నమ్మకాన్ని పెనవేసుకుని పుట్టే మోసానికి.. కేవలం బలి తీసుకోవడమే తెలుసు. దానికి చట్టమంటే మహా అలుసు. చేసింది ఎంతటి ఘోరమైనా.. పరపతి నీడలో.. పలుకుబడి ముసుగులో.. శిక్షాస్మృతిని సైతం వెక్కిరిస్తుంది. అసలు ఈ నేరచరిత నేటిది కాదు. నేటితో ఆగేదీ కాదు. అలా అని, ఏదొక ప్రాంతానికే పరిమితమూ కాదు. ఎందుకంటే.. అది మానవసమూహంలో మంచితనం ముసుగుతో తిరుగుతుంది. ఎదుటివారి అవసరాన్ని, అమాయకత్వాన్ని, ఆశల్నీ, ఆలోచనలనీ.. అన్నింటినీ అంచనా వేసి, పొందాల్సిన లాభాన్ని పొందాకే.. అదను చూసి.. దెబ్బకొడుతుంది. ప్రపంచ చరిత్రలో అలా దెబ్బతిన్న బాధితుల గాథలు అన్నీ ఇన్నీ కావు. వాటిలో ‘జో అలెన్ వీగెల్’ ఉదంతం ఒకటి.
1970, జూలై 2. పద్దెనిమిదేళ్ల ‘జో అలెన్ వీగెల్’ ఆశలన్నీ కుప్పకూలిన రోజది. తన మృత్యువుకు ప్రణాళిక ముందే సిద్ధమైందని, తనతో ఉన్నవారే యమకింకరులని ఆమెకు తెలియని రోజది. తెలిసే సమయానికి.. ఆమె లేనేలేదు. అమెరికాకు చెందిన ‘జో అలెన్ వీగెల్’.. చదువుకునే రోజుల్లో స్థానికుడైన మైక్ క్లైన్ అనే స్నేహితుడ్ని ప్రేమించింది. ఇద్దరిదీ సుమారు ఒకే వయసు. అతడు చాలా ఆస్తిపరుడు, అందగాడు. మెడిసిన్ చదువుతున్నాడు.
‘త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం’ అని అతడ్ని తన కన్నవారికి పరిచయం చేసింది జో. మొదటి నుంచి శ్రామికులైన జో తల్లిదండ్రులు.. ఆ జంటను చూసి.. అతడి బ్యాగ్రౌండ్ చూసి ఎంతగానో మురిసిపోయారు. జో.. మైక్‌తో కలసి వెళ్లిందంటే వారికో ధైర్యం. ఏ సమస్య వచ్చినా మైక్ చూసుకుంటాడులే అనే ఓ నమ్మకం. జూలై 2 రాత్రి కూడా జో.. అతడితోనే వెళ్లింది కానీ తిరిగిరాలేదు.
మరునాడు జో కోసం ఆమె తండ్రి జోసెఫ్ వీగెల్.. మైక్‌ని కలసి ఆరా తీశాడు. ‘మాకు వివాహం అయ్యింది. తను నా భార్య.. తన గురించి మీకంత శ్రద్ధ అవసరం లేదు’ అంటూ తిక్కగా సమాధానం చెప్పాడు మైక్. అతడ్ని ఆ తీరులో ఎప్పుడూ చూడలేదు జోసెఫ్. ‘గొడవపడ్డారా? నిన్న రాత్రి మీరిద్దరూ బయలుదేరే ముందు కూడా గొడవపడటం నేను విన్నాను. అసలేం జరిగింది? జో నిజంగా ఎక్కడికి వెళ్లిందో చెప్పు?’ అంటూ నిదానంగా, సముదాయింపుగా అడిగాడు జోసెఫ్.
ఆ వాదనలో ‘తెలియదు’ అని ఒకసారి.. ‘బంధువుల ఇంటికి వెళ్లింది’ అని మరోసారి చెప్పాడు మైక్. వెంటనే జోసెఫ్.. మైక్ చెప్పిన బంధువుల ఇంటికి వెళ్లి మరీ జో గురించి వాకబు చేశాడు. ఇక్కడికి రాలేదని బంధువులు తెలపడంతో.. నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి.. ‘మా అమ్మాయి కనిపించడం లేదు.. కాబోయే అల్లుడు మైక్‌పై అనుమానం ఉంది, కంప్లైంట్ తీసుకోండి’ అని కోరాడు జోసెఫ్. టీనేజ్ పిల్లలు ఇంట్లో చెప్పకుండా ట్రిప్‌లకు వెళ్లడం, కొన్నిరోజులకు మళ్లీ తిరిగి రావడం కామన్ కాబట్టి.. సరైన ఆధారం లేకుండా కేసు నమోదు చేసుకోలేమని.. పోలీసులు తేల్చేశారు. దాంతో జో పేరెంట్స్‌కి జో కోసం ఎదురుచూడటం తప్ప మరో దారి లేకుండా పోయింది.
సరిగ్గా మూడురోజులకి.. కొన్ని మైళ్లదూరంలో ఉన్న విన్నెబాగో సరస్సులో జో.. కేవలం లో–దుస్తులతో శవమై తేలింది. బాడీని జో పేరెంట్స్ గుర్తుపట్టడంతో కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు మొదలుపెట్టారు. జో కాళ్లకు.. బరువైన కాంక్రీట్ బండ, బరువైన వాటర్ టిన్ను కట్టి ఉన్నట్లు గుర్తించారు పోలీస్ అధికారులు. శవం పైకి తేలకుండా ఉండటానికే అలా చేసి ఉంటారని ప్రా«థమిక నిర్ధారణకు వచ్చారు. బాడీని పోస్ట్‌మార్టమ్‌కి పంపించారు. ఆ రిపోర్ట్‌లో జో గొంతు నులమడం వల్లే చనిపోయిందని.. ఆమె 4వ నెల గర్భవతి అని తేలింది.
పైగా ఆ సరస్సు ఒడ్డునే మైక్ నివాసం కావడంతో జో కేసు మొత్తం మైక్ చుట్టూనే తిరిగింది. అయితే జో బాడీ దొరికిన రోజే.. మైక్ యూరప్ చెక్కేశాడు. జో బాడీకి కట్టిన ఆ కాంక్రీట్ బండ.. మైక్ స్నేహితుడి ఇంటి ముందు ఉన్న మరిన్ని బండలతో సరిపోలింది. పైగా ఆ బండకు కట్టిన తాడు.. మైక్ ఇంట్లోని స్పీడ్ బోట్‌లో ఉండే బెల్ట్ అని తేలింది. ఇక మైక్ వాడే కారులో.. ఒక టవల్ దాని నిండా జో తల వెంట్రుకలు ఉన్నాయి. అవి జో మరణానికి ముందు.. తల నుంచి బలవంతంగా లాగినట్లు నేర పరిశోధనలో తేలింది. అంటే జోను చంపే సమయంలో తీవ్రమైన పెనుగులాట జరిగిందని అధికారులు నిర్ధారించుకున్నారు.
ఈలోపు ఆర్థికంగా ఉన్నతస్థానంలో ఉన్న మైక్ తండ్రి డొనాల్డ్ క్లైన్.. కొడుకుని కాపాడుకోవడానికి విశ్వప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే మీడియా కన్ను.. విన్నెబాగో సరస్సు ఒడ్డున ఉన్న మైక్ ఖరీదైన ఇంటి మీద పడింది. పోలీసులతో పాటు రిపోర్టర్స్ కూడా ఆ ఇంటిని శోధించి.. మైక్ ఇంటి అందాన్ని.. ఆ ఇంట్లో ఉన్న కార్లు, స్వీడ్ బోట్స్ లెక్కల్ని వాటి ధరల్నీ చెబుతూనే.. ‘జోకి అన్యాయం చేసిన మైక్ ఎక్కడ?’ అనే ఎన్నో కథనాలను ప్రచురించారు. జో గర్భిణి అని తెలుసుకున్నవారంతా మైక్ కుటుంబంపై దుమ్మెత్తిపోశారు.
ఇక సరిగ్గా వారానికి యూరప్ నుంచి తిరిగి వచ్చిన మైక్‌ని అరెస్ట్ చేసి విచారణకు పంపించారు. అయితే అతడు నోరు విప్పలేదు. ఏం జరిగిందో చెప్పలేదు. జోను చంపింది తానేనని ఒప్పుకోలేదు. అదంతా అతడి లాయర్ సలహానే అని మీడియా గగ్గోలుపెట్టింది. కేసు నడుస్తుండగానే బెయిల్‌పై బయటికి వచ్చిన మైక్.. వాయిదాల ప్రకారం కోర్టుకు వచ్చిపోతుండేవాడు. జో హత్యపై తీవ్రమైన అభియోగాలు ఎదురవడంతో.. జూలై 24న గ్రాండ్ జ్యూరీలో మైక్.. బెయిల్ రద్దు చేస్తూ.. తిరిగి మైక్‌ని అదుపులోకి తీసుకోమని ఆదేశాలొచ్చాయి. అయితే ఆ రోజు నుంచి మైక్ ఎవరికీ కనిపించలేదు. నేటికీ దొరకలేదు.
మైక్ మారుపేరుతో తన ఎడ్యుకేషన్ మొత్తం పూర్తి చేసి.. పశువైద్యుడిగా జీవితాన్ని రీస్టార్ట్ చేశాడని.. ఇప్పటికీ అతడు.. లాటిన్ అమెరికాలో రహస్యంగా, సురక్షితంగా జీవిస్తున్నాడని చాలామంది చెబుతుంటారు. అతడి ఆచూకీ ప్రపంచానికి తెలియకపోవచ్చు కానీ.. తన తండ్రి డొనాల్డ్‌కి కచ్చితంగా తెలుసు అని అధికారులు సైతం నమ్మారు. 1988లో డొనాల్డ్ మృతి చెందాడు. అంతకుముందే జో పేరెంట్స్ కూడా ఈ కేసుపై పోరాడి పోరాడి.. అనారోగ్యసమస్యలతో చనిపోయారు. ఈరోజుకి మైక్ బతికి ఉంటే అతడికి డెబ్బై రెండేళ్లు దాటి ఉంటాయని అంచనా. అతడికి సంబంధించిన పలు ఊహాచిత్రాలు.. నేటికీ ఎఫ్‌బీఐ రికార్డ్స్‌లో ‘మోస్ట్ వాంటెడ్’ నోట్‌తో కనిపిస్తుంటాయి.
ఏది ఏమైనా.. జో మృతిలో మైక్ హస్తం ఉందనే స్పష్టత అతడి మిస్సింగ్‌తో తేలిపోతుంది. కానీ ఆమెను మైక్ ఎందుకు చంపాడు? ఎవరెవరు ఈ కుట్రలో పాల్గొన్నారు? జో తల్లి కాబోతుందన్న నిజం తెలిసి కూడా చంపేశాడా? అసలు మైక్ ఏమైపోయాడు? ఎటుపోయాడు? ఎక్కడున్నాడు? ఇలా ఎన్నో ప్రశ్నలు మాత్రం నేటికీ మిస్టరీనే మిగిలిపోయాయి. – సంహిత నిమ్మన
Comments
Please login to add a commentAdd a comment