విరాళం ఇచ్చిన విశ్రాంత ప్రిన్సిపాల్ సూర్యనారాయణమూర్తి దంపతులు
అన్నవరం: చదువుల్లో రాణించాలని, లక్ష్యాలు సాధించాలని విద్యార్థులకు బోధించే అధ్యాపకులు చాలా కళాశాలల్లో కనిపిస్తారు. కాని కళాశాలల్లో పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయం కూడా కల్పిస్తే వారు మరింత బాగా కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకుంటారని భావించి అందుకోసం సొంత సొమ్మును ఖర్చు చేసే అధ్యాపకులు చాలా అరుదు.
అటువంటి కోవలోకే వస్తారు సత్యదేవ డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ భీమలింగం సూర్యనారాయణమూర్తి. ఆయన తన భార్య పద్మావతితో కలిసి సోమవారం శ్రీ సత్యదేవ నిత్యాన్నదాన పథకానికి సత్యదేవ డిగ్రీ కళాశాల విద్యార్థుల పేరుతో రూ.ఐదు లక్షలు విరాళాన్ని దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.త్రినాథరావుకు అందజేసిన విషయం తెలిసిందే.
మధ్యాహ్న భోజనం పునరుద్ధరించాలనే లక్ష్యంతో...
విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పునరుద్ధరించాలనే లక్ష్యంతో తన వంతు సాయంగా ఈ విరాళాన్ని అందచేసినట్టు ఆయన ‘సాక్షి’కి తెలిపారు. స్థానిక సత్యదేవ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా 2015–17 మధ్య సేవలందించిన సూర్యనారాయణమూర్తి ప్రస్తుతం తమ స్వగ్రామమైన పెద్దాపురం మండలంలోని సిరివాడలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఆయన ప్రిన్సిపాల్‌గా వ్యవహరించిన సమయంలో దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు మధ్యాహ్న భోజనం లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని అప్పటి దేవస్థానం చైర్మన్ రాజా ఐవీ రామ్‌కుమార్, ఈఓ కాకర్ల నాగేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్లారు. ఫలితంగా 2016లో అక్టోబర్ నుంచి 2017 ఏప్రిల్ వరకు డిగ్రీ కళాశాల విద్యార్థులకు అన్నదానం పథకం నుంచి మధ్యాహ్న భోజనం పంపించారు.
అన్నదానం పథకానికి దాతలు ఇచ్చిన విరాళాలు భక్తులకు భోజనానికి ఉపయోగించాలి తప్ప విద్యార్థుల భోజనానికి కాదని ఆడిట్ అధికారులు అభ్యంతరం చెప్పడంతో దేవస్థానం ఆ భోజనాన్ని పంపించడం నిలిపివేసింది. 2018లో సూర్యనారాయణమూర్తి పదవీ విరమణ చేశారు. అయితే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పునరుద్ధరించేందుకు ఆయన చాలా ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. దీంతో తన వంతు విరాళంగా ఆయన రూ.ఐదు లక్షలు అందజేశారు.
మధ్యాహ్న భోజన సౌకర్యం పునరుద్ధరించాలని కోరాను
కళాశాలలో చదివే విద్యార్థులు 600 మందిలో 400 మంది పేద, మధ్యతరగతి వారు. వీరికి భోజన సౌకర్యం పునరుద్ధరించాలని ఆలయ పెద్దలను కోరాను. నేను ఇచ్చిన విరాళంపై వడ్డీతో రోజుకు కనీసం పది మంది విద్యార్థులకు అన్నదాన పథకంలో (కళాశాల పనిదినాలు 180 రోజుల్లో) భోజనం పెట్టమని కోరాను.
– సూర్యనారాయణమూర్తి, విశ్రాంత ప్రిన్సిపాల్
కమిషనర్‌తో చర్చిస్తాం
డిగ్రీ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటుపై గతంలో ఆడిట్ అభ్యంతరాలు రావడంతో నిలిపివేయాల్సి వచ్చింది. మళ్లీ భోజనం పెట్టాలంటే దేవదాయశాఖ కమిషనర్ ఆదేశాలివ్వాలి. ఆ దిశగా ప్రయత్నం చేస్తాం.
– చైర్మన్ రోహిత్, ఈఓ త్రినాథరావు
Comments
Please login to add a commentAdd a comment