
న్యూఢిల్లీ: ప్రైవసీ పాలసీలో ప్రతిపాదిత మార్పులను ఉపసంహరించుకోవాలంటూ కేంద్రం ఆదేశాల నేపథ్యంలో మెసేజింగ్ యాప్ వాట్సాప్ స్పందించింది. ప్రతిపాదిత అప్‌డేట్ వల్ల మాతృసంస్థ ఫేస్‌బుక్‌తో యూజర్ల డేటాను మరింతగా పంచుకోవడమనేది జరగదని వివరించింది. పారదర్శకంగా వ్యవహరించడమే తమ లక్ష్యమని పేర్కొంది. వ్యాపార సంస్థలు తమ కస్టమర్లకు మెరుగ్గా సేవలు అందించేందుకు, మరింత మందికి చేరువయ్యేందుకు అవసరమైన అవకాశాలను అందుబాటులో ఉంచడం తమ ఉద్దేశమని తెలిపింది.
తప్పుడు సమాచార వ్యాప్తిని అరికట్టే ప్రయత్నాల్లో ఉన్నామని వివరించింది. దీనిపై ఎలాంటి ప్రశ్నలకైనా వివరణనిచ్చేందుకు సదా అందుబాటులో ఉంటామని వాట్సాప్ అధికార ప్రతినిధి తెలిపారు. మాతృసంస్థ ఫేస్‌బుక్‌తో పాటు ఇతర గ్రూప్ సంస్థలతో తమ యూజర్ల వివరాలను పంచుకునే విధంగా ప్రైవసీ పాలసీని మారుస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించడంపై దుమారం రేగిన సంగతి తెలిసిందే. దీనిపై యూజర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కాస్త వెనక్కి తగ్గి.. అప్‌డేట్‌ను మే 15 దాకా వాయిదా వేసింది. అటు కేంద్రం కూడా ఘాటుగా హెచ్చరించడంతో తాజా వివరణ ఇచ్చింది.