
త్వరలో వెలువడనున్న పదో తరగతి ఫలితాలు
బాసర క్యాంపస్‌లో 1,500 సీట్లు
ఎల్కతుర్తిలో మరో క్యాంపస్
బాసరకు అనుబంధంగా!
మార్చిలోనే భూసర్వే చేసిన అధికారులు
బాసర ట్రిపుల్ ఐటీలో ఈ విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుందోనని విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. నిర్మల్ జిల్లా బాసరలో ఉన్న ట్రిపుల్ ఐటీకి ఏటా వేల సంఖ్యలోనే దరఖాస్తులొస్తాయి. ఈ ఏడాది ప్రభుత్వం 1,500 సీట్ల ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానించనున్నట్టు సమాచారం. ప్రవేశాల ప్రక్రియకు ఇన్‌చార్జ్ వీసీ గోవర్దన్ ఆధ్వర్యంలో అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమవుతుంది.
ఈ నెల చివరిలోగా పదో తరగతి ఫలితాలు వెలువడనున్నాయి. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల్లో అత్యధిక మార్కులు ఉన్న వారికే ఈ క్యాంపస్‌లో సీట్లు దక్కుతాయి. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్సు బోధిస్తున్నారు. ఇక్కడి విద్యార్థుల్లో అధిక శాతం ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తున్నారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లోనూ కార్పొరేట్ కంపెనీల్లో కొలువులు వస్తున్నాయి. – భైంసా
ఎల్కతుర్తి క్యాంపస్...
కరీంనగర్, హనుమకొండ, సిద్దిపేట జిల్లాలకు కూడలిగా ఉన్న ఎల్కతుర్తిలో ట్రిపుల్ ఐటీ కొత్త క్యాంపస్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్రంలో నాలుగు కొత్త ట్రిపుల్ ఐటీలను నెలకొల్పుతామని పేర్కొంది. ఈ క్రమంలో గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన మంత్రివర్గ ఉప సంఘం సమావేశంలో విద్యా సంస్కరణలపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో రెండు కొత్త ప్రాంగణాలను ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్ల గొండ, ఎల్కతుర్తిలో క్యాంపస్‌లు ఏర్పాటు చేయాలనే చర్చ జరిగినట్టు తెలిసింది.
కాగా మంత్రి పొన్నం ప్రభాకర్ కొత్త క్యాంపస్ ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించారు. బాసర ట్రిపుల్ ఐటీకి అనుబంధంగా ఎల్కతుర్తి లో మరో క్యాంపస్ ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మార్చి 24న బాసర ఇన్‌చార్జ్ వీసీ గోవర్దన్ ఎల్కతుర్తి రెవెన్యూ అధికారులతో కలిసి అక్కడ భూమిని పరిశీలించారు. ట్రిపుల్ ఐటీ ఏర్పాటు కోసం 100 ఎకరాలు అవసరమని చర్చించారు.
ఎల్కతుర్తి మండల కేంద్రంలో బస్టాండ్ నుంచి కిలోమీటరు దూరంలో సర్వే నంబర్లు 381, 385, 389, 392లలో 200 ఎకరాల ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు గుర్తించి ఉన్నతాధికారులకు నివేదించారు. 381 సర్వేనంబరులో 88 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని సమాచారం. రెవె న్యూ అధికారుల బృందం గత మార్చి నెలలో మూడు రోజులు సర్వే చేసి ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చినట్టు తెలిసింది.
కలిపి ఇస్తారేమో...?
బాసర ట్రిపుల్ ఐటీకి ఈ బడ్జెట్‌లో రూ.35 కోట్లు కేటాయించారు. కొత్త క్యాంపస్ కోసం రూ.500 కోట్ల మేర నిధులు అవసరమవుతాయని సమాచారం. ఎల్కతుర్తిలో ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రవేశాలు తీసుకొని తరగతులు ప్రారంభించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. శాశ్వతంగా భవనాలు నిర్మించే వరకు కొత్త క్యాంపస్‌లో ఏటా 1,000 సీట్లు భర్తీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
ఏడాదికో క్యాంపస్ తెరిచి రానున్న నాలుగేళ్లలో నాలుగు కొత్త ట్రిపుల్ ఐటీలను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అయితే ఈ ఏడాది ప్రవేశాలు ఎల్కతుర్తితో కలిసి 1,000 సీట్లు పెంచుతారో ఒక్క బాసరకే 1,500 సీట్లు కేటాయిస్తారో అనే విషయం తెలియడం లేదు. సీట్లు పెరిగితే మరో 1,000 మంది విద్యార్థులకు చదువుకునే అవకాశం వస్తుంది.
అప్పటి వరకు బాసరలోనే...
ఎల్కతుర్తి క్యాంపస్‌లో కొత్త విద్యా సంవత్సరానికి 1,000 సీట్లు భర్తీ చేసి వచ్చే విద్యా సంవత్సరం వరకు బాసర క్యాంపస్‌లోనే పీయూసీ–1, పీయూసీ–2 చదివేలా ఏర్పాట్లు చేయించాలని వాదనలు వినిపిస్తున్నాయి. బాసర క్యాంపస్‌లో విశాలమైన భవనాలు ఉన్నాయి. రెండేళ్ల వరకు ఇక్కడే విద్యార్థులు చదివి.. ఎల్కతుర్తి క్యాంపస్ నిర్మాణం ప్రారంభమైతే విద్యార్థులను అక్కడకు పంపించొచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
ప్రభుత్వానికి నివేదించాం
గత మార్చి నెలలో ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాల ప్రకటన విషయ మై ప్రభుత్వానికి నివేదికను పంపించాం. రాష్ట్ర ప్రభుత్వం అను మతి ఇవ్వగానే నోటిఫికేషన్ విడుదల చేస్తాం. పదో తరగతి ఉత్తీర్ణులైన ఎంతో మంది విద్యార్థులు ఇక్కడ చదివేందుకు ఆసక్తి కనబరుస్తారు. ప్రభుత్వ అనుమతి రాగానే నోటిఫికేషన్ వెలువరించి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తాం.– గోవర్దన్, ట్రిపుల్ ఐటీ, వీసీ