అయోమయంలో యూజీ, పీజీ విద్యార్థుల భవిత
అస్తవ్యస్థంగా అధికారుల పనితీరు
బయో కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లేని డిగ్రీ కాలేజీలో బయో కెమిస్ట్రీ లెక్చరర్‌కు పోస్టింగ్
ఆ పోస్టు ఖాళీగా ఉన్న కాలేజీలో నో పోస్టింగ్
పనిలేక ఖాళీగా ఉంటున్న అధ్యాపకులు
విజయనగరం నుంచి అనంతపురం దాకా చాలా డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీల్లో ఇదే పరిస్థితి
సర్దుబాటు పేరుతో అవసరంలేని చోట పోస్టింగ్, అవసరమైన చోట ఖాళీలు
ఫారిన్ సరీ్వసులు చేసిన వారికి రాష్ట్ర సరిహద్దుల్లోకి బదిలీ
కమిషనరేట్‌లో మాత్రం 15 ఏళ్లుగా డిప్యుటేషన్‌పై పలువురు అధ్యాపకులు
అధికారుల తీరుతో తీవ్రంగా నష్టపోతున్న యూజీ, పీజీ విద్యార్థులు
డాక్టర్ ధనశ్రీ.. బయోకెమిస్ట్రీ లెక్చరర్. కర్నూలు కేవీఆర్‌లో పనిచేసేవారు. లాంగ్ స్టాండింగ్ పేరుతో 2022–23లో గుంతకల్లు డిగ్రీ కాలేజీకి బదిలీ చేశారు. అక్కడ ఫైనలియర్‌లో కేవలం ఆరుగురు మాత్రమే విద్యార్థులున్నారు. వారు వెళ్లిపోయిన తర్వాత బయో కెమి్రస్టికి ఒక్క అడ్మిషన్ కూడా రాలేదు. విద్యార్థులు లేరు.. పైగా బయోకెమిస్ట్రి అక్కడ తొలగించారు. దీంతో ధనశ్రీ ఖాళీగా ఉన్నారు. పని ఉన్న కాలేజీకి బదిలీచేయాలని ఉన్నత విద్యాశాఖకు లేఖ రాయగా ఆమెను నంద్యాల డిగ్రీ కాలేజీకి బదిలీ చేశారు. అక్కడ బయోకెమిస్ట్రీ డిపార్ట్‌మెంటే లేదు. దీంతో అక్కడ కూడా ఆవిడ పనిలేకుండా ఖాళీగా ఉన్నారు. కేవీఆర్, సిల్వర్ జూబ్లీలో బయో కెమిస్ట్రి విభాగంలో ఖాళీలున్నాయి, విద్యార్థులూ ఉన్నారు. కానీ, వారికి నాణ్యమైన బోధన అందడంలేదు. భారీ వేతనాలిచ్చి సబ్జెక్ట్‌లేని కాలేజీలో పనిలేకుండా అధికారులు ఉంచడం ఎందుకో!?
డాక్టర్ రవిశంకర్ శర్మ.. గుంతకల్లు డిగ్రీ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్. గుంతకల్లులో ఉన్న పోస్టుల కంటే ఎక్కువగా ఫిజిక్స్ లెక్చరర్లు ఉన్నారు. దీంతో పనిలేకుండా ఖాళీగా ఉన్నానని, పత్తికొండలో పోస్టు ఖాళీగా ఉందని అక్కడికి పంపాలని రిక్వెస్ట్ పెట్టుకున్నారు. అయితే, శర్మను అనంతపురం డిగ్రీ కాలేజీకి బదిలీ చేశారు. అక్కడ కూడా ఉన్న పోస్టుల కంటే ఎక్కువగానే ఉన్నారు. అక్కడా ఆయన పనిలేక ఖాళీగా ఉన్నారు. పత్తికొండలో మాత్రం ఖాళీ పోస్టును భర్తీచేయలేదు.
డాక్టర్ కోటేశ్వరరావు.. గుంటూరు డిగ్రీ కాలేజీలో ఇంగ్లీషు లెక్చరర్. 2022లో సర్దుబాటు పేరుతో ఇతన్ని బనగానపల్లిలో వేశారు. అక్కడ పూర్తిస్థాయిలో లెక్చరర్లు ఉన్నా అదనంగా నియమించారు. దీంతో ఏడాది పాటు పనిలేకుండా ఆయన ఖాళీగా ఉన్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి అక్కడ నియమించాలని ఇక్కడ తనకు పనిలేదని కోరారు. ఏడాది తర్వాత ఆయన్ను తిరిగి డోన్‌కు పంపారు.
డాక్టర్ ఫరీదా ఇంగ్లీషు లెక్చరర్. లాంగ్‌స్టాండింగ్ పేరుతో కేవీఆర్ నుంచి పాణ్యం డిగ్రీ కాలేజీకి బదిలీ చేశారు. అక్కడ పిల్లలు లేరు. పనిలేకుండా ఫరీదా కూడా ఖాళీగా ఉన్నారు. ఖాళీగా ఉన్నారని అక్కడి ప్రిన్సిపాల్ ఫరీదాకు వేతనం నిలిపేశారు. పిల్లలు లేనప్పుడు తానేం చేయాలని, తన అవసరం ఉన్న కాలేజీకి బదిలీచేయాలని ఆవిడ విన్నవించారు. కేవీఆర్‌లో ముగ్గురు కాంట్రాక్టు లెక్చరర్లు ఉన్నారు. రెగ్యులర్ పోస్టు ఉన్నప్పుడు కాంట్రాక్ట్ వారితో విద్యార్థులకు క్లాస్‌లు చెప్పించడం ఏమిటో!?
.. ఈ నాలుగు ఉదాహరణలు పరిశీలిస్తే డిగ్రీ కాలేజీలో లెక్చరర్ల నియామకాలు, పనితీరు, విద్యార్థులకు అందుతున్న బోధన, వారి భవిష్యత్తుపై ఉన్నత విద్యాశాఖకు, ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఎంత డొల్లగా ఉందో స్పష్టమవుతోంది. సబ్జెక్ట్‌లేని చోట సబ్జెక్ట్ లెక్చరర్‌ను నియమించడం, పిల్లలులేని చోట వారిని ఉంచడం, అవసరమైన చోట ఖాళీలు పెట్టడం చూస్తే అసలు డిగ్రీ కాలేజీల పనితీరుపై, విద్యార్థుల భవిష్యత్తుపై ఉన్నతాధికారులకు ఏమాత్రం అవగాహనలేదని తేటతెల్లమవుతోంది. – సాక్షి ప్రతినిధి, కర్నూలు
ఫారిన్ సర్వీసులు చేసి వస్తే సరిహద్దులకే..
⇒ ఓ లెక్చరర్ విజయనగరం జిల్లా ఎస్‌ఎస్‌ఏ ఏపీసీగా పనిచేశారు. తిరిగి అతను సొంతశాఖలోకి వస్తే ఖాళీలున్నా అతన్ని మాత్రం పార్వతీపురం డిగ్రీ కాలేజీకి బదిలీ చేశారు.
⇒ నంద్యాలలోని ఓ లెక్చరర్‌ను సర్దుబాటు పేరుతో విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురానికి బదిలీ చేశారు. చుట్టపక్కల కాలేజీల్లో ఖాళీలున్నా దూరానికి బదిలీ చేశారు.
⇒ కర్నూలు జిల్లాలోని ఓ లెక్చరర్ కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఎస్‌ఎస్‌ఏ ఏపీసీగా పనిచేశారు. కర్నూలు జిల్లాలో ఖాళీలు ఉన్నప్పటికీ కడప జిల్లాకు బదిలీ చేశారు.
⇒ కర్నూలు ఎస్‌ఎస్‌ఏ ఏపీసీగా పనిచేసిన ఓ కెమిస్ట్రీ లెక్చరర్‌ను కర్నూలులోని రెండు కాలేజీల్లో ఖాళీలున్నప్పటికీ నంద్యాల జిల్లా కోవెలకుంట్లకు బదిలీ చేశారు.
డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తూ ఫారిన్ సర్విసుల కింద బయటకెళ్లిన వారందరినీ ఆయా జిల్లాల్లోని డిగ్రీ కాలేజీల్లో ఖాళీలున్నప్పటికీ ఉన్నత విద్యాశాఖాధికారులు వారిని రాష్ట్ర సరిహద్దుల్లోని డిగ్రీ కాలేజీలకు బదిలీ చేస్తున్నారు. దీనికి కారణం వారు ‘ఫారిన్ సర్విసు’లకు వెళ్లడమే. వారిపై ఉన్న కోపంతో దూర ప్రాంతాలకు బదిలీచేసే సమయంలో అక్కడ ఖాళీలున్నాయా? వారి సొంత జిల్లాల్లో ఉన్న ఖాళీల పరిస్థితి ఏంటి? ఆ ఖాళీలను అలాగే ఉంచితే అక్కడున్న విద్యార్థుల భవిష్యత్తు ఏంటి? అని ఆలోచన చేయడంలేదు.
దీంతో 13 జిల్లాల్లోని ఏ డిగ్రీ కాలేజీ లెక్చరర్ కూడా ‘ఫారిన్ సర్విసు’కు వెళ్లినా వారిని ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోకి బదిలీ చేశారని లెక్చరర్లు చర్చించుకుంటున్నారు. ఉన్నత విద్యాశాఖలో ఇటీవల బదిలీ అయిన ఓ ఉన్నతాధికారి పనిగట్టుకుని ఇదంతా చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎక్కడ అధ్యాపకులు అవసరం? ఎక్కడ అవసరంలేదని గ్రహించకుండా కేవలం ఫారిన్ సర్వీసుకు వెళ్లారు కాబట్టి ‘శిక్ష’గా వీరిని దూర ప్రాంతాలకు బదిలీ చేస్తున్నట్లుగా ఉంది.
రెగ్యులర్ లెక్చరర్లు ఉన్నప్పుడు ‘కాంట్రాక్టు’ బోధన ఎందుకు?..
రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో దాదాపు 2,400 మంది రెగ్యులర్ అధ్యాపకులున్నారు. 740 మంది కాంట్రాక్టు, వెయ్యిమంది వరకు ఎయిడెడ్ లెక్చరర్లు ఉన్నారు. యూనివర్శిటీ స్థాయి పొందిన కాలేజీలో పీహెచ్‌డీ చేసిన అధ్యాపకులే యూజీ, పీజీ విద్యార్థులకు బోధించాలి. అయితే, రెగ్యులర్ పోస్టులున్నా వారిని ఇతర జిల్లాల్లోని డిగ్రీ కాలేజీలకు బదిలీచేసి యూనివర్శిటీ పరిధిలో కాంట్రాక్టు లెక్చరర్లతో నడిపిస్తున్నారు. వీరిలో సింహభాగం లెక్చరర్లకు పీహెచ్‌డీ లేదు. రెగ్యులర్ లెక్చరర్లు ఉన్నప్పుడు వారిని ఖాళీగా ఉంచి కాంట్రాక్టు లెక్చరర్లపై ఆధారపడటం ఏమిటని మిగిలిన అధ్యాపకులు ప్రశి్నస్తున్నారు.
కమిషనరేట్‌లో ఏళ్ల తరబడి డిప్యుటేషన్..
మరోవైపు.. కమిషనరేట్‌లో నలుగురు లెక్చరర్లు డిప్యుటేషన్‌పై 15 ఏళ్లుగా కొనసాగుతున్నారు. వీరు ఉద్యోగానికి వచ్చింది విద్యార్థులకు చదువు చెప్పేందుకా? లేదంటే కమిషనరేట్‌లో డిప్యుటేషన్‌పై కొనసాగేందుకా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 15 ఏళ్లుగా వారిని ఓ స్థానంలో అదీ డిప్యుటేషన్‌పై ఎందుకు కొనసాగిస్తున్నారని తోటి లెక్చరర్లు ప్రశి్నస్తున్నారు.
క్లస్టర్ యూనివర్సిటీపై శీతకన్ను..
కర్నూలు జిల్లా సిల్వర్ జూబ్లి కాలేజీని, నగరంలోని కాలేజీలను క్లస్టర్ యూనివర్సిటీగా గత ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసింది. విద్యార్థులకు మంచి విద్యను అందించాలనే లక్ష్యంతో ఖాళీలు లేకుండా పోస్టులు కూడా భర్తీచేశారు. అయితే, ఇక్కడ ఉన్న వీసీ సాయిగోపాల్‌కు, ఉన్నత విద్యాశాఖ నుంచి ఇటీవల బదిలీ అయిన ఓ కీలక అధికారికి మధ్య వ్యక్తిగత విభేదాలతో ఈ కాలేజీ వారిని బయటికి పంపడం, బయటి వారిని ఇక్కడకు పంపకుండా ఖాళీలు ఉండేలా చేస్తున్నారని లెక్చరర్లు చర్చించుకుంటున్నారు. వీసీలకు, ఉన్నతాధికారులకు మధ్య విభేదాలతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు యూజీ, పీజీపై సమీక్షించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment