
సాక్షి, హైదరాబాద్: లాక్‌డౌన్‌ను ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించిన నేపథ్యంలో ఎంసెట్, ఈసెట్ తదితర సెట్లను 15 రోజుల పాటు వాయిదా వేయనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి పేర్కొన్నారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్ష ఈసెట్‌ను మే 2న నిర్వహించాల్సి ఉంది. అలాగే ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 4, 5, 7, 9, 11 తేదీల్లో ఎంసెట్ నిర్వహించాల్సి ఉంది. అయితే లాక్‌డౌన్‌ను ముందుగా ఈనెల 14వ తేదీ వరకు ప్రకటించిన నేపథ్యంలో అన్ని ప్రవేశ పరీక్షల (సెట్స్) దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 20వ తేదీ వరకు ఉన్నత విద్యామండలి పొడిగించింది. అయితే శనివారం లాక్‌డౌన్‌ను ఈ నెల 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తామని పాపిరెడ్డి తెలిపారు. దాదాపు అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా పడతాయని పేర్కొన్నారు. అయితే ఈ వాయిదా ప్రభావం విద్యా సంవత్సరంపై లేకుండా అన్ని చర్యలు చేపడతామని, ఇబ్బందేమీ ఉండదని వెల్లడించారు. వివిధ సెట్లలో ముందుగా నిర్వహించాల్సిన ఈసెట్, ఎంసెట్ వాయిదా పడనుండగా, ఆ తర్వాత మే 13 నుంచి నిర్వహించాల్సిన పీఈసెట్, 20, 21 తేదీల్లో నిర్వహించాల్సిన ఐసెట్, 23న నిర్వహించాల్సిన ఎడ్‌సెట్, 27న నిర్వహించాల్సిన లాసెట్, 28 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించాల్సిన పీజీఈసెట్ కూడా వాయిదా పడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment