న్యూఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్ వేదిక వాట్సాప్ తన నూతన గోప్యతా విధానాన్ని అంగీకరించని వినియోగదారులకు కూడా సేవలను కొనసాగిస్తామంటూ 2021లో కేంద్రానికి ఇచ్చిన హామీని ప్రచారం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. డేటా ప్రొటెక్షన్ చట్టంలోని నిబంధనలకు కట్టుబడి ఉంటామంటూ అందులో వాట్సాప్ హామీ ఇచ్చిందని కూడా గుర్తు చేసింది. సంబంధిత హామీ వివరాలను అందరికీ తెలిసేలా ఐదు ప్రధాన పత్రికల్లో రెండు పర్యాయాలు ప్రచురించాలని పేర్కొంది. తదుపరి విచారణను ఏప్రిల్ 11న చేపడతామని తెలిపింది. పిటిషనర్ల తరఫున శ్యామ్ దివాన్ వాదనలు వినిపించారు.
వినియోగదారుల హక్కుల పరిరక్షణ విషయంలో వాట్సాప్ విధానాలు యూరప్ దేశాలతో పోలిస్తే భారత్‌లో వేరుగా ఉన్నాయన్నారు. వినియోగదారులు షేర్ చేసుకునే కాల్స్, ఫొటోలు, మెసేజీలు, వీడియోలు, డాక్యుమెంట్ల వివరాలను అందుబాటులో ఉంచేందుకు, వాట్సాప్ తన మాతృసంస్థ ఫేస్‌బుక్‌తో కుదుర్చుకున్న ఒప్పందం వ్యక్తిగత భద్రతకు, వాక్ స్వాతంత్య్రానికి భంగ కరమంటూ కర్మణ్యసింగ్ సరీన్, శ్రేయ సేథి అనే విద్యార్థినులు వేసిన పిటిషన్‌ను బుధవారం జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారించి పైఆదేశాలిచ్చింది. ఈ బెంచ్‌లో జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ సీటీ రవికుమార్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment