మూడో టైటిల్‌లో వచ్చిన మార్కులే అన్ని సబ్జెక్టులకు పునరావృతం అయిన తీరు
ఒక సబ్జెక్ట్‌లో పాసైతే అన్నింట్లో పాసైనట్లే.. ఒక సబ్జెక్ట్‌లో ఫెయిలైతే అన్నింట్లో ఫెయిలే.. ఏమిటీ వింత అనుకుంటున్నారా? శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ యంత్రాంగం సృష్టించిన గందరగోళం ఇది. శనివారం విడుదలైన డిగ్రీ 5వ సెమిస్టర్ ఫలితాలు యూనివర్సటీ యంత్రాంగం నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి.
ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం డిగ్రీ ఫలితాలు విద్యార్థుల భవిష్యత్తును తారుమారు చేశాయి. మార్కుల నమోదులో నిర్లక్ష్యం కారణంగా ఉండటంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. డిగ్రీ 5వ సెమిస్టర్ ఫలితాల్లో ఒక సబ్జెక్టులో వచ్చిన మార్కులే మిగతా సబ్జెక్టుల్లోనూ పునరావృతమయ్యాయి. అనంతపురం నగరంలోని ఒక డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులందరికీ ఇలాంటి ఫలితాలే వచ్చాయి. దీంతో విద్యార్థుల్లో అయోమయం, ఆందోళన నెలకొంది.
♦ బీఎస్సీలో హాల్ టికెట్ నంబర్ 16841099గల విద్యార్థినికి స్టాటిస్టిక్స్ విత్ మేథమేటిక్స్–5లో 18 మార్కులు వచ్చాయి. స్టాటిస్టిక్స్ విత్ మేథమేటిక్స్–6, కంప్యూటర్ అప్లికేషన్స్–5, కంప్యూటర్ అప్లికేషన్స్–6లోనూ 18 మార్కులే వచ్చాయి.
♦ ఇక బీకాంలో హాల్‌టికెట్ నంబర్ –16835141గల విద్యార్థికి ఓ సబ్జెక్టులో 32 మార్కులు వచ్చాయి. ప్రోగ్రామింగ్ ఇన్ సీ, డేటాబేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ సబ్జెక్టుల్లోనూ 32 మార్కులే వచ్చాయి. ఇలా ఒకే కళాశాలకు చెందిన విద్యార్థులందరికీ మార్కులు తారుమారు అయ్యాయి.
తప్పులు సరిచేస్తాం
మార్కుల నమోదులో తప్పిదాలను సరిచేస్తాం. బాధిత విద్యార్థులు నేరుగా వచ్చి పర్సనల్ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులందరికీ న్యాయం జరిగేలా చూస్తాం.
–ప్రొఫెసర్ జె.శ్రీరాములు, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్, ఎస్కేయూ
Comments
Please login to add a commentAdd a comment