worms in food
-
మంత్రిగారూ.. ఇవిగో పులిహోరలో పురుగులు
కర్నూలు(సెంట్రల్): ‘అయ్యా మంత్రి మనోహర్ గారు... మీరు నాణ్యమైన బియ్యం సరఫరా చేస్తే పులిహోరలో పురుగులు ఎందుకు వస్తాయి?.. అన్నం ఎందుకు ముక్కిపోయి ముద్దగా ఉంటుంది. కుల్లిపోయిన కూరగాయలతో కూరలు చేసే దుస్థితి ఎందుకు వస్తుంది...’ అని కర్నూలు సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాల విద్యార్థులు మండిపడుతున్నారు. తమ కళాశాల మేనేజ్మెంట్ బాలుర, బాలికల హాస్టళ్లలో పురుగుల బియ్యంతో అన్నం వండుతున్నారని, కుళ్లిన కూరగాయలతో కూరలు చేస్తున్నారని, నాలుగైదు రోజులకొకసారి నీళ్లు వస్తుండడంతో స్నానాలు కూడా చేయకుండా కాలేజీకి వెళ్తున్నామని శుక్రవారం కర్నూలు కలెక్టరేట్ ఎదుట దాదాపు 700మంది సిల్వర్ జూబ్లీ కళాశాల విద్యార్థులు ధర్నా చేశారు.విద్యార్థుల ఆవేదనను వివరిస్తూ ‘అన్నమో చంద్రబాబూ’ అంటూ ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై శనివారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. సిల్వర్ జూబ్లీ కళాశాలకు నాణ్యమైన బియ్యం సరఫరా చేశామని విజయవాడలో ఒక ప్రకటన విడుదల చేశారు. ‘సాక్షి’లో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అక్కసు వెళ్లగక్కారు. అదేవిధంగా ఈ ఘటనపై విచారణ చేయాలని కర్నూలు ఆర్డీవో, పౌరసరఫరాల సంస్థ డీఎంను ఆదేశించారు.అతి ప్రధానమైన కిలో బియ్యం రూపాయికే ఇచ్చే ప్రతిపాదనపై మాత్రం మంత్రి స్పష్టత ఇవ్వలేదు. ఉన్నత విద్యాశాఖ నుంచి ప్రతిపాదనలు వచ్చాయని, త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. దీంతో మంత్రి ప్రకటనపై విద్యార్థులు తీవ్రంగా మండిపడుతున్నారు. నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేస్తే శుక్రవారం ఉదయం వండిన పులిహోరలో పురుగులు ఎలా వచ్చాయని ప్రశ్నిస్తున్నారు. అన్నంలో పురుగులు వస్తున్నాయని, కుళ్లిన కూరగాయలతో వంట చేస్తున్నారనే విషయాన్ని తాము సాక్ష్యాధారాలతో కళ్లకు కట్టినట్లు ధర్నాలో వివరించినా మంత్రి వాస్తవాలు తెలుసుకోకుండా అన్నీ బాగానే ఉన్నట్లు ప్రకటన ఇవ్వడం మంచిది కాదని, వెంటనే తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని పలువురు విద్యార్థులు డిమాండ్ చేశారు. బుగ్గన చొరవతో రూపాయికే కిలో బియ్యం ఇచ్చేలా ఉత్తర్వులుసిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాల హాస్టల్ విద్యార్థులు నెలకు ఒక్కొక్కరూ రూ.430 మెస్ చార్జీల కోసం చెల్లిస్తారు. దానిలో అత్యధిక భాగం బియ్యం కొనుగోలుకే సరిపోతుంది. ప్రస్తుతం కళాశాల మేనేజ్మెంట్ కిలో బియ్యం రూ.45 చొప్పున కొనుగోలు చేస్తోంది. ఈ క్రమంలో మెస్‌చార్జీల డబ్బులన్నీ బియ్యం కొనుగోలుకే సరిపోతుండడంతో గ్యాస్, నూనె, కూరగాయలు, ఇతర సరుకుల కొనుగోలుకు డబ్బులు సరిపోవడంలేదు.ఈ విషయాన్ని గత ప్రభుత్వంలో ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వైఎస్ జగన్ స్పందించి సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాలకు రూపాయికే కిలో బియ్యం ఇవ్వాలని ఆదేశిస్తూ 2024, మార్చి ఒకటో తేదీన మెమో నంబర్ 976211/సీఈ/ఏ1/2019 జారీ చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దానిని అమలు చేయకపోవడంతోనే విద్యార్థులు అల్లాడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. -
చింత చిగురు తోడైతే.. చింత లేని వంట!
సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి... సీజనల్ వెజిటబుల్స్ ఉంటాయి. అలాగే సీజనల్ ఆకులూ ఉంటాయి...చింతచిగురు నోరూరిస్తోంది. ఎప్పుడూ చింతచిగురు పప్పేనా! ఈ సారి ఇలా ట్రై చేద్దాం. ఓ పచ్చడి... ఓ పొడి... ఓ అన్నం... ఓ కూర. వెరైటీగా ఏం వండాలా అనే చింత వద్దు. చింత ఉంది చిరుపుల్లగా... జిహ్వకు హితవుగా.చింతచిగురు కొబ్బరి పచ్చడి..కావలసినవి..చింత చిగురు – 2 కప్పులు (శుభ్రంగా కడగాలి);పచ్చి కొబ్బరి ముక్కలు – కప్పు;పచ్చిమిర్చి – 2;ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి;పోపు కోసం..ఆవాలు – అర టీ స్పూన్;ఇంగువ – చిటికెడు;కరివేపాకు – 2 రెమ్మలు;మినప్పప్పు – అర టీ స్పూన్;ఎండుమిర్చి – 2;నూనె – అర టీ స్పూన్;తయారీ..కొబ్బరిముక్కలు, చింతచిగురు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేయాలి.చిన్న పాత్రలో నూనె వేసి చిన్న మంట మీద వేడి చేసి అందులో ఆవాలు వేసి అవి వేగిన వెంటనే ఎండుమిర్చి (విరిచి ముక్కలు చేసి వేయాలి), మినప్పప్పు వేసి ఎర్రగా వేగిన తర్వాత ఇంగువ వేసి స్టవ్ ఆపేయాలి.పోపును స్పూన్‌తో కలిపి అందులో మిక్సీలో గ్రైండ్ చేసిన కొబ్బరి పచ్చడి వేసి కలపాలి.ఘుమఘుమలాడే కొబ్బరి పచ్చడి రెడీ.ఇది ఇడ్లీ, దోశెలతోపాటు అన్నంలోకి కూడా రుచిగా ఉంటుంది.చింత చిగురు పొడి..కావలసినవి..చింత చిగురు – కప్పు;ఎండుమిర్చి – 7 లేదా 8;ఎండు కొబ్బరి – అర చిప్ప;వెల్లుల్లి రేకలు – 4;ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచికి తగినంత;తయారీ..చింత చిగురును మంచినీటితో శుభ్రం చేసి నీడలో ఆరబెట్టాలి.స్టవ్ మీద మందపాటి బాణలి వేడి చేసి సన్నమంట మీద చింత చిగురులో తేమ పోయే వరకు వేయించాలి.వేగిన ఆకును ఒక ప్లేట్లోకి తీసుకుని అదే బాణలిలో ఎండుమిర్చి, కొబ్బరి వేసి వేయించాలి.అన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో వేసి కొంచెం పలుకుగా గ్రైండ్ చేయాలి.ఉప్పు, వెల్లుల్లి వేసి మరో రౌండ్ గ్రైండ్ చేస్తే చింత చిగురు పొడి రెడీ.వేడి అన్నంలో చింతచిగురు పొడి, నెయ్యి కలుపుకుంటే రుచి అమోఘం.ఇడ్లీ, దోశెల్లోకి కూడా బాగుంటుంది.ఈ పొడిని గాలి దూరని డబ్బాలో నిల్వ చేస్తే పది రోజుల వరకు తాజాగా ఉంటుంది.ఇంకా ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు. -
చీకటి పడితే చాలు.. అక్కడ అంతే సంగతులు..!
వరంగల్: లక్కపురుగుల బాధతో కాజీపేట పరిధిలోని రహమత్ నగర్, వెంకటాద్రి నగర్, విష్ణుపురి కాలనీల ప్రజలకు కంటి మీద కునుకు కరువైంది. వెంకటాద్రి నగర్లో ఉన్న ఎఫ్‌సీఐకి కిలోమీటరుకుపైగా దూరం ఉన్న ఈకాలనీలవాసులు లక్కపురుగుల బాధపడలేక ఇళ్లు ఖాళీ చేసి వెళ్తున్నారు. ఎఫ్‌సీఐ అధికారుల నిర్లక్ష్యం.. పట్టింపులేని తనంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏటా సిబ్బంది జీతభత్యాలు కలిపి రూ.10 లక్షలకు పైగా లక్కపురుగుల నివారణకు ఖర్చు చేస్తున్నట్లు అధికారులు లెక్కలు చూపిస్తున్నారు. కానీ.. ఆచరణలో మాత్రం విఫలమవుతున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. చీకటిపడితే ఇంట్లోనే బందీ.. చీకటి పడిందంటే చాలు.. పలు కాలనీల వాసులు తలుపులు, కిటికీలు మూసుకుని ఇళ్లలోనే బందీలవుతున్నారు. అసలే వర్షాకాలం, ఆపై దోమల బెడద, వీటికి తోడు పట్టణవాసులకు లక్క పురుగులు చుక్కలు చూపెడుతున్నాయి. నీళ్లలో, బియ్యం, వంట పదార్థాల్లో కుప్పలుతెప్పలుగా పడిపోతున్నాయి. దీని వల్ల అన్నం నోట్లోకి వెళ్లట్లేదు. కనీసం కంటి నిండా నిద్రపోదామంటే ఒంటిపై వాలుతూ.. చెవుల్లో చేరుతూ లక్కపురుగులు ప్రత్యక్ష నరకాన్ని చూపుతున్నాయి. లక్కపురుగులు వాలిన చోట దద్దుర్లు వస్తున్నాయని, వీటితో ఆస్పత్రుల పాలవుతున్నామని పలు కాలనీల వాసులు వాపోతున్నారు. పిల్లల బాధ మరీ వర్ణనాతీతంగా మారింది. ఒంటిపై దద్దుర్లు, దురదతో బాధపడుతున్నారు. వణికిస్తున్న లక్కపురుగులు.. పొద్దంతా రెక్కలు ముక్కలు చేసుకుని ఇంటికి చేరిన రాధమ్మ బువ్వ తిందామని కూర్చుంది. కూర వాసనకు నోరూరింది. నోట్లో బుక్క పెట్టుకుందామనేలోపే గిన్నెలో లక్కపురుగు కనిపించింది. ఆకలి మంటతో ఉన్న రాధమ్మకు ఆ పురుగులు చూడగానే ముద్ద దిగలేదు. ఈ పరిస్థితి ఒక్క రాధమ్మదే కాదు.. భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) సమీపంలోని కాలనీల వారందరిదీ. పట్టించుకోని అధికారులు.. లక్కపురుగుల నివారణకు లక్షలాది రూపాయలు మంచినీళ్లప్రాయంగా ఖర్చు పెడుతున్నట్లుగా అధికారులు లెక్కలు చూపుతున్నారు. అయినప్పటికీ ఫలితం కన్పించట్లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లక్కపురుగుల వల్ల పడుతున్న నష్టాలు తెలుపుతూ ఏరియా మేనేజర్‌కు పట్టణవాసులు ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినా.. అవన్నీ చెత్తబుట్టలోనే చేరుతున్నాయంటూ బాధిత కాలనీల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్క పురుగులను నివారించడంలో అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ గతంలో రాజకీయ పార్టీలకతీతంగా ఆందోళనలు చేపట్టారు. అప్పుడు ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి. జనవాసాల మధ్య గోదాంలు ఉన్నందున అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడమే ప్రస్తుత పరిస్థితికి కారణంగా పలువురు అభివర్ణిస్తున్నారు. ఇప్పటికైనా ఎఫ్‌సీఐ అధికారులు లక్కపురుగుల నివారణ చర్యలను ముమ్మరం చేసి ఇబ్బందులను తొలగించాలని కాజీపేటవాసులు కోరుతున్నారు. -
కోవిడ్ వారియర్స్ ఆహారంలో పురుగులు
లక్నో: కరోనాపై పోరులో వైద్య సిబ్బంది తమ ప్రాణాలను సైతం లెక్క చేయక.. రోజుల తరబడి కుటుంబానికి దూరంగా ఉంటూ పేషంట్లకు వైద్యం చేస్తున్నారు. ఈ క్రమంలో వారికి సరైన సౌకర్యాలు కల్పించకపోవడం నిజంగా క్షమార్హం. మంచి భోజనం అందించడం కనీస బాధ్యత. కానీ ఈ విషయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఇందుకు నిదర్శనంగా నిలిచే సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ (కేజీఎంయూ) వైద్య సిబ్బందికి అందించిన ఆహారంలో పురుగులు రావడం స్థానికంగా కలకలం రేపింది. ఇలా జరగడం ఇదే ప్రథమం కాదు. గతంలో కూడా అనేకసార్లు ఆహారంలో పురుగులు కనిపించాయి. దాంతో ప్రస్తుతం కేజీఎంయూ మెడికల్ సిబ్బంది దీని గురించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. (ఆస్పత్రి పడక.. తప్పుల తడక!) వివరాలు.. రెయిన్ బసేరా క్వారంటైన్ కేంద్రంలో ఉంటున్న కేజీఎంయూ ఎమర్జెన్సీ మెడిసిన్ సర్వీస్ విభాగంలో పనిచేసే క్లీనింగ్ సిబ్బందికి అందజేసిన ఆహారం ప్యాకెట్లో పురుగులు వచ్చాయి. గతంలో కూడా రెసిడెంట్ వైద్యులు, నాన్ క్లినికల్ సిబ్బందికి అందించిన ఆహారంలోనూ పురుగులు కనిపించాయి. దీని గురించి చాలాసార్లు ఫిర్యాదు చేశారు. కానీ ఎలాంటి స్పందన లేదు. దాంతో ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతేకాక డ్యూటీ అవర్స్ అయిపోయాక విశ్రాంతి తీసుకోవడానికి రెసిడెంట్ డాక్టర్లుకు కేటాయించిన గదుల్లో ఫ్యాన్లు కూడా సరిగా పని చేయడం లేదని తెలిపారు. కోవిడ్-19 డ్యూటీలో ఉన్న వైద్యులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. నాణ్యతలేని ఆహారం తీసుకుంటే వైద్య సిబ్బంది కూడా అనారోగ్యం పాలవుతారని సూచిస్తున్నారు. (మాస్కు ధరించనందుకు మహిళపై..) బస్తి జిల్లా వైద్యులు కూడా ఆహారం నాణ్యత పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు అందిస్తోన్న నాణ్యత లేని ఆహారం ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కోవిడ్ పేషంట్లతో పాటు వారికి సేవలందించే వైద్యులకు మంచి భోజనం అందించడం కనీస బాధ్యత అని తెలిపారు. కుటుంబాలకు దూరంగా ఉండి పేషంట్లకు చికిత్స చేస్తున్న వైద్యులకు మంచి ఆహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. -
సాంబార్లో పురుగులు
అనంతపురం, ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని మహానంది వసతిగృహంలో శుక్రవారం మధ్యాహ్నం వడ్డించిన సాంబార్లో పురుగులు కనిపించడంతో విద్యార్థులు ఆగ్రహించారు. పుచ్చుపట్టిన వంకాయలను సాంబార్‌లోకి యథాతథంగా వాడటంతో పురుగులు బయటపడ్డాయి. ఇటువంటి భోజనం ఎలా తినాలంటూ విద్యార్థులు యూనివర్సిటీ ఉన్నతాధికారులను ప్రశ్నించారు. నాసిరకమైన ఆహారంతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. వీరి ఆందోళనలకు వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు మద్దతు ప్రకటించారు. నాయకులు రాధాకృష్ణ, కళ్యాణ్ కుమార్, వినోద్, అనిల్, హేమంత్ మాట్లాడుతూ నాలుగు నెలల నుంచి నాణ్యమైన భోజనం అందించాలని అనేక దఫాలుగా విన్నవించినప్పటికీ అధికారుల వైఖరిలో మార్పు రాలేదన్నారు. ఇటీవల టెండర్లలో రేట్లు తగ్గించేలా ఒత్తిడి తీసుకొచ్చామన్నారు. అయినా కిందిస్థాయి అధికారులు వాటిని సక్రమంగా అమలు చేయలేదని విమర్శించారు. కూరగాయలు చెడిపోయినవి సరఫరా చేస్తున్నారని ధ్వజమెత్తారు. విద్యార్థులందరూ ర్యాలీగా వచ్చి ఎస్కేయూ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు. వార్డెన్ ప్రొఫెసర్ జ్యోతి విజయ్‌కుమార్ విద్యార్థులకు నచ్చచెప్పారు. స్టోర్ కీపర్, సప్లయర్‌పై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
పురుగుల బువ్వ మాకొద్దు
ఆకలి అవుతుందని భోజనం చేద్దామనుకుంటే రుచీపచీ లేని ఆహారం. పైగా పురుగులు వస్తుండడంతో తినలేక పేద విద్యార్థులు పస్తులు ఉండాల్సిన పరిస్థితి. భోజనంలో పురుగులు వస్తుండడంతో పిల్లలు వృథాగా పడేశాయి. ఖాళీ కడుపుతో తరగతులకు హాజరయ్యారు. ఈ ఘటన పెద్దేముల్ మండలం కందనెల్లి ఉన్నత పాఠశాలలో సోమవారం చోటుచేసుకుంది. అసలే ఎదిగే పిల్లలు.. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక ఆహారం అందించాలి. ఇవన్నీ కాకుండా నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి భోజనం అందిస్తుండడంతో విద్యార్థుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. పెద్దేముల్ : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని ప్రభుత్వం చెబుతోంది. ఆన్లైన్లో ఎప్పటికప్పుడు మధ్యాహ్న భోజనం తీరుపై సమీక్షిస్తున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం అభాసుపాలవుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి విద్యాశాఖ అధికారులు తిలోదకాలిచ్చారు. ఉన్నత పాఠశాల హెచ్ఎం మండల ఇన్చార్జి మండల విద్యాధికారిగా వ్యవహరిస్తున్న పాఠశాలలోనే విద్యార్థులకు పురుగుల అన్నం.. నీళ్ల చారు అందిస్తుండడం గమనార్హం. పురుగుల బువ్వ మాకు వద్దు అంటూ విద్యార్థులు భోజనం పడేశారు. వారంలో ఆరు రోజులు పప్పు చారే.. మెనూ జాడ లేదు.. పేరుకు మాత్రమే మధ్యాహ్న భోజనం అంటూ విద్యార్థులు వాపోతున్నారు. పెద్దేముల్ మండల కందనెల్లి ఉన్నత పాఠశాలల్లో 280 మంది విద్యార్థులు ఉన్నారు. సోమవారం రోజు మాదిరే మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్నారు. అయితే భోజనం సమయంలో కొంతమంది విద్యార్థుల పల్లెంలో తెల్లని పురుగులు కనిపించాయి. వాటిని చూసి విద్యార్థులు భోజనంపైనే ఏహ్యభావం పెంచుకున్నారు. వెంటనే విద్యార్థులందరూ కలిసి భోజనం పడేశారు. ఇది ఈ పాఠశాలలో తరచూ జరిగే సంఘటన అని విద్యార్థులు వాపోయారు. ఈ విషయమై సార్లకు చెప్పినా పట్టించుకోలేదని ఆరోపించారు. పైగా ప్రభుత్వం అందించిన మధ్యాహ్న భోజన మెనూ ఎక్కడా అమలు కావడం లేదు. వారంలో మూడుసార్లు కోడిగుడ్డు ఇవ్వాలనే ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారు. మండల విద్యాధికారి ఉన్న పాఠశాలల్లోనే మధ్యాహ్న భోజన పరిస్థితి ఇలా ఉండడం ఆశ్చర్యమేస్తోంది. వారంలో కనీసం మూడు రోజులు కూడా కురగాయలతో కూడిన భోజనం అందించడం లేదని విద్యార్థులు వాపోయారు. అధికారుల పర్యవేక్షణ లేక భోజన సిబ్బంది ఇష్టమొచ్చిన రీతిన వ్యవహరిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. గుడ్ల ధరలు ఎక్కువగా ఉన్నాయని అరటిపండ్లతో సరిపెడుతున్నారు. ఈ విషయమై మండల విద్యాధికారి, పాఠశాల హెచ్ఎం శ్రీనివాస్ వివరణ కోరగా అన్నంలో పురుగులు వచ్చిన విషయం వాస్తవమన్నారు. ఇక ముందుదిలా జరిగే చర్యలు తీసుకుంటాం అని చెప్పారు. భోజన సిబ్బందిపై మందలించిన నేటిలోపు మెనూను అమలు చేయిస్తానని తెలిపారు. ఇలా అయితే ఎలా తినేది.. మధ్యాహ్న భోజనంలో చాలాసార్లు పురుగులు వచ్చాయి. ఈ విషయం సార్లకు చెప్పాం. ఆయాలకు చెప్పితే చింతపండులో వచ్చి ఉండొచ్చని తీసివేసి తినమంటున్నారు. పురుగుల అన్నం ఎలా తినాలి. అధికారులు చర్యలు తీసుకోవాలి. మాకు మంచి భోజనం అందించాలి. – వినిల్‌కుమార్, పదో తరగతి, కందనెల్లి ఉన్నత పాఠశాల ఆరు రోజులు పప్పే వడ్డింపు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం ఇస్తామని చెబుతారు. కానీ మా బడిలో మెనూ కనిపించదు. వారంలో ఆరు రోజులు పప్పే వడ్డిస్తారు. కూరగాయలతో కూడిన భోజనం ఉండదు. గుడ్లు ఇవ్వకుండా అరటిపండ్లు ఇస్తున్నారు. ఉప్పు, కారం లేకపోవడంతో తినలేకపోతున్నాం. – శివకుమార్, పదో వరగతి, కందనెల్లి ఉన్నత పాఠశాల మెనూ పాటించడం లేదు ప్రభుత్వం చెప్పిన మెనూను పాటించడం లేదు. వారంలో మూడు రోజులు కూరగాయలతో కూడిన భోజనం అందించాలి. భోజనం ఎలా వడ్డిస్తున్నారు.. అని ఎవరూ పరిశీలించడం లేదు. మధ్యాహ్న భోజనంలో పురుగులు రాకుండా చూడాలి. మాకు నాణ్యమైన భోజనం అందిస్తే మంచిగా చదువుకుంటాం. – లావణ్య, పదో తరగతి -
వసతిగృహాల్లో పురుగుల బియ్యం
వసతిగృహ విద్యార్థులకు పురుగుల అన్నమే దిక్కయింది. వేసవి సెలవులకు ముందొచ్చిన బియ్యాన్ని వసతిగృహాల్లో నిల్వ ఉంచగా పురుగులు పట్టాయి. వాటినే ఇప్పుడు వండి పెడుతుండడంతో విద్యార్థులు కష్టమైనా...భరిస్తూ వేరే దిక్కు లేక తింటున్నారు. పార్వతీపురం : వసతిగృహాల్లో బియ్యం పురుగు పడుతున్నాయి. వసతిగృహ అధికారులకు ముందు చూపు లేకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. వేసవి సెలవుల ముందు అధిక సంఖ్యలో బియ్యం ఇండెంట్ పెట్టడంతో వేసవి సెలవులకు విద్యార్ధులు ఇంటికి వెళ్లిపోవడం రెండు నెలలు పాటు బియ్యం నిల్వ ఉండడంతో పురుగులు పడుతున్నాయి. వేసవి సెలవుల తరువాత పాఠశాలలు ప్రారంభం కావడం వసతిగృహాలు తెరుచుకోవడంతో విద్యార్థులకు ఈ నిల్వ బియ్యాన్నే వార్డెన్లు వండి పెడుతున్నారు. పురుగులు పట్టిన బియ్యాన్ని పౌర సరఫరాల గోదాముకు అప్పగించి వాటి స్థానంలో కొత్త బియ్యాన్ని తీసుకోవల్సిన వసతిగృహ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టకుండా ఉన్న నిల్వ బియ్యాన్నే వండి పెడుతున్నారు. దీంతో విద్యార్థులపై ప్రభావం పడే అవకాశం ఉంది. వసతిగృహ అధికారులకు ముందు చూపు లేకపోవడంతో అనేక వసతిగృహాల్లో వేసవి సెలవులకు ముందు విడిపించిన బియ్యం నిల్వ ఉండడం వేసవి సెలవుల తరువాత వాటిని తిరిగి వాడడంతో పురుగులు పట్టిన భోజనాన్ని విద్యార్థులు తినాల్సి వస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో విద్యార్థులు కంటికి కనిపించిన వాటిని ఏరుకుని కనిపించని వాటిని ఆహరంతో కలిపి తినేస్తున్నారు. పురుగులు పట్టిన బియ్యం గుర్తింపు రెండు రోజుల కిందట స్థానిక న్యాయమూర్తి ముధుబాబు వసతిగృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈయన పరిశీలనలో బియ్యాన్ని పరిశీలన చేయగా బియ్యం పురుగులు పట్టినట్టు గుర్తించారు. ఎందుకిలా అని వసతిగృహ అధికారిని ప్రశ్నించగా వేసవి సెలవులకు ముందు తెచ్చిన బియ్యం కావడంతో పురుగు పట్టాయని చెప్పడంతో న్యాయమూర్తి పిల్లలకు వీటినే పెడితే ఎలా అని మందలించారు. నిల్వ బియ్యాన్ని వెనక్కి పంపించి కొత్త బియ్యాన్ని తెప్పించుకోవాలని ఆదేశించారు. ఇలా అనేక వసతిగృహాల్లో వేసవి సెలవులకు ముందు విడిపించిన బియ్యాన్నే ప్రస్తుతం విద్యార్థులకు వండి పెడుతున్నారు. దీంతో విద్యార్ధులకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇప్పటికైనా వసతిగృహ అధికారులు నిల్వ బియ్యాన్ని తరలించి కొత్త బియ్యాన్ని తెచ్చుకుంటే బాగుంటుంది. -
భోజనంలో పురుగులున్నాయంటూ ఆందోళన
బాలాజీచెరువు: జేఎన్టీయూకే నలంద బాయ్స్ హాస్టల్స్ విద్యార్థులు భోజనంలో పురుగులు ఉన్నాయంటూ మంగళవారం రాత్రి గేటు వద్ద నిరసన తెలియజేశారు. వారం రోజులుగా ఈ సమస్య వస్తుండగా మెస్ ఇన్చార్జికి తెలిపామని, సమస్యను పరిష్కరించకపోగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ నిరసన తెలియజేశారు. దాదాపు 50 మంది విద్యార్థులు గేటు వద్ద కూర్చుని రాత్రి 11గంటల వరకూ నిరసన తెలియజేశారు. దీంతో మెస్ నిర్వాహకులు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు నిరసన విరమించారు. ఈ సమస్య కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి వెళ్లలేదని, బుధవారం తెలియజేసి తమ సమస్యను పరిష్కరించుకుంటామని కొంతమంది విద్యార్థులు పేర్కొన్నారు. -
