విద్యార్థులను విచారిస్తున్న ఎస్‌ఐ చంద్రశేఖర్
పామూరు: విజయవాడ, గుంటూరు, ఒంగోలులో బీటెక్ చదువుతున్న తమ పేర్లను పట్టణంలోని బెల్లంకొండ డిగ్రీ కళాశాలలో నమోదు చేసుకున్నారని పామూరు పట్టణం, మండలంలోని ఇనిమెర్ల గ్రామాలకు చెందిన పలువురు విద్యార్థులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం కనిగిరి ఏఎస్‌డబ్ల్యూవో రాజేశ్వరి, పామూరు ఎస్‌ఐ చంద్రశేఖర్‌లు విచారణ చేపట్టారు. వివరాలు.. పామూరుతో పాటు మండలంలోని ఇనిమెర్ల, ఇతర గ్రామాలకు చెందిన విద్యార్థులు 2017–19 విద్యా సంవత్సరంలో పట్టణంలోని బెల్లంకొండ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియేట్ ఎంపీసీ పూర్తి చేశారు. ఆ తర్వాత సర్టిఫికెట్లు తీసుకుని విజయవాడ, ఒంగోలు, గుంటూరులోని పలు ఇంజినీరింగ్ కళాశాలల్లో చేరారు. విద్యార్థులు వేముల వాసు, వై.మోహన్‌కృష్ణ, ఎ.నరసింహ, బత్తుల రాజాలు విజయవాడ ఎంఐసీ కళాశాలలో, వల్లపుశెట్టి సతీష్ ఒంగోలు పేస్ ఇంజినీరింగ్ కళాశాలలో, ఇర్లా కల్యాణ్ గుంటూరు చలపతి కళాశాలలో బీటెక్‌లో చేరారు.
వీరు ఫస్ట్ సెమ్ పరీక్షలు కూడా రాసి రెండో సెమ్ పరీక్షలు రాసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇదిలా ఉండగా నవశకం కార్యక్రమంలో భాగంగా జగనన్న వసతి దీవెన పథకానికి సంబంధించి మీ పేర్లు ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో చూపిస్తున్నాయని ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు సదరు విద్యార్థులకు సమాచారం ఇచ్చాయి. విద్యార్థులు అవాక్కై హుటాహుటిన పామూరు వచ్చి సదరు డిగ్రీ కళాశాల యాజమాన్యాన్ని ప్రశ్నించారు. ప్రశ్నించిన తమను యాజమాన్యం దూషించిందని బాధిత విద్యార్థులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై మంగళవారం ఎస్‌ఐ అంబటి చంద్రశేఖర్ విద్యార్థులను విచారించి సంబంధిత ధ్రువీకరణ పత్రాలు తీసుకున్నారు. డిగ్రీ కళాశాల నిర్వాహకులను పిలిపించి విచారణ జరిపారు. జిల్లా అధికారుల ఆదేశాలతో విచారణకు వచ్చిన కనిగిరి ఏఎస్‌డబ్ల్యూవో ఈ.రాజేశ్వరమ్మ కూడా విద్యార్థులను విచారించారు. దీనిపై విద్యార్థులు పామూరులో సదరు డిగ్రీ కళాశాల లేదని, సీఎస్‌పురంలో ఉందని తెలపగా విద్యార్థులు తెలిపిన కళాశాలలో విచారణ చేపట్టి ఆమె వెళ్లారు. దీనిపై ఎస్‌ఐని వివరణ కోరగా బుధవారం ఏఎస్‌డబ్ల్యూవో నివేదిక ఆధారంగా సీఐతో చర్చించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యార్థులు ధైర్యంగా ఉండాలని, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీనిపై ఏఎస్‌డబ్ల్యూవోను వివరణ కోరేందుకు యత్నించగా ఆమె ఫోన్ అందుబాటులోకి రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment