కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ హాస్టళ్లలో పురుగుల బియ్యంతోనే అన్నం
కుళ్లిన వంకాయలు, టమాటాలతో కూరలు
విద్యార్థులు స్వయంగా ధర్నాలో ప్రదర్శించారు
వాస్తవాలు తెలుసుకోకుండా ‘సాక్షి’పై మంత్రి నాదెండ్ల అక్కసు
కర్నూలు(సెంట్రల్): ‘అయ్యా మంత్రి మనోహర్ గారు... మీరు నాణ్యమైన బియ్యం సరఫరా చేస్తే పులిహోరలో పురుగులు ఎందుకు వస్తాయి?.. అన్నం ఎందుకు ముక్కిపోయి ముద్దగా ఉంటుంది. కుల్లిపోయిన కూరగాయలతో కూరలు చేసే దుస్థితి ఎందుకు వస్తుంది...’ అని కర్నూలు సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాల విద్యార్థులు మండిపడుతున్నారు. తమ కళాశాల మేనేజ్‌మెంట్ బాలుర, బాలికల హాస్టళ్లలో పురుగుల బియ్యంతో అన్నం వండుతున్నారని, కుళ్లిన కూరగాయలతో కూరలు చేస్తున్నారని, నాలుగైదు రోజులకొకసారి నీళ్లు వస్తుండడంతో స్నానాలు కూడా చేయకుండా కాలేజీకి వెళ్తున్నామని శుక్రవారం కర్నూలు కలెక్టరేట్ ఎదుట దాదాపు 700మంది సిల్వర్ జూబ్లీ కళాశాల విద్యార్థులు ధర్నా చేశారు.
విద్యార్థుల ఆవేదనను వివరిస్తూ ‘అన్నమో చంద్రబాబూ’ అంటూ ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై శనివారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. సిల్వర్ జూబ్లీ కళాశాలకు నాణ్యమైన బియ్యం సరఫరా చేశామని విజయవాడలో ఒక ప్రకటన విడుదల చేశారు. ‘సాక్షి’లో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అక్కసు వెళ్లగక్కారు. అదేవిధంగా ఈ ఘటనపై విచారణ చేయాలని కర్నూలు ఆర్‌డీవో, పౌరసరఫరాల సంస్థ డీఎంను ఆదేశించారు.
అతి ప్రధానమైన కిలో బియ్యం రూపాయికే ఇచ్చే ప్రతిపాదనపై మాత్రం మంత్రి స్పష్టత ఇవ్వలేదు. ఉన్నత విద్యాశాఖ నుంచి ప్రతిపాదనలు వచ్చాయని, త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. దీంతో మంత్రి ప్రకటనపై విద్యార్థులు తీవ్రంగా మండిపడుతున్నారు. నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేస్తే శుక్రవారం ఉదయం వండిన పులిహోరలో పురుగులు ఎలా వచ్చాయని ప్రశ్నిస్తున్నారు. అన్నంలో పురుగులు వస్తున్నాయని, కుళ్లిన కూరగాయలతో వంట చేస్తున్నారనే విషయాన్ని తాము సాక్ష్యాధారాలతో కళ్లకు కట్టినట్లు ధర్నాలో వివరించినా మంత్రి వాస్తవాలు తెలుసుకోకుండా అన్నీ బాగానే ఉన్నట్లు ప్రకటన ఇవ్వడం మంచిది కాదని, వెంటనే తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని పలువురు విద్యార్థులు డిమాండ్ చేశారు.
బుగ్గన చొరవతో రూపాయికే కిలో బియ్యం ఇచ్చేలా ఉత్తర్వులు
సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాల హాస్టల్ విద్యార్థులు నెలకు ఒక్కొక్కరూ రూ.430 మెస్ చార్జీల కోసం చెల్లిస్తారు. దానిలో అత్యధిక భాగం బియ్యం కొనుగోలుకే సరిపోతుంది. ప్రస్తుతం కళాశాల మేనేజ్‌మెంట్ కిలో బియ్యం రూ.45 చొప్పున కొనుగోలు చేస్తోంది. ఈ క్రమంలో మెస్‌చార్జీల డబ్బులన్నీ బియ్యం కొనుగోలుకే సరిపోతుండడంతో గ్యాస్, నూనె, కూరగాయలు, ఇతర సరుకుల కొనుగోలుకు డబ్బులు సరిపోవడంలేదు.
ఈ విషయాన్ని గత ప్రభుత్వంలో ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ ద్వారా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వైఎస్ జగన్ స్పందించి సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాలకు రూపాయికే కిలో బియ్యం ఇవ్వాలని ఆదేశిస్తూ 2024, మార్చి ఒకటో తేదీన మెమో నంబర్ 976211/సీఈ/ఏ1/2019 జారీ చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దానిని అమలు చేయకపోవడంతోనే విద్యార్థులు అల్లాడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment