'తిరకాసు వేతనం'పై ఆగ్రహం: ఒకరి సస్పెండ్‌ | SKU Ex Registrar Sudhakar Babu Suspended | Sakshi
Sakshi News home page

'తిరకాసు వేతనం'పై ఆగ్రహం

Published Tue, Jan 5 2021 9:56 AM | Last Updated on Tue, Jan 5 2021 9:56 AM

SKU Ex Registrar Sudhakar Babu Suspended - Sakshi

సాక్షిలో ప్రచురితమైన కథనం(ఇన్‌సెట్‌లో) మాజీ రిజిస్ట్రార్‌ సుధాకర్‌ బాబు

సాక్షి, అనంతపురం విద్య: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్, కెమిస్ట్రీ విభాగాధిపతి ప్రొఫెసర్‌ సుధాకర్‌ బాబుపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ మేరకు రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ పి.వెంకటరమణ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబర్‌ 21న జరిగిన పాలకమండలి ఆమోదం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. గతేడాది జూలై 9న సాక్షిలో తిర‘కాసు’ వేతనం’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. అనుకూలమైన వారికి అక్రమంగా పదోన్నతులు కట్టబెట్టారనే అంశాన్ని సాక్షి వెలుగులోకి తెచ్చింది. క్రియేటివ్‌ పోస్టుల్లో పదోన్నతులు కల్పించరాదని ఉన్నత విద్యామండలి 2017 సంవత్సరంలో ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ బేఖాతరు చేస్తూ ఇద్దరు ఉద్యోగులకు రిజిస్ట్రార్‌ హోదాలో పదోన్నతులు కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను విస్మరించడంతో సస్పెండ్‌ చేయాలని పాలకమండలి నిర్ణయించింది. 

సస్పెన్షన్‌ చేయడానికి పేర్కొన్న కారణాలు
 రిజిస్ట్రార్‌ హోదాలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. 
► రికార్డుల నిర్వహణలో సరైన విధానం పాటించలేదు.  
► రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ తప్పుడు సమాచారం ఇచ్చారు.  
2017 ఫిబ్రవరి 4న క్రియేటివ్‌ పోస్టుల్లో పదోన్నతులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. 
2018 జనవరి17న క్రియేటివ్‌ పోస్టుల్లో పదోన్నతులు కల్పించకూడదని రాష్ట్ర ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది. ఇదే అంశాన్ని ప్రిన్సిపల్‌ సెక్రెటరీ 2018 ఫిబ్రవరి 5న పునరుద్ఘాటించారు. పాలకమండలికి సమాచారం ఇచ్చి క్రియేటివ్‌ పోస్టుల్లో పదోన్నతులు కల్పించి ఉంటే  వెనక్కి తీసుకోవాలని ఉత్తర్వులో పేర్కొన్నారు.  
అయినప్పటికీ ఉద్దేశపూర్వకంగా క్రియేటివ్‌ పోస్టుల్లో పదోన్నతులు కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఉంచారు.  
ఏపీ యూనివర్సిటీ యాక్ట్‌ నంబర్‌ 4, 1991 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు అనుమతి లేకుండా, అనుకూలమైన వ్యక్తుల ప్రయోజనాల నిమిత్తం వర్సిటీ నిధులను ధారాదత్తం చేసే రీతిలో రివైజ్డ్‌ పేస్కేల్‌ అమలు చేశారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్‌ గ్రాంట్‌ నిధులను దుర్వినియోగం చేశారు.  
► దుర్వినియోగమైన నిధులు వ్యక్తిగతంగా ఎందుకు రాబట్టకూడదో జనవరి 28 లోపు వివరణ ఇవ్వాలని కోరారు.  

2018 ఏప్రిల్‌ 4న పదోన్నతులు : బి.క్రిష్టప్ప, ఎల్‌.లింగమయ్య (సూపరింటెండెంట్‌ నుంచి అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌), బి.రామకృష్ణయ్య (సీనియర్‌ అసిస్టెంట్‌ నుంచి సూపరింటెండెంట్‌), బి.శ్రీలత, ఆర్‌.శివశంకర్‌రెడ్డి, ఉమాశంకర్‌ (సీనియర్‌ అసిస్టెంట్‌ నుంచి సూపరింటెండెంట్‌)లకు పదోన్నతులు కల్పించారు. 
2018 జులై 11న తిరిగి పదోన్నతులు : ఎం.తిమ్మప్ప (సూపరింటెండెంట్‌ నుంచి అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌), పి.శ్రీనివాసులు (సీనియర్‌ అసిస్టెంట్‌ నుంచి సూపరింటెండెంట్‌)లకు పదోన్నతులు కల్పించారు.  
2018 సెప్టెంబర్‌ 19న పదోన్నతులు : జి.వెంకట్రాముడుకు సీనియర్‌ అసిస్టెంట్‌ నుంచి సూపరింటెండెంట్‌గా పదోన్నతి కల్పించారు. 
2018 సెప్టెంబర్‌ 28న పదోన్నతులు : ఎ.మల్లికార్జున, వెంకటరమణ (జూనియర్‌ అసిస్టెంట్‌ నుంచి సీనియర్‌ అసిస్టెంట్‌), ఖతీజా బీ, జి.బాలవీరన్న, ఆర్‌.సాయిశివ, జమాలుద్దీన్, శ్రీనివాసులు, బ్రహ్మానంద, వెంకటవిజయ (సీనియర్‌ అసిస్టెంట్‌)లకు పదోన్నతులు కల్పించారు. 

ఎస్కేయూకు రూ.22.19 లక్షలు నష్టం : 
క్రియేటివ్‌ పోస్టులు అంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన పోస్టుల్లో కాకుండా ఇష్టానుసారంగా పోస్టులు క్రియేట్‌ చేసి పదోన్నతులు కల్పించడం. క్రియేటివ్‌ పోస్టుల్లో పదోన్నతులు కల్పిస్తే సదరు ఉద్యోగుల జీతాన్ని మొత్తం వర్సిటీ ఖజానా నుంచి చెల్లించాల్సి ఉంటుంది. అవసరం లేకపోయినా , పనిభారం లేకపోయినా క్రియేటివ్‌ పోస్టుల్లో పదోన్నతి కల్పించారు. దీంతో వర్సిటీకి ఇప్పటి దాకా రూ. 22,19,063 ఖజానాకు భారం పడింది.  
వీసీ ముందస్తు అనుమతి లేకుండానే డాక్టర్‌ రమేష్‌ బాబు (రీసెర్చ్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌)కు యూజీసీ రివైజ్డ్‌పే స్కేలు మంజూరు చేయడానికి గత రిజిస్ట్రార్‌ సుధాకర్‌ బాబు ఏకపక్షంగా ఆదేశాలు ఇచ్చారు.  
ఇంజినీరింగ్‌ సెక్షన్‌లో వీసీ ఆదేశాలు లేకుండానే నేరుగా ఒకరికి ఉద్యోగం కల్పించారు. స్టడీ సెంటర్‌ ఆఫ్‌ సోషల్‌ ఎక్స్‌క్లూజివ్‌ అండ్‌ ఇన్‌క్లూజన్‌ విభాగంలో ఒక మహిళకు ఉద్యోగం ఇచ్చారు.  
► ఒక సూపరింటెండెంట్‌కు వీసీ ముందస్తు అనుమతి లేకుండా రూ.5 లక్షలు, రూ.2 లక్షలు, అడ్వాన్స్‌ రూపంలో కట్టబెట్టారు. అదే విభాగంలో డిప్యూటీ రిజిస్ట్రార్‌కు అడ్వాన్స్‌ రూపంలో ఇవ్వాల్సి ఉన్నప్పటికీ నిబంధనలు విస్మరించారు.  

కంప్యూటర్‌ సైన్స్‌లో మరో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ సస్పెన్షన్‌
కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ దేవరాజును సస్పెండ్‌ చేశారు. విధులకు సక్రమంగా హాజరు కాలేదని గతంలో మూడు మెమోలు ఇచ్చారు. మూడు దఫాలు మెమో ఇస్తే సస్పెండ్‌ చేయాలని నిబంధన ఉండడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.

ఒకరికి షోకాజ్‌ 
కంప్యూటర్‌ సైన్సెస్‌ విభాగంలో పనిచేస్తున్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ జె.ఖెజియారాణికి సోమవారం షోకాజ్‌ నోటీసు అందచేశారు. ఆన్‌లైన్‌ తరగతులు తీసుకోకపోవడం, స్కాలర్లతో ఆన్‌లైన్‌ తరగతులు ఇప్పించిన సంగతి డిసెంబర్‌ 15న వీసీ ఆకస్మిక తనిఖీలో నిర్ధారణ అయ్యింది. డిసెంబర్‌ 16 వరకు 20 రోజుల పాటు చైల్డ్‌కేర్‌ సెలవులు తీసుకోవడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. చైల్డ్‌కేర్‌ సెలవులు తీసుకోవడానికి నిబంధనలు ఏవీ లేకపోవడంతో ఎలా వినియోగించారో తెలపాలని వివరణ కోరారు.

కెమిస్ట్రీ విభాగాధిపతిగా ప్రొఫెసర్‌ పి.వెంకటరమణ 
కెమిస్ట్రీ విభాగాధిపతిగా ప్రొఫెసర్‌ కె.సుధాకర్‌బాబును సస్పెండ్‌ చేయడంతో ఆ స్థానంలో రిజిస్ట్రార్‌ పి.వెంకటరమణకు బాధ్యతలు చేపట్టారు. క్యాంపస్‌ సైన్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ ఎస్‌.శంకర్‌నాయక్‌.. ప్రొఫెసర్‌ పి.వెంకటరమణకు బాధ్యతలు ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement