సోమవారం హైదరాబాద్‌లో సీట్ల కేటాయింపు వివరాలను మీడియాకు వెల్లడిస్తున్న కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిట్టల్. చిత్రంలో తుమ్మల పాపిరెడ్డి తదితరులు
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాల్లో భాగంగా మొదటి దశ సీట్ల కేటాయింపు డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) ప్రకటించింది. డిగ్రీలో ప్రవేశాల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,21,363 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా 1,11,429 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. అందులో మొదటి దశలో 1,05,433 మంది దోస్త్ సీట్లను కేటాయించింది. 5,996 మంది విద్యార్థులు సరిపడా ఆప్షన్లు ఇచ్చుకోని కారణంగా ఏ కాలేజీలోనూ వారికి సీట్లు లభించలేదని పేర్కొంది. ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కళాశాల విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్‌తో కలిసి దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి వివరాలు ప్రకటించారు.
మొదటి పది సీట్లు అమ్మాయిలకే..
ఇంటర్మీడియట్‌లో అత్యధిక మార్కులతో మొదటి 10 సీట్లు అమ్మాయిలు సాధించారు. మొత్తం 75,184 మంది విద్యార్థులు తాము ఇచ్చుకున్న మొదటి ఆప్షన్ ప్రకారమే సీట్లు లభించాయి. మరో 30,459 మంది విద్యార్థులకు రెండో ఆప్షన్ ప్రకారం సీట్లు కేటాయించారు. సొంత జిల్లాల్లోని కాలేజీల్లో ప్రవేశాల కోసం ఆప్షన్లు ఇచ్చుకున్న 424 మందికి సీట్లు లభించాయి. మొత్తంగా సీట్లు పొందిన విద్యార్థుల్లో 40,375 మంది (38.3 శాతం) బాలురు ఉండగా, 65,058 మంది బాలికలు ఉన్నారు.
15లోగా వెబ్ ఆప్షన్లు
డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాల్లో భాగంగా రెండో దశ కౌన్సెలింగ్‌లో వెబ్ ఆప్షన్ల ప్రక్రియను కూడా సోమవారం నుంచే దోస్త్ ప్రారంభించింది. విద్యార్థులు ఈ నెల 15లోగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేలా ఏర్పాట్లు చేసింది. ఇంతకుముందు రిజిస్టర్ చేసుకోని విద్యార్థులు రూ.400 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకొని 15లోగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించింది. వారికి ఈనెల 20న రెండో దశ సీట్లు కేటాయిస్తామని వెల్లడించింది.
ఎంసెట్ తరహాలో సెల్ఫ్ రిపోర్టింగ్: మిట్టల్
ఎంసెట్, ఈసెట్ తరహాలోనే డిగ్రీలోనూ సెల్ఫ్ రిపోర్టింగ్ విధానాన్ని ఈ సారి అమల్లోకి తెచ్చినట్లు కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ వెల్లడించారు. విద్యార్థులు కాలేజీలకు వెళ్లాల్సిన అవసరం లేదని, ఆన్‌లైన్‌లోనే సెల్ఫ్ రిపోర్ట్ చేయాలని సూచించారు. కాలేజీల్లో ఇప్పుడు ఒరిజినల్ సర్టిఫికెట్లు కూడా ఇవ్వొద్దని స్పష్టం చేశారు. తర్వాత కూడా టీసీ మినహా ఏ ఒరిజినల్ సర్టిఫికెట్ కూడా కాలేజీల్లో ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. తమకు లభించిన కాలేజీలో చేరాలనుకుంటే జూలై 1 నాటికి కాలేజీలో చేరాలని సూచించారు. అదే రోజు నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని వివరించారు.
దోస్త్ పరిధిలోని కాలేజీల్లో చేరితే నో ఫీజు: పాపిరెడ్డి
దోస్త్ పరిధిలో లేకుండా, కోర్టును ఆశ్రయించిన సొంతంగా ప్రవేశాలు చేపట్టే కాలేజీల్లో విద్యార్థులు చేరితే వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించదని పాపిరెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. దోస్త్ కన్వీనర్ ద్వారా చేపట్టే ప్రవేశాలకే ఫీజు రీయింబర్స్‌మెంట్ వస్తుందన్నారు. అయితే మైనారిటీ కాలేజీలను మాత్రం ప్రభుత్వమే దోస్త్ నుంచి మినహాయించిందన్నారు. కౌన్సెలింగ్ తర్వాత మిగిలే సీట్లను స్పాట్ అడ్మిషన్లుగా యాజమాన్యా లు భర్తీ చేసుకునే అంశం ప్రభు త్వం పరిశీలనలో ఉందన్నారు.
15 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్
సీట్లు లభించిన విద్యార్థులు తమ దోస్త్ వెబ్‌సైట్ ద్వారా (ఆన్‌లైన్‌లో) ఈనెల 15లోగా సెల్ఫ్ రిపోర్టి ంగ్ చేయాలని దోస్త్ కన్వీనర్ ఆర్.లింబాద్రి పేర్కొన్నారు. లేకపోతే ఆ సీటు రద్దు అవుతుందన్నారు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసే సమయంలో ప్రభుత్వ కాలేజీల్లో సీటు వచ్చి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత కలిగిన వారు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వ కాలేజీల్లో సీటు వచ్చి ఫీజు రీయింబర్స్‌మెంట్ రాని వారు రూ.వెయ్యి చెల్లించాలని సూచించారు. ప్రైవేటు కాలేజీల్లో సీట్లు వచ్చి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన వారు రూ.500, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులు కాని వారు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన విద్యార్థులు ఆ కాలేజీ వద్దనుకుంటే, వేరే కాలేజీకి వెళ్లాలనుకుంటే రెండో దశ కౌన్సెలింగ్‌లో అంతకంటే మెరుగైన కాలేజీలకు మాత్రమే ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. మొదటి దశలో వెబ్ ఆప్షన్లు ఇచ్చినా సీటు లభించని వారూ రెండో దశలో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment