వర్కలా బాయ్స్
ఇటీవల ‘ముంజమ్మల్ బాయ్స్’ సినిమా పెద్ద హిట్ అయ్యింది. బిలంలో పడ్డ స్నేహితుణ్ణి బయటకు లాగడం కథ. ఇక్కడ మనం ‘వర్కలా బాయ్స్’ని చూడొచ్చు. కర్నాటక నుంచి కేరళ విహారానికి వచ్చిన ఒక మహిళ వర్కలా బీచ్లో ఫోన్ జారవిడిచింది. అది అక్కడి రాళ్ల కింద చాలా లోతులో పడింది. అసలే అది ఐఫోన్. ఇంకేముంది వర్కలా అగ్నిమాపక దళం రంగంలోకి దిగింది. 7 గంటలు శ్రమించాక... ఏమైంది?విహారంలో అపశృతులు దొర్లితే మనసు పాడవుతుంది. కర్నాటక నుంచి కేరళలోని వర్కలాకు విహారానికి వచ్చిన ఒక మహిళ అక్కడి బ్లాక్ బీచ్లో ఉండగా పొరపాటున ఫోన్ జారింది. అది రాళ్ల కట్ట ఉన్న బీచ్. ఫోన్ రాళ్ల సందులో నుంచి లోపలికి పడిపోయింది. లక్షన్నర రూపాయల విలువ చేసే ఐఫోన్. వెంటనే ఆమె బస చేసిన హోటల్ సిబ్బంది, వర్కలా అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. రాళ్లు తొలగించి ఫోన్ తీసే వీలు లేదు. తాడుతో తీగతో బయటకు లాగడం కూడా కష్టమైంది. దానికితోడు బీచ్లో భారీ అలలు, వాన పనికి అంతరాయం కలిగించాయి. దాంతో మరుసటి రోజు ఉదయం వచ్చి సుమారు ఏడు గంటలు కష్టపడి ఆ ఫోన్ని వెలికి తీశారు. అమ్మయ్య. కథ సుఖాంతం అయ్యింది. సుఖాంతం సంతోషమే కదా ఇస్తుంది. మంజుమ్మల్ బాయ్స్లో కూడా కథ సుఖాంతం కావడం వల్లే అది అంత పెద్ద హిట్ అయ్యిందని అనుకోవచ్చా?