బుధవారం ఐసెట్ ఫలితాలు విడుదల చేస్తున్న చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తదితరులు
సాక్షి, హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి ఫలితాల ను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గత నెల 23, 24 తేదీల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 61,439 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, 55,191 మంది హాజరయ్యారని తెలిపారు.
అందులో 49,812 మంది (90.25 శాతం) అర్హత సాధించినట్లు తెలిపారు. త్వరలో నిర్వహించే సెట్ కమిటీ సమావేశంలో.. ప్రవేశాల కౌన్సెలింగ్ తేదీలను నిర్ణయిస్తామని వివరించారు. గతేడాది 304 ఎంబీఏ కాలేజీల్లో 32 వేల సీట్లు, 49 ఎంసీఏ కాలేజీల్లో 5,846 సీట్లు అందుబాటులో ఉన్నాయని, ఈసారి యూనివర్సిటీలు ఇచ్చే గుర్తింపును బట్టి సీట్ల సంఖ్య తేలుతుందని ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యశర్మ తెలిపారు. కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ పాల్గొన్నారు.
ఫిర్యాదులు వస్తే చర్యలు: పాపిరెడ్డి
ఇంజనీరింగ్ ప్రవేశాల్లో భాగంగా మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారంటూ వస్తున్న వార్తలు ఊహాగానాలేనని పాపిరెడ్డి స్పష్టం చేశారు. ఏదైనా కాలేజీపై ఫిర్యాదులు వస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటామని, వాటికి ఆధారాలు ఉండాలని తెలిపారు. మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి నిబంధనలు జారీ చేశామని, వాటి ప్రకారమే ప్రవేశాలు చేపట్టాలని పేర్కొన్నారు.
బీటెక్ విద్యార్థులు కూడా..
ఎంబీఏ, ఎంసీఏ చదివేందుకు బీకాం విద్యార్థులు అత్యధికంగా దరఖాస్తు చేసుకోగా.. తర్వాతి స్థానంలో బీఎస్సీ, బీటెక్ విద్యార్థులు ఎక్కువగా దరఖాస్తు చేసుకున్నారు. అర్హత సాధించిన వారిలోనూ బీఎస్సీ, బీటెక్ విద్యార్థులు ఎక్కువ మందే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment