భయం ఉంటే వాట్సప్ వాడొద్దు...
న్యూఢిల్లీ: వాట్సప్ తన వినియోగదారులకు షాక్ ఇస్తోంది. వినియోగదారుల సమాచారానికి తాము కల్పించే భద్రత పట్ల అసంతృప్తి ఉంటే వాట్సప్ నుంచి వైదొలగొచ్చని తెలిపింది. గతేడాది వాట్సప్ డేటాని ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌తో షేర్‌చేస్తూ సరికొత్త ప్రైవసీ పాలసీని ప్రవేశ పెట్టింది. దీంతో వాట్సప్ వినియోగదారుల డేటా ప్రైవసీకి భంగం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం అయింది. కొత్త ప్రైవసీ పాలసీపై ప్రపంచ వ్యాప్తంగా పలు కేసులు నడుస్తున్నాయి.
భారత్‌లో కూడా దీనిపై కేసు నమోదు అయింది. అత్యున్నత న్యాయస్థానంలో విచారణలో భాగంగా వాట్పప్ ప్రైవసీ పాలసీపై భయం, అనుమానం ఉన్న వ్యక్తులు వాట్సప్ మానేయొచ్చని వాట్సప్ తరపు న్యాయవాది కపిల్ సిబాల్ కోర్టులో వాదించారు. వాట్సప్ ఇప్పటి వరకూ ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్సన్ భద్రతని అందిస్తోంది. అంతకు మించి భద్రత అందించలేమని వాట్సప్ వాదిస్తోంది.ఎవరైతే ఫేస్‌బుక్ వాట్సప్ కొత్త ప్రైవసీ పాలసీతో తమ ప్రాధమిక హక్కులను హరిస్తుందని భావిస్తున్నరో వారు ఆ సర్వీసులను వాడటం ఆపేయవచ్చని ఫేస్‌బుక్ తరపు న్యాయవాది వేణుగోపాల్ వాదించారు.భారతీయుడి ప్రాధమిక హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పిటీషనర్ తరపు న్యాయవాదులు వాదించారు.