ఐటీ దిగ్గజం విప్రో (Wipro) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు (Q3 Results) సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 24% జంప్‌చేసి రూ. 3,354 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం మాత్రం నామమాత్రంగా 0.5% పుంజుకుని రూ. 22,319 కోట్లకు చేరింది.
క్యూ4లో ఐటీ సర్వీసుల ఆదాయం 260.2–265.5 కోట్ల డాలర్ల శ్రేణిలో నమోదుకాగలదని (గైడెన్స్) తాజాగా ప్రకటించింది. వెరసి ఆదాయ వృద్ధిని మైనస్ 1% నుంచి +1% మధ్య అంచనా వేసింది. వాటాదారులకు ఒక్కో షేరుకి రూ. 6 చొప్పున మధ్యంతర డివిడెండ్ చెల్లింపునకు కంపెనీ బోర్డు అనుమతించింది. మూడేళ్లపాటు లాభాల్లో 70%వరకూ వాటాదారులకు చెల్లించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
బిలియన్ డాలర్లు: తాజా సమీక్షా కాలంలో 17 భారీ డీల్స్ ద్వారా బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లను అందుకున్నట్లు విప్రో వెల్లడించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2025–26)లో కొత్తగా 10,000–12,000 మంది ఫ్రెషర్స్‌కు ఉపాధి కల్పించనున్నట్లు తెలియజేసింది. క్యూ3లో నికరంగా 1,157మంది ఉద్యోగులు తగ్గడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 2,32,732కు చేరింది.
టెక్ మహీంద్రా
ఐటీ సొల్యూషన్ల కంపెనీ టెక్ మహీంద్రా (Tech Mahindra) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 93 శాతం దూసుకెళ్లి రూ. 983 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో ప్రతికూలతల కారణంగా కేవలం రూ. 510 కోట్లు ఆర్జించింది. అయితే ఈ ఏడాది క్యూ2లో సాధించిన రూ. 1,250 కోట్లతో పోలిస్తే నికర లాభం తగ్గింది.
ఇదీ చదవండి: ఉద్యోగులకు మరో షాకిచ్చిన టీసీఎస్..
కాగా.. మొత్తం ఆదాయం నామమాత్రంగా 1 శాతమే పుంజుకుని రూ. 13,286 కోట్లకు చేరింది. నిర్వహణ లాభ మార్జిన్లు 5.4 శాతం నుంచి 10.2 శాతానికి మెరుగుపడ్డాయి. అయితే రెండేళ్లలో ఇవి 15 శాతానికి బలపడగలవని కంపెనీ సీఈవో, ఎండీ మోహిత్ జోషీ పేర్కొన్నారు. ఈ కాలంలో ప్రధానంగా టెలికం, తయారీ రంగాల నుంచి74.5 కోట్ల డాలర్ల విలువైన ఆర్డర్లు అందుకున్నట్లు సీఎఫ్‌వో రోహిత్ ఆనంద్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment