సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్, ఎంసెట్ పరీక్షల్లో పరిగణనలోకి తీసుకోవా ల్సిన సిలబస్ ఖరారైంది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో 70% సిలబస్ తోనే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెకండియర్ పరీక్షలు నిర్వహించే 70% సిలబస్‌ను ఎంసెట్‌కు పరిగణనలోకి తీసుకోనుంది. ఫస్టియర్‌కు సంబంధించి గత మార్చిలోనే విద్యార్థులు పరీక్షలు రాసినందున ప్రథమ సంవత్సరంలోని పూర్తి సిలబస్‌ను ఎంసెట్‌లో పరిగణనలోకి తీసుకోనున్నారు. విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, మండలి కార్యదర్శి శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.
కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితులు, విద్యా బోధనకు ఏర్పడిన ఆటంకాలపై చర్చించారు. ముఖ్యంగా ఇంటర్మీడియట్, ఎంసెట్‌కు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. సిలబస్‌కు సంబంధించిన విధానం 2020–21 విద్యా సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. మరోవైపు ప్రస్తుతం ఎంసెట్ ర్యాంకుల ఖరారులో ఇంటర్మీడియట్ మార్కులకు ఇచ్చే 25 శాతం వెయిటేజీని తొలగించేది లేదని, యథాతథంగా కొనసాగించాలని కమిటీ నిర్ణయించింది.
ప్రశ్నల సంఖ్య పెంపు..
ఇంటర్మీడియట్‌లో ప్రశ్నల సంఖ్యను పెంచి, విద్యార్థులకు ఎక్కువ ఆప్షన్లు ఉండేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. దీంతో ఇంటర్ వార్షిక పరీక్షల్లో ప్రశ్న పత్రాల్లో విద్యార్థులకు ఇచ్చే ప్రశ్నల సంఖ్యను రెట్టింపు చేయడం ద్వారా విద్యార్థులకు ఎక్కువ చాయిస్ ఉండనుంది. కరోనా కారణంగా ప్రత్యక్ష బోధన లేకపోవడం, గత సెప్టెంబర్ 1 నుంచి జనవరి 31 వరకు ఆన్‌లైన్/ డిజిటల్ బోధన మాత్రమే కొనసాగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఆ పాఠాలు ఎంత మేరకు అర్థం అయ్యాయనే గందరగోళం ఉంది. అందుకే విద్యార్థులపై పరీక్షల ఒత్తిడి తగ్గించేందుకు 30 శాతం సిలబస్ తగ్గింపుతో పాటు చాయిస్ ఎక్కువ ఉండేలా చర్యలు చేపట్టింది.
ఎంసెట్‌లోనూ ఎక్కువ చాయిస్..
ఎంసెట్‌లోనూ విద్యార్థులకు ఎక్కువ చాయిస్ ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ప్రస్తుతం 160 ప్రశ్నలకు 160 మార్కుల విధానం ఉంది. అయితే ఈ సారి విద్యార్థులకు ఎక్కువ చాయిస్ ఉండేలా చర్యలు చేపట్టే ఆలోచనల్లో అధికారులు ఉన్నారు. 180 ప్రశ్నలు ఇచ్చి 160 ప్రశ్నలకు సమాధానాలు రాసే విధానం తీసుకొచ్చే అవకాశముంది. ప్రస్తుతం దీనిపై అధికారికంగా నిర్ణయం తీసుకోలేదు. వచ్చే 10 రోజుల్లో ఎంసెట్ కన్వీనర్‌ను ఉన్నత విద్యా మండలి నియమించనుంది. ఆ తర్వాత ప్రశ్నపత్రం, ఆప్షన్లు తదితర అంశాలపై ఓ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీనే తుది నిర్ణయం తీసుకోనుంది.
జూన్ 14 తర్వాత ఎంసెట్
‘ఇంటర్ వార్షిక పరీక్షల్లో భాగంగా ప్రధాన సబ్జెక్టుల పరీక్షలు మే 13తో పూర్తవుతాయి. కాబట్టి విద్యార్థులు ఎంసెట్‌కు సిద్ధం అయ్యేందుకు 4 వారాల గడువు ఇస్తాం. జూన్ 14 తర్వాత ఎంసెట్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉంటాం. అయితే ఆన్‌లైన్ పరీక్షలను నిర్వహించే సాంకేతిక సంస్థ అయిన టీసీఎస్ స్లాట్స్‌ను బట్టి పరీక్షల తేదీలు ఖరారు చేస్తాం.’ – ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment