కేన్సర్ కణుతులను లక్ష్యంగా చేసుకుని పనిచేసే మందులు ఇప్పటికే బోలెడున్నాయి. వీటన్నింటితో ప్రయోజనం మాత్రం చాలా తక్కువ. దక్షిణ కొరియాకు చెందిన ఉల్సాన్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధనలు పూర్తిస్థాయిలో విజయవంతమైతే మాత్రం ఈ పరిస్థితి మారిపోతుంది. మందుల ప్రభావం పది రెట్లు పెరగడమే కాకుండా.. దుష్ప్రభావాలు కూడా గణనీయంగా తగ్గనున్నాయి. ఇప్పటివరకు ఉపయోగిస్తున్న మందులు కేన్సర్ కణితిని చేరే లోపు బోలెడన్ని ప్రొటీన్లు వాటికి అతుక్కుపోవడం వల్ల ప్రభావం తక్కువగా ఉందని చాలాకాలం క్రితమే గుర్తించారు.
ఈ సమస్యను అధిగమించేందుకు కొరియా శాస్త్రవేత్తలు మందులపై ప్రత్యేకమైన ప్రొటీన్ పూత పూశారు. ఇది ఒంటరిగానే పనిచేస్తుంటుంది. నానోస్థాయి మందులపై ప్రొటీన్ పూత పూసి తాము ముందుగా కంప్యూటర్ లో సిములేట్ చేశామని రోగ నిరోధక వ్యవస్థ కళ్లుగప్పి మరీ ఇవి కణితిపై దాడిచేయగలిగాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త హ్యోయుంగ్ రో తెలిపారు. ఎలుకలపై జరిగిన ప్రయోగాల్లోనూ తాము సానుకూల ఫలితాలు రాబట్టగలిగామని, ఈ పద్ధతిని కేవలం కేన్సర్‌కు మాత్రమే కాకుండా వేర్వేరు వ్యాధుల నిర్ధారణ, చికిత్సలకు ఉపయోగించవచ్చునని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment