అత్యంత విలువైన ఐటీ బ్రాండ్‌లు | Tata Consultancy Services TCS and Infosys are indeed leading the IT industry | Sakshi
Sakshi News home page

అత్యంత విలువైన ఐటీ బ్రాండ్‌లు

Published Wed, Jan 22 2025 8:12 AM | Last Updated on Wed, Jan 22 2025 11:46 AM

Tata Consultancy Services TCS and Infosys are indeed leading the IT industry

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా దేశీ టెక్నాలజీ సంస్థలకు పెరుగుతున్న ప్రాధాన్యానికి నిదర్శనంగా దిగ్గజాలు టీసీఎస్(TCS), ఇన్ఫోసిస్(Infosys), హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్(HCL Tech), విప్రో(Wipro), టెక్‌ మహీంద్రా(Tech Mahindra) ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐటీ సర్వీసుల బ్రాండ్ల జాబితాలో ప్రముఖంగా చోటు దక్కించుకున్నాయి. 2025కి గాను టాప్‌ 25 సంస్థలతో బ్రాండ్‌ వేల్యుయేషన్‌ కన్సల్టెన్సీ సంస్థ బ్రాండ్‌ ఫైనాన్స్‌ రూపొందించిన నివేదికలో వరుసగా నాలుగో సంవత్సరంలోనూ టీసీఎస్‌ రెండో స్థానంలో, ఇన్ఫోసిస్‌ మూడో స్థానంలో నిల్చాయి. ఇందులో యాక్సెంచర్‌ వరుసగా ఏడో ఏడాది అగ్రస్థానంలో కొనసాగింది.

టీసీఎస్‌ బ్రాండ్‌ విలువ 11 శాతం పెరిగి 21.3 బిలియన్‌ డాలర్లకు చేరగా, ఇన్ఫోసిస్‌ బ్రాండ్‌ విలువ 15 శాతం పెరిగి 16.3 బిలియన్‌ డాలర్లకు చేరింది. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఐటీ సేవల బ్రాండుగా హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ నిల్చింది. కంపెనీ బ్రాండు విలువ 17 శాతం పెరిగి 8.9 బిలియన్‌ డాలర్లుగా ఉంది. అటు విప్రో, టెక్‌ మహీంద్రా, హెక్సావేర్‌ మొదలైనవి కూడా లిస్టులో చోటు దక్కించుకున్నాయి. దేశాలపరంగా చూస్తే మొత్తం బ్రాండ్‌ వేల్యూలో 40 శాతం వాటాతో అమెరికా అగ్రస్థానంలో 36 శాతం వాటాతో భారత్‌ రెండో స్థానంలో ఉన్నాయి.

ఇదీ చదవండి: ట్రిలియనీర్లు వచ్చేస్తున్నారహో!

కోలుకుంటున్న మార్కెట్‌ ..

ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్ల కారణంగా 2023 ఆఖర్లో, 2024 తొలినాళ్లలో కార్పొరేట్లు వ్యయాలను తగ్గించుకున్నాయని, అదే సమయంలో కృత్రిమ మేథ సంబంధిత సర్వీసులకు డిమాండ్‌ పెరిగిందని బ్రాండ్‌ ఫైనాన్స్‌ తెలిపింది. అమెరికా మార్కెట్‌ క్రమంగా పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్న నేపథ్యంలో భారతీయ ఐటీ సంస్థలకు ప్రయోజనాలు చేకూరగలవని పేర్కొంది. 2025లో వడ్డీ రేట్లు తగ్గి, కార్పొరేట్లు ఖర్చు చేయడం పెరగడంతో పాటు కొత్త టెక్నాలజీలకు డిమాండ్‌ నెలకొనడం వల్ల ఐటీ సంస్థలు లబ్ధి పొందవచ్చని బ్రాండ్‌ ఫైనాన్స్‌ తెలిపింది. అత్యంత విలువైన బ్రాండ్లన్నీ కూడా మారుతున్న పరిశ్రమ ట్రెండ్స్‌కి అనుగుణంగా కొత్త ఆవిష్కరణలు, వ్యూహాత్మక ప్రాజెక్టులపై దృష్టి పెడుతున్నాయని వివరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement