Srikrishna Devaraya University
-
ఎస్కేయూ స్నాతకోత్సవంలో పాల్గొన్న గవర్నర్ నజీర్
సాక్షి, అనంతపురం: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అనంతపురం పర్యటనలో ఉన్నారు. కాగా, ఎస్కే యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవంలో గవర్నర్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్కే యూనివర్సిటీలో శ్రీ కృష్ణదేవరాయ విగ్రహానికి గవర్నర్ నజీర్ నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే నూతన అకాడమీ, హాస్టల్ భవనాలను గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ నజీర్ మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎన్ని సవాళ్లు ఉన్నాయో.. అన్ని అవకాశాలు ఉన్నాయి. విద్య శక్తివంతమైన ఆయుధం అన్న విషయం మరిచిపోవద్దు. కృషి, పట్టుదల, సృజనాత్మకత ఉంటే ఏదైనా సాధించవచ్చు. విద్యార్థులు ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఉండాలి. కేంద్రం తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యావిధానం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: కోటంరెడ్డి సోదరులకు ఎదురుదెబ్బ -
'తిరకాసు వేతనం'పై ఆగ్రహం: ఒకరి సస్పెండ్
సాక్షి, అనంతపురం విద్య: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్, కెమిస్ట్రీ విభాగాధిపతి ప్రొఫెసర్ సుధాకర్ బాబుపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.వెంకటరమణ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబర్ 21న జరిగిన పాలకమండలి ఆమోదం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. గతేడాది జూలై 9న సాక్షిలో తిర‘కాసు’ వేతనం’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. అనుకూలమైన వారికి అక్రమంగా పదోన్నతులు కట్టబెట్టారనే అంశాన్ని సాక్షి వెలుగులోకి తెచ్చింది. క్రియేటివ్ పోస్టుల్లో పదోన్నతులు కల్పించరాదని ఉన్నత విద్యామండలి 2017 సంవత్సరంలో ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ బేఖాతరు చేస్తూ ఇద్దరు ఉద్యోగులకు రిజిస్ట్రార్ హోదాలో పదోన్నతులు కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను విస్మరించడంతో సస్పెండ్ చేయాలని పాలకమండలి నిర్ణయించింది. సస్పెన్షన్ చేయడానికి పేర్కొన్న కారణాలు ► రిజిస్ట్రార్ హోదాలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ► రికార్డుల నిర్వహణలో సరైన విధానం పాటించలేదు. ► రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ తప్పుడు సమాచారం ఇచ్చారు. ► 2017 ఫిబ్రవరి 4న క్రియేటివ్ పోస్టుల్లో పదోన్నతులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ► 2018 జనవరి17న క్రియేటివ్ పోస్టుల్లో పదోన్నతులు కల్పించకూడదని రాష్ట్ర ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది. ఇదే అంశాన్ని ప్రిన్సిపల్ సెక్రెటరీ 2018 ఫిబ్రవరి 5న పునరుద్ఘాటించారు. పాలకమండలికి సమాచారం ఇచ్చి క్రియేటివ్ పోస్టుల్లో పదోన్నతులు కల్పించి ఉంటే వెనక్కి తీసుకోవాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. ► అయినప్పటికీ ఉద్దేశపూర్వకంగా క్రియేటివ్ పోస్టుల్లో పదోన్నతులు కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఉంచారు. ► ఏపీ యూనివర్సిటీ యాక్ట్ నంబర్ 4, 1991 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు అనుమతి లేకుండా, అనుకూలమైన వ్యక్తుల ప్రయోజనాల నిమిత్తం వర్సిటీ నిధులను ధారాదత్తం చేసే రీతిలో రివైజ్డ్ పేస్కేల్ అమలు చేశారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్ గ్రాంట్ నిధులను దుర్వినియోగం చేశారు. ► దుర్వినియోగమైన నిధులు వ్యక్తిగతంగా ఎందుకు రాబట్టకూడదో జనవరి 28 లోపు వివరణ ఇవ్వాలని కోరారు. 2018 ఏప్రిల్ 4న పదోన్నతులు : బి.క్రిష్టప్ప, ఎల్.లింగమయ్య (సూపరింటెండెంట్ నుంచి అసిస్టెంట్ రిజిస్ట్రార్), బి.రామకృష్ణయ్య (సీనియర్ అసిస్టెంట్ నుంచి సూపరింటెండెంట్), బి.శ్రీలత, ఆర్.శివశంకర్‌రెడ్డి, ఉమాశంకర్ (సీనియర్ అసిస్టెంట్ నుంచి సూపరింటెండెంట్)లకు పదోన్నతులు కల్పించారు. 2018 జులై 11న తిరిగి పదోన్నతులు : ఎం.తిమ్మప్ప (సూపరింటెండెంట్ నుంచి అసిస్టెంట్ రిజిస్ట్రార్), పి.శ్రీనివాసులు (సీనియర్ అసిస్టెంట్ నుంచి సూపరింటెండెంట్)లకు పదోన్నతులు కల్పించారు. 2018 సెప్టెంబర్ 19న పదోన్నతులు : జి.వెంకట్రాముడుకు సీనియర్ అసిస్టెంట్ నుంచి సూపరింటెండెంట్‌గా పదోన్నతి కల్పించారు. 2018 సెప్టెంబర్ 28న పదోన్నతులు : ఎ.మల్లికార్జున, వెంకటరమణ (జూనియర్ అసిస్టెంట్ నుంచి సీనియర్ అసిస్టెంట్), ఖతీజా బీ, జి.బాలవీరన్న, ఆర్.సాయిశివ, జమాలుద్దీన్, శ్రీనివాసులు, బ్రహ్మానంద, వెంకటవిజయ (సీనియర్ అసిస్టెంట్)లకు పదోన్నతులు కల్పించారు. ఎస్కేయూకు రూ.22.19 లక్షలు నష్టం : క్రియేటివ్ పోస్టులు అంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన పోస్టుల్లో కాకుండా ఇష్టానుసారంగా పోస్టులు క్రియేట్ చేసి పదోన్నతులు కల్పించడం. క్రియేటివ్ పోస్టుల్లో పదోన్నతులు కల్పిస్తే సదరు ఉద్యోగుల జీతాన్ని మొత్తం వర్సిటీ ఖజానా నుంచి చెల్లించాల్సి ఉంటుంది. అవసరం లేకపోయినా , పనిభారం లేకపోయినా క్రియేటివ్ పోస్టుల్లో పదోన్నతి కల్పించారు. దీంతో వర్సిటీకి ఇప్పటి దాకా రూ. 22,19,063 ఖజానాకు భారం పడింది. ► వీసీ ముందస్తు అనుమతి లేకుండానే డాక్టర్ రమేష్ బాబు (రీసెర్చ్ స్టాటిస్టికల్ ఆఫీసర్)కు యూజీసీ రివైజ్డ్పే స్కేలు మంజూరు చేయడానికి గత రిజిస్ట్రార్ సుధాకర్ బాబు ఏకపక్షంగా ఆదేశాలు ఇచ్చారు. ► ఇంజినీరింగ్ సెక్షన్లో వీసీ ఆదేశాలు లేకుండానే నేరుగా ఒకరికి ఉద్యోగం కల్పించారు. స్టడీ సెంటర్ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజివ్ అండ్ ఇన్‌క్లూజన్ విభాగంలో ఒక మహిళకు ఉద్యోగం ఇచ్చారు. ► ఒక సూపరింటెండెంట్‌కు వీసీ ముందస్తు అనుమతి లేకుండా రూ.5 లక్షలు, రూ.2 లక్షలు, అడ్వాన్స్ రూపంలో కట్టబెట్టారు. అదే విభాగంలో డిప్యూటీ రిజిస్ట్రార్‌కు అడ్వాన్స్ రూపంలో ఇవ్వాల్సి ఉన్నప్పటికీ నిబంధనలు విస్మరించారు. కంప్యూటర్ సైన్స్‌లో మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ సస్పెన్షన్ కంప్యూటర్ సైన్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ దేవరాజును సస్పెండ్ చేశారు. విధులకు సక్రమంగా హాజరు కాలేదని గతంలో మూడు మెమోలు ఇచ్చారు. మూడు దఫాలు మెమో ఇస్తే సస్పెండ్ చేయాలని నిబంధన ఉండడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఒకరికి షోకాజ్ కంప్యూటర్ సైన్సెస్ విభాగంలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ జె.ఖెజియారాణికి సోమవారం షోకాజ్ నోటీసు అందచేశారు. ఆన్లైన్ తరగతులు తీసుకోకపోవడం, స్కాలర్లతో ఆన్లైన్ తరగతులు ఇప్పించిన సంగతి డిసెంబర్ 15న వీసీ ఆకస్మిక తనిఖీలో నిర్ధారణ అయ్యింది. డిసెంబర్ 16 వరకు 20 రోజుల పాటు చైల్డ్‌కేర్ సెలవులు తీసుకోవడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. చైల్డ్‌కేర్ సెలవులు తీసుకోవడానికి నిబంధనలు ఏవీ లేకపోవడంతో ఎలా వినియోగించారో తెలపాలని వివరణ కోరారు. కెమిస్ట్రీ విభాగాధిపతిగా ప్రొఫెసర్ పి.వెంకటరమణ కెమిస్ట్రీ విభాగాధిపతిగా ప్రొఫెసర్ కె.సుధాకర్‌బాబును సస్పెండ్ చేయడంతో ఆ స్థానంలో రిజిస్ట్రార్ పి.వెంకటరమణకు బాధ్యతలు చేపట్టారు. క్యాంపస్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్.శంకర్‌నాయక్.. ప్రొఫెసర్ పి.వెంకటరమణకు బాధ్యతలు ఇచ్చారు. -
గాడి తప్పిన విశ్వవిద్యాలయం!
ఏ విద్యార్థికైనా కాన్వొకేషన్ రోజున పట్టా అందుకోవడం గొప్ప అనుభూతి. కానీ శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు ఆ భాగ్యానికి నోచుకోవడం లేదు. ఏటా నిర్వహించాల్సిన కాన్వొకేషన్‌ను మూడేళ్లుగా నిర్వహించకపోవడంతో పట్టాలు అందుకునేందుకు విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో పట్టా కావాల్సి వస్తే నిర్ణయించిన రుసుం కన్నా రూ.1,000 అదనంగా చెల్లించాల్సి వస్తోంది. ఇక దూరవిద్యలో చదువు పూర్తి చేసిన వారైతే ఏకంగా రూ.2,350 కట్టాల్సి వస్తోంది. ఇలా 22 వేల మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా...ఎస్కేయూ ఉన్నతాధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. సాక్షి, ఎస్కేయు(అనంతపురం) : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పాలన గాడి తప్పింది. వర్సిటీ ఉన్నతాధికారుల నిర్లక్ష్యానికి విద్యార్థులు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. సకాలంలో అడ్మిషన్లు, పరీక్షలు నిర్వహించడంలో విఫలమవుతున్న వర్సిటీ ఉన్నతాధికారులు కనీసం ఏడాదికోసారి నిర్వహించాల్సిన కాన్వొకేషన్‌లోనూ విఫలమయ్యారు. దీంతో ఎందరో నిరుపేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడేళ్లుగా అతీగతీ లేదు ఎస్కేయూ 18వ స్నాతకోత్సవం నోటిఫికేషన్ 20 జూలై 2017న జారీ చేశారు. అదే సంవత్సరం ఏడాది చివరన స్నాతకోత్సవం నిర్వహించారు. 2013–14, 2014–15, 2015–16 విద్యాసంవత్సరంలో ఉత్తీర్ణులైన వారు 18వ స్నాతకోత్సవానికి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దీంతో 2016 ఏప్రిల్‌లోపు ఉత్తీర్ణులైన విద్యార్థులు స్నాతకోత్సవానికి దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి నుంచి మళ్లీ కాన్వొకేషన్ ఊసే లేదు. దీంతో 2016–17, 2017–18, 2018–19 విద్యాసంవత్సరంలో డిగ్రీ, పీజీ పూర్తి చేసిన విద్యార్థులు స్నాతకోత్సవానికి దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండాపోయింది. మొత్తం 22 వేల మంది విద్యార్థులు స్నాతకోత్సవానికి దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో అనివార్యంగా ఇన్‌అడ్వాన్స్‌డ్ స్నాతకోత్సవానికి దరఖాస్తు చేసుకోవాల్సి వస్తోంది. ఇలా రెగ్యులర్ విధానంలో డిగ్రీ, పీజీ పూర్తి చేసిన 22 వేల మంది విద్యార్థులు స్నాతకోత్సవ రుసుము కంటే అదనంగా రూ.1,000 చొప్పున మొత్తంగా రూ.2.2 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. దూరవిద్య డిగ్రీల పేరుతో దోపిడీ రెగ్యులర్ డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఇన్‌అడ్వాన్స్‌డ్ స్నాతకోత్సవ ఫీజు రూ.1,650 అయితే దూరవిద్య డిగ్రీ, పీజీ విద్యార్థులకు రూ. 3 వేలుగా నిర్ధారించారు. దూరవిద్య విభాగంలోనూ 10 వేల మంది విద్యార్థులు స్నాతకోత్సవ పట్టాకు నిరీక్షిస్తున్నారు. స్నాతకోత్సవ సమయంలో అయితే రూ.650 రుసుము కడితే పట్టా ప్రదానం చేస్తారు. ఇన్‌అడ్వాన్స్‌డ్ కింద దరఖాస్తు చేసుకుంటే అదనంగా రూ. 2,350 చొప్పున ఒక్కో విద్యార్థి రూ.3 వేలు చెల్లించాల్సి వస్తోంది. దీంతో దూరవిద్యలో డిగ్రీ, పీజీలు పూర్తి చేసిన విద్యార్థులు మొత్తంగా రూ.2.35 కోట్లు అదనగా చెల్లించాల్సి పరిస్థితి ఏర్పడింది. ఇలా రెగ్యులర్, దూరవిద్య విధానంలో మొత్తం రూ. 4.55 కోట్ల మేర విద్యార్థులపై అదనపు భారం పడుతోంది. దూరవిద్య విభాగంలో ఇన్‌అడ్వాన్స్‌డ్ కింద ఒక్కో పట్టాకు నిర్ణయించిన రుసుము రూ. 3 వేలు, ఒక ఏడాది కోర్సు ఫీజుతో సమానం కావడం గమనార్హం. కీలకమైన అంశాలు విస్మరణ ఏటా స్నాతకోత్సవం నిర్వహించి విద్యార్థులకు పట్టాలు అందజేయాలి. కానీ మూడేళ్లుగా కాన్వొకేషన్ నిర్వహించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటు వర్సిటీ పెద్దలు, అటు పాలక మండలి సభ్యులూ దీనిపై పెద్దగా చొరవ చూపకపోవడంతో విద్యార్థులు వైభవంగా నిర్వహించే కాన్వొకేషన్లో అందరి ముందు పట్టాలు పొందే బాగ్యానికి నోచుకోలేకపోతున్నారు. ఇప్పడైనా కాన్వొకేషన్ నిర్వహించాలని విద్యార్థులు కోరుతున్నారు. ⇔టి.అనిల్ కుమార్ ఎస్కేయూలో 2017 మార్చి నాటికి పీజీ చేశాడు. ఇటీవలే ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. పట్టా సమర్పించాల్సి రావడంతో ఎస్కేయూ పరీక్షల విభాగంలో దరఖాస్తు చేసుకున్నాడు. వాస్తవానికి పరీక్ష ఫీజు రూ. 650 కడితే కాన్వొకేషన్ రోజున పట్టా ఇచ్చేవారు. అయితే మూడేళ్లుగా కాన్వొకేషన్ ఊసే లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇన్‌అడ్వాన్స్‌డ్ కింద రూ.1,650 ఫీజు కట్టాల్సి వచ్చింది. అనిల్‌కుమార్ లాంటి వారు దాదాపు 22 వేల మంది విద్యార్థులు ఉన్నారు. ఇంకా నిర్ణయం తీసుకోలేదు స్నాతకోత్సవ నిర్వహణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 2016 నుంచి ఇప్పటి వరకు ఉత్తీర్ణులైన విద్యార్థుల వివరాలను వైస్ చాన్స్‌లర్ పరిశీలనకు తీసుకెళ్తాం. ఆయన సూచన మేరకు స్నాతకోత్సవ నోటిఫికేషన్ తేదీ ఖరారు చేస్తాం. – ప్రొఫెసర్ ఎ.మల్లిఖార్జున రెడ్డి, రిజిస్ట్రార్, ఎస్కేయూ -
సాంబార్లో పురుగులు
అనంతపురం, ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని మహానంది వసతిగృహంలో శుక్రవారం మధ్యాహ్నం వడ్డించిన సాంబార్లో పురుగులు కనిపించడంతో విద్యార్థులు ఆగ్రహించారు. పుచ్చుపట్టిన వంకాయలను సాంబార్‌లోకి యథాతథంగా వాడటంతో పురుగులు బయటపడ్డాయి. ఇటువంటి భోజనం ఎలా తినాలంటూ విద్యార్థులు యూనివర్సిటీ ఉన్నతాధికారులను ప్రశ్నించారు. నాసిరకమైన ఆహారంతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. వీరి ఆందోళనలకు వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు మద్దతు ప్రకటించారు. నాయకులు రాధాకృష్ణ, కళ్యాణ్ కుమార్, వినోద్, అనిల్, హేమంత్ మాట్లాడుతూ నాలుగు నెలల నుంచి నాణ్యమైన భోజనం అందించాలని అనేక దఫాలుగా విన్నవించినప్పటికీ అధికారుల వైఖరిలో మార్పు రాలేదన్నారు. ఇటీవల టెండర్లలో రేట్లు తగ్గించేలా ఒత్తిడి తీసుకొచ్చామన్నారు. అయినా కిందిస్థాయి అధికారులు వాటిని సక్రమంగా అమలు చేయలేదని విమర్శించారు. కూరగాయలు చెడిపోయినవి సరఫరా చేస్తున్నారని ధ్వజమెత్తారు. విద్యార్థులందరూ ర్యాలీగా వచ్చి ఎస్కేయూ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు. వార్డెన్ ప్రొఫెసర్ జ్యోతి విజయ్‌కుమార్ విద్యార్థులకు నచ్చచెప్పారు. స్టోర్ కీపర్, సప్లయర్‌పై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
భవిత తారుమారు
ఒక సబ్జెక్ట్‌లో పాసైతే అన్నింట్లో పాసైనట్లే.. ఒక సబ్జెక్ట్‌లో ఫెయిలైతే అన్నింట్లో ఫెయిలే.. ఏమిటీ వింత అనుకుంటున్నారా? శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ యంత్రాంగం సృష్టించిన గందరగోళం ఇది. శనివారం విడుదలైన డిగ్రీ 5వ సెమిస్టర్ ఫలితాలు యూనివర్సటీ యంత్రాంగం నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం డిగ్రీ ఫలితాలు విద్యార్థుల భవిష్యత్తును తారుమారు చేశాయి. మార్కుల నమోదులో నిర్లక్ష్యం కారణంగా ఉండటంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. డిగ్రీ 5వ సెమిస్టర్ ఫలితాల్లో ఒక సబ్జెక్టులో వచ్చిన మార్కులే మిగతా సబ్జెక్టుల్లోనూ పునరావృతమయ్యాయి. అనంతపురం నగరంలోని ఒక డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులందరికీ ఇలాంటి ఫలితాలే వచ్చాయి. దీంతో విద్యార్థుల్లో అయోమయం, ఆందోళన నెలకొంది. ♦ బీఎస్సీలో హాల్ టికెట్ నంబర్ 16841099గల విద్యార్థినికి స్టాటిస్టిక్స్ విత్ మేథమేటిక్స్–5లో 18 మార్కులు వచ్చాయి. స్టాటిస్టిక్స్ విత్ మేథమేటిక్స్–6, కంప్యూటర్ అప్లికేషన్స్–5, కంప్యూటర్ అప్లికేషన్స్–6లోనూ 18 మార్కులే వచ్చాయి. ♦ ఇక బీకాంలో హాల్‌టికెట్ నంబర్ –16835141గల విద్యార్థికి ఓ సబ్జెక్టులో 32 మార్కులు వచ్చాయి. ప్రోగ్రామింగ్ ఇన్ సీ, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సబ్జెక్టుల్లోనూ 32 మార్కులే వచ్చాయి. ఇలా ఒకే కళాశాలకు చెందిన విద్యార్థులందరికీ మార్కులు తారుమారు అయ్యాయి. తప్పులు సరిచేస్తాం మార్కుల నమోదులో తప్పిదాలను సరిచేస్తాం. బాధిత విద్యార్థులు నేరుగా వచ్చి పర్సనల్ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులందరికీ న్యాయం జరిగేలా చూస్తాం. –ప్రొఫెసర్ జె.శ్రీరాములు, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్, ఎస్కేయూ -
ఎస్కే వర్సిటీలో విద్యార్థుల ధర్నా
అనంతపురం: కాంట్రాక్టు ఉద్యోగాల క్రమబద్ధీకరణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ విద్యార్థులు సోమవారం భారీ ధర్నాకు దిగారు. అనంతరంపురంలోని వర్సిటీ సమీపంలో జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని, ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ధర్నాతో రహదారిపై భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులతో చర్చిస్తున్నారు. -
సీమాంధ్ర నేతలు చేతకాని దద్దమ్మలు: పరకాల
రాష్ట్ర విభజనకు సీమాంధ్ర నేతలే కారణమని విశాలాంధ్ర మహాసభ ప్రతినిధి పరకాల ప్రభాకర్ ఆరోపించారు. సీమాంధ్ర నేతలు ఢిల్లీలో చేతకాని దద్దమ్మల్లా వ్యహరించారని ఆయన విమర్శించారు. సీడబ్ల్యూసీ నిర్ణయం తన ఎడమకాలి బూటు దుమ్ముతో సమానమని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సమైక్యాంధ్రకు మద్దతుగా శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ(ఎస్కేయూ)లో విద్యార్థులు చేపట్టిన దీక్షలకు పరకాల ప్రభాకర్ మద్దతు పలికారు. రాష్ట్ర విభజన రెండు ప్రాంతాల మధ్య జరుగుతున్న పంచాయతీ కాదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో విభజనవాదులు, సమైక్యవాదుల మధ్య జరుగుతున్న ఉద్యమమని పేర్కొన్నారు. తుది విజయం సమైక్యవాదానిదే అని పరకాల ప్రభాకర్ విశ్వాసం వ్యక్తం చేశారు.