వచ్చే పదేళ్లలోపే కనీసం ఐదుగురు ఆవిర్భావం
2024లో ప్రపంచ కుబేరుల సంపద 2 ట్రిలియన్ డాలర్లు జంప్
క్రితం ఏడాదితో పోలిస్తే మూడింతల వేగంగా వృద్ధి
15 లక్షల కోట్ల డాలర్లకు పెరుగుదల
దావోస్: ఇప్పటిదాకా మనం కుబేరులను చూసే అబ్బో అనుకుంటున్నాం.. ఇకపై ట్రిలియనీర్ల సంగతి విని నోరెళ్లబెట్టాల్సిందే! ప్రపంచవ్యాప్తంగా కుబేరుల సంపద కుప్పలుతెప్పలుగా పెరిగిపోతోంది మరి. వచ్చే దశాబ్ద కాలంలోనే కనీసం ఐదుగురు ట్రిలియనీర్లుగా (ట్రిలియన్ అంటే లక్ష కోట్ల డాలర్లు. మన కరెన్సీలో రూ.86 లక్షల కోట్లు) అవతరించనున్నారట!! స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు సందర్భంగా ‘టేకర్స్, నాట్ మేకర్స్’ పేరుతో విడుదల చేసిన నివేదికలో ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ ఈ విషయాన్ని వెల్లడించింది.
2024లో ప్రపంచ బిలియనీర్ల సంపద ఏకంగా 2 ట్రిలియన్ డాలర్లు దూసుకెళ్లింది. 2023తో పోలిస్తే మూడింతల వేగంగా వృద్ధి చెంది 15 ట్రిలియన్ డాలర్లకు ఎగబాకడం విశేషం. ప్రస్తుతం 440 బిలియన్ డాలర్ల సంపదతో కుబేరుల కింగ్‌గా ప్రపంచాన్ని ఏలుతున్న ఎలాన్ మస్‌్క.. తొలి ట్రిలియనీర్ రేసులో స్పేస్‌ఎక్స్ రాకెట్లా దూసుకుపోతున్నారు. ఆయన తర్వాత రెండో స్థానంలో ఉన్న అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సంపద మస్‌్కతో పోలిస్తే దాదాపు సగమే (239 బిలియన్ డాలర్లు)!
అసమానతలు పెరిగిపోతున్నాయ్
ప్రపంచ కుబేరుల సంపదలో 60 శాతం వారసత్వంగా, గుత్తాధిపత్య బలం, రాజకీయ సంబంధాల ద్వారానే సమకూరుతోందని, వాళ్ల స్వశక్తితో సంపాదించినది కాదని కూడా ఆక్స్‌ఫామ్ నివేదిక పేర్కొంది. 1990 నుంచి ఇప్పటిదాకా పేదల స్థితిగతులు ఏమాత్రం మారలేదని స్పష్టం చేసింది. విచ్చలవిడి సంపద వృద్ధికి అడ్డుకట్ట వేసి, సమాజంలో నెలకొన్న తీవ్ర ఆర్థిక అసమానతలను తగ్గించాలంటే బిలియనీర్లపై భారీగా పన్నులు విధించాల్సిన అవసరం ఉందని కూడా ప్రభుత్వాలను అభ్యర్థించింది. ‘వలసవాదంతో వివిధ దేశాల నుంచి సంపదను కొల్లగొట్టిన కొన్ని అగ్ర రాజ్యాలు వాటికి తగిన మూల్యాన్ని చెల్లించాలి.
ప్రపంచంలో కోట్లాది మంది ఆకలితో అలమటిస్తుంటే.. కుబేరుల సంపద మాత్రం ఆకాశమేహద్దుగా ఎగబాకుతుండటం ఆందోళనక కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంపద సృష్టిలో అత్యధిక మొత్తం బహుళజాతి కార్పొరేట్ కంపెనీల చేతిలోకి వెళ్లిపోతోంది. ఈ ఆధునిక వలసవాదం మరింత ఆందోళనకరం. కోట్లకు పడగలెత్తిన కుబేరులపై పన్నుల మోత మోగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమితాబ్ బెహర్ పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడిగా బిలియనీర్ ట్రంప్ పగ్గాలు చేపడుతుండగా.. ఆయన సలహాదారుగా ప్రపంచ అపరకుబేరుడు మస్క్ ఉన్నారని, ప్రపంచానికి ఇదొక మేల్కొలుపుగా అభిప్రాయపడ్డారు. అమెరికా చరిత్రలోనే తొలిసారిగా ట్రంప్ కేబినెట్‌లో ఏకంగా 13 మంది బిలియనీర్లు కొలువుదీరిన విషయాన్ని బెహర్ ప్రస్తావించారు.
రిపోర్ట్ హైలైట్స్...
⇒ ప్రపంచంలో టాప్–10 అపర కుబేరుల సంపద 2024లో రోజుకు 10 కోట్ల డాలర్ల చొప్పున ఎగబాకింది. వారి సంపద రాత్రికిరాత్రి 99 శాతం ఆవిరైపోయినా కూడా బిలియనీర్లుగానే కొనసాగుతారు.
⇒ ప్రపంచంలోని మొత్తం బిలియనీర్ల సంపద సగటున రోజుకు 570 కోట్ల డాలర్ల చొప్పున పెరిగింది.
⇒ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తదితర గ్లోబల్ నార్త్ దేశాల్లోని 1% అపర కుబేరులకు గ్లోబల్ సౌత్ దేశాల ఆర్థిక వ్యవస్థల నుంచి గంటకు
3 కోట్ల డాలర్ల సంపద బదిలీ అవుతోంది.
⇒ ప్రపంచ జనాభాలో గ్లోబల్ నార్త్ దేశాల వాటా 21 శాతమే అయినప్పటికీ... ప్రపంచ సంపదలో 69 శాతం ఆ దేశాలదే!
కొత్త కుబేరులు రయ్
2024లో మొత్తం కుబేరుల సంఖ్య 2,769కి ఎగబాకింది. 2023లో ఉన్న 2,565 మంది బిలియనీర్లతో పోలిస్తే కొత్తగా 204 మంది ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. అంటే సగటున వారానికి నలుగురు బిలియనీర్లు ఆవిర్భవించినట్లు లెక్క. ఇక ఆసియా నుంచి కొత్తగా 41 మంది కొత్త బిలియనీర్లు అవతరించారు. ఆసియా బిలియనీర్ల మొత్తం సంపద గతేడాది 299 బిలియన్ డాలర్లు దూసుకెళ్లింది.
Comments
Please login to add a commentAdd a comment