పెద్దలకు పరమాన్నం..పిల్లలకు పురుగుల అన్నం
సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో అధికారుల తీరుకు అద్దం పట్టే చిత్రాలివి! పిల్లల సంక్షేమాన్ని గాలికి వదిలేశారనేందుకు నిదర్శనాలివి! ఈ ఫోటోలో ఒకపక్క కనిపిస్తున్నది పెద్దలకు పరమాన్నం.. మరోపక్క ఉన్నది పురుగులతో కూడిన అన్నం. నిత్యం పెదపాడులోని సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాల్లో జరుగుతున్న తంతు ఇది. ఇక్కడ ప్రతిరోజూ రెండు సార్లు వంట చేస్తారు. అందులో ఉపాధ్యాయులకు బాస్మతి రైస్‌తోనూ పిల్లలకు మాత్రం నిత్యావవసర సరుకుల బియ్యంతోనే వంట చేసి చేతులు దులుపుకుంటున్నారు. రెండు రోజులుగా స్థానిక పెదపాడు గురుకుల పాఠశాల స్కూల్లో జరుగుతున్న తరంగ్ కార్యక్రమాల్లో ఇవి ‘సాక్షి’ కెమెరాకు చిక్కాయి. తరంగ్ కార్యక్రమంలో హాజరైన అతిథులకే మాత్రమే ఈ వంటకాలు వండినట్లు అక్కడ సిబ్బంది చెప్పుకోవడం గమనార్హం! -
ఉప్మాలో పురుగులు
- నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులు - హాస్టల్‌ను సందర్శించిన తహశీల్దార్ జహీరాబాద్ టౌన్: విద్యార్థులకు ఉదయం వడ్డించిన ఉప్మాలో పురుగులు వచ్చిన సంఘటన గురువారం స్థానిక ఎస్సీ హాస్టల్లో జరిగింది. ఉప్మాలో పురుగులు రావడంతో ఎస్సీ హాస్టల్ విద్యార్థులు గురువారం నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న గిరిజన సంఘం మండల అధ్యక్షుడు ఎస్పీ తుకారం, ప్రధాన కార్యదర్శి రాజు పవార్, జిల్లా ఉపాధ్యక్షుడు జైసింగ్ రాథోడ్, సామాజిక సేవా సమితి అధ్యక్షుడు సతీష్ చౌహన్ తదితరులు వసతి గృహానికి వచ్చి వార్డెన్ శ్రీనివాస్‌ను నిలదీసి, నిర్లక్ష్యంపై మండిపడ్డారు.అనంతరం తహశీల్దార్ దశరథ్ సింగ్ వసతి గృహానికి వచ్చి పురుగులతో ఉన్న ఉప్మాను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వార్డెన్‌తో పాటు వంట మనిషిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. -
యూనివర్సిటీ భోజనంలో పురుగులు
అనంతపురం : జిల్లాలోని శ్రీకృష్ణదేవరాయ యూనవర్సిటీలో శుక్రవారం విద్యార్థులు ధర్నాకు దిగారు. భోజనంలో పురుగులు రావడంతో రిజిస్ట్రార్ కార్యాలయం ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. మెస్ బిల్లులు సకాలంలో చెల్లించినా సరిగ్గా భోజనం పెట్టడం లేదని, రోజువారీ మెనూ బాగాలేదని, తాగునీటి సమస్య కూడా ఉందని సమస్యలు ఏకరువు పెట్టారు. రిజస్ట్రార్ చెంచురామయ్య వచ్చి సమస్యలన్నీ తీరుస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.