న్యూఢిల్లీ: యూరోపియన్ వినియోగదారులతో పోలిస్తే భారత పౌరుల గోప్యతను తక్కువగా చూస్తున్నారంటూ దాఖలైన పిటిషన్‌కి సమాధానమివ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, సామాజిక మాధ్యమం వాట్సాప్, దాని మాతృసంస్థ ఫేస్‌బుక్‌లను సుప్రీంకోర్టు ఆదేశించింది. భారతపౌరుల ప్రైవసీని కాపాడాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థపై ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. రూ.లక్షల కోట్ల కన్నా, ప్రజలు తమ వ్యక్తిగత గోప్యతకే అధిక ప్రాధాన్యతనిస్తారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇటీవల సామాజిక మాధ్యమం వాట్సాప్ ప్రకటించిన నూతన గోప్యతా విధానం ప్రజల వ్యక్తిగత గోప్యత హక్కును హరించి వేస్తోందంటూ, వాట్సాప్ గోప్యతా విధానంపై స్టే విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఫేస్‌బుక్, వాట్సాప్‌లను ఉద్దేశించి.. ‘మీది 2–3 ట్రిలియన్ డాలర్ల కంపెనీ అయితే అయ్యుండొచ్చు. కానీ ప్రజలు డబ్బుకన్నా వారి సమాచార గోప్యతకే అధిక ప్రాధాన్యతనిస్తారు’ అని వ్యాఖ్యానించింది.
► నూతన గోప్యతా విధానాన్ని అమలుచేస్తే, ప్రజల ప్రైవసీని పరిరక్షించేందుకు తాము జోక్యం చేసుకోవాల్సి వస్తుందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ బాబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వీ సుబ్రమణియన్‌ల ధర్మాసనం వాట్సాప్, ఫేస్‌బుక్‌లకు నోటీసులు జారీచేసింది. కేంద్ర ప్రభుత్వానికీ నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై స్పందించేందుకు 4 వారాల సమయాన్ని కోర్టు మంజూరు చేసింది. వాట్సాప్ గోప్యతా విధానంపై పౌరులకు సందేహాలు ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది.
► కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. ‘ఇది దేశానికి సంబంధించిన సమస్య అని, వినియోగదారుల సమాచారాన్ని షేర్ చేసేందుకు ససేమిరా ఒప్పుకునే ప్రసక్తే లేదు’ అని కోర్టుకి చెప్పారు. వాట్సాప్ భారత చట్టాలను అనుసరించలేదని మెహతా ఆరోపించారు.
► వాట్సాప్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తూ ఒక్క యూరప్‌లో తప్ప భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ ప్రైవసీ పాలసీ ఒకే రకంగా ఉందని, యూరోపియన్‌లకు జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ ఉందని, భారత్‌లో పార్లమెంటు అదే విధమైన చట్టం చేస్తే వాట్సాప్ దాన్ని అనుసరిస్తుందని వ్యాఖ్యానించారు. ‘ఈ ప్రైవసీ పాలసీ ప్రకారం భారత పౌరుల డేటాను షేర్ చేయొచ్చు’ అని అన్నారు.
► ఇటీవల వాట్సాప్ కంపెనీ నూతన గోప్యతా విధానాన్ని ప్రకటించింది. ఈ విధానం ఫిబ్రవరి 8 నుంచి అమలులోకి వస్తుందని వాట్సాప్ పేర్కొంది. దీనిపై భారత ప్రభుత్వం ఇప్పటికే తన అభ్యంతరాలను వెల్లడించింది. భారత ప్రభుత్వం నోటీసుల మేరకు నూతన గోప్యతా విధానం అమలును మే 15కి వాయిదావేశారు. వాట్సాప్ న్యూ ప్రైవసీ పాలసీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని, ఇది భారతీయులకు ఒకలా, యూరోపియన్స్‌కి మరోలా అమలు చేస్తున్నారు అని పిటిషనర్ తరఫున వాదిస్తోన్న న్యాయవాది శ్యామ్ దివాన్ ఆరోపించారు. ‘యూరప్‌లో ఎవరికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్నైనా ఇతరులకు షేర్ చేయాల్సి వస్తే, దానికి ముందు సదరు వ్యక్తి అనుమతి తీసుకోవడం తప్పనిసరి. ఈ పాలసీనే భారత్‌కూ అన్వయించాలి’ అని దివాన్ కోరారు. కేంద్ర ప్రభుత్వం కొత్త గోప్యతా విధానాన్ని ప్రకటించే వరకు వాట్సాప్ న్యూ ప్రైవసీ పాలసీని అమలుచేయరాదని ఆదేశించాల్సిందిగా కోర్టుని కోరారు.
► ఇతరులతో తమ సంభాషణలని, తమ డేటాని, వాట్సాప్ కంపెనీ ఎవరితోనైనా షేర్ చేస్తే తమ వ్యక్తిగత గోప్యతకు నష్టం వాటిల్లుతుందేమోనని భారత పౌరులు భయపడుతున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ విషయాన్ని పరిశీలించాలని కోర్టు స్పష్టం చేసింది.
► తమ లబ్ధికోసం వినియోగదారుల డేటాని ఇతరులకు ఇస్తున్నారంటూ పిటిషన్‌దారుడు నూతన ప్రైవసీ పాలసీని సవాల్ చేశారు. వాట్సాప్ ప్రైవసీ పాలసీ విషయంలో 2017లో రాజ్యాంగ ధర్మాసనం ‘ఇది వ్యక్తిగత గోప్యతా హక్కుకి సంబంధించిన పెద్ద సమస్య’ అని వ్యాఖ్యానించినట్టు సుప్రీంకోర్టు ప్రస్తావించింది.
► డేటా షేరింగ్ విషయంలో తమ విధానం ఏమిటో వాట్సాప్, ఫేస్‌బుక్ స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నదని సీజేఐ అన్నారు.
లక్షల కోట్లకన్నా గోప్యతే ముఖ్యం
Published Tue, Feb 16 2021 3:36 AM | Last Updated on Tue, Feb 16 2021 7:57 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment