పురుగులున్న సాంబార్‌ను వడ్డించిన దృశ్యం, వార్డెన్ ప్రొఫెసర్ జ్యోతి విజయ్‌కుమార్‌కు సమస్యలను వివరిస్తున్న విద్యార్థులు
అనంతపురం, ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని మహానంది వసతిగృహంలో శుక్రవారం మధ్యాహ్నం వడ్డించిన సాంబార్‌లో పురుగులు కనిపించడంతో విద్యార్థులు ఆగ్రహించారు. పుచ్చుపట్టిన వంకాయలను సాంబార్‌లోకి యథాతథంగా వాడటంతో పురుగులు బయటపడ్డాయి. ఇటువంటి భోజనం ఎలా తినాలంటూ విద్యార్థులు యూనివర్సిటీ ఉన్నతాధికారులను ప్రశ్నించారు. నాసిరకమైన ఆహారంతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. వీరి ఆందోళనలకు వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు మద్దతు ప్రకటించారు.
నాయకులు రాధాకృష్ణ, కళ్యాణ్ కుమార్, వినోద్, అనిల్, హేమంత్ మాట్లాడుతూ నాలుగు నెలల నుంచి నాణ్యమైన భోజనం అందించాలని అనేక దఫాలుగా విన్నవించినప్పటికీ అధికారుల వైఖరిలో మార్పు రాలేదన్నారు. ఇటీవల టెండర్లలో రేట్లు తగ్గించేలా ఒత్తిడి తీసుకొచ్చామన్నారు. అయినా కిందిస్థాయి అధికారులు వాటిని సక్రమంగా అమలు చేయలేదని విమర్శించారు. కూరగాయలు చెడిపోయినవి సరఫరా చేస్తున్నారని ధ్వజమెత్తారు. విద్యార్థులందరూ ర్యాలీగా వచ్చి ఎస్కేయూ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు. వార్డెన్ ప్రొఫెసర్ జ్యోతి విజయ్‌కుమార్ విద్యార్థులకు నచ్చచెప్పారు. స్టోర్ కీపర్, సప్లయర్‌పై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment