Consumer Protection Act
-
Supreme Court: దుష్ప్రభావాలు రాయడం కుదరదు
న్యూఢిల్లీ: ఆయా ఔషధాల సైడ్ఎఫెక్ట్లనూ మందుల చీటీలో పేర్కొనేలా వైద్యులను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. జాకబ్ వడక్కన్‌చెరీ అనే వ్యక్తి తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఈ పిటిషన్‌ను దాఖలుచేశారు. ‘‘రోగులకు వైద్యులు సూచించిన ఔషధం గురించి, దాని సానుకూల ప్రభావంతోపాటు దుష్ప్రభావాలపైనా అవగాహన ఉండాలి. ఆ మేరకు వైద్యులు మందుల చీటీలో వాటిని తప్పకుండా ప్రస్తావించాలి’అంటూ జాకబ్ వేసిన పిటిషన్‌ను మే 15వ తేదీన ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. దీంతో తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును గురువారం జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. ‘‘ప్రతి చీటీపై ప్రతి ఒక్క మందు సైడ్ఎఫెక్ట్లను రాయడం ఆచరణలో సాధ్యంకాదు. ఒకవేళ రాస్తూపోతే వైద్యుడు ఒకరోజుకు పది, పదిహేను మందికి మించి చూడలేదు. చివరకు వినియోగదారుల పరిరక్షణ చట్టం కింద కేసులు నమోదయ్యే ఛాన్సుంది ’’అని ధర్మాసనం అభిప్రాయపడింది. దీనిపై ప్రశాంత్ భూషణ్ వాదించారు. ‘‘దుష్ప్రభావాలపై ముందే హెచ్చరిస్తే మంచిది. లేదంటే అవన్నీ వైద్యసేవల్లో నిర్లక్ష్యం లెక్కలోకి వెళ్తాయి. ముందుగా వైద్యులు తమ వద్ద ఉదాహరణలతో కూడిన నమూనాపత్రాన్ని ఉంచుకుంటే మంచింది’అని వాదించారు. ‘‘అలా చేస్తే దాని విపరిణామాలు పెద్దవై చివరకు వైద్యులకు కన్జూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కష్టాలు పెరుగుతాయి. మేం అలా చేయలేం’’అంటూ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. -
వస్తువులు కొని మోసపోతున్నారా? ఇలా పరిహారం రాబట్టుకోండి
వేలకు వేలు పోసి వస్తువులు కొన్నప్పుడు, సేవల్ని ఉపయోగించుకునే సందర్భాల్లో మోసపోయి చాలా మంది లబోదిబోమంటారు. అంతే తప్ప న్యాయం దిశగా ప్రయత్నించరు. దారి తెలియకపోవడమో లేదంటే ఎందుకులే? అనుకునే ధోరణినే అందుకు కారణం కావొచ్చు. అయితే ఇలాంటి సందర్భాల్లో న్యాయాన్ని అందించేందుకు వినియోగదారుల ఫోరాలు ఉంటాయని గుర్తించాలి. గుండు సూది నుంచి విమాన ప్రయాణం వరకు.. ఏం కొన్నా.. ఎంత ఖర్చు చేసినా వాళ్లు వినియోగదారులే(Consumer) అవుతారు. కొన్న వస్తువు నాణ్యంగా లేకపోయినా, సేవలు ప్రమాణాలకు తగ్గట్లుగా లేకపోయినా నష్టపోయేది ఆ వినియోగదారుడే. ఉదాహరణకు.. ఒక వ్యక్తి షాపుకెళ్లి ఆయిల్ ప్యాకెట్ కొంటాడు. ఎక్స్పైరీ డేట్ కంటే ముందే ఆ ఆయిల్ ప్యాకెట్ పాడైపోతుంది. అలాంటప్పుడు మోసపోయానని బాధపడుతూ ఉండిపోనక్కర్లేదు. ఈరోజుల్లో తినే ఆహారం నుంచి వేసుకునే దుస్తులు, తొడుక్కునే చెప్పులు అన్నీ కల్తీ, నకిలీలతో వినియోగదారుడు మోసపోతూనే ఉన్నాడు. ఇక డబ్బు నష్టపోవడం మాట దేవుడెరుగు... మానసికంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు కూడా. జరిగిన నష్టాన్ని చూస్తూ భరించాల్సిన అవసరం వినియోగదారుడికి అస్సలు లేదు. వీటికి అడ్డుకట్ట వేయాలంటే తమ హక్కులను గుర్తించి రక్షణ పొందొచ్చు. చట్టం ఏం చెప్తోందంటే.. వినియోగదారుల రక్షణ కోసం ప్రత్యేకంగా వినియోగదారుల చట్టం (The Consumer Protection Act) ఉంది. వస్తువులు, సేవల నాణ్యత, సామర్థ్యం, స్వచ్ఛత, ధర, ప్రమాణం.. సంబంధించి సమాచారం ఇందులో ఉంటుంది. అంతేకాదు నష్టపరిహారం పొందే హక్కునూ ఈ చట్టమే కల్పిస్తోంది. ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థల నుంచి పొందే సేవలన్నీ వినియోగదారుల చట్టం పరిధిలోకి వస్తాయి. ఒప్పందం ప్రకారం సేవ చేయకపోయినా, వస్తువు నాణ్యతలో లోపం ఉన్నా, చట్ట ప్రకారం విధులు నిర్వర్తించకపోయినా వినియోగదారుడు ఈ చట్టం ప్రకారం కోర్టులను(ఫోరం) ఆశ్రయించొచ్చు. అయితే ఉచితంగా పొందే సర్వీసులు ఈ చట్టం పరిధిలోకి రావు. వినియోగదారుడికి రక్షణగా వినియోగదారుల సంఘాలు, తూనికల కొలతల శాఖ, ఆహార కలుషిత నియంత్రణ తదితర విభాగాలు ఏర్పాటయ్యాయి. వినియోగదారుడు నష్టపోయినప్పుడు ఈ విభాగాలను సమర్థంగా వినియోగించుకుంటే నష్టపరిహారం పొందొచ్చు. అదే సమయంలో వ్యాపారుల బాధ్యతలను కూడా వినియోగదారుల చట్టం వివరిస్తుంది. వినియోగదారుల హక్కులు.. ► ఎంపిక : వస్తువులను లేదా సేవలను వినియోగదారులు తమకు అందుబాటు ధరలో ఉండి.. నచ్చితేనే ఎంచుకునే హక్కు ఉంటుంది. బలవంతంగా వినియోగదారుడికి అంటగట్టే ప్రయత్నం నేరమే అవుతుంది. ► భద్రత: ఈ హక్కు ప్రకారం సంస్థలు నాణ్యమైన వస్తువులు, సేవలను వినియోగదారుడికి అందించాలి. వినియోగదారుడు కొనే వస్తువులు, పొందే సేవలు దీర్ఘకాలం మన్నికలా ఉండాలి. అవి వినియోగదారులు ఆస్తులకు నష్టం కలిగించకూడదు. అయితే నాణ్యతను గుర్తించి వస్తువులను, సేవలను కొనుక్కోవాల్సిన బాధ్యత మాత్రం వినియోగదారుడి పైనే ఉంటుంది. ► సమాచారం పొందే హక్కు : కొనే వస్తువు, పొందే సేవల నాణ్యతా ప్రమాణాలు, ధరల గురించి పూర్తి సమాచారం తెలుసుకునే హక్కు వినియోగదారుడికి ఉంది. ఈ విషయంలో ఎలాంటి పరిమితులు విధించడానికి వీల్లేదు. ► న్యాయపోరాటం: వినియోగదారుడు మోసపోయినా లేదా నష్టపోయినా న్యాయస్థానాలను ఆశ్రయించే హక్కు ఉంటుంది. ఇది అన్నింటికన్నా అతిముఖ్యమైన హక్కు. ► అభిప్రాయం వినిపించొచ్చు: వినియోగదారుల వేదికలపై వినియోగదారుడు అభిప్రాయాలు చెప్పేందుకు హక్కు ఉంది. అంతేకాదు ప్రత్యేకంగా వినియోగదారుల సంఘాలను ఏర్పరుచుకునేందుకు కూడా హక్కు ఉంది. అయితే ఆ సంఘాలకు రాజకీయాలు, వ్యాపారాలతో ఎలాంటి సంబంధం ఉండకూడదు. ఫోరాలు మన కోసమే... వినియోగదారుల చట్టం కింద నష్టపోయిన వ్యక్తికి న్యాయం చేసేందుకు మూడంచెల వ్యవస్థలో ఫోరాలు ఏర్పాటయ్యాయి. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో వినియోగదారుల ఫోరాలు ఉన్నాయి. జిల్లా స్థాయిలో డీసీడీఆర్‌ఎఫ్(జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కృత ఫోరం).. ఇక్కడ రూ.20 లక్షలలోపు పరిహారం కోసం కేసు వేయొచ్చు. రూ.20లక్షల నుంచి రూ.కోటిలోపు పరిహారం అయితే హైకోర్టులో పరిధిలో ఉండే ఎస్సీడీఆర్సీ(రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కృత కమిషన్) కేసు దాఖలు చేయొచ్చు. కోటి.. ఆ పైన నష్టపరిహారం కోసం ఎన్సీడీఆర్సీ(జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కృత కమిషన్)ను ఆశ్రయించాలి. ఇది సుప్రీం కోర్టు పరిధిలోకి వస్తుంది. ఈ ఫోరాలకు కోర్టులకు ఉండే సాధారణ అధికారాలు ఉంటాయి. కింది స్థాయి ఫోరంలో ఇచ్చిన తీర్పు సంతృప్తి కలిగించకపోతే 30 రోజుల్లోగా పై కోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఫోరంలో కేసు వేయడానికి న్యాయవాది తప్పనిసరి కాదు. వినియోగదారుడే స్వయంగా తనకు జరిగిన నష్టాన్ని ఫోరం ముందు వినిపించొచ్చు. ఫిర్యాదు చేయడానికి ఫీజు మనం కోరే పరిహారాన్ని బట్టి ఉంటుంది. జిల్లా ఫోరం రూ.లక్ష లోపు పరిహారం కోసం: రూ.100 (దారిద్య్రరేఖకు దిగువున ఉన్నవారు ఫీజు చెల్లించక్కర్లేదు) రూ.5లక్షల లోపు: రూ.200 రూ.5 లక్షల నుంచి రూ.10లక్షలు: రూ.400 రూ.20లక్షల లోపు: రూ.500 రాష్ట్ర ఫోరం రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల లోపు:. రూ.2,000 ఫీజు రూ.50 లక్షల నుంచి రూ.కోటి లోపు:. రూ.4,000 ఫీజు జాతీయ ఫోరం రూ.కోటి.. ఆపైన: రూ.5,000 ఫీజు చెల్లించాలి. ఫీజు సొమ్మును డీడీ లేదంటే పోస్టల్ ఆర్డర్ ద్వారా చెల్లించే అవకాశం ఉంటుంది. కేసు గెలిస్తే బాధితుడికి పరిహారంతోపాటు ప్రయాణ ఛార్జీలు, ఇతర ఖర్చులు కూడా చెల్లించాలని కోర్టు ఆదేశించే అవకాశం ఉంది. ఇలా చెయ్యాలి ఫిర్యాదు చేసే ముందు అవతలి పార్టీకి సమాచారం ఇవ్వాలి. వినియోగదారుడు తనకు జరిగిన నష్టాన్ని, సేవా లోపాలను నోటీసులో స్పష్టంగా పేర్కొనాలి. ఎలాంటి పరిష్కారం, ఎన్ని రోజుల్లో కోరుకుంటున్నారో అనే విషయాలను తెలియజేయాలి. స్పందన కోసం కనీసం 30 రోజులు ఎదురు చూడటం మంచిది. ఎలాంటి స్పందన లేకపోతే అప్పుడు ఫోరాల్లో ఫిర్యాదు చేయాలి. అన్నింటికన్నా ముఖ్య విషయం సమస్య ఏర్పడిన రెండేళ్లలోగా వినియోగదారుడు ఫిర్యాదు చేయాలి. ముందుగా ఏ కంపెనీ, ఎలాంటి సేవలపై ఫిర్యాదు చేస్తున్నాం.. ఎలాంటి ఇబ్బదులు ఎదుర్కొన్నారు.. ఏం పరిహారం కావాలనుకుంటున్నారు వివరాలను ఒక తెల్లకాగితంపై రాయాలి. దీనికి ఒక అఫిడవిట్ జత చేయాలి. సంబంధిత ధ్రువపత్రాలు అంటే.. బిల్లులు, ఒప్పంద పత్రాలు దానికి జత చేయాలి. అన్ని పత్రాలను జిరాక్స్ కాపీల రూపంలోనే సమర్పించాలి. ఆ తర్వాత నిర్ణీత రుసుం చెల్లించి కేసు దాఖలు చేయాలి. ఫోరంలో ఫిర్యాదు దాఖలు చేయడానికి కావాలంటే అక్కడే ఉండే హెల్ప్ డెస్క్ సహకారం కూడా తీసుకోవచ్చు. స్వయంగానూ లేదా ప్రతినిధి లేదా వకీలు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారానూ ఫిర్యాదు పంపవచ్చు. తమకు తీరిక లేకుండా తమ తరఫున ఓ వ్యక్తిని ప్రతినిధిగా పంపాలనుకుంటే అథరైజేషన్ లెటర్ ఇవ్వాలి. వినియోగదారుడు ఫోరంను ఆశ్రయించిన తర్వాత 90 రోజుల్లోపు కేసును పూర్తిచేయాలనేది వినియోగదారుల చట్టంలోని నిబంధన. ఫిర్యాదు సబబు అని అభిప్రాయపడితే వినియోగదారుడికి నష్టపరిహారం చెల్లించాలని ఫోరం ఆదేశిస్తుంది. బిల్లు ఉంటే.. ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలని యాడ్లలో తరచూ చూస్తుంటాం. కొన్ని వస్తువుల విషయంలో గ్యారెంటీ, వారెంటీ కార్డులను షాపు యజమాని సంతకం, ముద్రతో సహా తీసుకోవాలి. చిన్న చిన్న వస్తువులను మినహాయిస్తే సాధ్యమైనంత వరకు బిల్లులను అడిగి తీసుకోవడం మంచిది. సమస్య తలెత్తినప్పుడు వినియోగదారుల ఫోరంలో సమర్పించడానికి ఇవి ఉపయోగపడతాయి. :::సాక్షి, వెబ్‌స్పెషల్ -
ప్రభుత్వానికి ట్రిబ్యునళ్లతో పని లేదా?
న్యూఢిల్లీ: వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌లో రాష్ట్ర, జిల్లా స్థాయి నియామకాల్లో జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వానికి ట్రబ్యునళ్ల అవసరం లేదనుకుంటే వినియోగదారుల పరిరక్షణ చట్టాన్ని రద్దు చేయాలంది. ట్రబ్యునళ్లలో ఖాళీలపై అత్యున్నత న్యాయస్థానం దృష్టి పెట్టాల్సి రావడం అత్యంత దురదృష్టకరమని జస్టిస్ ఎస్కే కాల్, ఎంఎం సుందరేష్‌ల ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇలాంటి విషయాల్లో కోర్టు తన విలువైన సమయాన్ని వెచ్చించే పరిస్థితులు రావడం అంత మంచిది కాదని కేంద్రానికి హితవు పలికింది. వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌లో రాష్ట్ర, జిల్లా స్థాయిలో అధ్యక్షుడు, ఇతర సభ్యుల నియామకం జరగకపోవడం, ట్రిబ్యునల్స్‌లో కనీస మౌలిక వసతుల కల్పన లేకపోవడంతో సుప్రీంకోర్టు ఈ అంశాన్ని సూమోటోగా స్వీకరించి విచారించింది. వినియోగదారుల హక్కుల్ని కాపాడడానికి శాశ్వత న్యాయస్థానాలను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయని అభిప్రాయపడింది. ‘కమ్యూనిటీ కిచెన్ల’పై విచారణకు సుప్రీం ఓకే దేశంలో ఆకలి కేకల నిర్మూలన కోసం కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుకు సంబంధించిన పథకాన్ని ప్రవేశపెట్టేలా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. కరోనా మహమ్మారి వ్యాప్తితో ఆరోగ్య, ఆర్థిక రంగాలు అతలాకుతలమవుతున్న నేపథ్యంలో కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేయడం చాలా అవసరమని లాయర్ అషిమా మండ్లా చేసిన విజ్ఞప్తిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం స్వీకరించింది. దీనిపై 27న విచారణ చేపడతామని తెలిపింది. -
అమ్మేది ఎవరో తెలియాల్సిందే.. సీసీపీఏ ఆదేశాలు
న్యూఢిల్లీ:ప్యాకింగ్‌పై విక్రేతల పేరు, చిరునామా, ఫిర్యాదుల పరిష్కార అధికారి నంబర్‌ను స్పష్టంగా, అందుబాటులో ఉండే పద్ధతిలో ఈ–కామర్స్ సంస్థలు ప్రదర్శించాల్సిందేనని సెంట్రల్ కంజ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) స్పష్టం చేసింది. ఈ మేరకు సీసీపీఏ అన్ని రాష్ట్రాలు, పారిశ్రామిక సంఘాలకు సమాచారమిచ్చింది. వినియోగదార్ల రక్షణ (ఈ–కామర్స్) నిబంధనలు–2020 ప్రకారం విక్రేతల వివరాలు పొందుపర్చడం లేదంటూ ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో సీసీపీఏ స్పందించింది. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టం కింద చర్య తీసుకుంటామని సీసీపీఏ కమిషనర్ అనుపమ్ మిశ్రా తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్–జూలైలో దేశవ్యాప్తంగా నేషనల్ కంజ్యూమర్ హెల్ప్‌లైన్‌కు ఈ–కామర్స్ కంపెనీల మీద 69,208 ఫిర్యాదులు అందాయి. బ్యాంకింగ్, టెలికం రంగాలతో పోలిస్తే ఇవే అధికం. -
కొత్త చట్టం.. ఇక సెలబ్రిటీలకు కష్టమే!
-
కొత్త చట్టం.. ఇక సెలబ్రిటీలకు కష్టమే!
సాక్షి, న్యూఢిల్లీ : వినియోగదారు రక్షణ చట్టం 2017కు ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. యాడ్ కంపెనీలు చేసే తప్పుడు ప్రచారాల వల్ల మోసపోయే వినియోగదారుల హక్కుల పరిరక్షణకై చట్టానికి సవరణలు చేసిన విషయం తెలిసిందే. గతంలోనే (ఆగష్టు 2015లో) కేంద్రం లోక్‌సభలో ఓ బిల్లును ప్రవేశపెట్టింది. తాజాగా కొన్ని సవరణలు తెరపైకి రావటంతో దాని స్థానంలో కొత్త బిల్లును రూపొందించింది. ఈ మేరకు నూతన వినియోగదారుల సంరక్షణ బిల్లు-2017కు ఆమోదం తెలిపింది. తద్వారా వినియోగదారు రక్షణ చట్టం-1986కి 30 ఏళ్ల తర్వాత కొత్తది తీసుకొచ్చినట్లయ్యింది. ఇక వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం కేంద్ర వినియోగదారుల సంరక్షణ సంస్థను ఏర్పాటు చేయబోతున్నారు. తాజా చట్టంలో శిక్షలను కూడా చేర్చారు. సెలబ్రిటీలు నటించిది తప్పుడు ప్రకటన అని తేలితే తొలిసారి 10 లక్షల రూపాయల ఫైన్‌తో, మరియు ఏడాదిపాటు ఎలాంటి ఎండోర్స్మెంట్ చేయకుండా నిషేధిస్తారు. రెండోసారి కూడా అదే పని చేస్తే.. 50 లక్షల రూపాయల ఫైన్.. మూడేళ్ల బ్యాన్ పడుతుంది. ఇక కంపెనీలకు కూడా శిక్షలు ఉన్నాయి. మొదటిసారికి గానూ 10 లక్షల రూపాయల ఫైన్.. రెండేళ్ల జైలు శిక్ష. రెండోసారస్కి 50 లక్షల ఫైన్‌తోపాటు ఐదేళ్ల శిక్ష విధిస్తారు. వీటితోపాటు నష్టపరిహారం అంశాన్ని ఆయా కేసుల తీవ్రతను బట్టి పరిశీలిస్తారు. జనాల్లో సినీ, క్రీడా సెలబ్రిటీలకు ఉన్న క్రేజ్‌ను వాడుకుని పలు సంస్థలు యాడ్లు రూపొందిస్తున్న విషయం తెలిసిందే. తద్వారా వారు రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఒకానోక సమయంలో ఫ్రోఫెషనల్‌గా కంటే ఇలా ఎండోర్స్‌మెంట్లతోనే వారికి వచ్చే ఆదాయం ఎక్కువ. అయితే ప్రజలను మభ్యపెట్టే తప్పుడు ప్రకటనల్లో సెలబ్రిటీలు నటించడం సరికాదన్న వాదన గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారింది. తాజా చట్టంతో దానికి బ్రేక్ పడనుంది. -
వినియోగదారుల చట్టం పరిధిలోకి మార్కెట్ కమిటీలు
ఏపీ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ తీర్పు సాక్షి, హైదరాబాద్: కొనుగోలుదారులు, రైతుల నుంచి రుసుము వసూలు చేసి సేవలందిస్తున్న వ్యవసాయ మార్కెట్ కమిటీలు వినియోగదారుల పరిరక్షణ చట్టం పరిధిలోకి వస్తాయని ఏపీ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ తేల్చి చెప్పింది. సౌకర్యాలేవీ ఉచితంగా కల్పించడంలేదని, క్విడ్‌ప్రోకో తరహాలో సేవలకు ఫీజు వసూలు చేస్తున్న నేపథ్యంలో కమిటీలు ఈ చట్టపరిధి లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఏపీ మార్కెట్ చట్టం (వ్యవసాయ ఉత్పత్తులు, పశు సంపద)లోని సెక్షన్ 14 కింద వసూలైన ఫీజు సొమ్మును మార్కెట్ కమిటీ ఫండ్‌కు జమ చేయాలన్నారు. సెక్షన్ 15 ప్రకారం మార్కెట్ ఏర్పాటుకు భూమి కొనుగోలు, నిర్మాణాలు, నిర్వహణ సహా ఇతర సౌకర్యాల కల్పనకు కమిటీ ఫండ్ నుంచే డబ్బును ఖర్చు చేయాలన్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్ కమిటీలు వినియోగదారుల రక్షణ చట్టం పరిధిలోకి వస్తాయన్నారు. ఈ మేరకు కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ నౌషద్ అలీ బుధవారం తీర్పునిచ్చారు. అప్పీలు కొట్టివేస్తూ తీర్పు... తమకు వినియోగదారుల రక్షణ చట్టం వర్తించదంటూ కృష్ణా జిల్లా మార్కెటింగ్ రీజినల్ డైరెక్టర్, గుంటూరు సహాయ డైరెక్టర్, తెనాలి మార్కెట్ కమిటీ సెలక్షన్ గ్రేడ్ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.