వస్తువులు కొని మోసపోతున్నారా? ఇలా పరిహారం రాబట్టుకోండి | How To Complaint In Consumer Forum Check Details Telugu | Sakshi
Sakshi News home page

వస్తువులు కొని మోసపోతున్నారా? అయితే లాభసాటి పరిహారం ఇలా రాబట్టుకోండి

Published Mon, Jan 17 2022 8:15 PM | Last Updated on Tue, Jan 18 2022 8:05 AM

How To Complaint In Consumer Forum Check Details Telugu - Sakshi

వేలకు వేలు పోసి వస్తువులు కొన్నప్పుడు, సేవల్ని ఉపయోగించుకునే సందర్భాల్లో మోసపోయి చాలా మంది లబోదిబోమంటారు. అంతే తప్ప న్యాయం దిశగా ప్రయత్నించరు. దారి తెలియకపోవడమో లేదంటే ఎందుకులే? అనుకునే ధోరణినే అందుకు కారణం కావొచ్చు. అయితే ఇలాంటి సందర్భాల్లో న్యాయాన్ని అందించేందుకు వినియోగదారుల ఫోరాలు ఉంటాయని గుర్తించాలి.


గుండు సూది నుంచి విమాన ప్రయాణం వరకు.. ఏం కొన్నా.. ఎంత ఖర్చు చేసినా వాళ్లు వినియోగదారులే(Consumer) అవుతారు. కొన్న వస్తువు నాణ్యంగా లేకపోయినా, సేవలు ప్రమాణాలకు తగ్గట్లుగా లేకపోయినా నష్టపోయేది ఆ వినియోగదారుడే. ఉదాహరణకు.. ఒక వ్యక్తి షాపుకెళ్లి ఆయిల్‌ ప్యాకెట్‌ కొంటాడు. ఎక్స్‌పైరీ డేట్ కంటే ముందే ఆ ఆయిల్‌ ప్యాకెట్‌ పాడైపోతుంది. అలాంటప్పుడు మోసపోయానని బాధపడుతూ ఉండిపోనక్కర్లేదు. ఈరోజుల్లో తినే ఆహారం నుంచి వేసుకునే దుస్తులు, తొడుక్కునే చెప్పులు అన్నీ కల్తీ, నకిలీలతో వినియోగదారుడు మోసపోతూనే ఉన్నాడు. ఇక డబ్బు నష్టపోవడం మాట దేవుడెరుగు... మానసికంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు కూడా. జరిగిన నష్టాన్ని చూస్తూ భరించాల్సిన అవసరం వినియోగదారుడికి అస్సలు లేదు. వీటికి అడ్డుకట్ట వేయాలంటే తమ హక్కులను గుర్తించి ర‌క్షణ పొందొచ్చు. 


చట్టం ఏం చెప్తోందంటే..
వినియోగ‌దారుల రక్షణ కోసం ప్రత్యేకంగా వినియోగ‌దారుల చ‌ట్టం (The Consumer Protection Act) ఉంది. వస్తువులు, సేవల నాణ్యత, సామర్థ్యం, స్వచ్ఛత, ధర, ప్రమాణం.. సంబంధించి సమాచారం ఇందులో ఉంటుంది. అంతేకాదు న‌ష్టప‌రిహారం పొందే హ‌క్కునూ ఈ చ‌ట్టమే క‌ల్పిస్తోంది. ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థల నుంచి పొందే సేవ‌ల‌న్నీ  వినియోగదారుల చట్టం పరిధిలోకి వ‌స్తాయి.
 

ఒప్పందం ప్రకారం సేవ చేయకపోయినా, వస్తువు నాణ్యతలో లోపం ఉన్నా, చట్ట ప్రకారం విధులు నిర్వర్తించ‌క‌పోయినా వినియోగదారుడు ఈ చ‌ట్టం ప్రకారం కోర్టులను(ఫోరం) ఆశ్రయించొచ్చు. అయితే   ఉచితంగా పొందే సర్వీసులు ఈ చట్టం పరిధిలోకి రావు.  వినియోగదారుడికి రక్షణగా వినియోగ‌దారుల సంఘాలు, తూనికల కొలతల శాఖ, ఆహార కలుషిత నియంత్రణ తదితర విభాగాలు ఏర్పాటయ్యాయి. వినియోగదారుడు నష్టపోయినప్పుడు ఈ విభాగాలను స‌మ‌ర్థంగా వినియోగించుకుంటే నష్టప‌రిహారం పొందొచ్చు. అదే సమయంలో వ్యాపారుల బాధ్యతలను కూడా వినియోగదారుల చట్టం వివరిస్తుంది. 

వినియోగదారుల హక్కులు..

► ఎంపిక : వస్తువులను లేదా సేవలను వినియోగదారులు తమకు అందుబాటు ధరలో ఉండి.. నచ్చితేనే ఎంచుకునే హక్కు ఉంటుంది. బలవంతంగా వినియోగదారుడికి అంటగట్టే ప్రయత్నం నేరమే అవుతుంది. 

భద్రత: ఈ హక్కు ప్రకారం సంస్థలు నాణ్యమైన వస్తువులు, సేవలను వినియోగదారుడికి అందించాలి. వినియోగదారుడు కొనే వస్తువులు, పొందే సేవలు దీర్ఘకాలం మన్నికలా ఉండాలి. అవి వినియోగదారులు ఆస్తులకు నష్టం కలిగించకూడదు. అయితే నాణ్యతను గుర్తించి వస్తువులను, సేవలను కొనుక్కోవాల్సిన బాధ్యత మాత్రం వినియోగదారుడి పైనే ఉంటుంది. 

 సమాచారం పొందే హక్కు : కొనే వస్తువు, పొందే సేవల నాణ్యతా ప్రమాణాలు, ధరల గురించి పూర్తి సమాచారం తెలుసుకునే హక్కు వినియోగదారుడికి ఉంది. ఈ విషయంలో ఎలాంటి పరిమితులు విధించడానికి వీల్లేదు. 

 న్యాయపోరాటం: వినియోగదారుడు మోసపోయినా లేదా నష్టపోయినా న్యాయస్థానాలను ఆశ్రయించే హక్కు ఉంటుంది. ఇది అన్నింటికన్నా అతిముఖ్యమైన హక్కు.  

అభిప్రాయం వినిపించొచ్చు: వినియోగదారుల వేదికలపై వినియోగదారుడు అభిప్రాయాలు చెప్పేందుకు హక్కు ఉంది. అంతేకాదు ప్రత్యేకంగా వినియోగదారుల సంఘాలను ఏర్పరుచుకునేందుకు కూడా హక్కు ఉంది. అయితే ఆ సంఘాలకు రాజకీయాలు, వ్యాపారాలతో ఎలాంటి సంబంధం ఉండకూడదు. 


ఫోరాలు మన కోసమే... 
వినియోగ‌దారుల చ‌ట్టం కింద నష్టపోయిన వ్యక్తికి న్యాయం చేసేందుకు మూడంచెల వ్యవస్థలో ఫోరాలు ఏర్పాటయ్యాయి. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో వినియోగదారుల ఫోరాలు ఉన్నాయి. జిల్లా స్థాయిలో డీసీడీఆర్‌ఎఫ్‌(జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కృత ఫోరం).. ఇక్కడ రూ.20 లక్షలలోపు పరిహారం కోసం కేసు వేయొచ్చు. రూ.20లక్షల నుంచి రూ.కోటిలోపు ప‌రిహారం అయితే హైకోర్టులో పరిధిలో ఉండే ఎస్‌సీడీఆర్‌సీ(రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కృత కమిషన్‌) కేసు దాఖలు చేయొచ్చు. కోటి.. ఆ పైన నష్టపరిహారం కోసం ఎన్‌సీడీఆర్‌సీ(జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కృత కమిషన్‌)ను ఆశ్రయించాలి. ఇది సుప్రీం కోర్టు పరిధిలోకి వస్తుంది. ఈ ఫోరాలకు కోర్టులకు ఉండే సాధారణ అధికారాలు ఉంటాయి. కింది స్థాయి ఫోరంలో ఇచ్చిన తీర్పు సంతృప్తి కలిగించకపోతే 30 రోజుల్లోగా పై కోర్టులో అప్పీల్‌ చేసుకునే అవకాశం ఉంది. మ‌రో ముఖ్యమైన విష‌యం ఏమిటంటే.. ఫోరంలో కేసు వేయ‌డానికి న్యాయవాది తప్పనిసరి కాదు. వినియోగదారుడే స్వయంగా తనకు జరిగిన నష్టాన్ని ఫోరం ముందు వినిపించొచ్చు. ఫిర్యాదు చేయడానికి ఫీజు మ‌నం కోరే ప‌రిహారాన్ని బ‌ట్టి ఉంటుంది.

జిల్లా ఫోరం  

  • రూ.ల‌క్ష లోపు ప‌రిహారం కోసం:  రూ.100 
  • (దారిద్య్రరేఖకు దిగువున ఉన్నవారు ఫీజు చెల్లించక్కర్లేదు) రూ.5లక్షల లోపు:  రూ.200
  • రూ.5 ల‌క్షల నుంచి రూ.10లక్షలు: రూ.400
  • రూ.20లక్షల లోపు: రూ.500

రాష్ట్ర ఫోరం 

  • రూ.20 ల‌క్షల నుంచి రూ.50 ల‌క్షల లోపు:. రూ.2,000 ఫీజు
  • రూ.50 ల‌క్షల నుంచి రూ.కోటి లోపు:. రూ.4,000 ఫీజు

జాతీయ ఫోరం

రూ.కోటి.. ఆపైన‌: రూ.5,000 ఫీజు చెల్లించాలి.  

ఫీజు సొమ్మును డీడీ లేదంటే పోస్టల్ ఆర్డర్ ద్వారా చెల్లించే అవకాశం ఉంటుంది. కేసు గెలిస్తే బాధితుడికి ప‌రిహారంతోపాటు ప్రయాణ ఛార్జీలు, ఇత‌ర ఖ‌ర్చులు కూడా చెల్లించాల‌ని కోర్టు ఆదేశించే అవకాశం ఉంది. 

ఇలా చెయ్యాలి
ఫిర్యాదు చేసే ముందు అవతలి పార్టీకి సమాచారం ఇవ్వాలి. వినియోగదారుడు తనకు జరిగిన నష్టాన్ని, సేవా లోపాలను నోటీసులో స్పష్టంగా పేర్కొనాలి. ఎలాంటి పరిష్కారం, ఎన్ని రోజుల్లో కోరుకుంటున్నారో అనే విషయాలను తెలియజేయాలి. స్పందన కోసం కనీసం 30 రోజులు ఎదురు చూడటం మంచిది. ఎలాంటి స్పందన లేకపోతే అప్పుడు ఫోరాల్లో ఫిర్యాదు చేయాలి.  అన్నింటికన్నా ముఖ్య విషయం స‌మస్య ఏర్పడిన రెండేళ్లలోగా వినియోగదారుడు ఫిర్యాదు చేయాలి. ముందుగా ఏ కంపెనీ, ఎలాంటి సేవ‌ల‌పై ఫిర్యాదు చేస్తున్నాం.. ఎలాంటి ఇబ్బదులు ఎదుర్కొన్నారు.. ఏం ప‌రిహారం కావాల‌నుకుంటున్నారు వివరాలను ఒక తెల్లకాగితంపై రాయాలి.  దీనికి ఒక అఫిడ‌విట్ జ‌త‌ చేయాలి. సంబంధిత ధ్రువపత్రాలు అంటే.. బిల్లులు, ఒప్పంద ప‌త్రాలు దానికి జత చేయాలి. అన్ని పత్రాలను జిరాక్స్ కాపీల రూపంలోనే సమర్పించాలి. ఆ త‌ర్వాత నిర్ణీత రుసుం చెల్లించి కేసు దాఖలు చేయాలి. ఫోరంలో ఫిర్యాదు దాఖలు చేయడానికి కావాలంటే అక్కడే ఉండే హెల్ప్ డెస్క్ సహకారం కూడా తీసుకోవచ్చు. స్వయంగానూ లేదా ప్రతినిధి లేదా వకీలు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారానూ ఫిర్యాదు పంపవచ్చు. తమకు తీరిక లేకుండా తమ తరఫున ఓ వ్యక్తిని ప్రతినిధిగా పంపాలనుకుంటే అథరైజేషన్ లెటర్ ఇవ్వాలి. వినియోగదారుడు ఫోరంను ఆశ్రయించిన త‌ర్వాత 90 రోజుల్లోపు కేసును పూర్తిచేయాలనేది వినియోగదారుల చట్టంలోని నిబంధన. ఫిర్యాదు సబబు అని అభిప్రాయపడితే వినియోగదారుడికి నష్టపరిహారం చెల్లించాలని ఫోరం ఆదేశిస్తుంది. 


 
బిల్లు ఉంటే..
ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలని యాడ్‌లలో తరచూ చూస్తుంటాం. కొన్ని వస్తువుల విషయంలో గ్యారెంటీ, వారెంటీ కార్డులను షాపు యజమాని సంతకం, ముద్రతో సహా తీసుకోవాలి. చిన్న చిన్న వస్తువులను మినహాయిస్తే సాధ్యమైనంత వరకు బిల్లులను అడిగి తీసుకోవడం మంచిది. సమస్య తలెత్తినప్పుడు వినియోగదారుల ఫోరంలో సమర్పించడానికి ఇవి ఉపయోగపడతాయి.

:::సాక్షి, వెబ్‌స్పెషల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement