
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 2018–19 విద్యా సంవత్సరంలో నిర్వహించే వివిధ ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్) తేదీలను వచ్చే నెలలో ఖరారు చేయాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. వచ్చే నెల మొదటి వారంలో సెట్‌లవారీగా కమిటీలను ఏర్పాటు చేసి, రెండో వారంలో పరీక్షల నిర్వహణ తేదీలను ఖరారు చేయనుంది. ఈసారి ఉమ్మడి ప్రవేశ పరీక్షలన్నింటినీ ఆన్‌లైన్‌లో నిర్వహించాలని, నిర్వహణ బాధ్యతను ప్రైవేటు సంస్థ అయిన టీసీఎస్‌కు అప్పగించాలని నిర్ణయించడంతో ఆన్‌లైన్ ప్రవేశ పరీక్షల ప్రాసెస్ ఫీజు రూ. 50 నుంచి రూ. 100 వరకు పెరిగే అవకాశం ఉంది. అయితే పెంపు ఒకవేళ నామమాత్రంగా ఉంటే ఆ భారాన్ని స్వయంగా భరించాలని, ఎక్కువ భారం అయితే విద్యార్థుల నుంచి వసూలు చేసే ఫీజును పెంచాలని ఉన్నత విద్యామండలి యోచిస్తోంది.
విధివిధానాలకు కమిటీ...
ప్రవేశ పరీక్షల విధివిధానాలను ఖరారు చేసేందుకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి నేతృత్వంలో ఇద్దరు వైస్‌చైర్మన్లు, మరో 12 మంది సభ్యులతో సోమవారం కమిటీ ఏర్పాటైంది. ఆంధ్రప్రదేశ్‌లో గతేడాది ఆన్‌లైన్‌లో ప్రవేశపరీక్షలను విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో వారు అనుసరించిన విధానాలను ఈ కమిటీ అధ్యయనం చేసి పరీక్షల నిర్వహణకు చేపట్టాల్సిన చర్యలను టీసీఎస్‌కు వివరించనుంది. ఇందులో భాగంగా కమిటీ మొదటి సమావేశం ఈ నెల 27న నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది.
ఆన్‌లైన్ ద్వారా పేపర్ లీకేజీకి చెక్: పాపిరెడ్డి
ఆన్‌లైన్ ప్రవేశ పరీక్షలతో పేపర్ లీకేజీ వంటి ప్రధాన సమస్యను అధిగమించవచ్చని, ముద్రణ, పంపిణీ సమయంలో లీకేజీ బెడద ఉండదని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ఆన్‌లైన్ పరీక్షలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు మాక్ పరీక్షలు నిర్వహిస్తామని, ప్రతి ప్రవేశపరీక్షకు సంబంధించిన వెబ్‌సైట్‌లో మాక్ ఆన్‌లైన్ టెస్టు లింక్‌ను ఇచ్చి విద్యార్థులు ప్రిపేర్ అయ్యేలా ఏర్పాట్లు చేస్తామన్నారు.