
తక్కువ ధరకే సామాన్యుడికి విమాన ప్రయాణ అనుభూతి అందించాలన్న మరో ప్రయత్నంలో ముందడుగు పడింది.
Rakesh Jhunjhunwala Akasa Air Ties Up With Boeing: భారత బిలియనీర్, స్టాక్ మార్కెట్ నిపుణుడు రాకేష్ ఝున్‌ఝున్‌వాలా స్టార్టప్ ఎయిర్‌లైన్ ‘ఆకాశ ఎయిర్’ నుంచి మరో అడుగు ముందుకు పడింది. కిందటి నెలలో సివిల్ ఏవియేషన్ నుంచి అనుమతులు పొందిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఆకాశ నుంచి బోయింగ్‌కు రూ.75,000 కోట్ల ఆర్డరు వెళ్లిందని సమాచారం.
అతిత్వరలోనే 70 నుంచి 80 దాకా 737 మ్యాక్స్ విమానాలకు సంబంధించిన ఒప్పందాన్ని ఈ కంపెనీ కుదుర్చుకోనుందని వార్తాసంస్థ బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. ఈనెల 14న మొదలయ్యే ‘దుబాయ్ ఎయిర్‌షో’లో అమెరికాకు(చికాగో) చెందిన బోయింగ్‌తో కుదుర్చుకునే ఒప్పందం గురించి ఆకాశ ప్రకటించే అవకాశం ఉందని ఆ వార్తా సంస్థ చెబుతోంది. అయితే ఆకాశ మాత్రం ఈ ఒప్పందంపై ఎలాంటి ప్రకటన వెలువరించలేదు.
ప్రస్తుత ధరల ప్రకారం.. ఈ ఒప్పంద విలువ 10 బిలియన్ డాలర్ల (రూ.75,000 కోట్ల) వరకు ఉండొచ్చని అంచనా. తక్కువ ధరతో సామాన్యుడికి విమాన ప్రయాణం అందించాలన్న బిగ్‌బుల్(ఝున్‌ఝున్‌వాలా) ప్రయత్నం ఏమేర సక్సెస్ అవుతుందో చూడాలి మరి. అయితే ఒక వేళ బోయింగ్ ఈ ఆర్డరును పొందితే కనుక భారత్‌లో ఎయిర్‌బస్ సంస్థకు ఉన్న ఆధిపత్యాన్ని గండి పడినట్లే అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికల్లా కార్యకలాపాలను మొదలుపెట్టాలని ఆకాశ ఎయిర్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.
చదవండి: చేతిలో చిల్లిగవ్వ లేదు.. ఇంగ్లీష్ రాదు.. కానీ బిలియనీర్ అయ్యాడు