ప్రిస్కిప్షన్‌లో సైడ్‌ఎఫెక్ట్స్‌పై సుప్రీం స్పష్టీకరణ
న్యూఢిల్లీ: ఆయా ఔషధాల సైడ్‌ఎఫెక్ట్‌లనూ మందుల చీటీలో పేర్కొనేలా వైద్యులను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. జాకబ్ వడక్కన్‌చెరీ అనే వ్యక్తి తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఈ పిటిషన్‌ను దాఖలుచేశారు. ‘‘రోగులకు వైద్యులు సూచించిన ఔషధం గురించి, దాని సానుకూల ప్రభావంతోపాటు దుష్ప్రభావాలపైనా అవగాహన ఉండాలి.
ఆ మేరకు వైద్యులు మందుల చీటీలో వాటిని తప్పకుండా ప్రస్తావించాలి’అంటూ జాకబ్ వేసిన పిటిషన్‌ను మే 15వ తేదీన ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. దీంతో తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును గురువారం జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. ‘‘ప్రతి చీటీపై ప్రతి ఒక్క మందు సైడ్‌ఎఫెక్ట్‌లను రాయడం ఆచరణలో సాధ్యంకాదు. ఒకవేళ రాస్తూపోతే వైద్యుడు ఒకరోజుకు పది, పదిహేను మందికి మించి చూడలేదు.
చివరకు వినియోగదారుల పరిరక్షణ చట్టం కింద కేసులు నమోదయ్యే ఛాన్సుంది ’’అని ధర్మాసనం అభిప్రాయపడింది. దీనిపై ప్రశాంత్ భూషణ్ వాదించారు. ‘‘దుష్ప్రభావాలపై ముందే హెచ్చరిస్తే మంచిది. లేదంటే అవన్నీ వైద్యసేవల్లో నిర్లక్ష్యం లెక్కలోకి వెళ్తాయి. ముందుగా వైద్యులు తమ వద్ద ఉదాహరణలతో కూడిన నమూనాపత్రాన్ని ఉంచుకుంటే మంచింది’అని వాదించారు. ‘‘అలా చేస్తే దాని విపరిణామాలు పెద్దవై చివరకు వైద్యులకు కన్జూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కష్టాలు పెరుగుతాయి. మేం అలా చేయలేం’’అంటూ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది.
Comments
Please login to add a commentAdd a comment