consumer rights
-
చాక్లెట్, కెల్లాగ్స్ చాకోస్‌లో పురుగుల కలకలం! వెంటనే తిరిగిచ్చేయండి!
ఇటీవల ఓ హైదరాబాదీ వ్యక్తి మెట్రో స్టేషన్లో కొనుగోలు చేసిన క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్లో పురుగులు కనిపించిన సంగతి తెలిసిందే. అది మరువక మునుపే కెల్లాగ్స్ చాకోస్ పురుగులు ఘటన వెలుగులోకి వచ్చింది. ఇలా అంతకుమునపు కూడా పలు సందర్భాల్లో ఇలాంటి ఘటనలు వార్తల్లో నిలిచాయి. అయితే ఇలా నాసిరకం వస్తువు కొనుగోలు చేస్తే మొహమాటంతోనే లేక మోసం చేశాడనే ఫీల్‌తోనే సదరు షాపుకి వెళ్లడం మానేస్తాం. కానీ ఇక్కడ అలా చేయొద్దని హెచ్చరిస్తున్నారు నిపుణులు. తక్షణమే ఆ వస్తువుని సదరు షాపు వాడికి ఇచ్చేసి దాని స్థానంలో మరొక వస్తువుని ఉచితంగా తెచ్చుకోవచ్చని చెబుతున్నారు. అలా ఇవ్వనని అంటే టోల్ ఫ్రీ నెంబర్‌కి కాల్ చెయ్యాలి. వస్తువు నాసిరకం అని తేలితే జరిమానా విధించడం లేదా షాప్‌ని సీజ్ చేయడం జరుగుతుంది . ఇంతకీ ఏంటా నంబర్? ఇలాంటి మోసానికి గురికాకుండా విజిలన్స్ అధికారులకు ఎలా ఫిర్యాదు చెయ్యాలి? అతి తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశతో కొందరూ నాసిరకం వస్తువులను అంటగడుతుంటారు. నిజానికి షాపులో కొన్ని వస్తువులు సేల్స్ కాకుండా అలా మిగిలిపోతాయి. వీటిని ఎలాగైన వదిలించుకోవాలనే ఉద్దేశ్యంతో తక్కువ ధరకు లేదా డిస్కౌంట్ ఆఫర్స్ కింద అమ్మేందుకు యత్నిస్తుంటారు. ఇక్కడ కస్టమర్ కూడా తక్కువ ధరకే దొరకుతుందన్న ఆశతో ఆ వస్తువు నాణ్యమైనదా? కాదా? అనేది ఆలోచించకుండా వెంటనే కొనుగోలు చేస్తాడు. అసలు అలా తక్కువ దరకు అమ్ముతున్నారంటే.. ముందుగా ఆ వస్తువు గడువు తేదీ చూడాలి. ఎప్పుడూ తయారు చేశారు, ఎప్పటి వరకు వినియోగించొచ్చు అనే వివరాలను చెక్ చేయాలి. అందులోనూ నిత్యావసర వస్తువులు పరిమిత కాలం వరకే ఉపయోగించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ద్రవ పదార్థాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. కొన్ని వస్తువులు పైకి నాణ్యమైనవిగా కనిపించినా..ఇంటికెళ్లాక నాసిరకంగా కనిపించడం జరుగుతుంది. అలాంటప్పుడూ వెంటనే ఆ వస్తవును కొనుగోలు చేసిన షాపుకే వచ్చి.. తక్షణమే తిరిగి ఇచ్చేయాలి. ఒకవేళ అలా తీసుకునేందుకు ఎవ్వరైనా వెనుకాడితే వెంటనే.. 1800114000 లేదా 1915 నెంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చెయ్యండి. దెబ్బకు విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగి సదరు షాపు యజమానిపై చర్యలు తీసుకుంటారు. ఆ వస్తువు నాసిరకం అని తేలితే మాత్రం ఆ షాపుని సీజ్ చేయడం లేదా జరిమానా విధించడం వంటి చర్యలు తప్పక తీసుకుంటారు. అందువల్ల ఇలా నకిలీ వస్తువులు కొని మోసపోయానని బాధపడొద్దు, వెంటనే తిరిగి ఇచ్చేయండి. దాని స్థానంలో మరొక వస్తువుని ఉచితంగా తెచ్చుకోండి.! (చదవండి: 'కెల్లాగ్స్ చాకోస్'లో పురుగులు..స్పందించిన కంపెనీ..!) -
Data protection: ఆ హామీ వివరాలను ప్రచారం చేయాలి
న్యూఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్ వేదిక వాట్సాప్ తన నూతన గోప్యతా విధానాన్ని అంగీకరించని వినియోగదారులకు కూడా సేవలను కొనసాగిస్తామంటూ 2021లో కేంద్రానికి ఇచ్చిన హామీని ప్రచారం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. డేటా ప్రొటెక్షన్ చట్టంలోని నిబంధనలకు కట్టుబడి ఉంటామంటూ అందులో వాట్సాప్ హామీ ఇచ్చిందని కూడా గుర్తు చేసింది. సంబంధిత హామీ వివరాలను అందరికీ తెలిసేలా ఐదు ప్రధాన పత్రికల్లో రెండు పర్యాయాలు ప్రచురించాలని పేర్కొంది. తదుపరి విచారణను ఏప్రిల్ 11న చేపడతామని తెలిపింది. పిటిషనర్ల తరఫున శ్యామ్ దివాన్ వాదనలు వినిపించారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ విషయంలో వాట్సాప్ విధానాలు యూరప్ దేశాలతో పోలిస్తే భారత్‌లో వేరుగా ఉన్నాయన్నారు. వినియోగదారులు షేర్ చేసుకునే కాల్స్, ఫొటోలు, మెసేజీలు, వీడియోలు, డాక్యుమెంట్ల వివరాలను అందుబాటులో ఉంచేందుకు, వాట్సాప్ తన మాతృసంస్థ ఫేస్‌బుక్‌తో కుదుర్చుకున్న ఒప్పందం వ్యక్తిగత భద్రతకు, వాక్ స్వాతంత్య్రానికి భంగ కరమంటూ కర్మణ్యసింగ్ సరీన్, శ్రేయ సేథి అనే విద్యార్థినులు వేసిన పిటిషన్‌ను బుధవారం జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారించి పైఆదేశాలిచ్చింది. ఈ బెంచ్‌లో జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ సీటీ రవికుమార్ ఉన్నారు. -
ఇష్టంగానా? కష్టంగానా?
ఒకరికి ఖేదం... వేరొకరికి మోదం అంటే ఇదేనేమో! హోటళ్ళు, రెస్టారెంట్లలో తప్పనిసరి సర్వీస్ ఛార్జ్‌పై నిషేధంతో హోటల్ యజమానులు విచారిస్తుంటే, వినియోగదారులు సంతోషిస్తున్నారు. కేంద్ర వినియోగదారుల హక్కుల పరిరక్షణ ప్రాధికార సంస్థ (సీసీపీఏ) సోమవారం జారీ చేసిన మార్గదర్శకాలతో దేశవ్యాప్తంగా ఆతిథ్యరంగంలో ఇదే పరిస్థితి. సేవా రుసుము (సామాన్య భాషలో టిప్స్) చెల్లించడం స్వచ్ఛందమే తప్ప తప్పనిసరి కాదనీ, ఎవరైనా నిర్బంధంగా వసూలు చేస్తుంటే 1915 నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చనీ సీసీపీఏ తేల్చేసింది. ఆతిథ్యరంగ ప్రతినిధులు మాత్రం శ్రామికులకు ఉపకరించే సర్వీస్ ఛార్జ్‌లో చట్టవిరుద్ధమేమీ లేదనీ, దీనిపైన కూడా పన్ను చెల్లిస్తున్నం దున ప్రభుత్వానికి ఆదాయం వస్తోందనీ వాదిస్తున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, తగ్గుతున్న వృద్ధి, కొనుగోలుశక్తి లాంటి సమస్యలుండగా సర్కారు ‘టిప్స్’ అంశంపై దృష్టి పెట్టడం విచిత్రమే. ఇష్టపడి స్వచ్ఛందంగా ‘టిప్స్’ ఇవ్వడం వేరు. తప్పనిసరి అంటూ ముక్కుపిండి వసూలు చేయడం వేరు. ఈ వాదనే ఇప్పుడు హోటళ్ళలో విధిస్తున్న సేవా రుసుమును చర్చనీయాంశం చేసింది. వినియోగదారులు తాము అందుకున్న సేవలకు సంతృప్తి చెంది, ఇష్టంతో ఇవ్వాల్సిన సేవా రుసుమును చాలాచోట్ల బిల్లులో తప్పనిసరి భాగం చేశారు. అయిదేళ్ళ క్రితం దేశమంతటా అమలైన ‘వస్తు, సేవల పన్ను’ దీనికి అదనం. హోటల్లో తిండికి అయిన ఖర్చు మీద 5 నుంచి 15 శాతం దాకా సేవా రుసుమును హోటల్ వారే వేసి, ఆ రెంటినీ కలిపిన మొత్తం మీద ‘వస్తు, సేవల పన్ను’ (జీఎస్టీ) వసూలు చేయడం సరికాదన్నది కొంతకాలంగా వస్తున్న ఫిర్యాదు. తినడానికి అయిన బిల్లు మీద ఎలాగూ సర్కారీ ‘వస్తు, సేవల పన్ను’ వసూలు చేస్తున్నప్పుడు, మళ్ళీ విడిగా హోటల్ వారి ‘సేవా రుసుము’ ఏమిటి? దీని వల్ల ఒకటి రుసుము, మరొకటి పన్ను అంటూ ఒకే సేవకు రెండుసార్లు చెల్లిస్తున్నట్లు అవుతోందనేది ఫిర్యాదీల వాదన. ఆ వాదన తార్కికమే. కానీ, సేవలందించే శ్రామికుడిని మానవీయ కోణంలో చూస్తే సరైనదేనా? హోటళ్ళు అంటున్నదీ అదే! సర్వీస్ ఛార్జ్‌కు చట్టబద్ధత ఏమీ లేకున్నా, బేరర్ శ్రమను గుర్తించి, మానవతా దృక్పథంతో స్వచ్ఛందంగా టిప్ ఇవ్వడం నైతికంగా ధర్మమే. అలాగని కొన్నిసార్లు సేవలు అసంతృప్తికరంగా ఉన్నప్పటికీ, బిల్లులో భాగంగా 10 శాతం తప్పనిసరి ‘సర్వీస్ ఛార్జ్’ను చెల్లించాల్సి వస్తున్న అనుభవాలూ లేకపోలేదు. దీనిపై ఫిర్యాదుల మేరకు కొన్నేళ్ళుగా వినియోగదారుల మంత్రిత్వ శాఖకూ, దేశంలోని 5 లక్షల పైచిలుకు రెస్టారెంట్ల పక్షాన నిలిచే ‘నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ (ఎన్నార్ఏఐ)కీ మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, జీఎస్టీ విధింపు కన్నా ముందే 2017 ఏప్రిల్‌లోనే హోటళ్ళలో సర్వీస్ ఛార్జ్ వసూలుపై మంత్రిత్వ విభాగం మార్గదర్శకాలిచ్చింది. రెస్టారెంట్‌కు వచ్చినంత మాత్రాన సర్వీస్ ఛార్జ్‌కి కస్టమర్ అంగీకరించినట్టు కాదని పేర్కొంది. ఛార్జ్ కట్టే పక్షంలోనే ఆర్డర్ చేయాలంటూ, కస్టమర్ ప్రవేశంపై షరతులు పెట్టడం చట్టప్రకారం ‘అనుచిత వాణిజ్య పద్ధతి’ అవుతుందన్నది. మెనూ కార్డులో పేర్కొన్న రేట్లు, ప్రభుత్వం విధించే పన్నులు మినహా మరే సర్వీస్ ఛార్జ్ చెల్లించాల్సిన అవసరం లేదని తేల్చింది. తద్విరుద్ధమైన అనుచిత విధానాలపై కస్టమర్లు న్యాయవేదికలను ఆశ్రయించవచ్చని తెలిపింది. ‘అనుచిత వాణిజ్య పద్ధతి’ లాంటి పెద్ద పెద్ద మాటలు ఈ ‘టిప్స్’కు వర్తిస్తాయా, లేదా అన్నది పక్కనబెడితే, సర్వీస్ ఛార్జ్‌ను ఆపేయాలంటూ ఇలా 2017 నుంచి 2019 మధ్య కేంద్రం పలు మార్గదర్శకాలు ఇచ్చిందన్నది నిజం. అయినా హోటళ్ళ బిల్లులో తప్పనిసరి సర్వీస్‌ఛార్జ్ పద్ధతి కొనసాగుతూ వచ్చింది. దాని ఫలితమే ఫిర్యాదులు, ప్రభుత్వ తాజా నిర్ణయం. నెల రోజుల క్రితం జూన్ 2న కూడా కేంద్ర వినియోగదారుల వ్యవహారాల విభాగం దీనిపై హోటళ్ళ సంఘం వారితో సమావేశం జరిపింది. చివరకు సోమవారం నాటి సీసీపీఏ మార్గనిర్దేశనంతో ఇకపై హోటళ్ళు తప్పనిసరి సేవా రుసుము వసూలు చేయడం పూర్తి నిషిద్ధం. సీసీపీఏ చట్టబద్ధ సంస్థ. ‘వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం– 2019’ కింద హక్కులు అమలయ్యేలా చూసేందుకూ, ఉల్లంఘించినవారిని శిక్షించేందుకూ రెండేళ్ళ క్రితమే 2020 జూలైలో ఏర్పాటైందనేది గమనార్హం. గతంతో పోలిస్తే 2021–22లో ఆతిథ్యరంగంలో ఆదాయం పడిపోయింది. ఇప్పుడు శ్రామికు లకు ప్రోత్సాహకంగా దక్కే టిప్స్ కూడా రద్దు అంటే కష్టమని హోటల్ యజమానుల అభిప్రాయం. ప్రభుత్వ లావాదేవీలకు ‘ప్రాసెసింగ్ ఫీ’ అనీ, రైలు, సినిమా టికెట్ల బుకింగ్‌కు ‘కన్వీనియన్స్ ఫీ’ అనీ, ఫుడ్ డెలివరీకి ‘రెస్టారెంట్ ఛార్జెస్’ అనీ రకరకాల పేర్లతో అనేక రంగాలు సేవా రుసుము వసూలు చేస్తూనే ఉన్నాయి. వాటిని అనుమతిస్తూ, ఆతిథ్యరంగంపై ఈ దాడి ఏమిటన్నది వారి వాదన. అలాగే, టిప్స్ రద్దుతో శ్రామికులకు కలిగే నష్టం భర్తీకి జీతాలు పెంచడం, దానికై హోటల్ రేట్లు పెంచడం అనివార్యం కావచ్చు. అయితే, కోవిడ్ అనంతరం ఆహార, ఇంధన ద్రవ్యోల్బణంతో సతమతమవుతూ ఇప్పటికే రేట్లు పెంచి, ఇరుకునపడ్డ హోటళ్ళు మరోసారి ఆ పని చేయగలవా? అయినా, అందుకున్న సేవల పట్ల సంతృప్తిని బట్టి, ఆర్థిక స్థోమతను బట్టి కస్టమర్లు ఇవ్వాల్సినదాన్ని కొన్ని హోటళ్ళు తప్పనిసరి అనబట్టే తలనొప్పి. యూరప్, యూకేల పద్ధతిలో మన దగ్గరా కస్టమర్ల ఇష్టానికే టిప్స్ చెల్లింపును వదిలేయాలి. అయినా, హోటల్లో టిప్ లాంటివాటి కన్నా కోవిడ్ పడగ నీడలోని ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించే పని మీద మన పాలకులు పరిశ్రమిస్తే దేశానికి మంచిదేమో! -
ప్రపంచంలోనే తొలిసారిగా ‘రైట్ టూ రిపేర్’ యాక్ట్
వినియోగదారుల హక్కులకు కాపాడేందుకు నడుం బిగించింది న్యూయార్క్ చట్టసభ. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువుల విషయంలో ఎంతో కాలంగా ఉన్న సమస్యకు పరిష్కారం చూపే దిశగా తొలిసారిగా అడుగు వేసింది. ప్రపంచంలోనే తొలిసారిగా ఫెయిర్ రిపేర్ యాక్ట్‌ను అమలు కోసం చట్టాన్ని సిద్ధం చేసింది. డిజిటల్ ఎలక్ట్రానిక్ వస్తువులకు ఏ చిన్న సమస్య వచ్చినా తిరిగి మాన్యుఫ్యాక్చరర్ సూచించి చోటే రిపేర్ చేయించుకోవాల్సి వస్తోంది. బయట చేయిస్తే వారంటీ, గ్యారంటీలు లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. కొన్ని సార్లు రిపేర్ ఎలా చేయాలో కూడా తెలియని పరిస్థితి ఎదురవుతోంది. దీంతో వినియోగదారులు అనివార్యంగా తయారీదారు మీదే ఆధారపడాల్సి వస్తోంది. ఇలాంటి అనేక సమస్యలకు చెక్ పెట్టే దిశగా న్యూయార్క్ చట్టసభ నడుం బిగించింది. న్యూయార్క్ చట్టసభ తాజా నిర్ణయం ప్రకారం ఇకపై డిజిటల్ ఎలక్ట్రానిక్స్ తయారీదారులు ఏదైనా ప్రొడక్టును మార్కెట్లోకి తెచ్చినప్పుడు అందులో తలెత్తే సమస్యలు వాటికి పరిష్కారాలను కూడా సూచించాల్సి ఉంటుంది. కొనుగోలుదారులు రిపేర్ల కోసం తయారీదారులతో పాటు స్థానికంగా ఉండే రిపేర్ షాప్‌లను కూడా ఆశ్రయించవచ్చు. సాధ్యమైతే అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా వాళ్లే పరిష్కారం వెతుక్కొవచ్చు. అంతేకాదు రిపేరుకు అవసరమైన విడి భాగాలు, ఇతర టూల్స్ అమ్మకంపై తయారీదారులు విధించిన ఆంక్షలు కూడా తొలగిపోతాయి. చదవండి: అమెజాన్‌కి గుడ్‌బై చెప్పిన డేవ్‌క్లార్క్.. వీడిన 23 ఏళ్ల బంధం.. -
వస్తువులు కొని మోసపోతున్నారా? ఇలా పరిహారం రాబట్టుకోండి
వేలకు వేలు పోసి వస్తువులు కొన్నప్పుడు, సేవల్ని ఉపయోగించుకునే సందర్భాల్లో మోసపోయి చాలా మంది లబోదిబోమంటారు. అంతే తప్ప న్యాయం దిశగా ప్రయత్నించరు. దారి తెలియకపోవడమో లేదంటే ఎందుకులే? అనుకునే ధోరణినే అందుకు కారణం కావొచ్చు. అయితే ఇలాంటి సందర్భాల్లో న్యాయాన్ని అందించేందుకు వినియోగదారుల ఫోరాలు ఉంటాయని గుర్తించాలి. గుండు సూది నుంచి విమాన ప్రయాణం వరకు.. ఏం కొన్నా.. ఎంత ఖర్చు చేసినా వాళ్లు వినియోగదారులే(Consumer) అవుతారు. కొన్న వస్తువు నాణ్యంగా లేకపోయినా, సేవలు ప్రమాణాలకు తగ్గట్లుగా లేకపోయినా నష్టపోయేది ఆ వినియోగదారుడే. ఉదాహరణకు.. ఒక వ్యక్తి షాపుకెళ్లి ఆయిల్ ప్యాకెట్ కొంటాడు. ఎక్స్పైరీ డేట్ కంటే ముందే ఆ ఆయిల్ ప్యాకెట్ పాడైపోతుంది. అలాంటప్పుడు మోసపోయానని బాధపడుతూ ఉండిపోనక్కర్లేదు. ఈరోజుల్లో తినే ఆహారం నుంచి వేసుకునే దుస్తులు, తొడుక్కునే చెప్పులు అన్నీ కల్తీ, నకిలీలతో వినియోగదారుడు మోసపోతూనే ఉన్నాడు. ఇక డబ్బు నష్టపోవడం మాట దేవుడెరుగు... మానసికంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు కూడా. జరిగిన నష్టాన్ని చూస్తూ భరించాల్సిన అవసరం వినియోగదారుడికి అస్సలు లేదు. వీటికి అడ్డుకట్ట వేయాలంటే తమ హక్కులను గుర్తించి రక్షణ పొందొచ్చు. చట్టం ఏం చెప్తోందంటే.. వినియోగదారుల రక్షణ కోసం ప్రత్యేకంగా వినియోగదారుల చట్టం (The Consumer Protection Act) ఉంది. వస్తువులు, సేవల నాణ్యత, సామర్థ్యం, స్వచ్ఛత, ధర, ప్రమాణం.. సంబంధించి సమాచారం ఇందులో ఉంటుంది. అంతేకాదు నష్టపరిహారం పొందే హక్కునూ ఈ చట్టమే కల్పిస్తోంది. ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థల నుంచి పొందే సేవలన్నీ వినియోగదారుల చట్టం పరిధిలోకి వస్తాయి. ఒప్పందం ప్రకారం సేవ చేయకపోయినా, వస్తువు నాణ్యతలో లోపం ఉన్నా, చట్ట ప్రకారం విధులు నిర్వర్తించకపోయినా వినియోగదారుడు ఈ చట్టం ప్రకారం కోర్టులను(ఫోరం) ఆశ్రయించొచ్చు. అయితే ఉచితంగా పొందే సర్వీసులు ఈ చట్టం పరిధిలోకి రావు. వినియోగదారుడికి రక్షణగా వినియోగదారుల సంఘాలు, తూనికల కొలతల శాఖ, ఆహార కలుషిత నియంత్రణ తదితర విభాగాలు ఏర్పాటయ్యాయి. వినియోగదారుడు నష్టపోయినప్పుడు ఈ విభాగాలను సమర్థంగా వినియోగించుకుంటే నష్టపరిహారం పొందొచ్చు. అదే సమయంలో వ్యాపారుల బాధ్యతలను కూడా వినియోగదారుల చట్టం వివరిస్తుంది. వినియోగదారుల హక్కులు.. ► ఎంపిక : వస్తువులను లేదా సేవలను వినియోగదారులు తమకు అందుబాటు ధరలో ఉండి.. నచ్చితేనే ఎంచుకునే హక్కు ఉంటుంది. బలవంతంగా వినియోగదారుడికి అంటగట్టే ప్రయత్నం నేరమే అవుతుంది. ► భద్రత: ఈ హక్కు ప్రకారం సంస్థలు నాణ్యమైన వస్తువులు, సేవలను వినియోగదారుడికి అందించాలి. వినియోగదారుడు కొనే వస్తువులు, పొందే సేవలు దీర్ఘకాలం మన్నికలా ఉండాలి. అవి వినియోగదారులు ఆస్తులకు నష్టం కలిగించకూడదు. అయితే నాణ్యతను గుర్తించి వస్తువులను, సేవలను కొనుక్కోవాల్సిన బాధ్యత మాత్రం వినియోగదారుడి పైనే ఉంటుంది. ► సమాచారం పొందే హక్కు : కొనే వస్తువు, పొందే సేవల నాణ్యతా ప్రమాణాలు, ధరల గురించి పూర్తి సమాచారం తెలుసుకునే హక్కు వినియోగదారుడికి ఉంది. ఈ విషయంలో ఎలాంటి పరిమితులు విధించడానికి వీల్లేదు. ► న్యాయపోరాటం: వినియోగదారుడు మోసపోయినా లేదా నష్టపోయినా న్యాయస్థానాలను ఆశ్రయించే హక్కు ఉంటుంది. ఇది అన్నింటికన్నా అతిముఖ్యమైన హక్కు. ► అభిప్రాయం వినిపించొచ్చు: వినియోగదారుల వేదికలపై వినియోగదారుడు అభిప్రాయాలు చెప్పేందుకు హక్కు ఉంది. అంతేకాదు ప్రత్యేకంగా వినియోగదారుల సంఘాలను ఏర్పరుచుకునేందుకు కూడా హక్కు ఉంది. అయితే ఆ సంఘాలకు రాజకీయాలు, వ్యాపారాలతో ఎలాంటి సంబంధం ఉండకూడదు. ఫోరాలు మన కోసమే... వినియోగదారుల చట్టం కింద నష్టపోయిన వ్యక్తికి న్యాయం చేసేందుకు మూడంచెల వ్యవస్థలో ఫోరాలు ఏర్పాటయ్యాయి. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో వినియోగదారుల ఫోరాలు ఉన్నాయి. జిల్లా స్థాయిలో డీసీడీఆర్‌ఎఫ్(జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కృత ఫోరం).. ఇక్కడ రూ.20 లక్షలలోపు పరిహారం కోసం కేసు వేయొచ్చు. రూ.20లక్షల నుంచి రూ.కోటిలోపు పరిహారం అయితే హైకోర్టులో పరిధిలో ఉండే ఎస్సీడీఆర్సీ(రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కృత కమిషన్) కేసు దాఖలు చేయొచ్చు. కోటి.. ఆ పైన నష్టపరిహారం కోసం ఎన్సీడీఆర్సీ(జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కృత కమిషన్)ను ఆశ్రయించాలి. ఇది సుప్రీం కోర్టు పరిధిలోకి వస్తుంది. ఈ ఫోరాలకు కోర్టులకు ఉండే సాధారణ అధికారాలు ఉంటాయి. కింది స్థాయి ఫోరంలో ఇచ్చిన తీర్పు సంతృప్తి కలిగించకపోతే 30 రోజుల్లోగా పై కోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఫోరంలో కేసు వేయడానికి న్యాయవాది తప్పనిసరి కాదు. వినియోగదారుడే స్వయంగా తనకు జరిగిన నష్టాన్ని ఫోరం ముందు వినిపించొచ్చు. ఫిర్యాదు చేయడానికి ఫీజు మనం కోరే పరిహారాన్ని బట్టి ఉంటుంది. జిల్లా ఫోరం రూ.లక్ష లోపు పరిహారం కోసం: రూ.100 (దారిద్య్రరేఖకు దిగువున ఉన్నవారు ఫీజు చెల్లించక్కర్లేదు) రూ.5లక్షల లోపు: రూ.200 రూ.5 లక్షల నుంచి రూ.10లక్షలు: రూ.400 రూ.20లక్షల లోపు: రూ.500 రాష్ట్ర ఫోరం రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల లోపు:. రూ.2,000 ఫీజు రూ.50 లక్షల నుంచి రూ.కోటి లోపు:. రూ.4,000 ఫీజు జాతీయ ఫోరం రూ.కోటి.. ఆపైన: రూ.5,000 ఫీజు చెల్లించాలి. ఫీజు సొమ్మును డీడీ లేదంటే పోస్టల్ ఆర్డర్ ద్వారా చెల్లించే అవకాశం ఉంటుంది. కేసు గెలిస్తే బాధితుడికి పరిహారంతోపాటు ప్రయాణ ఛార్జీలు, ఇతర ఖర్చులు కూడా చెల్లించాలని కోర్టు ఆదేశించే అవకాశం ఉంది. ఇలా చెయ్యాలి ఫిర్యాదు చేసే ముందు అవతలి పార్టీకి సమాచారం ఇవ్వాలి. వినియోగదారుడు తనకు జరిగిన నష్టాన్ని, సేవా లోపాలను నోటీసులో స్పష్టంగా పేర్కొనాలి. ఎలాంటి పరిష్కారం, ఎన్ని రోజుల్లో కోరుకుంటున్నారో అనే విషయాలను తెలియజేయాలి. స్పందన కోసం కనీసం 30 రోజులు ఎదురు చూడటం మంచిది. ఎలాంటి స్పందన లేకపోతే అప్పుడు ఫోరాల్లో ఫిర్యాదు చేయాలి. అన్నింటికన్నా ముఖ్య విషయం సమస్య ఏర్పడిన రెండేళ్లలోగా వినియోగదారుడు ఫిర్యాదు చేయాలి. ముందుగా ఏ కంపెనీ, ఎలాంటి సేవలపై ఫిర్యాదు చేస్తున్నాం.. ఎలాంటి ఇబ్బదులు ఎదుర్కొన్నారు.. ఏం పరిహారం కావాలనుకుంటున్నారు వివరాలను ఒక తెల్లకాగితంపై రాయాలి. దీనికి ఒక అఫిడవిట్ జత చేయాలి. సంబంధిత ధ్రువపత్రాలు అంటే.. బిల్లులు, ఒప్పంద పత్రాలు దానికి జత చేయాలి. అన్ని పత్రాలను జిరాక్స్ కాపీల రూపంలోనే సమర్పించాలి. ఆ తర్వాత నిర్ణీత రుసుం చెల్లించి కేసు దాఖలు చేయాలి. ఫోరంలో ఫిర్యాదు దాఖలు చేయడానికి కావాలంటే అక్కడే ఉండే హెల్ప్ డెస్క్ సహకారం కూడా తీసుకోవచ్చు. స్వయంగానూ లేదా ప్రతినిధి లేదా వకీలు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారానూ ఫిర్యాదు పంపవచ్చు. తమకు తీరిక లేకుండా తమ తరఫున ఓ వ్యక్తిని ప్రతినిధిగా పంపాలనుకుంటే అథరైజేషన్ లెటర్ ఇవ్వాలి. వినియోగదారుడు ఫోరంను ఆశ్రయించిన తర్వాత 90 రోజుల్లోపు కేసును పూర్తిచేయాలనేది వినియోగదారుల చట్టంలోని నిబంధన. ఫిర్యాదు సబబు అని అభిప్రాయపడితే వినియోగదారుడికి నష్టపరిహారం చెల్లించాలని ఫోరం ఆదేశిస్తుంది. బిల్లు ఉంటే.. ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలని యాడ్లలో తరచూ చూస్తుంటాం. కొన్ని వస్తువుల విషయంలో గ్యారెంటీ, వారెంటీ కార్డులను షాపు యజమాని సంతకం, ముద్రతో సహా తీసుకోవాలి. చిన్న చిన్న వస్తువులను మినహాయిస్తే సాధ్యమైనంత వరకు బిల్లులను అడిగి తీసుకోవడం మంచిది. సమస్య తలెత్తినప్పుడు వినియోగదారుల ఫోరంలో సమర్పించడానికి ఇవి ఉపయోగపడతాయి. :::సాక్షి, వెబ్‌స్పెషల్ -
క్వాలిటీ లేని వస్తువులెలా అమ్ముతారు? అమెజాన్, ఫ్లిప్‌కార్టులకు నోటీసులు
న్యూఢిల్లీ: ప్రమాణాలు లేని ప్రెజర్ కుక్కర్లను విక్రయిస్తున్న పలు విక్రయ సంస్థలపై కేంద్ర వినియోగ హక్కుల పరిరక్షణా సంస్థ (సీసీపీఏ) దృష్టి సారించింది. బీఐఎస్ నిబంధనలకు అనుగుణంగా లేని ప్రెషర్ కుక్కర్లను అందిస్తున్నందుకు విక్రేతలకు నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ అయిన సంస్థల్లో ఈ–కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటిఎమ్మాల్ కూడా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్, షాప్‌క్లూస్, పేటీఎంమాల్ తదితర విక్రేతలకు ఈ నెల 18న నోటీసులు జారీ అయ్యాయని సోమవారం ఒక అధికారిక ప్రకటన తెలిపింది. ఫోకస్ చేశాం 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకల్లో సందర్భంగా నిర్వహిస్తున్న ’ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా నాణ్యత నియంత్రణ ఉత్తర్వులను ఉల్లంఘించే వారిపై దృష్టి సారించినట్లు సీసీపీఏ స్పష్టం చేసింది. నకిలీ వస్తువుల విక్రయాలను నిరోధించడానికి సీసీపీఏ దేశవ్యాప్తంగా ప్రచారాన్ని ప్రారంభించిందని కూడా ఈ ప్రకటన తెలిపింది. నకిలీ వస్తువుల తయారీ లేదా విక్రయాల ద్వారా నిబంధలనకు వ్యతిరేకంగా వాణిజ్య విధానాలను అనుసరిస్తూ, వినియోగదారుల హక్కుల ఉల్లంఘన జరిపే సంస్థలపై దర్యాప్తు చేయాలని సీసీపీఏ ఇప్పటికే దేశవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. రోజువారీ వినియోగ ఉత్పత్తులపై దృష్టి ప్రత్యేకించి రోజువారీ వినియోగ ఉత్పత్తులు హెల్మెట్లు, ప్రెషర్ కుక్కర్లు వంట గ్యాస్ సిలిండర్ల వంటి వస్తువులపై సీసీపీఏ దృష్టి సారించినట్లు ప్రభుత్వ ప్రకటన వివరించింది. ‘బీఐఎస్ చట్టం, 2016లోని సెక్షన్ 16 (1) ప్రకారం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన డొమెస్టిక్ ప్రెజర్ కుక్కర్ (క్వాలిటీ కంట్రోల్) ఆర్డర్, 2020ని ఉల్లంఘించి ప్రెజర్ కుక్కర్లను విక్రయిస్తున్నట్లు గుర్తించిన ఇ–కామర్స్ సంస్థలపై సీసీపీఏ తనకుతానుగా సీసీపీఐ చర్యలకు ఉపక్రమించింది’’ అని అని ప్రకటన పేర్కొంది. నోటీసులు నవంబర్ 18న జారీ అయ్యాయని ప్రకటన పేర్కొంటూ, నోటీసులు జారీ చేసినప్పటి నుండి ఏడు రోజుల్లోగా ఇ–కామర్స్ సంస్థల నుండి ప్రతిస్పందనను అథారిటీ కోరిందని, లేని పక్షంలో వినియోగదారుల రక్షణ చట్టం, 2019లోని నిబంధనల ప్రకారం వారిపై అవసరమైన చర్య తీసుకోవచ్చని వివరించింది. ఈ విషయాన్ని వెంటనే గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలని బీఐఎస్ డీజీ (డైరెక్టర్ జనరల్)కి కూడా సీసీపీఏ లేఖ రాసిందని వెల్లడించింది. బీఐఎస్ ఉత్తర్వు ప్రకారం, దేశీయ ప్రెషర్ కుక్కర్లు భారతీయ ప్రామాణిక ఐఎస్ 2347: 2017కి అనుగుణంగా ఉండాలి. అలాగే 2020 ఆగస్ట్ 1 నుండి అమలులోకి వచ్చిన బీఐఎస్ లైసెన్స్ కింద ప్రామాణిక గుర్తును కలిగి ఉండాలి. వినియోగదారుల రక్షణ (ఈ–కామర్స్) నిబంధనలు, 2020లోని రూల్ 4(2) ఏ ప్రకారం ఈ–కామర్స్ సంస్థలు తమ ప్లాట్‌ఫారమ్‌లో వ్యాపారానికి సంబంధించి వినియోగదారుకు వ్యతిరేకంగా ఎటువంటి అన్యాయమైన వాణిజ్య విధానాన్ని అవలంభించకూడదు. 13 ఉత్పత్తుల జాబితా ఉన్నత స్థాయి వర్గాల కథనం ప్రకారం వినియోగదారుల వ్యవహారాల విభాగం ఈ–కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో విక్రయానికి అందుబాటులో ఉన్న 13 ఉత్పత్తుల జాబితాపై దృష్టి సారించినట్లు సమాచారం. ► వీటిలో రెండు– ‘అమెజాన్ బేసిక్స్ స్టెయిన్లెస్ స్టీల్ ఔటర్ లిడ్ ప్రెజర్ కుక్కర్– నాలుగు లీటర్లు (విజిల్ ద్వారా ప్రెజర్ అలర్ట్ ఇవ్వదు), క్యూబా 5 లీటర్ ఇండక్షన్ బేస్ అల్యూమినియం ప్రెషర్ కుక్కర్– ఇన్నర్ లిడ్’ వీటిలో ఉన్నాయి. ► ఫ్లిఫ్‌కార్ట్. కామ్ విషయంలో మూడు ప్రాడక్టులపై పరిశీలన ఉంది. వీటిలో క్యూబా అల్యూమినియం రెగ్యులర్ ఐదు లీటర్ల ఇండక్షన్ బాటమ్ ప్రెజర్ కుక్కర్ (అల్యూమినియం), ప్రిస్టైన్ స్టెయిన్లెస్ స్టీల్ ఐదు లీటర్ల ఇండక్షన్ బాటమ్ ప్రెజర్ కుక్కర్ (స్టెయిన్లెస్ స్టీల్), డైమండ్ బై ఫాస్ట్కలర్స్ ఔటర్ లిడ్ 10 మినీ ప్రీమియం 10మిని ) ఉన్నాయి. ► స్నాప్ డీల్‌కు సంబంధించి రెండు ఉత్పత్తుల్లో– ఇండక్షన్ బేస్ లేకుండా ఎబోడ్ 5 లీటర్ల అల్యూమినియం ఔటర్లిడ్ ప్రెజర్ కుక్కర్, బెస్టెక్ మిర్రర్ ఫినిష్ ఇండక్షన్ స్టవ్టాప్ అనుకూలమైన చెర్రీ ప్రెజర్ కుక్కర్ (ఐదు లీటర్లు) ఉన్నాయి. ► షాప్‌క్లూస్.కామ్లోలో మూడు ఉత్పత్తులు ఉన్నాయి –– క్యూబా అల్యూమినియం రెగ్యులర్ ఐదు లీటర్ల ప్రెజర్ కుక్కర్ (ఇండక్షన్ బాటమ్–అల్యూమినియం), ప్రిస్టైన్ ఇండక్షన్ బేస్ స్టెయిన్లెస్ స్టీల్ ప్రెజర్ కుక్కర్ (ఐదు లీటర్లు), ఎథికల్ టీఆర్ఐ–నేచర్ ప్రెజర్ కుక్కర్ (ఐదు లీటర్లు), ఇండక్షన్ బోటమ్ స్టైన్లెస్ స్టీల్ ట్రైప్లే ఎస్ఏఎస్ జాబితాలో నిలిచాయి. ► పేటీఎంమాల్ మూడు ఉత్పత్తుల విక్రయాన్ని అందిస్తోంది. ప్రిస్టైన్ 5.5 లీటర్ల ఔటర్ లిడ్ ప్రెజర్ కుక్కర్ ఇండక్షన్ బాటమ్ (సిల్వర్, స్టెయిన్లెస్ స్టీల్, సెట్ ఆఫ్ 1), క్యూబా 5 లీటర్ల ఇన్నర్ మూత ప్రెజర్ కుక్కర్ ఇండక్షన్ బాటమ్ (సిల్వర్, అల్యూమినియం, సెట్ ఆఫ్ 1), ఎథికల్ కుక్వేర్ కాంబోస్ ఇండక్షన్ బాటమ్ (స్టెయిన్లెస్ స్టీల్, సెట్ ఆఫ్ 1) వీటిలో ఉన్నాయి. చదవండి: ఈ–కామర్స్ కంపెనీలకు షాక్! రూ.42 లక్షల జరిమానా -
విరమణతోనూ దక్కని పింఛను
దశాబ్దాలు పనిచేసి రిటై రైన వారికి నెలనెలా పింఛ ను ఇవ్వాలని పీఎఫ్ చట్టం 1952, పింఛను పథకం 1995 స్పష్టంగా నిర్దేశి స్తున్నాయి. కానీ విరమణ చేసి చాలా ఏళ్లు గడచినా పెన్షన్ దక్కని బెనర్జీ అనే వృద్ధుడి పక్షాన ప్రవీణ్ కోహ్లీ అనే వ్యక్తి పోరాటం జరిపాడు. వినియో గదారుల కమిషన్ బెనర్జీకి అనుకూల తీర్పుఇచ్చినా పింఛను ఇవ్వకపోవడానికి కారణాలేంటి? ఇలాంటి కేసులు ఎన్ని ఉన్నాయి? అంటూ కోహ్లీ కొన్ని ప్రశ్న లు వేశాడు. పీఎఫ్ ఆఫీస్ నిష్క్రియ వల్ల బెనర్జీ కుటుంబం ఆర్థికంగా దెబ్బతిన్నది. తన మిత్రుడు బెనర్జీ తరఫున కోహ్లీ వేసిన ఆర్టీఐ దరఖాస్తుతో పని జరిగింది. కోల్‌కతాలో అనారోగ్యంతో ఉన్న ఉద్యోగి కోసం గుర్గావ్ నుంచి అతని మిత్రుడు ఆర్టీఐ దర ఖాస్తుపెడితే, ఢిల్లీ దగ్గరి గుర్గావ్ నుంచి కోల్‌కతా వచ్చి దస్త్రాలు చూసుకుని ప్రతులు తీసు కోవాల న్నారు. దీంతో రెండో అప్పీలులో కోహ్లీ తన మిత్రు డు కష్టాలు ఏకరువు పెట్టారు. 1969లో సర్వీసులో చేరి 58 ఏళ్ల వయసులో ఉద్యోగ విరమణ చేసిన బెనర్జీకి నెల పింఛనుకు అర్హుడు. కానీ ఇవ్వలేదు. కోల్‌కతా జిల్లా వినియో గదారుల ఫోరంలో కేసు ఓడిపోయాడు. రాష్ట్ర కమిష న్ బెనర్జీకి పింఛను అర్హత ఉందని వెంటనే చెల్లిం చాలని ఆదేశించింది. విరామం లేకుండా 33 ఏళ్ల 7 నెలలు పనిచేసిన బెనర్జీకి పింఛను ఆపాల్సిన కారణ మే లేదని, పింఛను పథకం కింద మూడునెలల్లో ఆయన పింఛను లెక్కించి 2002 సెప్టెంబర్ ఒకటిన ఉద్యోగ విరమణ చేసిన నాటి నుంచి పింఛను ఇవ్వాలని ఆదేశించింది. 26వేల 400 రూపాయలు తప్ప మరే ఇతరమైన తగ్గింపులు చేయరాదని, నెల రోజుల్లోగా బెనర్జీకిS పింఛను బకాయిలన్నీ చెల్లిం చాలని, అన్యాయంగా పింఛను ఇవ్వనందుకు జరి మానాగా 12 శాతం వడ్డీ చెల్లించాలని రాష్ట్ర కమిషన్ ఆదేశించింది. కానీ, ఏదో అన్యాయం జరిగినట్టు కోల్‌కతా ఈపీఎఫ్ జాతీయ వినియోగదారుల కమి షన్ కు అప్పీలు చేుసింది. రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఉత్తర్వును ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ హుందాగా గౌరవించాల్సింది. కానీ అన్యాయంగా జాతీయ ఫోరం దాకా లాగడం న్యాయం కాదు. పీఎఫ్ సంస్థ ఈ ఉద్యోగికి ఇచ్చే స్వల్ప పింఛను కన్నా చాలా ఎక్కువ డబ్బు ఖర్చుచేసి ఈ అప్పీలు వేసి ఉంటుందని జాతీయ వినియోగదారుల కమిషన్ వ్యాఖ్యానించింది. ఇంత జరిగాక కూడా ఆ పేద కార్మికుడిపై ఈపీఎఫ్ పగ బట్టినట్టు సుప్రీంకోర్టులో జాతీయ వినియోగదారుల కమిషన్ తీర్పుచెల్లదని దుర్మార్గంగా అప్పీలు దాఖలు చేసింది. తరువాత ఎవరో పుణ్యాత్ముడైన అధికారి ఆదేశాల మేరకు ఈ అప్పీలును ఉపసంహరించుకుంది. ఇప్పుడైనా పింఛను ఇస్తారేమో అనుకుంటే బెనర్జీకి నిరాశే ఎదు రయింది. తీర్పు అమలు చేయలేదు. కేవలం ఒక నెల వేయి రూపాయల పింఛను ఇచ్చి, ‘‘ఇంతే. నీకేమీ రాదు. నీ పింఛనుసొమ్మంతా సంస్థ స్వాధీనం చేసు కుంది,’’ అని ఈపీఎఫ్ నిర్దయగా ఉత్తర్వులు జారీ చేసింది. బెనర్జీ పింఛను నిరాకరణ కథ ప్రభుత్వ హింస, సర్కారీ క్రూరత్వానికి ఒక ఉదాహరణ. జాతీ య వినియోగదారుల కమిషన్ తీర్పును కూడా అమ లు చేయకపోవడం అన్యాయం అని అతను మొర బెటు ్టకుంటే వినేవాడు లేడు. ప్రధానమంత్రికి, కేంద్ర కార్మి క శాఖ కార్యదర్శికి విన్నపాలు పెట్టుకున్నారు. కానీ ఎవ్వరికీ దయ రాలేదు. కనీసం పీఎఫ్ ఛీఫ్ కమిషనర్ అయినా వినిపించుకుంటారేమో అనుకు న్నారు. కానీ ఆయనకు కూడా తీరిక లేదు. ఆ దశలో ఆర్టీఐ దరఖాస్తు వేస్తే అది కూడా దున్నపోతుమీద వానే అయింది. జితేంద్ర కుమార్ శ్రీవాత్సవ్ అనే సామాన్య ఉద్యోగికి జార్ఖండ్ ప్రభుత్వం పింఛను నిరాకరించడమేగాక, ఈ విషయమై ఈ విధంగానే సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. ఉద్యోగ విరమణ చేసిన సామాన్య పౌరుడిపై పోరాడింది. పింఛను, గ్రాట్యుటీ అనేవి ఉద్యోగులకు ఇచ్చే బహుమతులు కావు. అది వారి రాజ్యాంగ హక్కు (300 ఏ). వారి ఆస్తి. ప్రభుత్వం వాటిని అకారణంగా స్వాధీనం చేసుకోవడానికి వీల్లేదు. పైగా పింఛను, గ్రాట్యుటీ మొత్తాలను నిలిపివేసి, స్వాధీనం చేసుకునే అధికా రాన్ని ప్రభుత్వానికి ఏ చట్టమూ ఇవ్వడం లేదని సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. ఉద్యోగుల పింఛను పథకం –1995 ప్రకారం ఉద్యోగుల యజ మానులు లేదా సంస్థలు తమ వంతు పీఎఫ్ వాటాను చెల్లించకపోతే ఆ సంస్థల నుంచి జరిమా నా, నష్టపరిహారాలను వసూలు చేయాలని పన్నెండో నియమం అధికారాన్ని ఇస్తున్నది. మొత్తం దస్తావే జుల ప్రతులు బెనర్జీకి ఇవ్వాలని, నష్టపరిహారం ఎందుకు ఇవ్వకూ డదోచెప్పాలని, కార్మికుడిని వేధిం చినందుకు ఎందుకు జరిమానా విధించకూడదో చెప్పాలని కమిషన్ నోటీసులు జారీ చేసింది. (ప్రవీణ్ కోహ్లీ వర్సెస్ ఇపీఎఫ్ఓ కొల్కత్తా ఇఐఇ/ఉ్కఊౖఎ/అ/2018/153919 కేసులో 28.9.2018 నాటి ఆదేశం ఆధారంగా) మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
‘రియాల్టీ’ సవరణలకు కేబినెట్ ఓకే!
బిల్లు పరిధిలోకి ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులు కూడా! అవకతవకలకు పాల్పడిన బిల్డర్లకు కఠిన శిక్షలు న్యూఢిల్లీ: వినియోగదారుల హక్కులకు రక్షణ కల్పిస్తూ రూపొందించిన స్థిరాస్తి బిల్లు(రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ బిల్)లో సవరణలకు కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. బ్రోకర్లు, కమర్షియల్ ప్రాజెక్టులు, ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులను బిల్లు పరిధిలోకి తీసుకువస్తూ బిల్లులో సవరణలు చేశారు. అవకతవకలకు పాల్పడే నిర్మాణదారులకు(బిల్డర్లు) జైలుశిక్ష విధించాలన్న ప్రతిపాదన ఇప్పటికే బిల్లులో ఉండగా.. గృహనిర్మాణ ప్రాజెక్టులు సహా అన్ని ప్రాజెక్టుల డెవలపర్లు కొనుగోలుదారుల నుంచి వసూలు చేసిన మొత్తంలో కనీసం 50% డబ్బును నిర్మాణ ఖర్చుల కోసం థర్డ్ పార్టీ ఆధీనంలో ఉండే ప్రత్యేక అకౌంట్లో జమ చేయాలనే నిబంధనను తాజాగా బిల్లులో చేర్చారు. ఇతర అంశాలు.. మూడింట 2 వంతుల మంది కొనుగోలుదారుల అనుమతి లేకుండా బిల్డింగ్ ప్లాన్‌ను, నిర్మాణ డిజైన్‌ను మార్చడానికి వీల్లేదు. ప్రతీ రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతంలో రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేయాలి. ఈ సంస్థ నిబంధనలను ఉల్లంఘించే రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు శిక్ష విధింపు. జిల్లా జడ్జి స్థాయి అధికారిని అడ్జ్యూడికేటింగ్ ఆఫీసర్‌గా నియమించాలి. అప్పీలేట్ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలి. డెవలపర్లు తమ ప్రాజెక్టులను(రెసిడెన్షియల్, కమర్షియల్) నియంత్రణ సంస్థ వద్ద 60 రోజుల్లోగా రిజిస్టర్ చేసుకోవాలి. ప్రాజెక్టు వివరాలన్నీ.. ప్రమోటర్లు, లేఔట్, అనుమతులు, భూమి వివరాలు మొదలైనవన్నింటినీ బహిరంగపర్చాలి. రిజిస్టర్ చేయకపోతే ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో 10% జరిమానాగా విధిస్తారు. అప్పటికీ రిజిస్టర్ చేసుకోకపోతే మరో 10% జరిమానాతో పాటు మూడేళ్ల జైలుశిక్ష విధిస్తారు. తప్పుడు సమాచారమిస్తే ప్రాజెక్టు ఖర్చులో 5% జరిమానా విధిస్తారు. నిబంధనల ఉల్లంఘనను కొనసాగిస్తూ ఉంటే రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తారు. జువనైల్ బిల్లుపై చర్చించని కేబినెట్ జువనైల్ బిల్లులో సవరణలకు సంబంధించిన ప్రతిపాదనను కేబినెట్ భేటీ ఎజెండా నుంచి తప్పించారు. 16 నుంచి 18 ఏళ్ల వయసున్నవారిని ఐపీసీ కింద విచారణ జరిపేందుకు అనుమతించే ప్రతిపాదనపై కేబినెట్‌పై చర్చించాల్సి ఉండగా.. హక్కుల కార్యకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడం, జువనైల్ చట్టాలను పునఃసమీక్షించాలన్న సుప్రీంకోర్టు ఇటీవల వాఖ్యనించడం.. మొదలైన కారణాలతో ఆ అంశాన్ని అజెండా నుంచి తొలగించారు.