మరో విదేశీ కంపెనీ టెక్‌ మహీంద్రా సొంతం..! సత్యం కంప్యూటర్స్‌ తరువాత..! | Tech Mahindra Acquires European Tech Firm For EUR 310 Million | Sakshi
Sakshi News home page

Tech Mahindra: మరో విదేశీ కంపెనీ టెక్‌ మహీంద్రా సొంతం..! సత్యం కంప్యూటర్స్‌ తరువాత..!

Published Tue, Jan 18 2022 1:43 AM | Last Updated on Tue, Jan 18 2022 1:44 AM

Tech Mahindra Acquires European Tech Firm For EUR 310 Million - Sakshi

న్యూఢిల్లీ: యూరోపియన్‌ కంపెనీ కామ్‌ టెక్‌ కో ఐటీ(సీటీసీ)లో పూర్తి వాటాను కొనుగోలు చేసినట్లు సాఫ్ట్‌వేర్‌ సేవల దేశీ దిగ్గజం టెక్‌ మహీంద్రా తాజాగా వెల్లడించింది. సీటీసీలో 100 శాతం వాటా కోసం 31 కోట్ల యూరోల(సుమారు రూ. 2,628 కోట్లు)ను వెచ్చించినట్లు తెలియజేసింది. భవిష్యత్‌ పనితీరు, కంపెనీల కలయిక ఆధారిత చెల్లింపులతో కలిపి డీల్‌ కుదుర్చుకుంది. అంతేకాకుండా సీటీసీ గ్రూప్‌నకే చెందిన ఎస్‌డబ్ల్యూఎఫ్‌టీ, స్యూరెన్స్‌ ప్లాట్‌ఫామ్‌లలో 25 శాతం యాజమాన్య వాటాను సైతం సొంతం చేసుకుంటున్నట్లు పేర్కొంది. ఇందుకు మరో 2 కోట్ల యూరోల(దాదాపు రూ. 170 కోట్లు) పెట్టుబడులను వెచ్చిస్తున్నట్లు తెలియజేసింది. తద్వారా డిజిటల్‌ ఇంజినీరింగ్, బీమా రంగ టెక్నాలజీ సర్వీసుల్లో మరింత బలపడనున్నట్లు వివరించింది.

వెరసి టెక్‌ మహీంద్రా.. 2010 ఏప్రిల్‌లో సత్యం కంప్యూటర్స్‌ను చేజిక్కించుకున్నాక తిరిగి రెండో అతిపెద్ద కొనుగోలుకి తెరతీయడం విశేషం! 110 కోట్ల డాలర్ల ఎంటర్‌ప్రైజ్‌ విలువలో సత్యం కంప్యూటర్స్‌లో 42 శాతం వాటా కోసం 50 కోట్ల డాలర్లను వెచ్చించింది. డిజిటల్‌ ఇంజినీరింగ్, బీమా రంగ టెక్నాలజీ బిజినెస్‌ల వృద్ధి కోసం ఇటీవల కాలంలో తాము చేపట్టిన అత్యధిక పెట్టుబడులివని టెక్‌ మహీంద్రా బీఎఫ్‌ఎస్‌ఐ, హెచ్‌ఎల్‌ఎస్, కార్పొరేట్‌ డెవలప్‌మెంట్‌ ప్రెసిడెంట్‌ వివేక్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. 

సీటీసీ వివరాలివీ.. 
టెక్‌ మహీంద్రా అందించిన వివరాల ప్రకారం 2020లో సీటీసీ 71.3 మిలియన్‌ యూరోల ఆదాయం సాధించింది. 2021 సెప్టెంబర్‌తో ముగిసిన 9 నెలల కాలంలో 58.8 మిలియన్‌ యూరోల టర్నోవర్‌ నమోదైంది. కంపెనీకిగల 720 మంది సిబ్బంది ఇకపై టెక్‌ మహీంద్రాలో భాగంకానున్నారు. కాగా.. భవిష్యత్‌లో ఎస్‌డబ్ల్యూఎఫ్‌టీ, స్యూరెన్స్‌లలో వాటాలు పెంచుకునే అవకాశమున్నట్లు అగర్వాల్‌ వెల్లడించారు. ప్రస్తుతం బీమా రంగం భారీ స్థాయిలో డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ బాట పట్టినట్లు పేర్కొన్నారు. తాజా కొనుగోళ్ల ద్వారా తాము ఈ విభాగంలో కీలకపాత్ర పోషించే వీలున్నట్లు వివరించారు. బెలారస్, లాత్వియాలలో డెవలప్‌మెంట్‌ కేంద్రాలుగల ఈ సంస్థలు ప్రధానంగా యూరప్, ఉత్తర అమెరికా ప్రాంతాలలో క్లయింట్లకు సర్వీసులందిస్తున్నట్లు తెలియజేశారు.   

ఈ వార్తల నేపథ్యంలో టెక్‌ మహీంద్రా షేరు 1% నీరసించి రూ. 1,722 వద్ద ముగిసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement