medisin
-
ఇంతకీ.. ఎవరీ 'జో అలెన్ వీగెల్'!?
నమ్మకాన్ని పెనవేసుకుని పుట్టే మోసానికి.. కేవలం బలి తీసుకోవడమే తెలుసు. దానికి చట్టమంటే మహా అలుసు. చేసింది ఎంతటి ఘోరమైనా.. పరపతి నీడలో.. పలుకుబడి ముసుగులో.. శిక్షాస్మృతిని సైతం వెక్కిరిస్తుంది. అసలు ఈ నేరచరిత నేటిది కాదు. నేటితో ఆగేదీ కాదు. అలా అని, ఏదొక ప్రాంతానికే పరిమితమూ కాదు. ఎందుకంటే.. అది మానవసమూహంలో మంచితనం ముసుగుతో తిరుగుతుంది. ఎదుటివారి అవసరాన్ని, అమాయకత్వాన్ని, ఆశల్నీ, ఆలోచనలనీ.. అన్నింటినీ అంచనా వేసి, పొందాల్సిన లాభాన్ని పొందాకే.. అదను చూసి.. దెబ్బకొడుతుంది. ప్రపంచ చరిత్రలో అలా దెబ్బతిన్న బాధితుల గాథలు అన్నీ ఇన్నీ కావు. వాటిలో ‘జో అలెన్ వీగెల్’ ఉదంతం ఒకటి.1970, జూలై 2. పద్దెనిమిదేళ్ల ‘జో అలెన్ వీగెల్’ ఆశలన్నీ కుప్పకూలిన రోజది. తన మృత్యువుకు ప్రణాళిక ముందే సిద్ధమైందని, తనతో ఉన్నవారే యమకింకరులని ఆమెకు తెలియని రోజది. తెలిసే సమయానికి.. ఆమె లేనేలేదు. అమెరికాకు చెందిన ‘జో అలెన్ వీగెల్’.. చదువుకునే రోజుల్లో స్థానికుడైన మైక్ క్లైన్ అనే స్నేహితుడ్ని ప్రేమించింది. ఇద్దరిదీ సుమారు ఒకే వయసు. అతడు చాలా ఆస్తిపరుడు, అందగాడు. మెడిసిన్ చదువుతున్నాడు.‘త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం’ అని అతడ్ని తన కన్నవారికి పరిచయం చేసింది జో. మొదటి నుంచి శ్రామికులైన జో తల్లిదండ్రులు.. ఆ జంటను చూసి.. అతడి బ్యాగ్రౌండ్ చూసి ఎంతగానో మురిసిపోయారు. జో.. మైక్‌తో కలసి వెళ్లిందంటే వారికో ధైర్యం. ఏ సమస్య వచ్చినా మైక్ చూసుకుంటాడులే అనే ఓ నమ్మకం. జూలై 2 రాత్రి కూడా జో.. అతడితోనే వెళ్లింది కానీ తిరిగిరాలేదు.మరునాడు జో కోసం ఆమె తండ్రి జోసెఫ్ వీగెల్.. మైక్‌ని కలసి ఆరా తీశాడు. ‘మాకు వివాహం అయ్యింది. తను నా భార్య.. తన గురించి మీకంత శ్రద్ధ అవసరం లేదు’ అంటూ తిక్కగా సమాధానం చెప్పాడు మైక్. అతడ్ని ఆ తీరులో ఎప్పుడూ చూడలేదు జోసెఫ్. ‘గొడవపడ్డారా? నిన్న రాత్రి మీరిద్దరూ బయలుదేరే ముందు కూడా గొడవపడటం నేను విన్నాను. అసలేం జరిగింది? జో నిజంగా ఎక్కడికి వెళ్లిందో చెప్పు?’ అంటూ నిదానంగా, సముదాయింపుగా అడిగాడు జోసెఫ్.ఆ వాదనలో ‘తెలియదు’ అని ఒకసారి.. ‘బంధువుల ఇంటికి వెళ్లింది’ అని మరోసారి చెప్పాడు మైక్. వెంటనే జోసెఫ్.. మైక్ చెప్పిన బంధువుల ఇంటికి వెళ్లి మరీ జో గురించి వాకబు చేశాడు. ఇక్కడికి రాలేదని బంధువులు తెలపడంతో.. నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి.. ‘మా అమ్మాయి కనిపించడం లేదు.. కాబోయే అల్లుడు మైక్‌పై అనుమానం ఉంది, కంప్లైంట్ తీసుకోండి’ అని కోరాడు జోసెఫ్. టీనేజ్ పిల్లలు ఇంట్లో చెప్పకుండా ట్రిప్‌లకు వెళ్లడం, కొన్నిరోజులకు మళ్లీ తిరిగి రావడం కామన్ కాబట్టి.. సరైన ఆధారం లేకుండా కేసు నమోదు చేసుకోలేమని.. పోలీసులు తేల్చేశారు. దాంతో జో పేరెంట్స్‌కి జో కోసం ఎదురుచూడటం తప్ప మరో దారి లేకుండా పోయింది.సరిగ్గా మూడురోజులకి.. కొన్ని మైళ్లదూరంలో ఉన్న విన్నెబాగో సరస్సులో జో.. కేవలం లో–దుస్తులతో శవమై తేలింది. బాడీని జో పేరెంట్స్ గుర్తుపట్టడంతో కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు మొదలుపెట్టారు. జో కాళ్లకు.. బరువైన కాంక్రీట్ బండ, బరువైన వాటర్ టిన్ను కట్టి ఉన్నట్లు గుర్తించారు పోలీస్ అధికారులు. శవం పైకి తేలకుండా ఉండటానికే అలా చేసి ఉంటారని ప్రా«థమిక నిర్ధారణకు వచ్చారు. బాడీని పోస్ట్‌మార్టమ్‌కి పంపించారు. ఆ రిపోర్ట్‌లో జో గొంతు నులమడం వల్లే చనిపోయిందని.. ఆమె 4వ నెల గర్భవతి అని తేలింది.పైగా ఆ సరస్సు ఒడ్డునే మైక్ నివాసం కావడంతో జో కేసు మొత్తం మైక్ చుట్టూనే తిరిగింది. అయితే జో బాడీ దొరికిన రోజే.. మైక్ యూరప్ చెక్కేశాడు. జో బాడీకి కట్టిన ఆ కాంక్రీట్ బండ.. మైక్ స్నేహితుడి ఇంటి ముందు ఉన్న మరిన్ని బండలతో సరిపోలింది. పైగా ఆ బండకు కట్టిన తాడు.. మైక్ ఇంట్లోని స్పీడ్ బోట్లో ఉండే బెల్ట్ అని తేలింది. ఇక మైక్ వాడే కారులో.. ఒక టవల్ దాని నిండా జో తల వెంట్రుకలు ఉన్నాయి. అవి జో మరణానికి ముందు.. తల నుంచి బలవంతంగా లాగినట్లు నేర పరిశోధనలో తేలింది. అంటే జోను చంపే సమయంలో తీవ్రమైన పెనుగులాట జరిగిందని అధికారులు నిర్ధారించుకున్నారు.ఈలోపు ఆర్థికంగా ఉన్నతస్థానంలో ఉన్న మైక్ తండ్రి డొనాల్డ్ క్లైన్.. కొడుకుని కాపాడుకోవడానికి విశ్వప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే మీడియా కన్ను.. విన్నెబాగో సరస్సు ఒడ్డున ఉన్న మైక్ ఖరీదైన ఇంటి మీద పడింది. పోలీసులతో పాటు రిపోర్టర్స్ కూడా ఆ ఇంటిని శోధించి.. మైక్ ఇంటి అందాన్ని.. ఆ ఇంట్లో ఉన్న కార్లు, స్వీడ్ బోట్స్ లెక్కల్ని వాటి ధరల్నీ చెబుతూనే.. ‘జోకి అన్యాయం చేసిన మైక్ ఎక్కడ?’ అనే ఎన్నో కథనాలను ప్రచురించారు. జో గర్భిణి అని తెలుసుకున్నవారంతా మైక్ కుటుంబంపై దుమ్మెత్తిపోశారు.ఇక సరిగ్గా వారానికి యూరప్ నుంచి తిరిగి వచ్చిన మైక్‌ని అరెస్ట్ చేసి విచారణకు పంపించారు. అయితే అతడు నోరు విప్పలేదు. ఏం జరిగిందో చెప్పలేదు. జోను చంపింది తానేనని ఒప్పుకోలేదు. అదంతా అతడి లాయర్ సలహానే అని మీడియా గగ్గోలుపెట్టింది. కేసు నడుస్తుండగానే బెయిల్‌పై బయటికి వచ్చిన మైక్.. వాయిదాల ప్రకారం కోర్టుకు వచ్చిపోతుండేవాడు. జో హత్యపై తీవ్రమైన అభియోగాలు ఎదురవడంతో.. జూలై 24న గ్రాండ్ జ్యూరీలో మైక్.. బెయిల్ రద్దు చేస్తూ.. తిరిగి మైక్‌ని అదుపులోకి తీసుకోమని ఆదేశాలొచ్చాయి. అయితే ఆ రోజు నుంచి మైక్ ఎవరికీ కనిపించలేదు. నేటికీ దొరకలేదు.మైక్ మారుపేరుతో తన ఎడ్యుకేషన్ మొత్తం పూర్తి చేసి.. పశువైద్యుడిగా జీవితాన్ని రీస్టార్ట్ చేశాడని.. ఇప్పటికీ అతడు.. లాటిన్ అమెరికాలో రహస్యంగా, సురక్షితంగా జీవిస్తున్నాడని చాలామంది చెబుతుంటారు. అతడి ఆచూకీ ప్రపంచానికి తెలియకపోవచ్చు కానీ.. తన తండ్రి డొనాల్డ్‌కి కచ్చితంగా తెలుసు అని అధికారులు సైతం నమ్మారు. 1988లో డొనాల్డ్ మృతి చెందాడు. అంతకుముందే జో పేరెంట్స్ కూడా ఈ కేసుపై పోరాడి పోరాడి.. అనారోగ్యసమస్యలతో చనిపోయారు. ఈరోజుకి మైక్ బతికి ఉంటే అతడికి డెబ్బై రెండేళ్లు దాటి ఉంటాయని అంచనా. అతడికి సంబంధించిన పలు ఊహాచిత్రాలు.. నేటికీ ఎఫ్‌బీఐ రికార్డ్స్‌లో ‘మోస్ట్ వాంటెడ్’ నోట్‌తో కనిపిస్తుంటాయి.ఏది ఏమైనా.. జో మృతిలో మైక్ హస్తం ఉందనే స్పష్టత అతడి మిస్సింగ్‌తో తేలిపోతుంది. కానీ ఆమెను మైక్ ఎందుకు చంపాడు? ఎవరెవరు ఈ కుట్రలో పాల్గొన్నారు? జో తల్లి కాబోతుందన్న నిజం తెలిసి కూడా చంపేశాడా? అసలు మైక్ ఏమైపోయాడు? ఎటుపోయాడు? ఎక్కడున్నాడు? ఇలా ఎన్నో ప్రశ్నలు మాత్రం నేటికీ మిస్టరీనే మిగిలిపోయాయి. – సంహిత నిమ్మన -
కొన్ని ప్రాణాలు కాపాడగలిగామన్న సంతృప్తి ఉంది: నిఖిల్.
‘‘బ్లాక్ ఫంగస్ మెడిసిన్ కోసం రిక్వెస్ట్ వస్తే మణికొండ నుంచి నా భార్యతో రాజేంద్రనగర్‌లోని ఫార్మా ఫ్యాక్టరీ గోడౌన్ వరకూ వెళ్లి, అక్కడ్నుంచి సోమాజిగూడ ఆసుపత్రి దాకావెళ్లి ఆ మెడిసిన్ అందజేశాను. రాత్రి 2 గంటల టైమ్‌లో నేనొస్తానని ఊహించలేదేమో.. ఆ కుటుంబ సభ్యుల కన్నీళ్లు చూస్తే నాకు కన్నీళ్లొచ్చాయి’’ అన్నారు హీరో నిఖిల్. నాలుగు రోజుల క్రితం నిఖిల్ అవసరార్ధుల కోసం సికింద్రాబాద్‌లోని ఓ ఆసుపత్రికి మెడిసిన్స్ తీసుకెళుతున్న సమయంలో పోలీసులు ‘ఈ పాస్’ లేదని అడ్డుకున్నారు. ‘‘ఆ రోజు ఏం జరిగిందంటే... మందులు తీసుకెళుతున్నప్పుడు పోలీసులు ఆపారు. మాస్క్ తీసి ముఖం చూపలేదు కానీ, ప్రిస్క్రిప్షన్ చూపించి, ఎమర్జెన్సీ అని చెప్పినా ‘ఈ పాస్’ ఉండాల్సిందే అన్నారు. రోడ్డు మీదే 20నిమిషాలు ట్రై చేసినా పాస్ దొరకలేదు. ఆ విషయాన్నే ట్వీట్ చేశా’’ అన్నారు నిఖిల్. ఈ ఉదంతం బయటకు వచ్చేవరకూ నిఖిల్ చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’తో నిఖిల్ పంచుకున్న అనుభవాలివి.. తుపాన్లు, వరదలు వస్తే నష్టాన్ని అంచనా వేసి తలా ఇంత అని సాయం చేయడం వేరు. కానీ ఆసుపత్రుల్లో బెడ్స్ దొరక్క, మందులు దొరక్క ప్రాణాలు పోయే పరిస్థితులు.. అంచనాలకు అందని వ్యాధులు.. వీటి మధ్య అవసరార్ధులకే కాదు సాయం చేయాలనుకున్నవారికీ కష్టమే. గత ఏప్రిల్‌లో నా భార్య, మా అంకుల్ కోవిడ్ బారిన పడినప్పుడు ఆసుపత్రుల్లో బెడ్స్ కోసం ఎదుర్కొన్న ఇబ్బందులు నన్ను ఆలోచింపజేశాయి. అప్పటికే ట్విట్టర్లో చూస్తే... పెద్ద సంఖ్యలో సాయం కోరుతూ రిక్వెస్టులు. కొంతమందికైనా సహాయం చేయాలనుకున్నాను. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్‌లలో వచ్చిన ప్రతీ రిక్వెస్ట్‌నీ పరిశీలించి, వీలైనంతవరకూ అటెండయ్యాం. ఇంజక్షన్ కావాలన్నవారికి ఇంజక్షన్, మెడిసిన్స్ అంటే మెడిసిన్స్, ఆసుపత్రి బిల్ కట్టలేకపోయిన వారికి బిల్లు... ఇలా వందలాది పేషెంట్స్‌కి కావాల్సినవి సమకూర్చగలిగాం. కాకినాడ కేజీహెచ్‌లో ఒకరికి బ్లాక్ ఫంగస్, విజయవాడ కామినేని ఆసుపత్రిలో ఇలా కొందరి గురించి ఆరోగ్యాంధ్రకు వారిని ట్యాగ్ చేసి రిక్వెస్ట్ చేస్తే.. వారు కూడా ఆయా పేషెంట్స్‌కి ఉచితంగా చికిత్స చేయించారు. నాకు విజయవాడ, హైదరాబాద్, వైజాగ్ ఆసుపత్రుల్లో మంచి పరిచయాలు ఉండడం హెల్ప్ అయింది. రిక్వెస్టులు తగ్గాయి ఈ నెల 15 వరకూ రోజుకు దాదాపు 1000 దాకా రిక్వెస్టులు వచ్చాయి. అయితే ప్రభుత్వం కూడా తగిన చర్యలు చేపట్టడం వల్ల, బెడ్స్ బాగా పెరిగి అందుబాటులోకి రావడం వల్లనేమో ఆ తర్వాత తగ్గాయి. గతంలో తిత్లీ తుపాన్ టైమ్‌లో కూడా బాధితులకు సేవ చేసిన అనుభవం ఉంది. అయితే ఇన్ని రోజులు ఇంత కంటిన్యూగా చేయడం చాలా కొత్త అనుభవాలను, పాఠాలను నేర్పింది. ఒక అబ్బాయికి ఆక్సిజన్ సిలిండర్ పంపిస్తే అది ఇంటికి చేరేలోపు చనిపోయాడు. ఇలా చివరి నిమిషాల్లో రిక్వెస్ట్‌లు పెట్టడం వల్ల ప్రాణాలు కాపాడలేకపోవడమనే బాధ కలచివేసింది. ఏదేమైనా కొన్ని ప్రాణాలైనా కాపాడగలిగాం, కొంతమందికైనా ఉపశమనం ఇచ్చామనే సంతృప్తి అయితే ఉంది. పుట్టినరోజుకి ఫస్ట్ లుక్ నిఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘18 పేజెస్’. అనుపమా పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్నారు. ‘కుమారి 21 ఎఫ్’ ఫేమ్ పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి ‘బన్ని’ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించారు. జూన్ 1న నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా ‘18 పేజెస్’ ఫస్ట్ లుక్ విడుదల కానుంది. అయితే బుధవారం అప్డేట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘18 పేజెస్’ టైటిల్ ఫిక్స్ చేసినప్పటినుంచి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించింది. గోపీసుందర్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: బాబు, కెమెరా: వసంత్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: శరణ్ రాపర్తి, అశోక్ బి. -
రేపటి నుంచి ఏపీ ఎంసెట్
చిత్తూరు, తిరుపతి ఎడ్యుకేషన్: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడిసిన్ విద్యలో ప్రవేశానికి ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఏపీ ఎంసెట్ ఈనెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. రెండేళ్లుగా ఆన్లైన్ (కంప్యూటర్ ఆధారిత) ద్వారా ఎంసెట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షను జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకు ఎంసెట్‌ను పకడ్బందీగా నిర్వహించనున్నారు. 20 నుంచి 23వ తేదీ వరకు ఇంజినీరింగ్, 23, 24వ తేదీల్లో అగ్రికల్చర్ పరీక్షలు జరగనున్నాయి. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ రెండింటికీ దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు 23, 24వ తేదీల్లో పరీక్ష ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 10నుంచి మధ్యాహ్నం 1గంట వరకు, మధ్యాహ్నం 2.30నుంచి సాయంత్రం 5.30గంటల వరకు రెండు సెషన్స్‌లో నిర్వహిస్తారు. 23,051మంది దరఖాస్తు జిల్లావ్యాప్తంగా ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడిసిన్‌కు 23,051మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంజినీరింగ్‌కు 14,409మంది, అగ్రికల్చర్‌కు 8,642మంది, మొత్తం 23,051మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఏపీ ఎంసెట్‌కు నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదంటూ కాకినాడ జేఎన్టీయూ ప్రొఫెసర్, ఏపీ ఎంసెట్–2019 కన్వీనర్ సీహెచ్ సాయిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థి హాల్ టికెట్లోనే పరీక్ష తేదీ, సమయం ఉంటాయని, దీనిని గుర్తుంచుకుని సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని తెలిపారు. పరీక్ష కేంద్రంలోకి ఎంసెట్ హాల్ టికెట్‌తో పాటు ఇంటర్ హాల్ టికెట్, ఓటరు ఐడీ, పాన్ కార్డు, పాస్‌పోర్ట్, ఆధార్ కార్డుల్లో ఏదేని ఒక గుర్తింపు కార్డు, బాల్‌పాయింట్ పెన్, ఎంసెట్ దరఖాస్తు, ఎస్సీ, ఎస్టీలు కుల ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని సూచించారు. కాలిక్యులేటర్లు, సెల్ఫోన్లు, స్మార్ట్ వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించమని స్పష్టంచేశారు. బయోమెట్రిక్ అటెండెన్స్ నేపథ్యంలో పరీక్ష కేంద్రంలోకి ఉదయం 9గంటలకు, మధ్యాహ్నం 1.30గంటల నుంచే విద్యార్థులను అనుమతించనున్నట్లు తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్ష ప్రారంభానికి ముందు కంప్యూటర్లో ఇచ్చిన సూచనలు, జాగ్రత్తలను విద్యార్థులు క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలన్నారు. ఏపీ ఎంసెట్–2019కు సంబంధించి సందేహాలను నివృత్తి చేసుకోవడానికి 0884–2340535, 0844–2356255 నంబర్లలో సంప్రదించాలని, అలాగే 2019 apeamcet@fmai.com మెయిల్ ద్వారా సంప్రదించాలని కన్వీనర్ సూచించారు. జిల్లాలో 10పరీక్ష కేంద్రాలు ఎంసెట్ పరీక్ష నిర్వహణకు జిల్లాలో 10పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. చిత్తూరులో ఒకటి, మదనపల్లిలో 2, పుత్తూరులో 3, తిరుపతిలో 4, మొత్తం 10 పరీక్ష కేంద్రాల్లో ఆన్లైన్ ద్వారా పరీక్షను నిర్వహించనున్నారు. చిత్తూరులో.. 1. వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మదనపల్లెలో.. 2. ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల 3. మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్సైన్సెస్ పుత్తూరులో.. 4. సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్టెక్నాలజీ 5. శ్రీవేంకటేశ పెరమాళ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్అండ్ టెక్నాలజీ 6. కేకేసీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజినీరింగ్ తిరుపతిలో.. 7. అయాన్ డిజిటల్ జోన్, రామిరెడ్డిపల్లి 8. అయాన్ డిజిటల్ జోన్, జూపార్కు సమీపం 9. అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ 10. ఎస్వీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ -
సెల్ఫీ డాక్టర్ అయిపోతా
యాక్టర్‌గా మారారు డాక్టర్ సాయి పల్లవి. మెడిసిన్ చదువుతూనే సినిమాలో నటించే అవకాశం రావడంతో మలయాళ ‘ప్రేమమ్’లో నటించారు. ఆ తర్వాత మెడిసిన్ పూర్తి చేసి పూర్తి స్థాయిగా సినిమాల్లో కనిపిస్తున్నారు. మరి యాక్టర్‌గా బిజీ అయిపోయారు. ప్రాక్టీస్ మొదలుపెట్టారా? అనే ప్రశ్నకు సాయి పల్లవి సమాధానమిస్తూ – ‘‘యాక్టర్‌గా మారాక ప్రాక్టీస్ చేయడమే మరచిపోయాను. కానీ కచ్చితంగా చదివింది రివిజన్ చేయాలి. మెడిసిన్‌లో చదువుకున్న చాలా విషయాలు మర్చిపోతున్నాను అని అర్థం అవుతోంది. ఎంతో కష్టపడి నేర్చుకున్నదంతా అలా మర్చిపోతుంటే చాలా బాధగా ఉంది. ఒకవేళ నేను ప్రాక్టీస్ కోసం హాస్పిటల్‌కు వెళ్లినా నేను డాక్టర్ అంటే నన్ను ఎవ్వరూ నమ్మరనుకుంటున్నాను. మందులచీటీ రాసివ్వండి అనే వాళ్లకంటే సెల్ఫీ ఇవ్వండి అనేవాళ్లే ఎక్కువ సంఖ్యలో ఉంటారనుకుంటున్నాను. సంతోషమైన విషయమేంటంటే మా ఇంట్లో నేనొక్కదాన్నే డాక్టర్ని. కాబట్టి మావాళ్లకు వేరే ఆప్షన్ లేదు. నేను ప్రయోగాలు చేయడానికి వెతుక్కునే పని లేదు’’ అని పేర్కొన్నారు. -
ప్రొటీన్ పూతతో మందుకు పది రెట్ల బలం!
కేన్సర్ కణుతులను లక్ష్యంగా చేసుకుని పనిచేసే మందులు ఇప్పటికే బోలెడున్నాయి. వీటన్నింటితో ప్రయోజనం మాత్రం చాలా తక్కువ. దక్షిణ కొరియాకు చెందిన ఉల్సాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధనలు పూర్తిస్థాయిలో విజయవంతమైతే మాత్రం ఈ పరిస్థితి మారిపోతుంది. మందుల ప్రభావం పది రెట్లు పెరగడమే కాకుండా.. దుష్ప్రభావాలు కూడా గణనీయంగా తగ్గనున్నాయి. ఇప్పటివరకు ఉపయోగిస్తున్న మందులు కేన్సర్ కణితిని చేరే లోపు బోలెడన్ని ప్రొటీన్లు వాటికి అతుక్కుపోవడం వల్ల ప్రభావం తక్కువగా ఉందని చాలాకాలం క్రితమే గుర్తించారు. ఈ సమస్యను అధిగమించేందుకు కొరియా శాస్త్రవేత్తలు మందులపై ప్రత్యేకమైన ప్రొటీన్ పూత పూశారు. ఇది ఒంటరిగానే పనిచేస్తుంటుంది. నానోస్థాయి మందులపై ప్రొటీన్ పూత పూసి తాము ముందుగా కంప్యూటర్ లో సిములేట్ చేశామని రోగ నిరోధక వ్యవస్థ కళ్లుగప్పి మరీ ఇవి కణితిపై దాడిచేయగలిగాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త హ్యోయుంగ్ రో తెలిపారు. ఎలుకలపై జరిగిన ప్రయోగాల్లోనూ తాము సానుకూల ఫలితాలు రాబట్టగలిగామని, ఈ పద్ధతిని కేవలం కేన్సర్‌కు మాత్రమే కాకుండా వేర్వేరు వ్యాధుల నిర్ధారణ, చికిత్సలకు ఉపయోగించవచ్చునని వివరించారు. -
త్వరలో టెలీ మెడిసిన్ సేవలు
ఆధునిక వైద్య సేవలను ప్రవేశపెట్టాలని సర్కారు యోచన కాళోజీ ఆరోగ్య వర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి ఫిజీషియన్ల సదస్సు ప్రారంభం ఎంజీఎం : ఆస్పత్రుల్లో టెలీ మెడిసిన్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ బి.కరుణాకర్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా ఎంజీఎం, కేఎంసీ మెడిసిన్ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కళాశాలలో రెండు రోజుల పాటు రాష్ట్ర స్థాయి ఫిజీషియన్ల సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి వీసీ కరుణాకర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శనివారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సదస్సులో అనుభవజ్ఞులైన వైద్యులు ఇచ్చే ఉపన్యాసాలు, ప్రజెంటేషన్లు వైద్య విద్యార్థులకు, సహ వైద్యులకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. వైద్యులు రోగులకు చికిత్స అందించడంతో తమ బాధ్యతను సరిపెట్టుకోకుండా, ఆయా రోగాలు రాకుండా ఉండేందుకు వారి జీవన శైలిలో చేసుకోవాల్సిన మార్పులపై అవగాహన కల్పించాలన్నారు. సదస్సుకు సంబంధించిన సావనీర్‌ను వీసీతో పాటు ప్రముఖ ఫిజీషియన్లు మురుగనాథన్, నర్సింహం, సహాయ్, రామకృష్ణారెడ్డి, మనోహర్, కరుణాకర్ ఆవిష్కరించారు. సమావేశంలో నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ కందగట్ల మనోహర్‌ను సన్మానించారు. కార్యక్రమంలో వరంగల్ ఫిజీషియన్ల చాప్టర్ అధ్యక్షుడు వి.చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి పవన్, కోశాధికారి జి.చంద్రశేఖర్, వైద్యులు బాలాజీ, హేమంత్, రాకేశ్‌తో పాటు సుమారు 500 మంది ఫిజీషియన్లు పాల్గొన్నారు.