
బోయింగ్ కష్టాలు ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలకు సవాలుగా మారుతున్నాయి. భారత విమానయాన సంస్థ ఆకాసా ఎయిర్‌కు డెలివరీ ఇవ్వాల్సిన బోయింగ్ 737 మ్యాక్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఆలస్యం అవుతుండడంతో ఉన్నతాధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పనిలేకుండా ఖాళీగా ఉన్న వందలాది మంది పైలట్లను శాంతింపజేయడానికి బోయింగ్ ప్రయత్నిస్తోందని ఆకాసా ఎయిర్ తీవ్రంగా విమర్శిస్తోంది.
ముంబైకి చెందిన ఆకాసా ఎయిర్ సుమారు మూడు సంవత్సరాల క్రితం కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ సంస్థ ఇప్పటివరకు 27 విమానాల ఫ్లీట్‌ను కలిగి ఉంది. వీటి సంఖ్యను క్రమంగా పెంచుకోవాలని కంపెనీ యోచించింది. భవిష్యత్తులో వీటి సంఖ్యను 226ను తీసుకెళ్లాలని నిర్ణయించింది. అందుకోసం బోయింగ్ 737 మ్యాక్స్‌లను ఆర్డర్ ఇచ్చింది. ఈ క్రమంలో గత ఏడాది మిడ్ ఎయిర్ క్యాబిన్ ప్యానెల్‌లో సమస్యలు వచ్చిన నేపథ్యంలో బోయింగ్‌పై కొన్ని సంస్థలు కేసు నమోదు చేశాయి. తర్వాత బోయింగ్ 737 ప్రోగ్రామ్ కొన్ని సంస్థల పరిశీలనలోకి వెళ్లింది. దానికితోడు బోయింగ్ కార్మికులు సమ్మె చేయడంతో తయారీ తాత్కాలికంగా నిలిచిపోయింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీకి ఆర్డర్ ఇచ్చిన కంపెనీల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.
ఇదీ చదవండి: వంటలో రారాజులు.. సంపదలో కింగ్‌లు
ఆకాసా వ్యూహాత్మక కొనుగోళ్ల కార్యకలాపాలు సమీక్షిస్తున్న ప్రియా మెహ్రా బోయింగ్‌ను ఉద్దేశించి ‘గదిలో ఏనుగు’గా అభివర్ణించారు. కంపెనీ సహ వ్యవస్థాపకుడు ఆదిత్య ఘోష్ ‘బ్లడీ బోయింగ్.. మా వేగాన్ని తగ్గిస్తుంది’ అంటూ కామెంట్ చేశారు. కంపెనీ సీఈఓ వినయ్ దూబే మాట్లాడుతూ..‘మా సర్వీసులకు డిమాండ్ ఉన్నప్పటికీ తగినన్ని విమానాలు లేవు. డెలివరీలు త్వరగా చేయాలని బోయింగ్‌తో నిరంతరం చర్చలు జరుపుతున్నాం. నాణ్యతను పెంచడానికి, వనరులను క్రమబద్ధీకరించడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాం’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment