బెంగళూరులో మరో బాలింత మృతి
శోకసంద్రంలో కుటుంబ సభ్యులు
కన్నడనాట కొనసాగుతున్న బాలింతల మరణాలు
బొమ్మనహళ్లి: బళ్లారిలో బాలింతల మరణాల పరంపర మరువక ముందే బెంగళూరులో ప్రసవించిన ఓ మహిళ శస్త్ర చికిత్స చేయించుకున్న అనంతరం అవయవ వైఫల్యం, ఇతర సమస్యలతో మరణించిన హృదయవిదారక ఘటన జరిగింది. చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా గర్జే గ్రామానికి చెందిన గర్భిణీ అనూష మృతితో బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. వివరాలు...చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా గర్జే గ్రామానికి చెందిన గర్భిణీ అనూషను తరికెరెలోని రాజ్ నర్సింగ్ హోంలో చేర్పించారు.
సాధారణ ప్రసవం ద్వారా పాప పుట్టింది. కాన్పుకు ముందు స్కానింగ్ చేయగా కిడ్నీలో స్టోన్ ఉందని, డెలివరీ అయిన నెల తరువాత షిమోగాలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోంలో సర్జరీ చేశారని సమాచారం. అయితే పేగులు దెబ్బతిన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అనూషను ఇంటికి తీసుకువచ్చిన తరువాత కాళ్లు, చేతులు వాపు కనిపించింది. మళ్లీ ఆస్పత్రికి వెళ్లగా సమస్య లేదని వైద్యుడు చెప్పారు. అయితే ఆమె ఆరోగ్య క్షీణించడంతో స్థానికంగా ఉన్న మరో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వారు కామెర్లు ఉన్నట్లు నిర్ధారించారు.
మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తీసుకువచ్చి నగరంలోని నాగరబావిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి్పంచారు. లివర్ సమస్యకు మరో ఆపరేషన్ చేసి సీటీ స్కానింగ్, ఎంఆర్‌ఐ, సర్జరీ అంటూ కుటుంబ సభ్యుల నుంచి డబ్బులు దండుకున్నట్లు సమాచారం. అప్పటి నుంచి అనూష స్పృహలో లేదు. ఆమెకు గుండె సమస్య ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యుల్లో మరింత ఆందోళన నెలకొంది. నిరంతర చికిత్స, వైద్య పరిశీలన లేక పోవడంతో తన భార్య మరణించిందని ఆమె భర్త ఆరోపిస్తున్నారు.
అనూష ఎలా చనిపోయిందనేది కూడా వైద్యులు చెప్పలేకపోతున్నారని ఆమె బంధువులు, భర్త రోదించారు. ఆమె మృతితో రోజుల బిడ్డ అనాథగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ప్రైవేట్ ఆస్పత్రిలో బాలింత మృతి చెందడంపై ప్రజల్లో ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment