ఇండిగో రూ. లక్షన్నర కోట్ల విమానాల ఆర్డరు
250 ఏ-320ల కోసం ఎయిర్‌బస్‌తో ఒప్పందం
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ఇండిగో తాజాగా ఎయిర్‌బస్‌కి చెందిన ఏ-320 విమానాలను 250 కొనుగోలు చేస్తోంది. ఈ డీల్ విలువ దాదాపు రూ. 1.55 లక్షల కోట్లు (25.5 బిలియన్ డాలర్లు). ఇందుకు సంబంధించిన అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఇరు కంపెనీలు వెల్లడించాయి. యూరోపియన్ కంపెనీ అయిన ఎయిర్‌బస్‌కి సంఖ్యాపరంగా ఒకే సంస్థ నుంచి ఇంత పెద్ద ఆర్డరు రావడం ఇదే మొదటిసారి. ఆర్డరు విలువను ఎయిర్‌బస్ వెల్లడించనప్పటికీ కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం ఒక్కో ఏ-320 విమానం ధర 102.8 మిలియన్ డాలర్లు.
ఇండిగో 2005లో 100 విమానాలు, 2011లో 180 ఏ-320 నియో విమానాలను ఆర్డరు ఇచ్చింది. ఇంధనాన్ని పొదుపుగా వినియోగించే ఏ-320 నియో విమానాల డెలివరీ వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఇండిగో 180 సీట్లుండే 83 ఏ-320 విమానాలతో సర్వీసులు నడుపుతోంది. అదనంగా విమానాలను సమకూర్చుకోవడం వల్ల మరింత మంది కస్టమర్లు, మార్కెట్లకు చేరువయ్యేందుకు, ఉపాధి అవకాశాలు పెంచేందుకు తోడ్పడగలదని ఇండిగో ప్రెసిడెంట్ ఆదిత్య ఘోష్ తెలిపారు.