28 నుంచి ఎడ్‌సెట్‌ దరఖాస్తులు | Edset applications from 28 | Sakshi

28 నుంచి ఎడ్‌సెట్‌ దరఖాస్తులు

Feb 15 2019 2:26 AM | Updated on Jul 11 2019 5:01 PM

Edset applications from 28 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (బీఎడ్‌) కోర్సులో ప్రవేశాల కోసం మే 31న నిర్వహించనున్న ఎడ్‌సెట్‌–2019 ప్రవేశపరీక్ష దరఖాస్తులను ఈ నెల 28 నుంచి స్వీకరించాలని సెట్‌ కమిటీ నిర్ణయించింది. ఉన్నత విద్యామండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన గురువారం సెట్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎడ్‌సెట్‌ షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఎడ్‌సెట్‌ నోటిఫికేషన్‌ను ఈ నెల 25న జారీ చేయాలని నిర్ణయించారు. విద్యార్థులు ఆన్‌లైన్‌లో (https://edcet. tsche.ac.in) ఈ నెల 28 నుంచి ఏప్రిల్‌ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పాపిరెడ్డి వెల్లడించారు. రిజిస్ట్రేషన్‌ ఫీజును రూ.650గా కమిటీ నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీలు రూ.450 చెల్లించాలని పేర్కొంది. రూ.500 ఆలస్య రుసుముతో విద్యార్థులు ఏప్రిల్‌ 20 వరకు, రూ.1,000 ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 30 వరకు, రూ.2 వేల ఆలస్య రుసుముతో మే 4 వరకు దరఖాస్తు చేసుకునేందుకు కమిటీ నిర్ణయించింది.  

ఆన్‌లైన్‌లో రెండు షిఫ్టుల్లో.. 
ఆన్‌లైన్‌ ప్రవేశ పరీక్షను మే 31న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు షిఫ్టుల్లో నిర్వహించాలని సెట్‌ కమిటీ నిర్ణయించింది. వాటి ఫలితాలను జూన్‌ 15న ప్రకటించేలా షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఈ పరీక్షల నిర్వహణ కోసం ప్రాంతీయ కేంద్రాలుగా తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్, నల్లగొండ, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, కోదాడ, ఆదిలాబాద్‌.. ఏపీలోని విజయవాడ, కర్నూలును ఎంపిక చేసింది. సమావేశంలో ఉస్మానియా వర్సిటీ వీసీ ఎస్‌.రామచంద్రం, ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్లు ఆర్‌.లింబాద్రి, వెంకటరమణ, మండలి కార్యదర్శి శ్రీనివాసరావు, ఎడ్‌సెట్‌ కన్వీనర్‌ మృణాళిని తదితరులు పాల్గొన్నారు.

25 నుంచి పీఈసెట్‌కు..
డిప్లొమా ఇన్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ (డీపీఈడీ), బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ (బీపీఈడీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 15 నుంచి నిర్వహించనున్న ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ సెట్‌కు (పీఈసెట్‌–2019) ఈ నెల 25 నుంచి దరఖాస్తులను స్వీకరించాలని సెట్‌ కమిటీ నిర్ణయించింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ పాపిరెడ్డి అధ్యక్షతన గురువారం హైదరాబాద్‌లో జరిగిన సెట్‌ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నోటిఫికేషన్‌ను ఈ నెల 18న కమిటీ జారీ చేయనుంది. ఈ నెల 25 నుంచి ఏప్రిల్‌ 13 వరకు ఆన్‌లైన్‌లో ఈ దరఖాస్తులను స్వీకరించనుంది. రిజిస్ట్రేషన్‌ ఫీజును రూ.800గా నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీలు రూ.400 చెల్లించాలని పేర్కొంది. సమావేశంలో మహాత్మాగాంధీ వర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్‌ హుస్సేన్, పీఈసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ వి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement