European Company
-
మరో విదేశీ కంపెనీ టెక్ మహీంద్రా సొంతం..! సత్యం కంప్యూటర్స్ తరువాత..!
న్యూఢిల్లీ: యూరోపియన్ కంపెనీ కామ్ టెక్ కో ఐటీ(సీటీసీ)లో పూర్తి వాటాను కొనుగోలు చేసినట్లు సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం టెక్ మహీంద్రా తాజాగా వెల్లడించింది. సీటీసీలో 100 శాతం వాటా కోసం 31 కోట్ల యూరోల(సుమారు రూ. 2,628 కోట్లు)ను వెచ్చించినట్లు తెలియజేసింది. భవిష్యత్ పనితీరు, కంపెనీల కలయిక ఆధారిత చెల్లింపులతో కలిపి డీల్ కుదుర్చుకుంది. అంతేకాకుండా సీటీసీ గ్రూప్‌నకే చెందిన ఎస్‌డబ్ల్యూఎఫ్‌టీ, స్యూరెన్స్ ప్లాట్‌ఫామ్‌లలో 25 శాతం యాజమాన్య వాటాను సైతం సొంతం చేసుకుంటున్నట్లు పేర్కొంది. ఇందుకు మరో 2 కోట్ల యూరోల(దాదాపు రూ. 170 కోట్లు) పెట్టుబడులను వెచ్చిస్తున్నట్లు తెలియజేసింది. తద్వారా డిజిటల్ ఇంజినీరింగ్, బీమా రంగ టెక్నాలజీ సర్వీసుల్లో మరింత బలపడనున్నట్లు వివరించింది. వెరసి టెక్ మహీంద్రా.. 2010 ఏప్రిల్‌లో సత్యం కంప్యూటర్స్‌ను చేజిక్కించుకున్నాక తిరిగి రెండో అతిపెద్ద కొనుగోలుకి తెరతీయడం విశేషం! 110 కోట్ల డాలర్ల ఎంటర్ప్రైజ్ విలువలో సత్యం కంప్యూటర్స్‌లో 42 శాతం వాటా కోసం 50 కోట్ల డాలర్లను వెచ్చించింది. డిజిటల్ ఇంజినీరింగ్, బీమా రంగ టెక్నాలజీ బిజినెస్‌ల వృద్ధి కోసం ఇటీవల కాలంలో తాము చేపట్టిన అత్యధిక పెట్టుబడులివని టెక్ మహీంద్రా బీఎఫ్ఎస్ఐ, హెచ్ఎల్ఎస్, కార్పొరేట్ డెవలప్మెంట్ ప్రెసిడెంట్ వివేక్ అగర్వాల్ పేర్కొన్నారు. సీటీసీ వివరాలివీ.. టెక్ మహీంద్రా అందించిన వివరాల ప్రకారం 2020లో సీటీసీ 71.3 మిలియన్ యూరోల ఆదాయం సాధించింది. 2021 సెప్టెంబర్‌తో ముగిసిన 9 నెలల కాలంలో 58.8 మిలియన్ యూరోల టర్నోవర్ నమోదైంది. కంపెనీకిగల 720 మంది సిబ్బంది ఇకపై టెక్ మహీంద్రాలో భాగంకానున్నారు. కాగా.. భవిష్యత్‌లో ఎస్‌డబ్ల్యూఎఫ్‌టీ, స్యూరెన్స్లలో వాటాలు పెంచుకునే అవకాశమున్నట్లు అగర్వాల్ వెల్లడించారు. ప్రస్తుతం బీమా రంగం భారీ స్థాయిలో డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ బాట పట్టినట్లు పేర్కొన్నారు. తాజా కొనుగోళ్ల ద్వారా తాము ఈ విభాగంలో కీలకపాత్ర పోషించే వీలున్నట్లు వివరించారు. బెలారస్, లాత్వియాలలో డెవలప్మెంట్ కేంద్రాలుగల ఈ సంస్థలు ప్రధానంగా యూరప్, ఉత్తర అమెరికా ప్రాంతాలలో క్లయింట్లకు సర్వీసులందిస్తున్నట్లు తెలియజేశారు. ఈ వార్తల నేపథ్యంలో టెక్ మహీంద్రా షేరు 1% నీరసించి రూ. 1,722 వద్ద ముగిసింది. -
లక్షల కోట్లకన్నా గోప్యతే ముఖ్యం
న్యూఢిల్లీ: యూరోపియన్ వినియోగదారులతో పోలిస్తే భారత పౌరుల గోప్యతను తక్కువగా చూస్తున్నారంటూ దాఖలైన పిటిషన్‌కి సమాధానమివ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, సామాజిక మాధ్యమం వాట్సాప్, దాని మాతృసంస్థ ఫేస్‌బుక్‌లను సుప్రీంకోర్టు ఆదేశించింది. భారతపౌరుల ప్రైవసీని కాపాడాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థపై ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. రూ.లక్షల కోట్ల కన్నా, ప్రజలు తమ వ్యక్తిగత గోప్యతకే అధిక ప్రాధాన్యతనిస్తారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇటీవల సామాజిక మాధ్యమం వాట్సాప్ ప్రకటించిన నూతన గోప్యతా విధానం ప్రజల వ్యక్తిగత గోప్యత హక్కును హరించి వేస్తోందంటూ, వాట్సాప్ గోప్యతా విధానంపై స్టే విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఫేస్బుక్, వాట్సాప్‌లను ఉద్దేశించి.. ‘మీది 2–3 ట్రిలియన్ డాలర్ల కంపెనీ అయితే అయ్యుండొచ్చు. కానీ ప్రజలు డబ్బుకన్నా వారి సమాచార గోప్యతకే అధిక ప్రాధాన్యతనిస్తారు’ అని వ్యాఖ్యానించింది. ► నూతన గోప్యతా విధానాన్ని అమలుచేస్తే, ప్రజల ప్రైవసీని పరిరక్షించేందుకు తాము జోక్యం చేసుకోవాల్సి వస్తుందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ బాబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వీ సుబ్రమణియన్‌ల ధర్మాసనం వాట్సాప్, ఫేస్‌బుక్‌లకు నోటీసులు జారీచేసింది. కేంద్ర ప్రభుత్వానికీ నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై స్పందించేందుకు 4 వారాల సమయాన్ని కోర్టు మంజూరు చేసింది. వాట్సాప్ గోప్యతా విధానంపై పౌరులకు సందేహాలు ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. ► కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. ‘ఇది దేశానికి సంబంధించిన సమస్య అని, వినియోగదారుల సమాచారాన్ని షేర్ చేసేందుకు ససేమిరా ఒప్పుకునే ప్రసక్తే లేదు’ అని కోర్టుకి చెప్పారు. వాట్సాప్ భారత చట్టాలను అనుసరించలేదని మెహతా ఆరోపించారు. ► వాట్సాప్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తూ ఒక్క యూరప్‌లో తప్ప భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ ప్రైవసీ పాలసీ ఒకే రకంగా ఉందని, యూరోపియన్లకు జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ ఉందని, భారత్‌లో పార్లమెంటు అదే విధమైన చట్టం చేస్తే వాట్సాప్ దాన్ని అనుసరిస్తుందని వ్యాఖ్యానించారు. ‘ఈ ప్రైవసీ పాలసీ ప్రకారం భారత పౌరుల డేటాను షేర్ చేయొచ్చు’ అని అన్నారు. ► ఇటీవల వాట్సాప్ కంపెనీ నూతన గోప్యతా విధానాన్ని ప్రకటించింది. ఈ విధానం ఫిబ్రవరి 8 నుంచి అమలులోకి వస్తుందని వాట్సాప్ పేర్కొంది. దీనిపై భారత ప్రభుత్వం ఇప్పటికే తన అభ్యంతరాలను వెల్లడించింది. భారత ప్రభుత్వం నోటీసుల మేరకు నూతన గోప్యతా విధానం అమలును మే 15కి వాయిదావేశారు. వాట్సాప్ న్యూ ప్రైవసీ పాలసీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని, ఇది భారతీయులకు ఒకలా, యూరోపియన్స్‌కి మరోలా అమలు చేస్తున్నారు అని పిటిషనర్ తరఫున వాదిస్తోన్న న్యాయవాది శ్యామ్ దివాన్ ఆరోపించారు. ‘యూరప్‌లో ఎవరికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్నైనా ఇతరులకు షేర్ చేయాల్సి వస్తే, దానికి ముందు సదరు వ్యక్తి అనుమతి తీసుకోవడం తప్పనిసరి. ఈ పాలసీనే భారత్‌కూ అన్వయించాలి’ అని దివాన్ కోరారు. కేంద్ర ప్రభుత్వం కొత్త గోప్యతా విధానాన్ని ప్రకటించే వరకు వాట్సాప్ న్యూ ప్రైవసీ పాలసీని అమలుచేయరాదని ఆదేశించాల్సిందిగా కోర్టుని కోరారు. ► ఇతరులతో తమ సంభాషణలని, తమ డేటాని, వాట్సాప్ కంపెనీ ఎవరితోనైనా షేర్ చేస్తే తమ వ్యక్తిగత గోప్యతకు నష్టం వాటిల్లుతుందేమోనని భారత పౌరులు భయపడుతున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ విషయాన్ని పరిశీలించాలని కోర్టు స్పష్టం చేసింది. ► తమ లబ్ధికోసం వినియోగదారుల డేటాని ఇతరులకు ఇస్తున్నారంటూ పిటిషన్‌దారుడు నూతన ప్రైవసీ పాలసీని సవాల్ చేశారు. వాట్సాప్ ప్రైవసీ పాలసీ విషయంలో 2017లో రాజ్యాంగ ధర్మాసనం ‘ఇది వ్యక్తిగత గోప్యతా హక్కుకి సంబంధించిన పెద్ద సమస్య’ అని వ్యాఖ్యానించినట్టు సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ► డేటా షేరింగ్ విషయంలో తమ విధానం ఏమిటో వాట్సాప్, ఫేస్బుక్ స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నదని సీజేఐ అన్నారు. -
మరో కొనుగోలుకు టొరెంటో..
ముంబై : ఇటీవలే యూనికెమ్ ల్యాబోరేటరీస్‌ను కొనుగోలు చేసి, టాప్-5 ఫార్మా దిగ్గజంగా పేరు తెచ్చుకున్న టోరెంటో ఫార్మాస్యూటికల్స్, మరో యూరోపియన్ జనరిక్స్ బిజినెస్ యూనిట్ కొనుగోలుకు సిద్ధమైంది. సనోఫి యూరోపియన్ జనరిక్స్ బిజినెస్ జెంటివా ఎన్.వీని రూ.16వేల కోట్లకు టోరెంటో కొనుగోలు చేస్తున్నట్టు న్యూస్ రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఒకవేళ ఈ కొనుగోలులో టోరెంటో విజయం సాధిస్తే, కంపెనీకి అతిపెద్ద లావాదేవీ ఇదే కానుంది. ఫండింగ్ కోసం ఇప్పటికే టోరెంటో పలు దేశీయ, విదేశీ బ్యాంకులతో భాగస్వామ్యం కూడా ఏర్పరుచుకుంది. 28 మార్చి వరకు అన్ని ఫండింగ్ అరెంజ్మెంట్లు కూడా పూర్తి కానున్నాయి. జెంటివాను సనోఫి 2009లో కొనుగోలు చేసింది. జెంటీవా ప్రస్తుతం యూరప్‌లో మూడో అతిపెద్ద జనరిక్స్ కంపెనీ. 50 మార్కెట్లలో జెంటివా తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఈబీఐటీడీఏల తర్వాత జెంటివా ఆదాయాలు 150 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. టోరెంటో ప్రస్తుతం కొనుగోలు చేస్తున్న విలువ తన ఈబీఐటీడీఏల కంటే 13 సార్లు ఎక్కువగా ఉందని సంబంధిత వర్గాలు చెప్పాయి. ఈ సేల్ ప్రక్రియను విజయవంతంగా ముగించడానికి సనోఫి, జేపీ మోర్గాన్, రోథ్స్చైల్డ్ అండ్ కంపెనీ, మోర్గాన్ స్టాన్లీని నియమించుకుందని తెలుస్తోంది. -
ఇండిగో రూ. లక్షన్నర కోట్ల విమానాల ఆర్డరు
250 ఏ-320ల కోసం ఎయిర్‌బస్‌తో ఒప్పందం న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ఇండిగో తాజాగా ఎయిర్‌బస్‌కి చెందిన ఏ-320 విమానాలను 250 కొనుగోలు చేస్తోంది. ఈ డీల్ విలువ దాదాపు రూ. 1.55 లక్షల కోట్లు (25.5 బిలియన్ డాలర్లు). ఇందుకు సంబంధించిన అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఇరు కంపెనీలు వెల్లడించాయి. యూరోపియన్ కంపెనీ అయిన ఎయిర్‌బస్‌కి సంఖ్యాపరంగా ఒకే సంస్థ నుంచి ఇంత పెద్ద ఆర్డరు రావడం ఇదే మొదటిసారి. ఆర్డరు విలువను ఎయిర్‌బస్ వెల్లడించనప్పటికీ కంపెనీ వెబ్సైట్ ప్రకారం ఒక్కో ఏ-320 విమానం ధర 102.8 మిలియన్ డాలర్లు. ఇండిగో 2005లో 100 విమానాలు, 2011లో 180 ఏ-320 నియో విమానాలను ఆర్డరు ఇచ్చింది. ఇంధనాన్ని పొదుపుగా వినియోగించే ఏ-320 నియో విమానాల డెలివరీ వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఇండిగో 180 సీట్లుండే 83 ఏ-320 విమానాలతో సర్వీసులు నడుపుతోంది. అదనంగా విమానాలను సమకూర్చుకోవడం వల్ల మరింత మంది కస్టమర్లు, మార్కెట్లకు చేరువయ్యేందుకు, ఉపాధి అవకాశాలు పెంచేందుకు తోడ్పడగలదని ఇండిగో ప్రెసిడెంట్ ఆదిత్య ఘోష్ తెలిపారు.