గ్రామీణ వర్సిటీల్లోనూ ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర ఉద్యోగాలే కాకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలపై రానున్న రోజుల్లో యువతకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. అలాగే ఫార్మా, ఆటోమోటివ్, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్‌టైల్, బిజినెస్, ఐటీ తదితర రంగాల్లో ఉన్న అవకాశాలు, అందుకు అనుగుణంగా ఉన్నత విద్యా కోర్సుల సిలబస్‌లో తేవాల్సిన మార్పులపైనా చర్చించారు. ఈ సమావేశంలో ఐటీ కార్యదర్శి జయేశ్‌రంజన్, గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ హరిప్రీత్‌సింగ్, ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ, హైదరాబాద్ ట్రిపుల్‌ఐటీ ప్రొఫెసర్ రమేశ్, లోకనాథం, టీహబ్, నాస్కామ్, ఫిక్కీ, సీఐఐ, టీశాట్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment