Boeing 737
-
అంబానీ జెట్ పైలట్ల జీతం ఎంతంటే..
ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి పటిష్ట భద్రత ఉంటుంది. తాను ప్రయాణించే వాహనాలు, విమానాలు, ప్రైవేట్ జెట్లు.. ఇలా ప్రతిదాన్ని భద్రత పరంగా పకడ్బందీగా నిర్వహిస్తుంటారు. అంబానీ వినియోగించే బోయింగ్ 737 మ్యాక్స్ జెట్‌ను ఇటీవల తనిఖీలు నిర్వహించి వేరే పేరుతో రిజిస్టర్ చేశారు. గతంలో ఈ జెట్ శాన్ మారినో కోడ్ కింద ‘టీ7-లోటస్’ పేరుతో ఉండేది. కొన్ని కారణాల వల్ల ప్రస్తుతం దీన్ని ‘వీటీ-ఏకేవీ’గా రిజిస్టర్ చేశారు.ఈ విలాసవంతమైన జెట్‌ను నడపడానికి ఉత్తమ పైలట్లను మాత్రమే ఎంచుకుంటారు. దేశంలోనే అత్యంత ధనవంతుడి భద్రత, సౌకర్యానికి సంబంధించిన విషయం కావడంతో చాలా పకడ్బందీగా వ్యవహరిస్తారు. ఈ జెట్ నడిపే పైలట్లకు ఏటా వేతనం 1,20,000 డాలర్లు(సుమారు రూ.ఒక కోటి) ఉంటుందని అంచనా.ఇదీ చదవండి: కొత్త సంవత్సరంలో తొలి అడుగులుసుమారు రూ.1,000 కోట్ల విలువైన బోయింగ్ 737 మ్యాక్స్ జెట్‌ను రిలయన్స్ కమర్షియల్ డీలర్స్ లిమిటెడ్ (ఆర్సీడీఎల్) నిర్వహిస్తోంది. దీన్ని నడిపే పైలట్లు నిత్యం భద్రతా ప్రోటోకాల్స్‌ను పాటిస్తూ అప్డేట్గా ఉండటానికి కఠినమైన శిక్షణ ఉంటుంది. ముఖేష్ అంబానీ వద్ద ఉన్న ఇతర ప్రైవేట్ జెట్లను కూడా ఆర్సీడీఎల్ పర్యవేక్షిస్తోంది. ఇది అత్యున్నత స్థాయి విమానయాన భద్రత, నైపుణ్యాన్ని కలిగి ఉంది. -
గాలిలో ప్రాణాలు
దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం నేపథ్యంలో వైమానిక భద్రత మరోసారి చర్చనీయాంశమైంది. గత ఐదారేళ్లుగా అత్యంత ఘోరమైన ప్రమాదాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది... టేకాఫ్ అయిన కాసేపటికే... గత ఐదేళ్లలో అత్యంత విషాదకరమైన, చర్చనీయమైన విమాన ప్రమాదం లయన్ ఎయిర్ ఫ్లైట్ 610. 2018 అక్టోబర్ 29న ఇండోనేసియాలోని జకార్తా నుంచి పాంగ్‌కల్ పినాంగ్‌కు బయలుదేరిన బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానం టేకాఫ్ అయిన కాసేపటికే జావా సముద్రంలో కూలిపోయింది. 189 మంది ప్రయాణికులతో పాటు సిబ్బంది చనిపోయారు. విమానంలోని ఆగ్మెంటేషన్ సిస్టమ్ (ఎంసీఏఎస్)లో లోపమే ప్రమాదానికి కారణమని తేలింది. బోయింగ్ విమానాల రూపకల్పన, ఏవియేషన్ రెగ్యులేటర్లు, ముఖ్యంగా ఫెడరల్ ఏవియేషన్ అడ్మిని్రస్టేషన్ (ఎఫ్ఏఏ) పర్యవేక్షణలో తీవ్ర లోపాలను ఈ దుర్ఘటన ఎత్తిచూపింది. ఐదు నెలలకే మరోటి... లయన్ ఎయిర్ ప్రమాదం జరిగిన ఐదు నెలలకే మరో బోయింగ్ 737 మ్యాక్స్ కూలిపోయింది. 2019 మార్చి 10న ఇథియోపియా ఎయిర్‌లైన్స్ విమానం 302 అడిస్ అబాబా నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో 157 మంది చనిపోయారు. దీనికీ ఎంసీఏఎస్ వ్యవస్థే కారణమని తెలిసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా విమానయాన అధికారులు మాక్స్‌ను నిలిపివేశారు. బోయింగ్ చట్టపరమైన, ఆర్థికపరమైన ఒత్తిళ్లను ఎదుర్కొంది. సముద్రంలో కూలిన విమానం... 2021 జనవరి 9న ఇండోనేషియాలోని జకార్తాలో విమాన ప్రమాదం జరిగింది. సోకర్నో–హట్టాలో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పాంటియానాక్కు బయలుదేరిన బోయింగ్ 737–500 విమానం సముద్రంలో కూలిపోయింది. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే సముద్రంలో కూలిపోవడంతో అందులో ఉన్న 62 మంది చనిపోయారు. ఇండోనేషియాలో ఇటీవలి కాలంలో జరిగిన అత్యంత ఘోరమైన విమాన ప్రమాదం ఇది. యాంత్రిక వైఫల్యం, మానవ తప్పిదం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది. విమానంలోని ఆటోథ్రోటిల్ సిస్టమ్‌లో లోపం వల్ల విమానం ఇంజన్లు అసమతుల్యం కావడంతో అదుపు తప్పి కూలిపోయింది. పైలట్ పరిస్థితికి తగిన విధంగా స్పందించడంలో విఫలమయ్యారని తేలింది. ఈ ప్రమాదం పాత విమానాల నిర్వహణలో అప్రమత్తతను, విమానాల అప్‌గ్రేడేషన్ ప్రాముఖ్యతను నొక్కిచెప్పింది. యాంత్రిక వైఫల్యాలు తలెత్తినప్పుడు ప్రతిస్పందించడానికి విమానయాన సిబ్బంది అందరికీ శిక్షణ ఇవ్వాలని ఉద్ఘాటించింది.ఇళ్లపైనే కూలిన విమానం.. 2020 మే 22న పాకిస్తాన్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) ఫ్లైట్ 8303, ఎయిర్‌బస్ ఎ 320 కరాచీలోని ఇళ్లపై కూలిపోయింది. లాహోర్ నుంచి బయలుదేరిన ఈ విమానంలో 99 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదంలో 41 మంది మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. ల్యాండింగ్ సమయంలో పైలట్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ల్యాండింగ్ గేర్‌లో తలెత్తిన సమస్యల కారణంగా విమానం రన్ వేపైకి దూసుకెళ్లడంతో ఇంజన్లు ధ్వంసమయ్యాయి. చివరకు అదుపు తప్పిన విమానం నివాస ప్రాంతంలోకి దూసుకెళ్లింది. పైలట్లుప్రామాణిక అత్యవసర విధానాలను పాటించలేదని విమానం బ్లాక్ బాక్స్ వెల్లడించింది. ఈ ప్రమాదం పైలట్ల శిక్షణ, నియంత్రణ పర్యవేక్షణలో లోతైన లోపాలను బహిర్గతం చేసింది. పాకిస్తాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీలో శిక్షణ నాణ్యతపై విచారణకు దారితీసింది, రన్‌వే నుంచి జారి లోయలో పడి... గత ఐదేళ్లలో భారత్‌లో జరిగిన అత్యంత ఘోర విమాన ప్రమాదం ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం 1344ది. దుబాయ్ నుంచి వచి్చన ఈ విమానం 2020 ఆగస్టు 7న కేరళలోని కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ అవుతుండగా కూలిపోయింది. ప్రయాణికులు, సిబ్బంది మొత్తం 165 మంది ఉండగా.. 21 మంది మరణించారు. భారీ వర్షాల కారణంగా రన్‌వే తడిసిపోయి ఉంది. ఇక్కడ రన్‌వే పొడవు కూడా తక్కువగా ఉండటంతో ల్యాండ్ అయిన విమానం జారి లోయలో పడిపోయింది. వాతావరణ పరిస్థితులు, మానవ తప్పిదం, రన్ వే మౌలిక సదుపాయాల సరిగా లేకపోవడం వల్ల జరిగిందని దర్యాప్తులో తేలింది. ఈ ప్రమాదం తరువాత దేశంలోని విమానాశ్రయాల మౌలిక సదుపాయాలను సమీక్షించారు. రన్‌వే నుంచి జారి..నేపాన్‌లోని ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పొఖారాకు బయల్దేరిన విమానం టేకాఫ్ సమయంలో కుప్పకూలింది. శౌర్య ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో సిబ్బందితో సహా 19 మంది ఉన్నారు. 18 మంది మృతి చెందగా, పైలట్ కెపె్టన్ ఎంఆర్ షాక్యా తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. రన్‌వే దక్షిణం వైపు నుంచి విమానం టేకాఫ్ అవుతుండగా, రెక్కల కొన భూమిని తాకడంతో ఒక్కసారిగా పలీ్టలు కొట్టింది. దీంతో వెంటనే విమానంలో మంటలు చెలరేగాయి.మంచు కారణంగా... ఈ సంవత్సరం బ్రెజిల్ విమానయాన సంస్థకు చెందిన వోపాస్ 2283, ఏటీఆర్ 72 ట్విన్ఇంజన్ టర్బోప్రాప్ ఆగస్టు 9న కూలిపోయింది. 58 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో సావోపాలో అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరిన విమానం.. సావోపావో సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్నవారంతా మరణించారు. విమాన ప్రమాదానికి మంచు కారణమని తేలింది. పండుగ రోజున ప్రమాదం.. ఇటీవలే.. క్రిస్మస్ పర్వదినాన అజర్బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి ప్రమాదం జరిగింది. అజర్బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం బాకు నుంచి రష్యాలోని గ్రోజీ్నకి వెళ్తుండగా కాస్పియన్ సముద్ర సమీపంలో కూలిపోయింది. విమానంలో 62 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉండగా 38 మంది మరణించారు. ఉక్రెయిన్ వరుస డ్రోన్ దాడులను తిప్పికొడుతున్న రష్యా వైమానిక రక్షణ దళాలు విమానాన్ని కూలి్చవేశాయని రష్యా అంగీకరించింది. దాడి చేసినందుకు అధ్యక్షుడు పుతిన్ క్షమాపణ చెప్పారు. వీడని మిస్టరీ.. చైనాలో జరిగిన అత్యంత విషాద ఘటనల్లో ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ ఎంయూ 5735 కుప్పకూలడం ఒకటి. చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737–800.. 2022 మార్చి 21న దక్షిణ చైనాలోని పర్వతాల్లో కూలిపోయింది. ప్రయాణికులు, సిబ్బంది సహా విమానంలో ఉన్న 132 మంది మరణించారు. విమానం ఎత్తునుంచి కిందికి దించే సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తాత్కాలిక దర్యాప్తులో తేల్చారు. విమానం వేగంగా, ఉద్దేశపూర్వకంగా ల్యాండ్ చేసినట్లు బ్లాక్ బాక్స్ డేటా వెల్లడించింది. ఈ ప్రమాదం యాంత్రిక వైఫల్యమా, మానవ తప్పిదమా అనే విషయంపై అనేక ఊహాగానాలు వచ్చాయి. ఈ విపత్తుకు అసలు కారణం మాత్రం మిస్టరీగా మిగిలిపోయింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నేరం జరిగింది.. రూ.2 వేలకోట్లు చెల్లిస్తాం: బోయింగ్
ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ ‘737 మ్యాక్స్’ ఎయిర్‌క్రాఫ్ట్‌లు కుప్పకూలిన విషయంలో నేరాన్ని అంగీకరించింది. దాంతోపాటు బాధితులకు జరిమానా కింద రూ.243.6 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.2 వేలకోట్లు) చెల్లించేందుకు సిద్ధమైంది. ఈమేరకు అమెరికా న్యాయ సంస్థతో కేసు పరిష్కార షరతులపై సూత్రప్రాయ అంగీకారానికి వచ్చినట్లు బోయింగ్ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఈ ఒప్పందానికి న్యాయమూర్తి అనుమతి లభించాల్సి ఉందని తెలిపారు.ఈ సందర్భంగా బోయింగ్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ..‘2018-19 మధ్యకాలంలో ఇండోనేషియా, ఇథియోపియాలో 737 మ్యాక్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు రెండు నేలకూలాయి. ఈ ఘటనల్లో 346 మంది మరణించారు. ఎయిర్‌క్రాఫ్ట్‌ల్లోని కొన్ని లోపాల వల్ల ప్రమాదాలు జరిగాయి. అందుకు పరిహారంగా బాధిత కుటుంబాలకు రూ.2 వేలకోట్లు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇందుకు అమెరికా న్యాయ సంస్థతో సూత్రప్రాయ అంగీకారానికి వచ్చాం. దీనిపై న్యాయమూర్తి అనుమతి లభించాల్సి ఉంది’ అని చెప్పారు.ప్రమాదాలు జరిగిన వెంటనే బాధిత కుటుంబాలు కోర్టును ఆశ్రయించాయి. బోయింగ్‌ను చట్టపరంగా శిక్షించడంతోపాటు ఆ సంస్థపై ఆర్థికపరంగా కఠిన చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాంతో 2021లో కేసు పరిష్కార ఒప్పందంలో భాగంగా సుమారు రూ.2,000 కోట్లు జరిమానా చెల్లించేందుకు బోయింగ్ అంగీకరించింది. అయితే ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు న్యాయ స్థానం గుర్తించింది. దాంతో సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ పరిణామాల దృష్ట్యా ఇటీవల బోయింగ్ నేరాన్ని అంగీకరించడంతోపాటు గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం రూ.2 వేలకోట్లు జరిమానా ఇచ్చేందుకు సిద్ధమైనట్లు ప్రకటించింది.ఈ ఒప్పందానికి న్యాయమూర్తి అనుమతి లభించాల్సి ఉంది. గతంలో జరిగిన ఒప్పందంలో భాగంగా జరిమానాతోపాటు రక్షణ చర్యల నిమిత్తం వచ్చే మూడేళ్లలో కనీసం రూ.3,700 కోట్లు బోయింగ్ వెచ్చించాల్సి ఉంటుంది. ఆయా ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబీకులను బోయింగ్ బోర్డు కలవాలి. ఒప్పంద షరతులను బోయింగ్ పాటిస్తుందా? లేదా అనే విషయాన్ని పరిశీలించేందుకు ఒక స్వతంత్ర పర్యవేక్షకుడిని కూడా నియమించాలి.ఇదీ చదవండి: ఆయుష్మాన్ భారత్ బీమా కవరేజీ పెంపు..?ఇదిలాఉండగా, నేర అంగీకారం వల్ల అమెరికా రక్షణ విభాగం, నాసా లాంటి ప్రభుత్వ విభాగాల నుంచి కాంట్రాక్టులు పొందే విషయంలో బోయింగ్ సామర్థ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
విమానంలో 135 మంది ప్రయాణికులు.. గాల్లోనే ఊడిన ఇంజిన్ కవర్
విమానం గాల్లోకి ఎగిరిన కాసేపటికే దాని ఇంజిన్ కవర్ ఊడిపోయిన సంఘటన ఇటీవల అమెరికాలోని డెన్వర్ ఎయిర్‌పోర్టులో చోటు చేసుకుంది. యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపిన వివరాల ప్రకారం.. సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737-800 విమానం 135 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో డెన్వర్ ఎయిర్‌పోర్టు నుంచి హోస్టన్కు బయల్దేరింది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికి ఇంజిన్ కవర్ ఊడిపోయింది. అలా ఊడిన కవర్ విమానం కుడివైపు రెక్కలపై ఉన్న ఫ్లాప్స్‌లో చిక్కుకుంది. విమాన సిబ్బంది, పైలట్లు సమస్యను వెంటనే గుర్తించి అప్పటికే గాల్లో ఉన్న విమానాన్ని సురక్షితంగా వెనక్కి మళ్లించి, కిందకు దించారు. డెన్వర్ ఎయిర్‌పోర్ట్‌లోని గ్రౌండ్ సిబ్బంది తగిన చర్యలు చేపట్టారు. ఘటన సమయంలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ప్రయాణికులను వేరే విమానంలో హోస్టన్కు తరలించారు. ఘటనకు సంబంధించి అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: లగేజీ తీసుకురావడానికి రూ.25 కోట్ల కాన్వాయ్! గతంలోనూ అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 ఎయిర్‌క్రాఫ్ట్ గాల్లో ఉండగానే డోర్ ఒక్కసారిగా ఊడిపోయిన విషయం తెలిసిందే. ఇటీవల జపాన్‌లో అల్ నిప్పాన్ ఎయిర్వేస్కు చెందిన బోయింగ్ 737-800 కాక్‌పిట్ అద్దంలో పగుళ్లు గుర్తించిన పైలట్లు.. విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. అలస్కా విమాన ఘటన తర్వాత బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానాలను అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) ఆకాశంలోకి ఎగరనీయకుండా కట్టడి చేసింది. -
ఒకేసారి 150 విమానాలు.. హైదరాబాద్ వేదికగా ఆర్డర్
WingsIndia2024: ప్రముఖ విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్‌లైన్స్ ఏకంగా 150 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను కొనుగోలు చేయడానికి ఆర్డర్ ఇచ్చింది. హైదరాబాద్‌లో జరిగిన వింగ్స్ ఇండియా ఈవెంట్లో దీనికి సంబంధించిన ఒప్పందం కుదుర్చుకున్నట్లు సీఈఓ వినయ్ దూబే వెల్లడించారు. ఆకాశ ఎయిర్ భారతదేశపు సరికొత్త విమానయాన సంస్థ అయినప్పటికీ.. 2022లో కార్యకలాపాలను ప్రారంభించినప్పటి నుంచి నాలుగు శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఇప్పటికే ఈ కంపెనీ గతంలో 72 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలకు ఆర్డర్ ఇచ్చింది. ఇందులో 22 విమానాలను డెలివరీ చేసుకుని నిర్వహణలో ఉంచింది. అంతర్జాతీయ విస్తరణ వైపు అడుగులు వేస్తున్న ఆకాశ ఎయిర్ ప్రణాళికలో భాగంగానే ఈ కొత్త ఆర్డర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అనుకున్నవన్నీ సవ్యంగా జరిగితే.. భారత్ నుంచి ఆగ్నేయాసియా, మిడిల్ ఈస్ట్ సహా సమీప విదేశీ గమ్యస్థానాలకు వెళ్లేందుకు వీలుగా బోయింగ్ విమానాలను ఉపయోగిస్తారు. ఇదీ చదవండి: టీసీఎస్ వర్క్ ఫ్రమ్ హోమ్.. సీఈఓ ఏమన్నారంటే? గత ఏడాది మరో ఎయిర్‌లైన్స్‌లో చేరటానికి ఎలాంటి నోటీసు లేకుండానే సుమారు 40 మంది పైలట్లు రాజీనామా చేయడంలో విమానయాన సంస్థ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో సంస్థ సంక్షోభంలోకి వెళ్ళింది. ఆ సమయంలోనే ఆకాశ ఎయిర్ తన కార్య కలాపాలను నిలిపివేసే అవకాశం ఉందని చాలామంది భావించారు. ఆ తరువాత కొత్త ఫైలెట్లను నియమించుకుని ముందుకు సాగుతోంది. Thank you, Hon’ble @JM_Scindia for your constant support and encouragement. We are proud to be a part of the India growth story and are committed to create an inclusive travel environment by connecting people, places, and cultures. #AkasaAir #ItsYourSky #WingsIndia2024 https://t.co/5AhlZ30z1j — Akasa Air (@AkasaAir) January 18, 2024 -
విమానంలో లీకేజీ.. ప్రయాణానికి తప్పని తిప్పలు
బోయింగ్ విమానాలను ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మక విమానయాన సంస్థలు వినియోగిస్తున్నాయి. అయితే వాటిలో తరచూ వస్తున్న సాంకేతికలోపాలతో ప్రయాణికులు, సంస్థ యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల బోయింగ్ విమానం గాల్లోనే ఉండగా డోర్ ఊడిపోయిన ఘటనలు, టేకాఫ్ అయిన కాసేపటికే కాక్‌పిట్ అద్దాలు పగలడం చూశాం. ఈ తిప్పలు కేవలం సామాన్యులకే కాదు ఏకంగా అగ్రరాజ్యంలో దౌత్యవేత్తకు తప్పలేదు. తాజాగా అమెరికా దౌత్యవేత్త ఆంటోనీ బ్లింకెన్ దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యారు. సదస్సు నుంచి తిరిగివెళ్లేందుకు ప్రయత్నించగా ఆయన ప్రయానిస్తున్న బోయింగ్ 737 ఎయిర్‌క్రాఫ్ట్‌లో లోపాన్ని గుర్తించారు. అందులో ఆక్సిజన్ లీకేజీ అవుతున్నట్లు సిబ్బంది గమనించారు. దాంతో వెంటనే ఆ సమాచారాన్ని ఆంటోనీకి చేరవేశారు. చాలా సమయం వరకు సిబ్బంది సమస్యను పరిష్కరించకపోవడంతో తన అమెరికా ప్రయాణం ఆలస్యమైనట్టు మీడియా కథనాలు తెలిపాయి. అయితే గతంలో ఈ విమానంలో ఇదే సమస్య తలెత్తినట్లు చెప్పారు. ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యంత విలువైన టాప్10 కరెన్సీలు ఇవే.. సెప్టెంబరులో జస్టిన్ ట్రూడోకు ఇలాంటి సంఘటన ఎదురైంది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన విమానంలో మెకానికల్ లోపం కారణంగా జీ20 శిఖరాగ్ర సమావేశం తర్వాత భారతదేశంలోని న్యూదిల్లీలో చిక్కుకున్నారు. అలస్కా విమాన ఘటన తర్వాత బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానాలను అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) ఆకాశంలోకి ఎగరనీయకుండా కట్టడి చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల వీటిపై ఆంక్షలను మరింత కాలం పొడిగించింది. యునైటెడ్ స్టేట్స్ ఏవియేషన్ రెగ్యులేటర్ కొత్త భద్రతా తనిఖీల కోసం బోయింగ్ 737 మాక్స్ 9 విమానాల పర్యవేక్షణను కఠినతరం చేయబోతున్నట్లు గతంలోనే తెలిపింది. -
గాల్లో ఉండగానే కాక్‌పిట్ అద్దంలో పగుళ్లు!
అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానానికి ఇటీవలే పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగానే బోయింగ్ 737 ఎయిర్‌క్రాఫ్ట్ డోర్ ఒక్కసారిగా ఊడిపోయింది. విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఈ ప్రమాదం జరిగింది. దాంతో బోయింగ్ 737 మ్యాక్స్‌లను అన్ని దేశాలు పక్కన పెట్టేశాయి. కానీ, ఆ సంస్థకు చెందిన ఇతర విమానాల్లో లోపాలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా జపాన్‌లో అల్ నిప్పాన్ ఎయిర్వేస్కు చెందిన బోయింగ్ 737-800 కాక్‌పిట్ అద్దంలో పగుళ్లు గుర్తించిన పైలట్లు.. విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు సంస్థ తెలిపింది. ‘సపోరో-న్యూ చిటోస్ నుంచి తొయామకు బయల్దేరిన ఫ్లైట్ 1182 గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే నాలుగు లేయర్లు కలిగిన కాక్‌పిట్ అద్దంలో పగుళ్లు వెలుగు చూశాయి. అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించారు. ఘటన జరిగిన సమయంలో విమానంలో ఆరుగురు సిబ్బందితోపాటు 59 మంది ప్రయాణికులు ఉన్నారు’ అని ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో చెప్పింది. ఇదీ చదవండి: కీలక టారిఫ్‌లను తొలగించనున్న జియో, ఎయిర్టెల్? అలస్కా విమాన ఘటన తర్వాత బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానాలను అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) ఆకాశంలోకి ఎగరనీయకుండా కట్టడి చేసింది. తాజాగా వీటిపై ఆంక్షలను మరింత కాలం పొడిగించింది. యునైటెడ్ స్టేట్స్ ఏవియేషన్ రెగ్యులేటర్ కొత్త భద్రతా తనిఖీల కోసం బోయింగ్ 737 మాక్స్ 9 విమానాల పర్యవేక్షణను కఠినతరం చేయబోతున్నట్లు తెలిపింది. మరిన్ని భద్రతా పరీక్షల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. భారత్‌లోనూ వైమానిక రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ దీనిపై దృష్టి పెట్టింది. అత్యవసర ద్వారాలను తక్షణమే తనిఖీ చేయాలని దేశీయ ఎయిర్‌లైన్స్ సంస్థలకు గతవారం మార్గదర్శకాలు జారీ చేసింది. -
Alaska Airlines Boeing 737-9 Max: గాల్లో గజగజ
అది అమెరికాలో ఓరెగాన్‌లోని పోర్ట్లాండ్ విమానాశ్రయం. శుక్రవారం సాయంత్రం 4.52 గంటలు. అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన అత్యాధునిక బోయింగ్ 737 మాక్స్ 9 విమానం 174 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో కాలిఫోర్నియాలోని ఒంటారియో బయల్దేరింది. టేకాఫ్ తీసుకుని, చూస్తుండగానే వేగం పుంజుకుని దాదాపు 5 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లింది. బయల్దేరిన ఆరు నిమిషాలకే విమానం రెక్క వెనక ప్రయాణికుల వరుసను ఆనుకుని ఉన్న కిటికీతో పాటు కొంత భాగం ఉన్నట్టుండి ఊడి గాల్లో కలిసిపోయింది. ఒక ఫ్రిజ్‌ను మించిన పరిమాణంలో పెద్ద రంధ్రం పడింది. దాంతో విపరీతమైన వేగంతో పెను గాలులు లోనికి దూసుకొచ్చాయి. వాటి దెబ్బకు విమానం పిచ్చి పట్టినట్టు అటూ ఇటూ ఊగిపోవడం మొదలుపెట్టింది. లోపల వాయు పీడనం పూర్తిగా తగ్గిపోవడంతో ప్రయాణికులంతా ప్రాణ భయంతో వణికిపోయారు. రంధ్రంలోంచి దూసుకొస్తున్న పెను గాలుల వేగానికి ఆ వరుసలోని సీట్లోనే కూర్చున్న ఒక చిన్నారి చిగురుటాకులా వణికిపోయాడు. గాలి విసురుకు అతని షర్టు ఒంటి నుంచి విడివడి అమాంతంగా బయటికి దూసుకెళ్లింది. దాంతో పాటే బాబు కూడా గాల్లోకి లేవడంతో తల్లి పెను కేకలు వేసింది. బలమంతా ఉపయోగించి అతన్ని గట్టిగా కౌగిలించుకుని ఆపింది! ఇంకో ప్రయాణికుని చేతిలోని సెల్ ఫోన్ గాలి విసురుకు శరవేగంగా విమానంలోంచి బయటికి దూసుకెళ్లింది. దాంతో విమానమంతటా హాహాకారాలు చెలరేగాయి. ప్రాణభయంతో ప్రయాణికులు ఆర్తనాదాలు చేశారు. సీట్ బెల్టులు పెట్టుకుని సీట్లను గట్టిగా కరుచుకున్నారు. అందరి ప్రాణాలూ అక్షరాలా గాల్లో వేలాడాయి. 10 నిమిషాలకు పైగా నరకం చూసిన అనంతరం విమానాన్ని పైలట్ కల్లోలం మధ్యే అతి కష్టంగా వెనక్కు మళ్లించింది. నిబ్బరంగా కిందికి దించి సాయంత్రం 5.27కు తిరిగి పోర్ట్లాండ్ విమానాశ్రయంలోనే సురక్షితంగా లాండ్ చేసింది. దాంతో బతుకు జీవుడా అంటూ అంతా ఊపిరి పీల్చుకున్నారు. అచ్చం హాలీవుడ్ సినిమాను తలపించిన ఈ ప్రమాదం బారి నుంచి కొద్దిపాటి గాయాలు మినహా అంతా సురక్షితంగా బయట పడ్డారు. నరకం అంచులకు వెళ్లొచ్చాం... ప్రమాదం జరిగిన తీరును వివరిస్తూ ప్రయాణికుల్లో పలువురు భయోద్వేగాలకు లోనయ్యారు. ‘‘విమానం వెనక వైపు నుంచి పెద్ద శబ్దం విని్పంచింది. ఏమిటా తిరిగి చూసేలోపే పెను గాలులు విమానమంతటినీ ఈ డ్చి కొట్టడం మొదలైంది’’ అని ఎవాన్ స్మిత్ చెప్పాడు. ‘‘నేను పక్క వరుసలో కూర్చుని ఉన్నాను. చూస్తుండగానే నా కళ్లముందే అటువైపున్న కిటికీతో పాటు దాని చుట్టుపక్కల భాగమంతా ఎవరో బయటి నుంచి లాగేసినట్టుగా ఊడి కొట్టుకుపోయింది. ఆ కిటికీ సీట్లో ఎవరూ లేరు కాబట్టి సరిపోయింది’’ అంటూ జెస్సికా అనే ప్రయాణికురాలు చెప్పు కొచి్చంది. అక్షరాలా నరకం అంచుల దాకా వెళ్లి అదృష్టం కొద్దీ సురక్షితంగా బయట పడ్డామంటూ వణికిపోయింది. ‘‘ఎమర్జెన్సీలో చిక్కుకున్నాం. గాలి పీడనం పూర్తిగా తగ్గిపోయింది. మేం తక్షణం ల్యాండవ్వాలి’’ అని గ్రౌండ్ కంట్రోల్‌ను పైలట్ రిక్వెస్ట్ చేస్తున్న ఆడియో క్లిప్ వైరల్‌గా మారింది. ఆ విమానాల నిలిపివేత... ప్రయాణికులకు ఎదురైన భయానక అనుభవాన్ని తలచుకుంటేనే గుండె తరుక్కుపోతోందని అలస్కా ఎయిర్‌లైన్స్ సీఈఓ బెన్ మినికుచి తీవ్ర విచారం వెలిబుచ్చారు. ప్రమాదం నేపథ్యంలో పూర్తిస్థాయి తనిఖీలు, భద్రతా పరీక్షలు జరిగేదాకా తమ వద్ద ఉన్న మొత్తం 65 బోయింగ్ 737 మాక్స్ 9 రకం విమానాలనూ పక్కన పెడుతున్నట్టు ప్రకటించారు. తనిఖీలకు పూర్తిగా సహకరిస్తామని బోయింగ్ సంస్థ ప్రకటించింది. ఈ ఉదంతంపై నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ విచారణ జరుపుతోంది. – పోర్ట్‌ల్యాండ్ (అమెరికా) తొలిసారి కాదు.. బోయింగ్ 737 మాక్స్ రకం విమానాలు ప్రమాదాల బారిన పడటం ఇది తొలిసారేమీ కాదు. 2018, 2019ల్లో ఈ రకానికి చెందిన రెండు విమానాలు కూలిపోయి వాటిలో ఉన్నవారంతా దుర్మరణం పాలయ్యారు. దాంతో ప్రపంచమంతటా ఈ విమానాల వాడకాన్ని ఏడాదిన్నర పాటు నిలిపేశారు. కానీ వాటితో పోలిస్తే తాజా ప్రమాదం చాలా భిన్నమైనదని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 1,300కు పైగా బోయింగ్ 737 మాక్స్ రకం విమానాలు వాడకంలో ఉన్నాయి. వీటిలో మాక్స్ 9 అత్యాధునిక విమానాలు. భారత్‌లోనూ ఆకాశ ఎయిర్, స్పైస్‌జెట్, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలు 40కి పైగా బోయింగ్ 737 మాక్స్ 8 రకం విమానాలను దేశీయ రూట్లలో నడుపుతున్నాయి. అమెరికా విమాన ప్రమాదం నేపథ్యంలో వాటన్నింట్లనూ తక్షణం క్షుణ్నంగా భద్రతా తనిఖీలు నిర్వహించాలని డీజీసీఏ ఆదేశించింది. -
విమానం గాల్లో ఉండగా ఊడిపోయిన డోర్.. వీడియో వైరల్
అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగా.. ఎయిర్‌క్రాఫ్ట్ డోర్ ఒక్కసారిగా ఊడిపోయింది. విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఈ ప్రమాదం జరిగింది. అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ 9(1282) విమానం పోర్టులాండ్ నుంచి ఒంటారియాకు(కెనడా) గురువారం సాయంత్రం బయలు దేరింది. 171 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో వెళ్తున్న ఈ ఎయిర్‌క్రాఫ్ట్ టేకాఫ్ అయిన కొంత సమయానికే మిడ్ క్యాబిన్ ఎగ్జిట్ డోర్ విమానం నుంచి పూర్తిగా విడిపోయింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయందోళనకు గురయ్యారు. వెంటనే గమనించిన పైలెట్.. విమానాన్ని తిరిగి పోర్ట్లాండ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. 🚨#BREAKING: Alaska Airlines Forced to Make an Emergency Landing After Large Aircraft Window Blows Out Mid-Air ⁰⁰📌#Portland | #Oregon ⁰A Forced emergency landing was made of Alaska Airlines Flight 1282 at Portland International Airport on Friday night. The flight, traveling… pic.twitter.com/nt0FwmPALE — R A W S A L E R T S (@rawsalerts) January 6, 2024 విమానం ఆకాశంలో ఉండగా డోర్ ఊడిపోయి సమయం దృశ్యాలను ప్రయాణికులు వీడియో తీయగా.. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై అలస్కా ఎయిర్‌లైన్స్ స్పందించింది. ఈ ఘటనతో ప్రభావితులైన ప్రయాణికులు, సిబ్బంది పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంది. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. AS1282 from Portland to Ontario, CA experienced an incident this evening soon after departure. The aircraft landed safely back at Portland International Airport with 171 guests and 6 crew members. We are investigating what happened and will share more as it becomes available. — Alaska Airlines (@AlaskaAir) January 6, 2024 ఇక ఈ సంఘటన అనంతరం అలాస్కా ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ‘ఫ్లైట్ 1282లో గురువారం రాత్రి జరిగిన పరిణామంతో మా బోయింగ్ 737-9కు సంబంధించిన 65 విమానాలను ముందు జాగ్రత్త చర్యలో భాగంగా తాత్కాలికంగా నేలకు పరిమితం చేస్తున్నాం’ అని ఎయిర్లైన్సన్ సీఈవో బెన్స్ మినికుచి పేర్కొన్నారు. పూర్తి మెయింటెనెన్స్, సేఫ్టీ తనిఖీల తర్వాత ప్రతి విమానం తిరిగి సేవలందించనున్నట్లు ఆయన తెలిపారు. -
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్రంగా సరికొత్త ప్రాజెక్ట్
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల విమానాలను ఫ్రైటర్లుగా మార్చే సరికొత్త ప్రాజెక్టు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్రంగా ప్రారంభమైంది. ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని కల్పిస్తున్న బోయింగ్–737 విమానాన్ని ఫ్రైటర్గా మార్చనున్నారు. ఈ మేరకు విమానాశ్రయంలో మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్ హాలింగ్ (ఎంఆర్ఓ) సేవలు అందజేసే జీఎమ్మార్ ఎయిరో టెక్నిక్ (జీఏటీ)కి, బోయింగ్ సంస్థకు మధ్య తాజాగా ఒప్పందం కుదిరింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు తరువాత అతిపెద్ద ఎయిర్‌పోర్టుగా సేవలందిస్తున్న హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలోనే మొట్టమొదటిసారి విమానాల మార్పు రంగంలోకి అడుగుపెట్టినట్లయింది. ఈ తరహా కన్వర్షన్ సాంకేతిక పరిజ్ఞానం అమలులో చైనా, బ్రిటన్, కోస్టారికా తరువాత నాలుగో స్థానంలో హైదరాబాద్ నిలిచినట్లు ఎయిర్‌పోర్టు అధికారవర్గాలు తెలిపాయి. ఈ ఒప్పందం మేరకు బోయింగ్ –737 నుంచి బోయింగ్ –800 వరకు ప్రయాణికుల విమానాలను బోయింగ్ కన్వర్టెడ్ ఫ్రైటర్స్ (బీసీఎఫ్)గా మార్పు చేయనున్నారు. ఈ ఏడాది నుంచి రానున్న ఐదేళ్లలో 30 విమానాలను ఫ్రైటర్లుగా అభివృద్ధి చేయనున్నారు. ఒప్పందం ప్రతిష్టాత్మకం విమానాల కన్వర్షన్ కోసం బోయింగ్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్ హాలింగ్ కేంద్రాల నుంచి బిడ్లను ఆహా్వనించగా చివరకు హైదరాబాద్ ఎయిర్‌పోర్టులోని ఎంఆర్ఓకు ఈ కాంట్రాక్ట్ లభించడం విశేషం. రానున్న రోజుల్లో బోయింగ్ సరుకు రవాణా రంగంలో తన సేవలను మరింత విస్తృతం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సుమారు 75 ఫ్రైటర్లను బోయింగ్ అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. దీంతో ఎయిర్ కార్గోలో ఇది 6.3 శాతం వరకు విస్తరించనుందని పేర్కొన్నారు. మరోవైపు ఈ–కామర్స్ రంగం పెద్దఎత్తున అభివృద్ధి చెందిన దృష్ట్యా హైదరాబాద్ నుంచి అమెరికాతోపాటు వివిధ దేశాలు, మన దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు మధ్య ఫ్రైటర్స్ డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. కోవిడ్ దృష్ట్యా అంతర్జాతీయంగా రాకపోకలు తగ్గుముఖం పట్టడంతో పలు ఎయిర్‌లైన్స్ సరుకు రవాణా రంగంలోకి తమ సేవలను మార్పు చేశాయి. ఈ క్రమంలోనే బోయింగ్ సైతం ఈ రంగంలో విస్తరణకు చర్యలు చేపట్టింది. బోయింగ్ సంస్థ గత 40 ఏళ్లుగా ప్రయాణికుల సేవలో ఉంది. ఎంఆర్ఓలదే భవితవ్యం ప్రపంచవ్యాప్తంగా విమానాల మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాలింగ్(ఎంఆర్ఓ) సేవలకు గొప్ప భవిష్యత్తు ఉందని జీఎమ్మార్ ఎయిరో టెక్నిక్ సంస్థ సీఈవో అశోక్ గోపీనాథ్ వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తాము ఎంఆర్ఓ సేవలను అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి అన్ని ప్రధాన అంతర్జాతీయ నగరాలకు కార్గో సేవలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. -
బోయింగ్‌కు హైదరాబాద్ నుంచి తొలి ‘ఫిన్’ డెలివరీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ ప్లాంటులో తయారు చేసిన తొలి ’వర్టికల్ ఫిన్’ భాగాన్ని అమెరికాలోని బోయింగ్ విమానాల తయారీ కేంద్రానికి పంపించినట్లు టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (టీబీఏ) వెల్లడించింది. దీన్ని అమెరికాలోని వాషింగ్టన్లో ఉన్న బోయింగ్ ప్లాంటుకు డెలివరీ చేస్తారు. అక్కడ బోయింగ్ 737 విమానానికి అమరుస్తారు. నిట్టనిలువుగా ఉండే వర్టికల్ ఫిన్ భాగాన్ని విమానానికి స్థిరత్వాన్నిచ్చేలా ఎయిర్‌క్రాఫ్ట్ తోకపై ఏర్పాటు చేస్తారు. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, బోయింగ్ కలిసి టీబీఏను జాయింట్ వెంచర్ సంస్థగా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సంక్లిష్టమైన వర్టి కల్ ఫిన్ భాగాల తయారీ కోసం టీబీఏ గతేడాదే కొత్త లైన్‌ను ప్రారంభించింది. 14,000 చ.మీ. విస్తీర్ణంలోని టీబీఏ ప్లాంటులో బోయింగ్ ఏహెచ్–64 అపాచీ హెలికాప్టర్లకు కావాల్సిన ఏరో–స్ట్రక్చర్స్ మొదలైన వాటిని తయారు చేస్తున్నారు. (ఇదీ చదవండి: డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టే మొదటి ప్రత్యేక ఫండ్ ఇదే...) -
పైలట్లు ఇద్దరూ నిద్రపోయారు.. గమ్యస్థానం దాటేసిన తర్వాత మేలుకున్నారు!
అడీస్ అబాబా: ప్రయాణంలో ప్రతిక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఎయిర్‌పోర్ట్‌లో రన్‌వే పై విమానాన్ని భద్రంగా దించాల్సిన పైలట్లు హాయిగా నిద్రపోయారు. గమ్యస్థానం దాటేసిన తర్వాత విమానంలో అలారం మోగాక హఠాత్తుగా నిద్ర నుంచి మేలుకున్నారు. ఆఫ్రికా ఖండంలోనే అతి పెద్దదైన ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 ఈటీ343 విమానం ఈ నెల 15వ తేదీన సూడాన్ నుంచి ఇథియోపియాకు బయలుదేరింది. షెడ్యూల్ ప్రకారం అడీస్ అబాబా విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే, అందులోని ఇద్దరు పైలట్లు నిద్రలోకి జారుకున్నారు. అడీస్ అబాబాకు చేరుకున్నా లేవలేదు. ఆ సమయంలో విమానం 37,000 అడుగుల ఎత్తున ఆకాశంలో దూసుకెళ్తోంది. రన్ వేపై దిగాల్సిన జాడ లేకపోవడంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది అప్రమతమయ్యారు. పైలట్లను సంప్రదించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఫ్లైట్‌లోని అలారం మోగించారు. ఆ శబ్దానికి పైలట్లు కళ్లు తెరిచారు. జరిగిన పొరపాటు గుర్తించారు. అధికారుల సూచనతో విమానాన్ని వెనక్కి మళ్లించి, ఎయిర్‌పోర్ట్‌లో దించారు. -
చైనా విమాన ప్రమాదంలో సంచలన విషయాలు.. పైలెట్లు కావాలనే అలా...
బీజింగ్: చైనా ఈస్ట్రన్ ఎయిర్‌లైన్స్ విమాన ప్రమాద ఘటనలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. విమానాన్ని పైలట్లే ఉద్దేశపూర్వకంగా కూల్చేసి ఉండొచ్చని దర్యాప్తు అధికారులు అంచనా వేస్తున్నారు. బ్లాక్‌బాక్స్ డేటా విశ్లేషణలో ఈ విషయం తెలిసింది. విమానం ఎత్తు ఒక్కసారిగా తగ్గడాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ గుర్తించి.. వెంటనే పైలట్లను సంప్రదించేందుకు పలుమార్లు ప్రయత్నించింది. కానీ, పైలట్ల నుంచి ఎలాంటి సమాధానం రాలేదని అధికారులు తెలిపారు. దీనిని బట్టి కాక్‌పిట్‌లో ఉన్న సిబ్బందే కావాలని విమానం ఎత్తును ఒక్కసారిగా కిందకు దించి కూల్చేసి ఉంటారని అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై బోయింగ్ గానీ, చైనా అధికారుల నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. బోయింగ్ 737 మార్చి 21న గుయాంగ్జీ ప్రాంతంలో కుప్పకూలింది. 123 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బందిలో ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదు. చదవండి👇 మీరొస్తానంటే.. నేనొద్దంటా! చైనాలో ఘోర విమాన ప్రమాదం.. మొత్తం 132 మంది మృతి! -
ఘోర విమాన ప్రమాదం.. చైనీస్ విమానశాఖ సంచలన నిర్ణయం
చైనా దక్షిణ గ్వాంగ్జీ ఝువాంగ్ ప్రాంతంలో సోమవారం ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం కారణంగా మంగళవారం షెడ్యూల్ చేయబడిన 11,800 విమానాలలో 74% రద్దు చేస్తున్నట్లు చైనీస్ విమాన శాఖ తెలిపింది. వీటిలో ఎక్కువ భాగం బీజింగ్, షాంఘై మధ్య ప్రయాణించాల్సి ఉంది. సాధారణంగా ప్రపంచంలోని అత్యంత రద్దీ దేశీయ మార్గాలలో ఇదీ ఒకటి. గతంలో కోవిడ్ పరిమితుల కారణంగా చైనీస్ విమానాలు చాలా కాలాం గాల్లో ఎగరలేదు. దీంతో చైనీస్ విమానశాఖ చాలా వరకు ఆర్థికంగా నష్టపోయింది. అయితే తాజాగా మంగళవారం చేసిన రద్దుతో ఆ నష్టం మరింత పెరగనున్నట్లు చైనీస్ ఏవియేషన్ డేటా కంపెనీ డేటా పేర్కొంది. వివరాల్లోకి వెళితే.. చైనా ఈస్ట్రన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 ఎయిర్‌క్రాఫ్ట్ గ్వాంఝుకు వెళ్లేందుకు కున్మింగ్ నుంచి స్థానిక సమయం ప్రకారం మధ్యాహ్నం 1.10కి బయలుదేరరిన విమానం వుఝు సమీపంలోని టెంగ్జియాన్ కౌంటీ ప్రాంతంలోకి రాగానే కొండను ఢీకొని కూలిపోయింది. ప్రమాదంలో అంతా మరణించి ఉంటారని భావిస్తున్నారు. అందులో 132 మంది ప్రయాణికులు ఉన్నారు. 2010 తర్వాత చైనాలో జరిగిన తొలి విమాన ప్రమాదం ఇదే. చదవండి: China Flight Crash: చైనాలో ఘోర విమాన ప్రమాదం.. మొత్తం 132 మంది మృతి! -
చైనాలో ఘోర విమాన ప్రమాదం.. మొత్తం 132 మంది మృతి!
బీజింగ్: చైనా దక్షిణ గ్వాంగ్జీ ఝువాంగ్ ప్రాంతంలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 132 మందితో వెళ్తున్న ఒక పాసింజర్ విమానం సోమవారం ఈ ప్రాంతంలో కుప్పకూలిందని అధికార వర్గాలు ప్రకటించాయి. ప్రమాదంలో అంతా మరణించి ఉంటారని భావిస్తున్నారు. చైనా ఈస్ట్రన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 ఎయిర్‌క్రాఫ్ట్ గ్వాంఝుకు వెళ్లేందుకు కున్మింగ్ నుంచి స్థానిక సమయం ప్రకారం మధ్యాహ్నం 1.10కి బయలుదేరింది. 2.52 కు గమ్యస్థానం చేరాల్సి ఉండగా వుఝు సమీపంలోని టెంగ్జియాన్ కౌంటీ ప్రాంతంలోకి రాగానే కొండను ఢీకొని కూలిపోయింది. మంటలను అదుపులోకి తెచ్చామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు చెప్పారు. ఘటనపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. నిట్టనిలువునా కూలింది ప్రమాద దృశ్యాలు దగ్గర్లోని మైనింగ్ కంపెనీ సెక్యూరిటీ కెమెరాలో రికార్డయ్యాయి. విమానం అదుపు తప్పి నిట్టనిలువుగా కూలిపోతూ కన్పించింది. 29వేల అడుగుల ఎత్తు నుంచి వేగంగా పడిపోతూ కేవలం 2.15 నిమిషాల్లో 9 వేల అడుగులకు చేరింది. మరో 20 సెకన్లలో 3,225 అడుగులకు దిగిందని ఫ్లైట్ రాడార్ వెల్లడిస్తోంది. అంతెత్తునుంచి విమానం నేలను తాకడానికి దాదాపు 30 నిమిషాలు పడుతుంది. కానీ 3 నిమిషాల్లో నేలకూలడం ప్రమాద తీవ్రతను తెలియజేస్తోందని నిపుణులు భావిస్తున్నారు. విమాన భద్రతలో చైనా ట్రాక్ రికార్డు గొప్పగా ఉంది. చైనాలో చివరిసారి 2010లో విమాన ప్రమాదం జరిగింది. బోయింగ్ విమానాలపై నిఘా: భారత్ ప్రమాద వార్త తెలియగానే భారత్‌లోని బోయింగ్ 737 విమానాలన్నింటిపై మరింత నిఘా పెట్టినట్లు డీజీసీఏ ప్రకటించింది. 2018, 2019ల్లో అంతర్జాతీయంగా జరిగిన బోయింగ్ ప్రమాదాల తర్వాత దేశంలో బోయింగ్ 737 మాక్స్ విమానాలను డీజీసీఏ నిషేధించింది. సాంకేతిక మార్పుల తర్వాత గత ఆగస్టు నుంచి తిరిగి అనుమతించింది. ప్రస్తుతం దేశంలో స్పైస్‌జెట్, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, విస్తారా వద్ద బోయింగ్ 737 విమానాలున్నాయి. ప్రమాదంపై బోయింగ్ స్పందించలేదు. చైనా ఈస్ట్రన్ ఎయిర్‌లైన్స్ తమ ఆధీనంలోనిబోయింగ్ విమానాలన్నింటినీ నిలిపివేసింది. #China Unconfirmed new video appears to show the crash site of the Boeing 737 with significant fire in the mountains. pic.twitter.com/S62uOQ0uqn — Shane B. Murphy (@shanermurph) March 21, 2022 #BREAKING: On footage from social networks - presumably crashed in southern #China Boeing 737. There were 133 people on board, according to Chinese television. pic.twitter.com/uE2gmfA8dh — Newsistaan (@newsistaan) March 21, 2022 #China Unconfirmed new video appears to show the crash site of the Boeing 737 with significant fire in the mountains. pic.twitter.com/S62uOQ0uqn — Shane B. Murphy (@shanermurph) March 21, 2022 #China If you search #MU5735 that’s where all the newest footage is popping up. pic.twitter.com/KdmUsMDizi — Shane B. Murphy (@shanermurph) March 21, 2022 -
Akasa Air: ఇక ‘ఆకాశ’మే హద్దుగా..
భారత బిలియనీర్ స్టాక్ మార్కెట్ నిపుణుడు రాకేష్ ఝున్‌ఝున్‌వాలా స్టార్టప్ ఎయిర్‌లైన్ ‘ఆకాశ ఎయిర్’ నుంచి మరో అడుగు ముందుకు పడింది. ఝున్‌ఝున్‌వాలా వాలా నేతృత్వంలో 'ఆకాశ ఎయిర్' బ్రాండ్ కింద ఎస్ఎన్వీ ఏవియేషన్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థను ఏర్పాటు చేసిన సంగతి తేలిసిందే. ఇప్పుడు ఆ కంపెనీ 72 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను ఆర్డర్ చేస్తున్నట్లు నేడు(నవంబర్ 16) ప్రకటించింది. ఈ ఒప్పందం విలువ దాదాపు 9 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 66 వేల కోట్లు) అని ఒక సంయుక్త ప్రకటనలో తెలిపింది. ఆకాశ ఎయిర్ సీఈఓ వినయ్ దుబే మాట్లాడుతూ కంపెనీ తన మొదటి విమానాల ఆర్డర్ కోసం బోయింగ్ సంస్థతో భాగస్వామ్యం ఒప్పందం చేసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. "ఈ కొత్త 737 మ్యాక్స్ విమానం కేవలం విమానయాన ఖర్చులను మాత్రమే తగ్గించకుండా తక్కువ ధరకు ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలు అందిస్తూ పర్యావరణ హితమైన సంస్థగా నడపాలనే మా లక్ష్యానికి మద్దతు ఇస్తుందని మేము నమ్ముతున్నాము" అని అన్నారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్లలో భారతదేశం ఒకటి అని దుబే అన్నారు. ఆకాశ ఎయిర్ ప్రధాన ఉద్దేశ్యం భారతదేశం ఎదుగుదలకు శక్తిని అందించడంతో పాటు సామాజిక-ఆర్థిక లేదా సాంస్కృతిక నేపథ్యాలతో సంబంధం లేకుండా భారతీయులందరికీ సమ్మిళిత వాతావరణంలో ప్రజలకు విమాన ప్రయాణాన్ని అందించడం అని దుబే తెలిపారు. అకాసా ఎయిర్ ఆర్డర్ చేసిన వాటిలో రెండు వేరియెంట్లు ఉన్నాయి. అవి ఒకటి 737-8, రెండవది అధిక సామర్ధ్యం గల 737-8-200. బోయింగ్ కమర్షియల్ ఎయిర్ ప్లేన్స్ అధ్యక్షుడు, సీఈఓ స్టాన్ డీల్ మాట్లాడుతూ.. వినియోగదారులకు అద్భుతమైన సేవలు అందించడంతో పాటు పర్యావరణ సుస్థిరతపై దృష్టి సారించే సృజనాత్మక విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన ప్రాంతాలలో తక్కువ ధరకు సేవలను అందించడానికి బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలపై నమ్మకాన్ని ఉంచిందుకు కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: పబ్జీ మొనగాళ్లకు షాక్..! అలా చేస్తే మీ అకౌంట్లు బ్లాక్ అవుతుయ్..!) -
భయపెట్టే బోయింగ్‌కి మళ్లీ అనుమతులు! ప్రజలేమంటున్నారు?
అతి పెద్ద విమానాలకు మరో పేరుగా స్థిరపడిన బోయింగ్ విమనాలు మళ్లీ భారత గగనతలంలో ప్రయాణానికి రెడీ అయ్యాయి. రెండున్నరేళ్ల నిషేధం తర్వాత బోయింగ్ ఫ్లైట్లను నడిపేందుకు విమానయాన సంస్థలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనుమతులు ఇచ్చింది. ప్రమాదాల జరగడం వల్లే జంబో విమానాల తయారీకి బోయింగ్ సంస్థ పెట్టింది పేరు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థకు చెందిన విమానాలు ఏవియేషన్ సెక్టార్లో రాజ్యమేళాయి. అయితే బోయింగ్ 737 మ్యాక్స్ విమానంతో కథ అడ్డం తిగిరింది. యూరప్, అమెరికా, ఏషియా అని తేడా లేకుండా బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు ప్రమాదాల బారిన పడ్డాయి. దీంతో వరుసగా ఒక్కో దేశం ఈ విమానలను కమర్షియల్ సెక్టార్ నుంచి తొలగించాయి. భారత్ సైతం 2019 మార్చిలో బోయింగ్ విమానాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఎప్పటి నుంచి రెండున్నరేళ్ల నిషేధం తర్వాత ఇటీవల బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు నడుపుకునేందుకు అనుమతులు ఇచ్చింది. దీంతో స్పైస్ జెట్ సంస్థ సెప్టెంబరు చివరి వారం నుంచి బోయింగ్ విమానాలు నడిపేందుకు రెడీ అవుతోంది. మరోవైపు దుబాయ్ ఇండియా మధ్య సర్వీసులు అందిస్తున్న సంస్థలు సైతం బోయింగ్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ విమానాలపై ఉన్న నిషేధాన్ని ఇప్పటికే అమెరికా, యూరప్ దేశాలు ఎత్తేయగా తాజగా ఆ జాబితాలో ఇండియా చేరింది. చైనా ఇప్పటికీ నిషేధాన్ని కొసాగిస్తోంది. పారదర్శకత ఏదీ బోయింగ్ విమానాల కమర్షియల్ ఆపరేషన్స్‌కి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్స్ అనుమతులు ఇవ్వడంపై ప్రయాణికుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. అనుమతులు ఇవ్వడం, రద్దు చేయడం అనేది డీజీసీఏ సొంత వ్యవహారం కాదంటున్నారు. ఏ కారణాల చేత అనుమతులు రద్దు చేశారు ? విమానంలో ఏ లోపాలను గుర్తించారు ? వాటిని ఆ సంస్థ సవరించిందా లేదా ? అనే వివరాలు ప్రజల ముందు ఉంచకుండా ప్రయాణాలకు అనుమతి ఇవ్వడం సరికాదంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహారించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు బోయింగ్ విమానాలు తిరిగి అందుబాటులోకి రావడాన్ని కొందరు స్వాగతిస్తున్నారు. చదవండి: బంపర్ టూ బంపర్ ఇన్సురెన్స్ తప్పనిసరి..మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు -
టాటా బోయింగ్ కేంద్రంలో కొత్త ప్రొడక్షన్ లైన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏరోస్పేస్ ప్రొడక్ట్స్ తయారీలో ఉన్న టాటా బోయింగ్ ఏరోస్పేస్ విమానం వెనుక భాగంలో ఉండే కీలక విడిభాగమైన వెర్టికల్ ఫిన్ స్ట్రక్చర్స్‌ను ఉత్పత్తి చేయనుంది. ఇందుకోసం కొత్త ప్రొడక్షన్ లైన్‌ను జోడించింది. ఇక్కడ బోయింగ్ 737 రకానికి చెందిన విమానాల ఫిన్ స్ట్రక్చర్స్‌ను రూపొందిస్తారు. ఈ విస్తరణతో అదనపు ఉపాధి అవకాశాలతోపాటు నైపుణ్య అభివృద్ధికి వీలు కలుగుతుంది. బోయింగ్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సంయుక్తంగా టాటా బోయింగ్ ఏరోస్పేస్ను హైదరాబాద్ సమీపంలోని ఆదిభట్ల వద్ద స్థాపించాయి. తాజా విస్తరణ మైలురాయిగా నిలుస్తుందని ఇరు సంస్థలు శుక్రవారం వెల్లడించాయి. రక్షణ ఉత్పత్తుల తయారీలో భారతదేశాన్ని స్వావలంబనగా మార్చడానికి జేవీకి ఉన్న నిబద్ధతకు కొత్త ప్రొడక్షన్ లైన్ మరొక నిదర్శనమని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఎండీ, సీఈవో సుకరన్ సింగ్ తెలిపారు. నూతన లైన్‌ను చేర్చడం భారత అంతరిక్ష, రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ వృద్ధిలో గుర్తించదగ్గ ముందడుగు అని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. దేశంలో రక్షణ, ఏరోస్పేస్ పరిశ్రమకు తెలంగాణ ఒక స్థాపిత కేంద్రంగా ఉందని గుర్తుచేశారు. పెద్ద ఎత్తున నిపుణులైన, పరిశ్రమకు అవసరమైన మానవ వనరులు ఇక్కడ కొలువుదీరారని తెలిపారు. కాగా, 14,000 పైచిలుకు చదరపు మీటర్ల విస్తీర్ణంలోని ఈ అత్యాధునిక ఫెసిలిటీలో బోయింగ్ ఏహెచ్–64 అపాచీ హెలికాప్లర్ల ప్రధాన భాగాలను సైతం తయారు చేస్తున్నారు. -
విమానం కూలిన చోటు గుర్తించాం
జకార్తా: ఇండోనేసియాలో 62 మందితో కనిపించకుండా పోయిన విమానం జావా సముద్రంలో కూలిపోయిందని ప్రభుత్వం ప్రకటించింది. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని గుర్తించామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది. ప్రమాదానికి కారణాలు తెలుసుకునేందుకు ఎంతో కీలకమైన బ్లాక్‌బాక్స్ ఉన్న చోటును కూడా గుర్తించినట్లు పేర్కొంది. ఘటనపై ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఇండోనేసియా పౌరులు, ప్రభుత్వం తరఫున బాధితులకు సానుభూతి తెలిపారు. ప్రమాదం నుంచి బయటపడిన వారిని కనుగొనేందుకు సహాయక చర్యలు కొనసాగుతాయన్నారు. బాధిత కుటుంబాలకు భారత ప్రధాని మోదీ తీవ్ర సంతాపం ప్రకటించారు. ఈ విషాద సమయంలో ఇండోనేసియాకు భారత్ తోడుగా నిలుస్తుందన్నారు. ప్రమాదానికి గురైన బోయింగ్ విమానం గతంలో అమెరికా విమానయాన సంస్థలు వాడిందేనని శ్రీవిజయ ఎయిర్ ప్రెసిడెంట్ డైరెక్టర్ జెఫర్సన్ ఇర్విన్ జవెనా అన్నారు. 26 ఏళ్ల క్రితం తయారైన ఈ విమానం ఫూర్తి ఫిట్నెస్తో ఉందని తెలిపారు. శనివారం విమానం జకార్తా నుంచి గంట ఆలస్యంగా బయలుదేరడానికి వాతావరణం సరిగా లేకపోవడమే కారణమని వివరించారు. విషాద ఘటనపై ఇండోనేసియా అన్వేషణ, సహాయక సంస్థ చీఫ్ బగుస్ పురుహితో ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘విమానం నుంచి ఆఖరు సారిగా నమోదైన సిగ్నల్ ఆధారంగా ప్రమాద ప్రాంతాన్ని గుర్తించాము. బ్లాక్‌బాక్స్‌లుగా పిలిచే ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ల నుంచి వచ్చిన ఎమర్జెన్సీ సిగ్నళ్లను నౌకాదళం కనుగొంది. వీటి ఆధారంగా సముద్ర జలాల్లో అవి ఏ ప్రాంతంలో ఉన్నాయో గుర్తించాం’అని వివరించారు. అతి త్వరలోనే వాటిని వెలికితీసి, ప్రమాదానికి దారితీసిన కారణాలు తెలుసుకుంటామని మిలటరీ చీఫ్ హదీ టిజాజంతో అన్నారు. ఆదివారం సముద్ర జలాల్లో 75 అడుగుల లోతులో రిజిస్ట్రేషన్ నంబర్ తదితర వివరాలతో కూడిన ప్రధాన విమాన భాగాలను వెలికితీశామన్నారు. శ్రీ విజయ ఎయిర్ సంస్థకు చెందిన బోయింగ్ 737 విమానం శనివారం మధ్యాహ్నం 2.36 గంటలకు జకార్తా నుంచి పొంటియానక్ వైపు బయలుదేరింది. నాలుగు నిమిషాలకే కంట్రోల్ టవర్‌తో విమానానికి సంబంధాలు తెగిపోయాయి. ఈ విమానంలో 50 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. -
ఇండోనేషియా విమాన ప్రమాదం ఫొటోలు
-
ఇండోనేషియా విషాదం: బ్లాక్ బాక్స్ ఆచూకీ లభ్యం
జకార్తా: శనివారం మధ్యాహ్నం అదృశ్యమైన ఇండోనేషియా విమానానికి సంబంధించిన రెండు బ్లాక్ బాక్సుల ఆచూకీ లభ్యమైంది. సిగ్నల్స్ బట్టి వాటిని త్వరలోనే బయటికి తీస్తామని అధికారులు పేర్కొన్నారు. కాగా నేటి ఉదయం లాంకాంగ్, లకీ ద్వాపాల మధ్య విమాన భాగాలు, శకలాలు, మునుషులు శరీర బాగాలు, దుస్తులు లభ్యమవడంతో ఈ ప్రమాదంలో ఒక్కరు కూడా బతికిలేరన్న విషయం అర్థమవుతుంది. కాగా విమానం నడిపిన పైలట్లు 10 ఏళ్లకు పైగా అనుభవం ఉన్నవారేనని అధికారులు తెలిపారు. బ్లాక్ బాక్సులను వెలికి తీసి పరిశీలించిన అనంతరం మరిన్ని వివరాలు బయటికి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.(చదవండి: ఇండోనేషియాలో కూలిన విమానం?) శ్రీవిజయ ఎయిర్ సంస్థకు చెందిన బోయింగ్ 737 విమానం శనివారం మధ్యాహ్నం 2.36 గంటలకు జకార్తా నుంచి బోర్నియో ద్వీపంలోని పశ్చిమ కాలిమంతన్ ప్రావిన్సు రాజధాని పొంటియానక్కు బయలుదేరింది. విమానంలో 50 మంది ప్రయాణికులు, 12 సిబ్బంది సహా మొత్తం 62 మంది ఉన్నారు. వీరంతా ఇండోనేసియన్లే. జకార్తా– పొంటియానక్ ప్రయాణ సమయం సుమారు గంటన్నర కాగా విమానం షెడ్యూల్ సమయానికి గంట ఆలస్యంగా బయలుదేరింది. 2.40 గంటల సమయంలో కంట్రోల్ టవర్‌తో విమానానికి సంబంధాలు తెగిపోయాయని ఇండోనేసియా రవాణా శాఖ మంత్రి బుది కార్య సుమది తెలిపారు. అంతకుముందే విమానాన్ని 29 వేల అడుగుల ఎత్తుకు తీసుకువస్తానంటూ పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించాడని తెలిపారు. గాల్లోకి ఎగిరిన 4 నిమిషాలకే విమానం 11 వేల అడుగుల ఎత్తులో ఉండగా కంట్రోల్ టవర్‌తో సంబంధాలు తెగిపోయాయన్నారు. దీంతో ఈ విమానం జావా సముద్రంలో కూలిపోయింది. -
కూలిన విమానం?
జకార్తా: ఇండోనేసియాకు చెందిన ప్రయాణికుల జెట్ విమానం ఒకటి ఆచూకీ తెలియకుండా పోయింది. శ్రీవిజయ ఎయిర్ సంస్థకు చెందిన బోయింగ్ 737 విమానం శనివారం మధ్యాహ్నం 2.36 గంటలకు జకార్తా నుంచి బోర్నియో ద్వీపంలోని పశ్చిమ కాలిమంతన్ ప్రావిన్సు రాజధాని పొంటియానక్కు బయలుదేరింది. విమానంలో 50 మంది ప్రయాణికులు, 12 సిబ్బంది సహా మొత్తం 62 మంది ఉన్నారు. వీరంతా ఇండోనేసియన్లే. జకార్తా– పొంటియానక్ ప్రయాణ సమయం సుమారు గంటన్నర కాగా విమానం షెడ్యూల్ సమయానికి గంట ఆలస్యంగా బయలుదేరింది. 2.40 గంటల సమయంలో కంట్రోల్ టవర్‌తో విమానానికి సంబంధాలు తెగిపోయాయని ఇండోనేసియా రవాణా శాఖ మంత్రి బుది కార్య సుమది తెలిపారు. అంతకుముందే విమానాన్ని 29 వేల అడుగుల ఎత్తుకు తీసుకువస్తానంటూ పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించాడని తెలిపారు. గాల్లోకి ఎగిరిన 4 నిమిషాలకే విమానం 11 వేల అడుగుల ఎత్తులో ఉండగా కంట్రోల్ టవర్‌తో సంబంధాలు తెగిపోయాయన్నారు. దీంతో ఈ విమానం జావా సముద్రంలో కూలిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ శకలాలు దానివేనా? ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్న జకార్తాకు ఉత్తరంగా ఉన్న లంకాంగ్, లాకి ద్వీపాల మధ్య గాలింపు కోసం నాలుగు యుద్ధ నౌకలు సహా 12 ఓడలను ఆ ప్రాంతానికి పంపినట్లు మంత్రి సుమది తెలిపారు. ఆ విమానానివే అని అనుమానిస్తున్న కొన్ని శకలాలు, దుస్తులు జకార్తాకు ఉత్తరంగా ఉన్న థౌజండ్ ఐలాండ్స్ వద్ద మత్స్యకారులకు లభించగా వాటిని స్వాధీనం చేసుకుని విచారణ నిమిత్తం పంపినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ‘మత్స్యకారులకు కొన్ని కేబుళ్లు, లోహపు ముక్కలు లభించాయి. సమీపంలో భీకర శబ్ధం, మిరుమిట్లు గొలిపే మెరుపు కనిపించిన కొద్దిసేపటికే వారున్న ప్రాంతంలో నీళ్లలో పడిపోయాయి. అదే ప్రదేశంలో నీటిపై విమాన ఇంధనం జాడలు మత్స్యకారులకు కనిపించాయి’ అని స్థానిక మీడియా తెలిపింది. ప్రమాదం వల్లే కూలిందా అనేది నిర్ధారణ చేసుకునేందుకు ఉపయోగపడే అత్యవసర లొకేటర్ ట్రాన్స్‌మీటర్(ఈఎల్టీ) ఎందుకు పనిచేయలేదనే విషయమై దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు. జకార్తా, పొంటియానక్ విమానాశ్రయాల్లో ప్రయాణికుల కోసం ఎదురు చూస్తున్న బంధువులు, కుటుంబసభ్యులు, మిత్రులు దైవ ప్రార్థనలు చేస్తున్నట్లు, రోదిస్తున్నట్లు ఉన్న దృశ్యాలను స్థానిక టీవీలు ప్రసారం చేస్తున్నాయి. అతిపెద్ద ద్వీపసమూహ దేశమైన ఇండోనేసియాలో తరచూ రోడ్డు, నౌక, విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. -
737 విమానాలతో స్పైస్‌జెట్‌కు రెక్కలు
ముంబై, సాక్షి: బోయింగ్ 737 మ్యాక్స్ విమాన సర్వీసులకు యూఎస్ వైమానిక నియంత్రణ సంస్థ తిరిగి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన వార్తలతో స్పైస్‌జెట్ కౌంటర్‌కు జోష్ వచ్చింది. రెండు ఘోర ప్రమాదాల నేపథ్యంలో సుమారు ఏడాదిన్నర కాలంగా నిలిచిపోయిన 737 మ్యాక్స్ విమానాలను తిరిగి సర్వీసులకు వినియోగించేందుకు బుధవారం యూఎస్ ఎఫ్ఏఏ అనుమతించింది. 2019 మార్చి నుంచి బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను సర్వీసుల నుంచి తప్పించిన విషయం విదితమే. అయితే నిలిచిపోయిన ఈ విమానాలను ఆధునీకరించాక మాత్రమే సర్వీసులను ప్రారంభించుకోవలసిందిగా యూఎస్ ఎఫ్ఏఏ ఆదేశించినట్లు తెలుస్తోంది. సాఫ్ట్వేర్, వైరింగ్ సవరణలతోపాటు.. పైలట్లు సైతం తగినంత సన్నద్ధత కావలసి ఉంటుందని తెలియజేసింది. షేరు జోరు బోయింగ్ తయారీ 737 మ్యాక్స్ విమానాలను సర్వీసులకు తిరిగి అనుమతించిన వార్తలో స్పైస్‌జెట్ లిమిటెడ్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. దేశీయంగా స్పైస్‌జెట్ మాత్రమే 13 ఎయిర్ క్రాఫ్ట్‌లను కలిగి ఉంది. దీంతో ఎన్ఎస్ఈలో ఈ షేరు ప్రస్తుతం 15 శాతం దూసుకెళ్లి రూ. 76 వద్ద ట్రేడవుతోంది. మ్యాక్స్ 737 విమానాల నిలిపివేత కారణంగా కంపెనీ వ్యయాలు పెరిగినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. కాగా.. గత నాలుగు రోజులుగా స్పైస్‌జెట్ కౌంటర్ ర్యాలీ బాటలో సాగుతుండటం గమనార్హం. గత నాలుగు రోజుల్లో ఈ షేరు 40 శాతం దూసుకెళ్లడం విశేషం! -
‘మానవ తప్పిదం వల్లే ఆ 176 మంది మృతి’
టెహ్రాన్: ఈ ఏడాది జనవరిలో ఇరాన్లో ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. 176 మంది ప్రాణాలు బలి తీసుకున్న ఈ ప్రమాదానికి గల కారణాలను ఇరాన్ ప్రభుత్వం వెల్లడించింది. మానవ తప్పిదం వల్ల వాయు రక్షణ విభాగం రాడార్ సిస్టమ్ విఫలమయయ్యిందని తెలిపింది. రాడార్‌ను సమలేఖనం చేయడంలో వైఫల్యం తలెత్తిందని.. ఫలితంగా వ్యవస్థలో 107 డిగ్రీల లోపం ఏర్పడిందని ఇరాన్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. ఈ తప్పిదం వల్ల వరుస ప్రమాదాలు సంభవించి చివరకు విమానం కూలిపోయిందని అధికారులు ఒక వాస్తవిక నివేదికను విడుదల చేశారు. ఇరాన్, అమెరికాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలోనే టెహ్రాన్ విమానాశ్రయానికి సమీపంలో ఉక్రేయిన్‌కు చెందిన ఈ బోయింగ్ 737 విమానం కుప్ప కూలింది. అందులో ప్రయాణిస్తున్న 167 మంది ప్రయాణికులతో పాటు మరో 9 మంది ఫ్లైట్ సిబ్బంది కలిపి మొత్తం 176 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ విమానం టెహ్రాన్‌లోని ఇమామ్ ఖొమేని విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. అయితే ఆ విమానాన్ని తమ రెండు ‘టార్ ఎం1’ క్షిపణులు కూల్చేశాయని ఇరాన్ అప్పట్లోనే ప్రకటించింది. (ఆ విమానాన్ని మా రెండు క్షిపణులు కూల్చాయి: ఇరాన్) ఈ క్రమంలో ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘ఈ ప్రమాదం జరిగిన నాడు ఇరాన్, అమెరికా దళాలపై దాడులు జరిపింది. ఇందుకు ప్రతీకారంగా అమెరికా తిరిగి మా దళాలపై దాడులు చేస్తుందనే హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. ఈ క్రమంలో డిఫెన్స్ యూనిట్ ఆపరేటర్ ఆకాశంలో ఎయిర్ క్రాఫ్ట్‌ను గుర్తించాడు. దాంతో ఎలాంటి సమాచారం లేకుండానే రెండు రాడార్లను ఎయిర్‌క్రాఫ్ట్ మీదకు ప్రయోగించాడు. ఫలితంగా ప్రమాదం సంభవించింది’ అన్నాడు. -
పొరపాటున కూల్చేశాం
టెహ్రాన్/వాషింగ్టన్: ఉక్రెయిన్ విమానాన్ని తాము పొరపాటున కూల్చేశామని ఇరాన్ ఎట్టకేలకు శనివారం అంగీకరించింది. మానవ తప్పిదం కారణంగా పేలిన క్షిపణులు బోయింగ్ 737ను ఢీకొన్నాయని, ఫలితంగా అది కుప్పకూలిపోయి 176 మంది మరణాలకు కారణమైందని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ ప్రకటించారు. తాము జరిపిన సైనిక విచారణలో తప్పిదం విషయం తెలిసిందని చెప్పారు. అయితే ఈ ప్రమాదానికి తమకు సంబంధం లేదని ఇరాన్ ఇన్నిరోజులూ చెప్పింది. ఇరాన్ సైనిక జనరల్ ఖాసీం సులేమానీని అమెరికా డ్రోన్ దాడిలో చంపేయడం, ఇందుకు ప్రతీకారంగా ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణులతో వరుస దాడులు జరపడం.. ఆ వెంటనే కొంత సమయానికే ఈ ఘటన చోటు చేసుకోవడంతో దీనిపై సర్వత్రా చర్చ మొదలైంది. శత్రువని అనుకున్నాం... శత్రువులకు సంబంధించిన విమానం అనుకోవడం వల్లనే పొరబాటున ఉక్రెయిన్ విమానాన్ని క్షిపణులతో కూల్చేయాల్సి వచ్చిందని ఇరాన్ మిలటరీ వర్గాలు అంగీకరించాయి. మృతుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం అందించేందుకు చర్యలు చేపడుతున్నామని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ వెల్లడించారు. ఈ తప్పుకు కారణమైన వారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. మృతుల్లో అధికులు ఇరాన్– కెనడా ద్వంద్వ పౌరసత్వం ఉన్నవారు కాగా, ఉక్రెయిన్ దేశస్తులు కొందరు ఉన్నారు. కెనడా ప్రధాని ట్రూడో స్పందిస్తూ.. బాధితులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేయగా.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ బాధ్యులను శిక్షించాలని, మృతుల కుటుంబాలకు పరిహారం అందించాలని కోరారు. అతన్నీ చంపాలనుకుంది ఇరాన్ సైనిక జనరల్ సులేమానీని చంపిన రోజే మరో ఇరాన్ కమాండర్‌ను కూడా అమెరికా చంపాలనుకుందని, అయితే ఆ వ్యూహం విఫలమైందని అమెరికా అధికారులు తెలిపారు. ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రిపబ్లికన్ గార్డ్ కోర్ కమాండర్ అబ్దుల్ రెజా షహ్లైని అమెరికా తుదముట్టించాలనుకుంది. ఈ గ్రూపును కూడా అమెరికా ఇప్పటికే ఉగ్రవాద జాబితాలో చేర్చింది. ఇద్దరు నాయకుల మరణాలు ఒకేరోజు జరిగితే ఇరాన్ బలగాలు నీరుగారిపోతాయని అమెరికా భావించింది. అందుకే అబ్దుల్ రెజాను కూడా చంపేందుకు అమెరికా అధ్యక్షుడు అనుమతి ఇచ్చారు. అయితే యెమెన్‌లో ఉన్న ఆయన అమెరికా నుంచి తప్పించుకోగలిగారు. షియా మిలిటెంట్ గ్రూపులకు అబ్దుల్ రెజా ఆయుధాలు, నిధులు సమకూర్చుతున్నట్లు అమెరికా ప్రకటించింది. అతడు చేస్తున్న వ్యవహారాల గురించి చెప్పిన వారికి భారీ మొత్తం ఇస్తామని కూడా ప్రకటించింది. అమెరికాకు వ్యతిరేకంగా, ఉగ్రవాదులకు స్వర్గధామమైన యెమెన్‌లో అబ్దుల్ రెజాను చంపేందుకు తమ దేశం వేసిన ప్రణాళికను తాము చూశామని, అయితే అది విఫలమైనందున మరిన్ని విషయాలు చెప్పడంలేదని పెంటగాన్ అధికార ప్రతినిధి, నేవీ కేడర్‌కు చెందిన రెబెకా రెబరిచ్ తెలిపారు. -
క్షిపణి వల్లే కూలింది..
టెహ్రాన్/ఒట్టావా/వాషింగ్టన్: ఇరాన్లో కుప్పకూలిన ఉక్రెయిన్ విమాన ఘటనపై వివాదం తీవ్రమవుతోంది. ఆ విమానం ఇరాన్ ప్రయోగించిన క్షిపణి దాడిలోనే అనేందుకు ఆధారాలున్నాయని కెనడా, బ్రిటన్ తదితర దేశాలు పేర్కొన్నాయి. అయితే, పొరపాటున అది జరిగి ఉండొచ్చని వ్యాఖ్యానించాయి. క్షిపణి దాడిలోనే ఆ బోయింగ్ 737 విమానం కూలిపోయిందనేందుకు బలం చేకూర్చే వీడియో ఆధారమొకటి తెరపైకి వచ్చింది. ఆ వీడియోలో ఆకాశంలో వేగంగా వెళ్తున్న వస్తువు ఒకటి కనిపిస్తుంది. కాసేపటికి ఒక మెరుపులాంటి దృశ్యం, ఆ తరువాత పేలుడు శబ్దం వినిపిస్తుంది. ఆ వీడియోను తాము వెరిఫై చేశామని ది న్యూయార్క్ టైమ్స్ పత్రిక పేర్కొంది. పలు నిఘా వర్గాల సమాచారం ప్రకారం గతంలో రష్యా నుంచి ఇరాన్ కొన్న ఎస్ఏ–15 టార్ క్షిపణి వ్యవస్థ నుంచి ప్రయోగించిన క్షిపణి వల్లే విమానం కూలినట్లు స్పష్టమవుతోందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో శుక్రవారం పేర్కొన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలని, వాస్తవాలు తమ పౌరులకు తెలియాల్సి ఉందని అన్నారు. విమాన ప్రమాదంలో చనిపోయిన 176 మందిలో 63 మంది ప్రయాణీకులు కెనడా పౌరులే. మిగతావారిలో 82 మంది ఇరాన్, 11 మంది ఉక్రెయిన్, 10 మంది స్వీడన్, నలుగురు ఆఫ్గానిస్తాన్, ముగ్గురు జర్మన్, ముగ్గురు బ్రిటన్ పౌరులున్నారు. తమ క్షిపణి దాడిలోనే విమానం కూలిందన్న ఆరోపణలను ఇరాన్ ఖండించింది. సంబంధిత ఆధారాలివ్వాలని అమెరికా, కెనడాలను కోరింది. ప్రమాద ఘటనపై జరుగుతున్న విచారణలో పాలుపంచుకోవాలని బాధిత దేశాలతో పాటు బోయింగ్ సంస్థను కోరింది. విమాన ప్రమాదానికి క్షిపణి దాడే కారణమని వివిధ ఆధారాల ద్వారా స్పష్టమవుతోందని బ్రిటన్ ప్రధాని జాన్సన్ అన్నారు. తమకందిన సమాచారం ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల వల్లనే విమానం కూలిందని స్పష్టం చేస్తోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ప్రమాదంపై సమగ్ర, నిష్పక్షపాత దర్యాప్తు జరగాలని ఈ నేతలు డిమాండ్ చేశారు. ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసిన రోజే ఈ ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దళాల ఉపసంహరణ ప్రారంభించండి బాగ్దాద్: ఇరాక్ నుంచి బలగాలను ఉపసంహరించేందుకు సాధ్యమైనంత త్వరగా కార్యాచరణ రూపొందించుకోవాలని అమెరికాకు ఇరాక్ సూచించింది. ఇరాక్ ప్రధాని అదెల్ అబ్దుల్ మెహదీకి గురువారం రాత్రి యూఎస్ విదేశాంగ మంత్రి మైక్ పాంపియొ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా, తమ దేశం నుంచి అమెరికా దళాల ఉపసంహరణను ప్రారంభించాలని పాంపియోను కోరారు. -
వైరల్ : విమానాన్ని కూల్చిన ఇరాన్ మిస్సైల్..!
టెహ్రాన్ : ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు వెళ్తున్న ఉక్రెయిన్‌కు చెందిన బోయింగ్ 737 విమాన ప్రమాదంపై సంచలన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. అగ్రరాజ్యం అమెరికా- ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నెలకొన్న వేళ.. విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదంపై అమెరికా, కెనడా, ఉక్రెయిన్‌తో పాటు పలు అగ్ర దేశాలు తొలినుంచి అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. విమానంపై ఇరాన్‌కు చెందిన టోర్ మిస్సైల్ దాడి చేసిందని ఆరోపిస్తున్నాయి. కానీ ఆ దేశాల ఆరోపణలు ఇరాన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తూ వస్తోంది. అయితే ఈ సమయంలో విమానంపై క్షిపణి దాడి చేసినట్లు ఉన్న ఈ వీడియో బయటపడింది. క్షిపణి దాడి తర్వాతే విమానం కుప్పకూలినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ ఆ వీడియో ప్రామాణికతపై పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. (మీరే కూల్చారు... సమాచారం ఇవ్వండి!) వీడియోలో మిస్సైల్ ఢీ కొట్టినట్టు కనిపిస్తున్నప్పటికీ అది ఉక్రేయిన్ విమానమని నిర్థారణకు రాలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్ క్షిపణి దాడివల్లే తమ విమానం కూలిపోయి ఉంటుందని ఉక్రెయిన్ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇరాన్ జనరల్ ఖాసిం సులేమాని మృతికి ప్రతీకారంగా ఇరాన్.. ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై క్షిపణులు ప్రయోగించిన క్రమంలో ఉక్రెయిన్ విమానం కుప్పకూలిందని అభిప్రాయపడుతోంది. దీనిపై ఆ దేశ జాతీయ భద్రత సంఘం కార్యదర్శి ఒలెక్సీ డానిలోవ్ మీడియాతో మాట్లాడుతూ.. విమాన ప్రమాదంపై క్షిపణి దాడి సహా అనేక కోణాల్లో విచారణ జరుపుతున్నామన్నారు. విమానం కూలిపోయిన ప్రాంతానికి సమీపంలో ఈ క్షిపణుల ఆనవాళ్లు దొరికాయని పలువురు చెప్పినట్లు ఆయన తెలిపారు. బోయింగ్ ఎయిర్‌లైనర్‌ను ఇరాన్ కూల్చివేసిందని తమకు ఇప్పటికే పలు ఇంటలెజిన్స్ నివేదికలు అందాయన్నని కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో పేర్కొన్నారు. టెహ్రాన్ నుంచి బయల్దేరగానే విమానం కుప్పకూలడం వెనుక ఇరాన్ దాడుల ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఇక బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సైతం జస్టిన్ ట్రూడో వ్యాఖ్యలను సమర్థించారు. ఉద్దేశపూర్వకంగా విమానాన్ని కూల్చకపోయినా.. దాడుల్లో భాగంగానే ఈ దుర్ఘటన జరిగి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు మరోవైపు ప్రమాద స్థలిలో దొరికిన బ్లాక్ బాక్స్‌లను తయారీ కంపెనీ బోయింగ్ సంస్థకు కానీ, అమెరికాకి కానీ ఇచ్చేదిలేదని ఇరాన్ ఇదివరకే తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో తాజా వీడియోపై ఉక్రేయిన్, కెనడా ఎలా స్పందిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ వీడియో నిజమని తేలితే ఇరాన్‌కు కొంచె ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. -
విమానాన్ని కూల్చిన ఇరాన్ మిస్సైల్..!
-
కూలడానికి ముందు తిరుగు పయనం
టెహ్రాన్: ఉక్రెయిన్ ఎయిర్‌లైన్స్ విమాన ప్రమాదంపై ఇరాన్ కీలక ప్రకటన చేసింది. విమానంలో సమస్య తలెత్తడంతో తిరిగి వెనక్కి వచ్చేందుకు ప్రయత్నించిందని వెల్లడించింది. ఉక్రెయిన్‌కు చెందిన బోయింగ్ విమానం బుధవారం ఉదయం ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోగా అందులోని మొత్తం 176 మంది మరణించడం తెల్సిందే. ఇరాన్–అమెరికాల మధ్య ఉద్రిక్తతలు, ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడుల సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ‘పశ్చిమ దిశగా ప్రయాణిస్తున్న ఆ విమానం 8 వేల అడుగుల ఎత్తులో ఉండగా రాడార్ నుంచి అదృశ్యమైంది. ఏదో లోపం తలెత్తినట్లు గుర్తించిన వెంటనే వెనక్కి రావడానికి గాను విమానం కుడి వైపునకు తిరిగి, ఆ వెంటనే కూలిపోయినట్లుగా గుర్తించాం. అయితే, విమానంలో తలెత్తిన అసాధారణ పరిస్థితులపై పైలెట్ ఎలాంటి రేడియో మెసేజ్ పంపించలేదు’ అని ఘటనపై దర్యాప్తు జరుపుతున్న ఇరాన్ అధికారులు గురువారం ఒక ప్రకటనలో వివరించారు. ఈ దుర్ఘటనపై దర్యాప్తుతోపాటు, బ్లాక్‌బాక్స్‌లో సమాచారాన్ని విశ్లేషించేందుకు 45 మందితో కూడిన ఉక్రెయిన్ అధికారుల బృందం గురువారం ఇరాన్‌కు చేరుకుంది. ప్రమాద ఘటనపై ఏడు వేర్వేరు కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నామని, ప్రస్తుతానిౖMðతే ఫలానా కారణమని చెప్పలేమని ఓ అధికారి తెలిపారు. -
కూలిన విమానం
టెహ్రాన్: అగ్రరాజ్యం అమెరికాతో యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో ఇరాన్లో ఓ విమానం కుప్పకూలింది. ఉక్రెయిన్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన పౌర విమానం టెహ్రాన్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన రెండు నిమిషాలకే కూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 176 మంది మృతి చెందారు. బోయింగ్ 737 విమానం టెహ్రాన్ నుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు వెళ్లాల్సి ఉండగా ఈ ఘటన జరిగింది. విమాన ప్రమాదంలో మృతి చెందినవారిలో ఇరాన్, కెనడా దేశస్తులే అత్యధికంగా ఉన్నారు. ఇరాన్‌కి చెందినవారు 82 మంది, కెనడా దేశస్తులు 63 మంది ఉన్నారు. ప్రయాణికుల్లో 15 మంది చిన్నారులు కూడా ఉన్నారు. రెండు నిమిషాల్లోనే రాడార్ నుంచి అదృశ్యం ఉక్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు (యూఐఏ) చెందిన పీఎస్ 752 విమానం టెహ్రాన్ విమానాశ్రయంనుంచి ఉదయం 6:10 గంటలకి టేకాఫ్ అయింది. ఆ తర్వాత రెండు నిమిషాలకే రాడార్‌తో సంకేతాలు తెగిపోయాయి. టెహ్రాన్ విమానాశ్రయానికి వాయవ్య దిశగా 45 కి.మీ. దూరంలో షారియార్లోని పంట పొలాల్లో విమాన శిథిలాలు కనిపించినట్టు ఇరాన్ మీడియా వెల్లడించింది. విమానంలో ప్రయాణిస్తున్న 176 మందిలో ఎవరూ జీవించే అవకాశమే లేదు. ఇరాన్ మీడియా ప్రసారం చేసిన వీడియోలో విమానం కూలిన ప్రాంతంలో మంటలు, దట్టమైన పొగ అలము కొని ఉన్నాయి. సహాయ సిబ్బంది మృతదేహాలను, ప్రయాణికుల వస్తువులను మోసుకొస్తున్న దృశ్యాలు అందరి హృదయాల్ని కలిచివేశాయి. కూలిపోయిందా ? కూల్చేశారా ? ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఈ విమానాన్ని కూల్చివేశారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇరాన్ దేశానికి చెందిన క్షిపణి పొరపాటున విమానాన్ని కూల్చేసిందని సోషల్ మీడియా వేదికగా ప్రచారం మొదలైంది. విమానం ప్రమాదవశాత్తూ కూలిపోకుండా, వేరే ఏదైనా కుట్ర కోణం ఉంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాడిమిర్ జెలెంస్కీ హెచ్చరించారు. సందేహాలు ► ఇరాక్‌లో అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణులతో దాడి చేసిన కొద్ది సేపటికే విమానం ప్రమాదానికి గురైంది. ఇరాన్ క్షిపణులకి పొరపాటున తగలడం వల్లే విమానం ప్రమాదానికి గురైందన్న అనుమానాలున్నాయి. ► బోయింగ్ 737 విమానం 2016లో తయారు చేశారు. ప్రమాదానికి గురైన రెండు రోజుల ముందే దానిని తనిఖీ చేశారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు చెందిన ఈ ఎయిర్‌లైన్స్ విమానం ప్రమాదానికి గురికావడం ఇదే మొదటి సారి. విమానం పూర్తిగా పనిచేసే సామర్థ్యంలోనే ఉందని యూఐఏ అధ్యక్షుడు యెవగనీ వెల్లడించారు. తాము నడిపే విమానాల్లో ఇదే అత్యుత్తమమైనదనీ కన్నీళ్ల మధ్య చెప్పారు. ► విమానం కుప్పకూలాక మంటల్లో చిక్కుకుం దని ఇరాన్ మీడియా వెల్లడించింది. కానీ గాల్లోనే విమానం మంటల్లో చిక్కుకున్నట్టుగా ప్రమాద దృశ్యాల్లో కనిపిస్తోంది. ► విమానంలో టిక్కెట్ బుక్ చేసుకొని ఆఖరి నిముషంలో ఇద్దరు ప్రయాణికులు రద్దు చేసుకున్నారని ఉక్రెయిన్ జాతీయ భద్రతా మండలి చీఫ్ ఒలెక్సీ డేనిలవ్ అంటున్నారు. ► ప్రమాద స్థలిలో దొరికిన బ్లాక్ బాక్స్‌లను తయారీ కంపెనీ బోయింగ్ సంస్థకు కానీ, అమెరికాకి కానీ ఇరాన్ ఇంకా ఇవ్వలేదు. విమాన ప్రమాదంపై విచారణ ఏ దేశం చేస్తుందో స్పష్టత లేదని అందుకే ఇవ్వలేదని ఇరాన్ అధికారులు చెబుతున్నారు. ► ఈ విమాన ప్రమాదంలో మానవ తప్పిదం ఉన్నట్టుగా తాము భావించడం లేదని బోయింగ్ సంస్థ చెబుతోంది. అంతకు ముందు ఇరాన్లో ఉక్రెయిన్ దౌత్యకార్యాలయం తన వెబ్సైట్లో ఈ ప్రమాదం వెనుక ఎవరి హస్తం లేదని, ప్రాథమిక ఆధారాలను పరిశీలిస్తే ఇంజిన్ వ్యవస్థ పనిచేయకపోవడమే కారణమని భావిస్తున్నట్టు వెల్లడించింది. -
ఇరాన్ విమాన ప్రమాదంపై అనుమానాలు!
న్యూఢిల్లీ : ఇరాన్లో బుధవారం చోటుచేసుకున్న విమాన ప్రమాదంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. బోయింగ్ 737 విమానం టెహ్రాన్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో విమాన సిబ్బందితోపాటు 176 మంది మృతిచెందారు. అయితే ఈ విమానం గాల్లో ఉండగానే మంటలు చెలరేగాయని, ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే కుప్పకూలిందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. తొలుత సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని తెలిపిన ఉక్రేయిన్ ప్రతినిధులు.. ఆ తర్వాత కొద్దిసేపటికే విరుద్దమైన ప్రకటన చేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని.. దర్యాప్తు తర్వాత వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. విమాన ప్రమాదం జరిగిన చోట రెండు బ్లాక్ బాక్స్‌లను స్వాధీనం చేసుకున్న ఇరాన్.. వాటిని బోయింగ్ సంస్థకు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్టు అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీలు వార్తలు ప్రచురించాయి. మరోవైపు అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో క్షిపణి దాడి కారణంగానే విమాన ప్రమాదం జరగి ఉంటుందని పలువురు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. అలాగే రెండు రోజుల క్రితమే ప్రమాదానికి గురైన విమానానికి సాంకేతిక పరీక్షలు నిర్వహించామని బోయింగ్ సంస్థ తెలిపింది. ఇలా పలు సందేహాలు తలెత్తడంతో.. విమాన ప్రమాదం ఎలా జరిగిందనేది మిస్టరీగా మారింది. -
టెహ్రాన్‌లో కూలిన విమానం
-
ఘోర విమాన ప్రమాదం, వైరల్ వీడియో
టెహ్రాన్: ఇరాన్లో బుధవారం చోటు చేసుకున్న ఘోర విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఉక్రెయిన్‌కు చెందిన బోయింగ్ 737 విమానం టేకాఫ్ తీసుకున్నకొద్ది సేపటికే కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో సిబ్బంది సహా, మొత్తం ప్రయాణీకులు 180 మంది సజీవ దహనమై పోయారు. దీనికి సంబంధించిన భయంకరమైన వీడియోలో ట్విటర్లో షేర్ అవుతోంది. మిలిటరీ కమాండర్ ఖాసిం సులేమాని హత్యకు ప్రతీకారంగా ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడికి పాల్పడింది. దీంతో ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చదవండి: ఇరాన్లో కుప్పకూలిన విమానం -
ఇరాన్లో కుప్పకూలిన విమానం
ఒకవైపు ఇరాన్ అమెరికా మధ్య యుద్ధ వాతావరణం మరింత ముదురుతున్న తరుణంలో ప్యాసింజర్ విమానం కుప్పకూలిపోవడం మరింత ఆందోళన రేపింది. బోయింగ్ 737 విమానం టేక్ ఆఫ్ తీసుకున్న కొద్ది సేపటికే ప్రమాదానికి గురైంది. ప్రాథమిక సమాచారం ప్రకారం సాంకేతిక కారణాలతోనే ఈ విమానం కూలిపోయినట్టు తెలుస్తోంది. 170 మంది ప్రయాణికులు, సిబ్బందితో బయలుదేరిన ఉక్రేనియన్ విమానం బుధవారం టెహ్రాన్‌లోని ఇమామ్ ఖొమేని విమానాశ్రయం సమీపంలో కుప్పకూలింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రాజధాని టెహ్రాన్ శివారు పరాంద్ సమీపంలో బోయింగ్ 737 జెట్ కూలిపోయిందని ఇరాన్ మీడియా తెలిపింది. ఈ ప్రమాదంలో సిబ్బంది సహా మొత్తం 180 ప్రాణాలు కోల్పోయారు. -
ఐటీ కంపెనీలకు ‘బ్లో’యింగ్
న్యూఢిల్లీ: భారత ఐటీ కంపెనీలకు బోయింగ్ సంస్థ నుంచి వచ్చే వ్యాపారానికి గండిపడనుంది! ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ నుంచి బిలియన్ డాలర్ల వ్యాపారం ఆగిపోయే ప్రమాదం పొంచి ఉంది. బోయింగ్ తన ప్రతిష్టాత్మక 737 మ్యాక్స్ సిరీస్ విమానాల తయారీని జనవరి నుంచి నిలిపివేయనుంది. టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, సైయంట్, ఎల్అండ్టీ టెక్నాలజీ సర్వీసెస్ ప్రస్తుతం బోయింగ్ సంస్థతో వ్యాపార అనుబంధం కలిగి ఉన్నాయి. ‘‘చాలా భారత ఐటీ కంపెనీలకు బోయింగ్ ప్రముఖ క్లయింట్‌గా ఉంది. కనుక స్వల్పకాలంలో ఈ కంపెనీలపై తప్పక ప్రభావం ఉంటుంది. బోయింగ్ ఎదుర్కొంటున్న సమస్యల వల్ల ఏరోస్పేస్ విభాగంలో వ్యయాలు కూడా తగ్గిపోతాయి’’ అని ఐటీ అవుట్సోర్సింగ్ అడ్వైజర్, పారీక్ కన్సల్టింగ్ వ్యవస్థాపకుడు పారీక్ జైన్ తెలిపారు. మ్యాక్స్ 737 విమాన తయారీని ఈ నెలారంభంలోనే బోయింగ్ తాత్కాలికంగా నిలిపివేయగా, జనవరి నుంచి తన సరఫరాదారులు సరఫరాను నిలిపివేయనున్నట్టు ప్రకటించింది. ఈ సంస్థ తన సీఈవో డెన్నిస్ ములెన్బర్గ్కు ఈ వారమే ఉద్వాసన కూడా పలకడం గమనార్హం. ఇండోనేసియా, ఇథియోపియాల్లో బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు కూలిపోయిన ఘటనల నేపథ్యంలో నియంత్రణ సంస్థల విశ్వాసాన్ని బోయింగ్ కోల్పోయింది. ఇదే సీఈవోను సాగనంపేందుకు దారితీసింది. సగం వాటా మన ఐటీ కంపెనీలదే.. విమానయాన ఇంజనీరింగ్ అవుట్సోర్సింగ్ మార్కెట్ పరిమాణం ప్రపంచవ్యాప్తంగా ఏటా 4 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. బోయింగ్, ఎయిర్‌బస్ సమానంగా వాటా కలిగి ఉన్నాయి. బోయింగ్ సంస్థ 2 బిలియన్ డాలర్ల విలువైన సేవలను అవుట్సోర్సింగ్ ఇస్తుండగా, ఇందులో సగానికి సగం మన దేశ ఐటీ కంపెనీలే సొంతం చేసుకుంటున్నాయి. వీటితోపాటు అస్సెంచుర్, క్యాప్‌జెమినీ సంస్థలు కూడా ఈ విభాగంలో ముందున్నాయి. బోయింగ్‌కు ఇంజన్లను ప్రట్ అండ్ విట్నే, రోల్స్‌రాయిస్, జనరల్ ఎలక్ట్రిక్, శాఫ్రాన్.. విమాన విడిభాగాలను స్పిరిట్ ఏరోసిస్టమ్స్, శాఫ్రాన్ సమకూరుస్తున్నాయి. రాక్వెల్, హానీవెల్ సంస్థలు ఏవియోనిక్స్ను సమకూరుస్తున్నాయి. ‘‘చాలా వరకు భారత ఐటీ సంస్థలు నేరుగా బోయింగ్ సంస్థతో, సరఫరా వ్యవస్థతో అనుబంధం కలిగి ఉన్నాయి. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, సైయింట్ నేరుగా బోయింగ్‌తో వ్యాపారం కలిగి ఉంటే, విడిభాగాల సరఫరాదారు స్పిరిట్ ఏరోసిస్టమ్ ఇన్ఫోసిస్ క్లయింట్‌గా ఉంది’’ అని అవుట్సోర్సింగ్ మార్కెట్ ప్రముఖుడొకరు తెలిపారు. ఒప్పందాల్లో రక్షణ ఉంటుంది.. ‘‘సాధారణంగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్టుల్లో రక్షణకు సంబంధించి నిబంధనలు ఉంటాయి. రద్దు కారణంగా తలెత్తే నష్టాల నుంచి ఐటీ కంపెనీలకు రక్షణ ఉంటుంది. అయితే, స్వల్ప కాలానికి లాభదాయకతపై కచ్చితంగా ప్రభావం పడుతుంది’’ అని గ్రేహౌండ్ రీసెర్చ్ వ్యవస్థాపకుడు, సీఈవో సంచిత్విర్ గోగియా వివరించారు. ‘‘ఇంజనీరింగ్ సేవల సంస్థలు మాత్రం ఇప్పటికీ ఆశావహంగానే ఉన్నాయి. ఎందుకంటే బోయింగ్ 737 మ్యాక్స్‌ను నిలిపివేస్తే, అప్పుడు 797 మోడల్‌పై అధిక వ్యయాలు చేస్తుందన్న అంచనాతో ఉన్నాయి. భారత ఇంజనీరింగ్ సేవల సంస్థలకు ఇది సానుకూలమే’’ అని మరొక నిపుణుడు పేర్కొన్నారు. బోయింగ్ 797 కొత్త తరహా విమానం. ఇది 225–275 సీట్ల సైజుతో ఉంటుంది. బోయింగ్ సరఫరా వ్యవస్థ ఇంజిన్ తయారీదారులు: ప్రట్ అండ్ విట్నే, రోల్స్‌రాయిస్, జనరల్ ఎలక్ట్రిక్, శాఫ్రాన్ విడిభాగాల సరఫరాదారులు: స్పిరిట్ ఏరోసిస్టమ్స్, శాఫ్రాన్ ఏవియోనిక్స్ (ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్): రాక్వెల్, హనీవెల్ భారత కంపెనీలు: భారత ఐటీ కంపెనీలు అప్లికేషన్ డెవలప్మెంట్, టెస్టింగ్, ఇంజనీరింగ్, ఏవియోనిక్స్, బీపీఓ సేవలను బోయింగ్ 737 మ్యాక్స్ విమాన తయారీ కార్యక్రమానికి అందిస్తున్నాయి. -
రన్‌వే నుంచి నదిలోకి..
జాక్సన్విల్లే: అమెరికాలో పెను విమాన ప్రమాదం తప్పింది. క్యూబా దేశం నుంచి అమెరికాలోని ఉత్తర ఫ్లోరిడాకు 143 మంది ప్రయాణికులతో బయల్దేరిన ఓ చార్టర్ విమానం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయి వేగంతో దూసుకెళ్తూ రన్‌వే నుంచి అదుపుతప్పి ఆ పక్కనే ఉన్న సెయింట్ జాన్స్ నదిలోకి దూసుకెళ్లింది. అయితే శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. క్యూబాలోని గ్వాంటనమో బే నావల్ స్టేషన్ నుంచి బయల్దేరిన బోయింగ్–737 విమానం అమెరికాలోని జాక్సన్విల్లే నావల్ స్టేషన్లో ల్యాండ్ అవుతుండగా ఈ ఘటన జరిగింది. ఘటన జరిగినపుడు విమానంలో 136 మంది ప్రయాణికులు, ఏడుగురు విమాన సిబ్బంది ఉన్నారు. స్వల్పగాయాలైన 21 మందిని ఆస్పత్రికి తరలించారు. ఈ విమానంపై మియామీ ఎయిర్ ఇంటర్నేషనల్ లోగో ఉన్న ఫొటోను అధికారులు పోస్ట్ చేశారు. అయితే దీనిపై మియామీ స్పందించలేదు. ‘ఇది నిజంగా ఒక అద్భుతం. నదిలో నుంచి విమానాన్ని బయటికి తీయడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేం’ అని ఎన్ఏఎస్ జాక్సన్విల్లే కమాండింగ్ అధికారి కెప్టెన్ మేఖేల్ కాన్నర్ అన్నారు. విమానంలోని ఇంధనం నదిలోకి లీక్ అవ్వకుండా చూసేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నట్లు చెప్పారు. -
నదిలోకి దూసుకెళ్లిన విమానం
-
నదిలోకి దూసుకెళ్లిన విమానం
వాషింగ్టన్ : ఫ్లోరిడాలో ప్రమాదకర ఘటన చోటుచేసుకుంది. ల్యాండింగ్ సమయంలో అదుపుతప్పిన బోయింగ్ 737 కమర్షియల్ జెట్ నదిలోకి దూసుకువెళ్లింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. వివరాలు... 136 మంది ప్రయాణికులతో బోయింగ్ విమానం క్యూబా నుంచి బయల్దేరింది. అయితే నావల్ స్టేషన్ గంటానమో బేలో ల్యాండ్ అవుతున్న సమయంలో జాక్సన్‌విల్లేలోని సెయింట్ జాన్స్ నదిలోకి దూసుకువెళ్లిందని నావల్ ఎయిర్‌స్టేషన్ అధికార ప్రతినిధి తెలిపారు. అంతా క్షేమం.. శుక్రవారం రాత్రి 9.40 గంటల సమయంలో జరిగిన ఈ ఘటన నుంచి ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారని జాక్సన్విల్లే మేయర్ ట్వీట్ చేశారు. వారంతా బతికే ఉన్నారని కుటుంబ సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఇక ఈ ఘటనపై స్పందించిన జాక్సన్విల్లే షరిఫ్స్ ఆఫీస్ కూడా ప్రమాద సమయంలో ఎటువంటి ప్రాణ నష్టం జరుగలేదని ట్వీట్ చేసింది. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఎగరని విమానాలు చార్జీలకు రెక్కలు!
న్యూఢిల్లీ: పలు సమస్యలతో దేశీ ఎయిర్‌లైన్స్ పెద్ద సంఖ్యలో విమానాలను నిలిపివేయాల్సి వస్తుండటంతో.. విమాన ప్రయాణ చార్జీలు గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. స్వల్పకాలికంగా చార్జీలు 25 శాతం దాకా పెరగవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. వివిధ కారణాలతో ఇండిగో, జెట్ ఎయిర్వేస్, స్పైస్‌జెట్ దగ్గరున్న వాటిలో దాదాపు 20 శాతం విమానాలు నిలిచిపోవడం ఇందుకు కారణం. దేశీయంగా మొత్తం 585 విమానాలతో ఎయిర్‌లైన్స్ ప్రస్తుతం సేవలు అందిస్తున్నాయి. తాజాగా భద్రతా కారణాల దృష్ట్యా బోయింగ్737 మ్యాక్స్ రకం విమానాలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిషేధించింది. ఫలితంగా స్పైస్‌జెట్ తమ దగ్గరున్న ఈ తరహా 12 విమానాలను పక్కన పెట్టాల్సి వచ్చింది. దీంతో.. దేశీయంగా ఎయిర్‌లైన్స్ ఇలా పక్కకు పెట్టిన విమానాల సంఖ్య 114కి చేరింది. ఇది మొత్తం విమానాల సంఖ్యలో దాదాపు 20 శాతం కావడం గమనార్హం. విమానాల కొరత కారణంగా స్పైస్‌జెట్ బుధవారం 14 ఫ్లయిట్స్‌ను రద్దు చేయగా గురువారం 32 సర్వీసుల దాకా రద్దు చేసి ఉంటుందని అంచనా. మిగతా విమానాలను మరింత సమర్థ వంతంగా ఉపయోగించుకోవడంపై సంస్థలు కసరత్తు చేస్తున్నప్పటికీ.. స్వల్పకాలికంగా డిమాండ్‌కి తగ్గట్లుగా సేవలు అందించలేకపోవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. కష్టాల్లో ఎయిర్‌లైన్స్.. ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానం కూలిపోవడంతో బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలపై ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో నిషేధం అమలవుతోంది. దీంతో భారత్ సహా పలు దేశాల్లో విమానయాన సంస్థలు ఈ రకం ఏరోప్లేన్స్‌ను పక్కన పెట్టాల్సి వస్తోంది. అయితే, దీనికన్నా ముందే దేశీయంగా ఇండిగో, గోఎయిర్, జెట్‌ఎయిర్‌వేస్, ఎయిరిండియా వంటి విమానయాన సంస్థలు ఇతరత్రా కారణాలతో చాలా విమానాలను పక్కన పెట్టాయి. ఆర్థిక సంక్షోభం మొదలుకుని సాంకేతిక సమస్యలు, పైలట్ల కొరత మొదలైనవి ఈ కారణాల్లో ఉన్నాయి. ఉదాహరణకు లీజింగ్ సంస్థలకు చెల్లింపులు జరపకపోవడంతో జెట్ ఎయిర్వేస్కి చెందిన 50 శాతం విమానాలు ఇప్పటికే నిల్చిపోయాయి. ఇక, పైలట్ల కొరత సమస్యతో ఇండిగో రోజుకు దాదాపు 30 ఫ్లయిట్ సర్వీసుల దాకా రద్దు చేస్తోంది. మరోవైపు 47 విమానాలు ఉన్న గోఎయిర్ సంస్థ ఇంజిన్ల సమస్యలు, సరైన నెట్వర్క్ లేకపోవడం తదితర అంశాల కారణంగా 14 విమానాలను పక్కన పెట్టింది. ఇలా ఒకవైపు విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండగా.. మరోవైపు డిమాండ్‌కి తగినంత స్థాయిలో సర్వీసులు నడిపేందుకు విమానాలు లేకపోతుండటం మూలంగా విమాన చార్జీలపై ప్రభావం పడుతోంది. ఇప్పటికే 15 శాతం పెరిగిన చార్జీలు.. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటిదాకా విమానయాన చార్జీలు (వార్షిక ప్రాతిపదికన) 15 శాతం దాకా పెరిగాయని ఆన్లైన్ ట్రావెల్ సెర్చి ఇంజిన్ యాత్ర ఆన్లైన్ సీవోవో శరత్ ధాల్ తెలిపారు. ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉండటం, విమానాల సంఖ్య తగ్గుతుండటం కారణంగా.. భారీ సంఖ్యలో ప్యాసింజర్స్‌కు తగ్గట్లుగా ఎయిర్‌లైన్స్ సర్వీసులు నడపలేకపోవచ్చని ఆయన పేర్కొన్నారు. దీంతో చార్జీలు కచ్చితంగా పెరిగే అవకాశాలే ఉన్నాయన్నారు. ఆఖరు నిమిషంలో బుక్ చేసుకుంటే ఏకంగా 100 శాతం పైగానే చార్జీలు చెల్లించాల్సి రావొచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఉదాహరణకు ఒక ట్రావెల్ పోర్టల్ ప్రకారం.. బుధవారం ముంబై–చెన్నై రూట్లో స్పాట్ టికెట్ ధర ఏకంగా రూ. 26,073 పలికింది. గతేడాది ఇదే సమయంలో ఈ రేటు రూ. 5,369 మాత్రమే. హోలీ పండుగ, స్కూళ్లు .. కాలేజీలకు వేసవి సెలవులు వంటి అంశాలతో ప్రస్తుతం ప్రయాణికుల రద్దీ భారీగానే ఉంటుందని ట్రావెల్ పోర్టల్ ఇక్సిగో సీఈవో అలోక్ బాజ్‌పాయ్ చెప్పారు. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత ముందుగా బుక్ చేసుకోవడమే మంచిదని సూచించారు. ‘మ్యాక్స్’ సమస్యలు.. మ్యాక్స్ తరహా ఏరోప్లేన్స్ సంఖ్య ప్రస్తుతానికి తక్కువే ఉన్నా .. పలు సంస్థలు పెద్ద సంఖ్యలో వీటి కోసం ఆర్డర్ ఇచ్చాయి. నిషేధం కారణంగా ఆ విమానాల డెలివరీ ఆగిపోతే విమానాల సంఖ్యపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఏవియేషన్ కన్సల్టింగ్ సంస్థ సెంటర్ ఫర్ ఆసియా పసిఫిక్ ఏవియేషన్ (సీఏపీఏ) సీఈవో (దక్షిణాసియా విభాగం) కపిల్ కౌల్ చెప్పారు. ఇక జెట్ ఎయిర్వేస్ ఆర్థిక కష్టాలు, ఇండిగోలో పైలట్ల కొరత మొదలైనవి కూడా దీనికి తోడైతే విమానయాన సంస్థల సామర్థ్యం మరింత తగ్గుతుందని పేర్కొన్నారు. ఇది ఆందోళన కలిగించే విషయమన్నారు. మ్యాక్స్ విమానాలను పక్కన పెట్టాల్సి రావడం, నిషేధం ఎత్తివేతపై అనిశ్చితి నెలకొనడం.. స్పైస్‌జెట్ కార్యకలాపాల విస్తరణ ప్రణాళికలపై కూడా ప్రభావం చూపనుంది. స్పైస్‌జెట్ ఏకంగా ఈ రకానికి చెందిన 155 విమానాలకు ఆర్డర్లిచ్చింది. ఇవి అందుబాటులోకి వస్తే కార్యకలాపాలు మరింతగా విస్తరించాలని ప్రణాళికలు వేసుకుంది. కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్రణాళికలు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. -
నేలకు దిగిన బోయింగ్‌లు
న్యూఢిల్లీ/అడిస్ అబబా: భారత విమానయాన సంస్థలు ఉపయోగిస్తున్న అన్ని బోయింగ్ 737 మ్యాక్స్–8 రకం విమానాలను కిందకు దింపేశామని పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఖరోలా బుధవారం చెప్పారు. దీని కారణంగా స్పైస్‌జెట్‌కు చెందిన 35 విమానాల సర్వీసులు గురువారం రద్దు అవుతాయన్నారు. రద్దవుతున్న సర్వీసులకు టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు తమ ఇతర విమానాల్లో టికెట్లు కేటాయిస్తున్నామనీ, టికెట్లు రద్దయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని స్పైస్‌జెట్ తెలిపింది. వివిధ దర్యాప్తు సంస్థల నుంచి వచ్చే సమాచారాన్ని బట్టి బోయింగ్‌పై నిషేధాన్ని కొనసాగించాలా, ఎత్తేయాలా అన్నది నిర్ణయిస్తామనీ, అయితే దీనిపై సమీప భవిష్యత్తులో నిర్ణయం వెలువడే అవకాశం లేదని ఆయన అన్నారు. ఇక మరో భారతీయ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ వద్ద కూడా ఐదు బోయింగ్ 737 మ్యాక్స్ 8 రకం విమానాలు ఉన్నప్పటికీ వాటికి అద్దె చెల్లించలేక ఆ సంస్థ వాటిని ఇప్పటికే నిలిపేసింది. తాజా నిషేధంతో ఆ సంస్థ సర్వీసులపై ప్రభావమేమీ ఉండదు. ఇథియోపియాలో ఇటీవల కూలిపోయిన బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానంలోని బ్లాక్ బాక్స్‌లను విశ్లేషణల కోసం యూరప్‌కు పంపనున్నట్లు ఇథియోపియా ప్రభుత్వం తెలిపింది. బోయింగ్ విమానాల్లో భద్రతా ప్రమాణాలపై ఆందోళనలు నెలకొన్న తరుణంలో ఈ బ్లాక్ బాక్స్‌లను విశ్లేషించాలని తీవ్రంగా ఒత్తిడి ఉన్న నేపథ్యంలో ఇథియోపియా ఈ నిర్ణయం తీసుకుంది. బోయింగ్ విమానాలపై అనేక దేశాలు నిషేధం విధించాయి. ఇథియోపియాలో కూలిన విమానం బ్లాక్ బాక్స్‌లు, కాక్పిట్ల్లోని సమాచారాన్ని విశ్లేషించేందుకు అవసరమైన పరికరాలు తమ వద్ద లేవనీ, కాబట్టి వాటిని యూరప్‌కు పంపుతున్నామని ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి చెప్పారు. అయితే యూరప్‌లో ఏ దేశానికి పంపాలో గురువారం నిర్ణయిస్తామన్నారు. -
బోయింగ్ 737పై భారత్ నిషేధం
న్యూఢిల్లీ: బోయింగ్ 737 మ్యాక్స్–8 విమానాలపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. ఇథియోపియా ఎయిర్‌లైన్స్ ప్రమాదం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు బోయింగ్ 737పై ఇప్పటికే నిషేధం విధించాయి. ఇథియోపియా విమాన ప్రమాదంలో ఆరుగురు భారతీయులు సహా 157 మంది ప్రయాణికులు మృత్యువాతపడిన విషయం తెలిసిందే. ఈ విమానాలు సురక్షితమేనని నిర్థారించేందుకు అవసరమైన మార్పులు, భద్రతా చర్యలు చేపట్టేవరకు నిషేధం కొనసాగుతుందని కేంద్ర పౌరవిమానయాన శాఖ తెలిపింది. అంతేకాకుండా, ఈ విమాన పైలెట్లకు వెయ్యి గంటలు, కో పైలెట్‌కు 500 గంటలు నడిపిన అనుభవం ఉంటేనే అనుమతిస్తామని స్పష్టం చేసింది. ‘ప్రయాణికుల భద్రతే మాకు అత్యంత ముఖ్యం. ఇందుకు అవసరమైన చర్యలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానయాన సంస్థలు, ఉత్పత్తి దారులతో సంప్రదింపులు జరుపుతున్నాం’ అని పౌరవిమానయాన శాఖ ట్విట్టర్లో పేర్కొంది. భారత్‌కు చెందిన స్పైస్‌జెట్‌కు 13, జెట్ ఎయిర్వేస్ సంస్థకు 5 బోయింగ్ 737 మ్యాక్స్8 రకం విమానాలు ఉన్నాయి. జెట్ ఎయిర్వేస్ ఇప్పటికే ఈ విమానాలను నిలిపివేయగా స్పైస్ జెట్ మాత్రం తమ విమానాలు అత్యంత సురక్షితమైనవంటూ తెలిపింది. -
‘ఇథియోపియా’ బ్లాక్‌బాక్స్ దొరికింది
-
బాబోయ్ ఆ విమానాలు మాకొద్దు!
సింగపూర్ : ఆదివారం జరిగిన ఇథియోపియా విమాన ప్రమాదం నేపథ్యంలో సింగపూర్ తన విమానయాన సంస్థల వద్ద వున్న బోయింగ్ 737 విమానాలను పక్కనపెట్టాలని నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయం తాత్కలికమే అని అధికారులు తెలిపారు. ఇథియోపియా దేశ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 'బోయింగ్ 737 మ్యాక్స్ - 8' విమానం బయలుదేరిన కాసేపటికే కుప్పకూలి 157 మంది మరణించడంతో సింగపూర్ ఈ నిర్ణయం తీసుకుంది. చైనా, ఇండొనేషియా కూడా సింగపూర్ బాటలోనే నడుస్తున్నాయి. ఇథియోపియా విమాన ప్రమాదం నేపథ్యంలో చైనా, ఇండోనేషియా దేశ విమానయాన సంస్థలు కూడా బోయింగ్ 737 మ్యాక్స్ విమాన సర్వీసులను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశాయి. విమానాల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైనా పేర్కొంది. ఐదు నెలల కిందట ఇదే రకం లయన్ ఎయిర్ విమానం ఇండోనేసియాలో కుప్పకూలడంతో 189 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఆదివారం ప్రమాదానికి గురైన బోయింగ్ విమానం కూడా బయలుదేరిన కొన్ని నిమిషాలకే ప్రమాదానికి గురవడంతో వీటి భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
‘ఇథియోపియా’ బ్లాక్‌బాక్స్ దొరికింది
ఎజియర్: ఇథియోపియాలో 157 మంది ప్రాణాలను బలిగొన్న అత్యంత విషాద విమాన ప్రమాదఘటనకు సంబంధించి కీలక ఆధారంగా భావించే బ్లాక్‌బాక్స్ దొరికింది. ‘విమానానికి సంబంధించి లభ్యమైన ఈ బ్లాక్‌బాక్స్‌లో విమాన సమాచారం, కాక్‌పిట్ వాయిస్ రికార్డు అయి ఉంది’ అని ఇథియోపియా ఎయిర్‌లైన్స్ సోమవారం పేర్కొంది. ‘అయితే బ్లాక్‌బాక్స్ పాక్షికంగా దెబ్బతింది. దాని నుంచి ఎంత సమాచారం పొందగలమనే దాన్ని మేం పరిశీలిస్తున్నాం’ అని ఎయిర్‌లైన్స్ అధికారి ఒకరు మీడియాకు చెప్పారు. మరోవైపు, రెడ్‌క్రాస్ కార్యకర్తలు విమాన కూలిన ప్రాంతంలో చెల్లాచెదురుగా పడి ఉన్న 157 మంది ఆచూకీ కోసం వెతుకుతున్నారు. ఘటనాస్థలిలో నలిగిపోయిన పాస్‌పోర్టులు, వస్తువులు, సామగ్రి చిందరవందరగా పడిఉన్నాయి. బోయింగ్‌కు చైనా షాక్! చైనా తన స్వదేశీ విమాన సంస్థలకు చెందిన దాదాపు వంద బోయింగ్ 737 మాక్స్–8 రకం విమానాల సేవలను నిలిపివేయాలని ఆదేశించింది. విమానాల భద్రత దృష్ట్యా ఈమేరకు నిర్ణయించినట్లు పేర్కొంది. అడిస్ అబాబాలో ఇథియోపియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కూలి పోయిన సంగతి తెలిసిందే. ఐదు నెలల కిందట ఇదే రకం లయన్ ఎయిర్ విమానం ఇండోనేసియాలో కుప్పకూలడంతో 189 మంది చనిపోయారు. ఇండోనేసియా, ఇథియోపియా కూడా ఈ రకం విమానాల సేవలు నిలిపివేయాలని ఆదేశించాయి. విమాన ప్రమాద నేపథ్యంలో స్వదేశీ ఎయిర్‌లైన్స్ నిర్వహించే ఈ రకం విమానాల భద్రతపై సమీక్ష చేపట్టాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)ను కోరినట్లు భారత పౌర విమానయాన మంత్రి సురేశ్ ప్రభు ట్వీట్ చేశారు. -
బోయింగ్‌కు చైనా షాక్
-
ఇథియోపియాలో కూలిన విమానం
అడిస్ అబాబా: ఆఫ్రికా దేశం ఇథియోపియా గగనతలంలో ఆదివారం పెను విషాదం చోటు చేసుకుంది. రాజధాని అడిస్ అబాబా నుంచి కెన్యా రాజధాని నైరోబి బయల్దేరిన బోయింగ్ 737–8 మ్యాక్స్ విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న సిబ్బంది, ప్రయాణికులు మొత్తం 157 మంది చనిపోయారు. మృతుల్లో నలుగురు భారతీ యులుసహా చైనీయులు, కెనడా, అమెరికా దేశాల పౌరులున్నట్లు తెలిసింది. ఈ ప్రమాదా నికి కారణమేంటో తెలియరాలేదు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ప్రయాణికులు బతికున్నట్లు సమాచారమేదీ లేదని ఇథియోపియా ప్రధాని కార్యా లయం ప్రకటించింది. విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది అంతా చనిపోయారని, మృతుల్లో 33 దేశాలకు చెందిన వారు ఉన్నారని ఇథియోపియా ప్రభుత్వ రంగ మీడియా సంస్థ ఈబీసీ వెల్లడించింది. బయల్దేరిన ఆరు నిమిషాలకే.. అడిస్ అబాబాలోని బోలె విమానాశ్రయం నుంచి బయల్దేరిన ఇథియోపియా ప్రభుత్వ రంగ సంస్థ ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ విమా నం ఆరు నిమిషాలకే కుప్పకూలింది. దక్షిణ అడిస్ అబాబాకు సుమారు 50 కి.మీ దూరం లోని బిషోఫ్తులో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8.44 గంటలకు ఈ ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో విమానంలో ఉన్న 149 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది మృతిచెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. ప్రమాదాన్ని పసిగట్టిన పైలట్ ఎమర్జెన్సీ కాల్ చేశాడని, వెనక్కి వచ్చేందుకు అనుమతి ఇచ్చామని విమానయాన సంస్థ సీఈవో తెలిపారు. విమానం టేకాఫ్ అయిన తరువాత అస్థిర వేగంతో పైకి ఎగిరిందని ఎయిర్ ట్రాఫిక్ మానిటర్ వెల్లడించారు. ప్రమాదానికి గురైన విమానం బోయింగ్ 737–8 మ్యాక్స్ గత నవంబర్లోనే ఎయిర్‌లైన్స్‌లో చేరినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో 32 మంది కెన్యా, 9 మంది ఇథియోఫియా, 18 మంది కెనడా పౌరులున్నట్లు చెప్పారు. అలాగే, చైనా, అమెరికా, ఇటలీ నుంచి ఎనిమిది మంది చొప్పున, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల నుంచి ఏడుగురు చొప్పున, ఈజిప్టు నుంచి ఆరుగురు, నెదర్లాండ్స్ నుంచి ఐదుగురు, భారత్, స్లోవేకియా నుంచి నలుగురేసి చొప్పున ప్రయాణికులు ఉన్నట్లు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు ఇథియోపియా ప్రధాన మంత్రి కార్యాలయం ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఈ దుర్ఘటనపై విమాన తయారీ సంస్థ బోయింగ్ విచారం వ్యక్తం చేసింది. భారతీయ మృతుల గుర్తింపు.. విమాన ప్రమాదంలో మరణించిన భారతీయుల వివరాలను ఇథియోపియా రాయబార కార్యాలయం వెల్లడించింది. అందులో కేంద్ర పర్యావరణ శాఖకు సలహాదారుగా పనిచేస్తున్న ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం కన్సల్టెంట్ శిఖా గార్గ్ ఉన్నారని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ చెప్పారు. గార్గ్ యూఎన్ఈపీ సమావేశానికి వెళ్తున్నారని చెప్పారు. మిగిలిన ముగ్గురు వైద్య పన్నాగేశ్ భాస్కర్, వైద్య హాసిన్ అన్నాగేశ్, నూకవరపు మనీషా అని వెల్లడించారు. మృతుల కుటుంబాలకు మంత్రులు సుష్మా స్వరాజ్, హర్షవర్థన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
విమాన ప్రమాదం: అది ఫేక్ న్యూస్
జకార్తా: సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌కు అడ్డు అదుపు లేకుండా పోతుంది. తప్పుడు వార్తలను ట్రెండ్ చేస్తూ చాలామందిని తప్పుదోవ పట్టిస్తున్నారు. గత సోమవారం ఇండోనేసియాలో చోటుచేసుకున్న ఘోర విమాన ప్రమాదంలో 189 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఓ పసిపాప ప్రాణాలతో బయటపడిందని ఓ వార్త గత రెండు రోజులుగా హల్చల్ చేస్తోంది. ఆ పసిపాకు సంబంధించిన ఫొటో కూడా విపరీతంగా ట్రెండ్ అయింది. ప్రమాదం జరిగిన 24 గంటల్లోనే ఈ వార్తకు సంబంధించిన పోస్ట్ ఐదు వేల సార్లు షేర్ కావడం గమనార్హం. (చదవండి: సముద్రంలో కూలిన విమానం) ఈ పోస్ట్‌లో .. ‘ఈ పాపను రక్షించిన ఆ దేవుడికి కృతజ్ఞతలు. జేటీ610 విమాన ప్రమాదంలో బతికిన చిన్నారి. ఆమె తల్లి లైఫ్ జాకెట్‌తో కవర్ చేయడంతో ప్రాణాలతో బయట పడింది. దురదృష్టవశాత్తు ఆ పాప తల్లిని ఇప్పటి వరకు గుర్తించలేకపోయారు.’ అని క్యాప్షన్‌గా పేర్కొంటు ఓ పసిపాప ఫొటోను ట్రెండ్ చేశారు. (లయన్ విమాన ప్రమాదం : కెప్టెన్‌గా ఢిల్లీ వాసి) అయితే ఆ పాప ఈ ఏడాది జూలైలో ఇండోనేషియాలోనే చోటుచేసుకున్న నౌక ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన పాపని, ఆ ఫొటోనే తాజా ప్రమాదానికి ముడిపెడుతూ వైరల్ చేశారని ఆదేశ విపత్తు ఉపశమన సంస్థ అధికార ప్రతినిధి సుటోపా ట్విటర్ వేదికగా స్పష్టం చేశారు. ఇది ఒక గాలివార్తని, ఇలాంటి పుకార్లను నమ్మి, ప్రచారం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. సులవేసి నుంచి సెలయార్ తీరానికి వస్తుండగా నౌక మునిగిపోవడంతో సుమారు 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక నకిలీ వార్తలు ప్రచారం కావడం ఇదే తొలిసారేం కాదు. గతంలో చాలాసార్లు ట్రెండ్ అయ్యాయి. భారత్‌లో కేరళను వరదలు ముంచెత్తినప్పుడైతే ఈ నకిలీ వార్తలకు అడ్డుఅదుపే లేకుండా పోయింది. అలాగే పిల్లలను ఎత్తుకుపోతున్నారనే వాట్సాప్ మెసేజ్‌లతో చాలా మందిపై దాడులు జరిగాయి. ఈ దాడుల్లో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. (చదవండి: వరదల్లో ఫేక్ న్యూస్ బురద) కేరళ వరదలు: రోనాల్డో 72.. కోహ్లి 82 కోట్లట! -
సముద్రంలో కూలిన విమానం
జకార్తా: ఇండోనేసియాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. రాజధాని జకార్తా నుంచి సోమవారం ఉదయం 6.20 గంటలకు 189 మందితో పంగ్కల్ పినాంగ్ సిటీకి బయల్దేరిన ‘లయన్ ఎయిర్’ జెట్ విమానం జావా సముద్రంలో కుప్పకూలింది. బయల్దేరిన 13 నిమిషాలకే జకార్తాకు 32 మైళ్ల దూరంలో, కెరవాంగ్ సముద్ర తీరానికి దగ్గర్లో సముద్రంలో కూలిపోయింది. విమానంలో ప్రయాణిస్తున్న 182 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, ఐదుగురు సిబ్బంది ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినట్లు భావిస్తున్నారు. ప్రమాదానికి గురైన ‘బోయింగ్ –737 మాక్స్’ జేటీ 610 విమానానికి భారతీయుడైన భవ్య సునేజా పైలట్‌గా వ్యవహరిస్తున్నారు. ఫ్లైట్ డేటా ప్రకారం.. ఆకాశంలోకి వెళ్లాక వేగం పుంజుకుని 5 వేల అడుగుల పైకి చేరుకున్న కాసేపటికి, రాడార్ సంకేతాలను కోల్పోయి, కంట్రోల్ సెంటర్‌తో సంబంధాలు తెగిపోయి, వేగంగా నేలవైపు దూసుకువచ్చిన విమానం క్షణాల్లో సముద్రంలో కుప్పకూలింది. అంతకుముందు, కొన్ని క్షణాల ముందే, తిరిగి జకార్తాకు తిరిగిరావాల్సిందిగా ఆ విమాన పైలట్‌ను కంట్రోల్ సెంటర్ నుంచి ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. ప్రమాద సమాచారం తెలియగానే అధికారులు సహాయచర్యలు చేపట్టారు. తమకు లభించిన ఆనవాళ్ల మేరకు ఈ ఘటనలో ప్రయాణికులు ఎవరూ బ్రతికే అవకాశం లేదని సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్న అధికారి బంబాంగ్ సుర్యొ అజి తెలిపారు. విమానం నీళ్ల లోపలికి వేగంగా దూసుకువెళ్లడాన్ని పలువురు ప్రత్యక్ష సాక్షులు కూడా చూశారన్నారు. 40 మంది డైవర్లు సహా 150 మంది సహాయ చర్యల్లో పాలుపంచుకుంటున్నారు. సముద్రంలో 30 నుంచి 40 మీటర్ల లోతులో విమాన శకలాలను గుర్తించారు. ఈ ఆగస్ట్‌లోనే ఈ విమానాన్ని సర్వీస్‌లోకి తీసుకున్నామని లయన్ ఎయిర్ సంస్థ తెలిపింది. కొద్ది రోజుల క్రితం స్వల్ప మరమ్మతులకు గురైందని వెల్లడించింది. బాలిలో మరమ్మతులు జరిపి ఇటీవలే మళ్లీ జకార్తా తీసుకువచ్చామని, సోమవారం ఉదయం టేకాఫ్‌కు ముందు కూడా ఇంజనీర్లు స్వల్ప మరమ్మతులు చేశారని, అయితే, అది సాధారణంగా చేసే ప్రక్రియేనని లయన్ ఎయిర్ చీఫ్ ఎడ్వర్డ్ సైరాయిత్ వివరించారు. ఫ్లైట్ డేటా రికార్డర్, వాయిస్ రికార్డర్ లభిస్తే ప్రమాదానికి కచ్చితమైన కారణం తెలుస్తుందన్నారు. ఈ ప్రమాదంపై విమాన తయారీ సంస్థ బోయింగ్ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రమాద ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరో గంటలో గమ్యస్థానానికి.. మరో గంటలో ప్రముఖ పర్యాటక ప్రదేశమైన పంగ్కల్ పినాంగ్ సిటీకి ఈ విమానం చేరుకోవాల్సి ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలియగానే జకార్తా విమానాశ్రయం చేరుకున్న ప్రయాణీకులు తమవారి ఆచూకీ కోసం తల్లడిల్లుతున్న హృదయ విదారక దృశ్యాలు స్థానిక మీడియాలో ప్రసారమయ్యాయి. ‘నా కుమార్తె చనిపోయి ఉంటే కనీసం ఆమె ఖననమైనా సరిగ్గా జరగా లని కోరుకుంటున్నాను’ అని ఆ విమాన ప్రయాణఙ కురాలి తల్లి ఒకరు కన్నీళ్లతో చెప్పారు. ఇండోనేసియా నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ కమిటీ వివరాల మేరకు.. ప్రమాదానికి గురైన విమానంలో 178 మంది పెద్దలు, ఒక పాప, ఇద్దరు చిన్నారులు, ఇద్దరు పైలట్లు, ఆరుగురు విమాన సహాయక సిబ్బంది ఉన్నారు. వారిలో దాదాపు 20 మంది ఇండోనేసియా ఆర్థిక శాఖ ఉద్యోగులున్నారు. తన స్నేహితులు చాలామంది అందులో ఉన్నారని ఆలస్యం కావడంతో విమానాన్ని అందుకోలేకపోయిన సోనీ సెతియావన్ చెప్పారు. 2015 ఆగస్ట్‌లో ప్రతికూల వాతావరణం కారణంగా ఇండోనేసియాకే చెందిన త్రిగణ ఎయిర్‌లైన్స్ విమానం కూడా ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో 54 మంది ప్రయాణికులు చనిపోయారు. ఏడాదిక్రితం ఎయిర్ ఏసియా విమాన ప్రమాదలో 162 మంది ప్రాణాలు కోల్పోయారు. తక్కువ ధరలకే విమాన ప్రయాణం కల్పించే సంస్థగా పేరున్న లయన్ ఎయిర్‌కు చెందిన పలు విమానాలకు కూడా గతంలో ప్రమాదాలకు గురైన చరిత్ర ఉంది. 1999లో ప్రారంభం లయన్ ఎయిర్ సంస్థను 1999లో ప్రారంభించారు. ప్రయాణికుల సంఖ్య పరంగా ఇండోనేసియాలో ఇది అతి పెద్ద విమానయాన సంస్థ. అంతర్జాతీయంగానే కాకుండా, దేశీయంగా వేలాది ద్వీపాలకు డజన్ల సంఖ్యలో విమానాలను నడుపుతోంది. ప్రపంచవ్యాప్తంగా చూసినా, మలేసియాకు చెందిన ఎయిర్ఏషి యా తరువాత చవకైన ఎయిర్‌లైన్ ఇదే. ఈ సంస్థ నడుపుతున్న విమానాల్లో అత్యధికం బోయింగ్ 737 రకానివే. ఈ ఏడాది మొదట్లో 6.24 మిలియన్ డాలర్లతో 50 బోయింగ్ విమానాల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చింది. భారత్‌లో సేఫే: డీజీసీఏ భారత్‌లో విధుల్లో ఉన్న బోయింగ్ 737 మాక్స్ విమానాల్లో సాంకేతికపరమైన ఎలాంటి లోపాలు ఇప్పటివరకు తలెత్తలేదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ప్రకటించింది. భారత్‌లో స్పైస్ జెట్, జెట్ ఎయిర్వేస్ సంస్థలు భారత్‌లో ఈ రకానికి చెందిన ఆరు విమానాలను నడుపుతున్నాయి. ఎందుకు ఇక్కడే ప్రమాదాలు ఎక్కువ? సుహార్తో నాయకత్వం కింద సైనిక పాలనలో ఉన్న ఇండోనేసియా 1997లో ప్రజాస్వామ్యానికి మళ్లింది. పర్యాటక రంగం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని 2000లో విమానయాన రంగంలో ప్రైవేటు సంస్థలకు తలుపులు తెరిచింది. దాంతో అనేక సంస్థలు ఇక్కడ నుంచి సర్వీసులు ప్రారంభించాయి. ప్రస్తుతం దాదాపు 60 విమానయాన సంస్థలు ఇక్కడ పని చేస్తున్నాయి. సంస్థలు ఎక్కువ కావడంతో పోటీ పెరిగి ధరల యుద్ధానికి దారి తీసింది. టికెట్ల రేట్లు పోటీ పడి తగ్గిస్తున్న సంస్థలు నాణ్యత, భద్రత విషయంలో రాజీ పడుతున్నాయి. దీనిపై ప్రభుత్వ పర్యవేక్షణ కూడా కొరవడింది. ఫలితంగా ప్రమాదాలు పెరిగాయి. 2000 నుంచి తాజా ప్రమాదం వరకు లెక్కిస్తే ఇండోనేసియాలో మొత్తం 45 భారీ ప్రమాదాలు జరిగాయి. 1950–1999 మధ్య 35 ప్రమాదాలు జరిగాయి. ఒక్క 1997లో జరిగిన వివిధ ప్రమాదాల్లో మొత్తం 380 మంది చనిపోయారు. ఇండోనేసియా విమానయాన సంస్థల నిర్వహణలో భద్రతాపరమైన లోపాలున్నాయంటూ యూరోప్ దేశాలకు అక్కడి నుంచి విమాన సర్వీసులు నడపొద్దంటూ యూరోపియన్ యూనియన్ జూన్ 2016లో నిషేధం విధించింది. అమెరికా కూడా దశాబ్దం పాటు విధించిన నిషేధాన్ని 2016లో తొలగించింది. పైలట్ భారతీయుడు ప్రమాదానికి గురైన విమాన ప్రధాన పైలట్ భారతీయుడైన భవ్య సునేజా(31) అని, ఈ ప్రమాదంలో ఆయన కూడా దుర్మరణం చెందారని అక్కడి భారతీయ ఎంబసీ ప్రకటించింది. ఈ విమాన కో పైలట్‌గా హర్వీనో వ్యవహరించారు. సునేజాకు 6 వేల గంటలు, కో పైలట్ హర్వీనోకు 5 వేల గంటలకు పైగా విమానాలను నడిపిన అనుభవం ఉంది. సునేజా ఢిల్లీకి చెందిన వారు. మయూర్ విహార్‌లోని ఆల్కాన్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. 2009లో బెల్ ఎయిర్ ఇంటర్నేషనల్ నుంచి పైలట్ లైసెన్స్ పొందారు. లయన్ ఎయిర్ సంస్థలో 2011 మార్చ్‌లో చేరారు. అంతకుముందు ఎమిరేట్స్‌లో ట్రైనీ పైలట్‌గా చేశారు. లయన్ ఎయిర్ సంస్థను విడిచి భారత్‌కు వచ్చి ఇక్కడి సంస్థలో పని చేయా లని సునేజా భావించా రని భారత్‌కు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ వైస్ ప్రసిడెంట్ ఒకరు తెలిపారు. అందుకోసం తమను సంప్రదించాడని, అనుభవజ్ఞుడైన అలాంటి పైలట్ తమకూ అవసరమేనని భావించి, తాము కూడా సుముఖంగానే స్పందించామని చెప్పారు. అయితే, ఆయన ఢిల్లీ పోస్టింగ్ అడగడంతో, సర్వీస్‌లో చేరిన ఏడాది తరువాత ఢిల్లీ పోస్టింగ్ ఇస్తామని చెప్పామని వివరించారు. పైలట్ భవ్య సునేజా -
సరస్సులోకి దూసుకెళ్లింది..
మజురో(మార్షెల్ ఐలాండ్స్): న్యూజిలాండ్‌లో ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో రన్‌వే నుంచి పక్కకు జారిన విమానం సరస్సులోకి దూసుకెళ్లింది. సరుస్సు లోతుగా లేకపోవడంతో కొందరు ప్రయాణికులు ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చి ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ఘటన న్యూజిలాండ్‌లోని మైక్రోనేసియా ద్వీపంలో జరిగింది. 36 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బందితో వస్తున్న ఎయిర్ న్యుగిని బోయింగ్ 737 విమానం వెనో విమానాశ్రయంలో దిగుతూ అదుపుతప్పింది. ఒక్కసారిగా విమానం రన్‌వే పై నుంచి పక్కనే ఉన్న సరస్సులోకి దూసుకెళ్లింది. సరస్సు లోతు తక్కువ కావడంతో పూర్తిగా మునగలేదు. స్థానికులు పడవలతో వెళ్లి ప్రయాణికులు, సిబ్బందిని కాపాడారు. కొందరేమో ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని ఎయిర్‌పోర్టు సిబ్బంది తెలిపారు. ప్రమాద కారణాలు స్పష్టంగా తెలియకున్నా.. ప్రమాద సమయంలో భారీ వర్షం, తక్కువ వెలుగు ఉండటం కారణం కావచ్చని ఎయిర్‌లైన్స్ వర్గాలు పేర్కొన్నాయి. ఇక్కడ రన్‌వే పొడవు కేవలం 1831 మీటర్లు. 2008లో ఏసియా పసిఫిక్ ఎయిర్‌లైన్స్ కార్గో బోయింగ్ 727 విమానం కూడా రన్‌వేను దాటి ముందుభాగం వరకు సరస్సులోకి దూసుకెళ్లింది. -
పైలట్ల తప్పిదం.. విమానంలో నరకం
ముంబై: పైలట్ల తప్పిదం వల్ల దాదాపు 30 మంది విమాన ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. గురువారం ముంబై నుంచి జైపూర్‌కు 166 మంది ప్రయాణికులతో వెళ్తున్న జెట్ ఎయిర్వేస్ విమానంలో ఒక్కసారిగా పీడనం తగ్గడంతో పలువురు ప్రయాణికుల ముక్కుల్లోంచి, చెవుల్లోంచి రక్తం రావడంతో అంతా ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విమానంలోని ఎయిర్ ప్రెషర్ బటన్స్ ఆన్ చేయకపోవడం వల్ల ఈ దారుణం జరిగింది. ఏం జరుగుతుందో తెలియక ఉక్కిరిబిక్కిరైన ప్రయాణికులంతా ఆక్సిజన్ మాస్క్‌లు ధరించారు. కొద్దిసేపటికి తప్పు తెలుసుకున్న పైలట్లు టేకాఫ్ అయిన 23 నిమిషాల అనంతరం విమానాన్ని తిరిగి మళ్లీ ముంబై విమానాశ్రయంలో దించారు. చెవులు, ముక్కుల నుంచి రక్తం వచ్చిన ఐదుగురు ప్రయాణికులకు తాత్కాలికంగా వినికిడి సమస్య ఏర్పడిందని(బారోట్రామా), రెండు వారాల్లో కోలుకుంటారని ముంబైలోని బాలాభాయ్ నానావతి ఆస్పత్రి వైద్యులు తెలిపారు. వారి ఆరోగ్య పరిస్థితి సాధారణంగా ఉండడంతో వైద్య పరీక్షల అనంతరం డిశ్చార్జ్ చేశారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశం ఈ ఘటనకు బాధ్యులైన పైలట్లను విధుల నుంచి తప్పించారు. విమాన ప్రమాద దర్యాప్తు విభాగం(ఏఏఐబీ)చే విచారణకు ఆదేశించింది. విమానం ఇంజిన్లు ఆన్ చేసే ముందు క్యాబిన్‌లోని ఒత్తిడి నియంత్రణను సరిచూసుకోవడం పైలట్ల బాధ్యతని, వారి నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన జరిగిందని ఏఏఐబీ అధికారి తెలిపారు. విమానం ఎగరడానికి ముందు ‘బ్లీడ్’ స్విచ్‌ను ఆన్ చేయడం సిబ్బంది మరిచిపోయారని, దాంతో క్యాబిన్లో ఒత్తిడి నియంత్రణ కాలేదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) తెలిపింది. బోయింగ్ 737 విమానం క్యాబిన్లో ప్రెషర్ లోపం వల్ల ముంబైకి తిరిగి వచ్చిందని, పైలట్లను విధుల నుంచి తప్పించామని, దర్యాప్తు కొనసాగుతోందని జెట్ ఎయిర్వేస్ అధికార ప్రతినిధి తెలిపారు. ‘మొత్తం 166 మంది ప్రయాణికుల్లో 30 మంది ఇబ్బంది పడ్డారు. కొందరికి నోటి నుంచి, చెవుల నుంచి రక్తం వచ్చింది. కొందరు తలనొప్పితో ఇబ్బంది పడ్డారు’ అని చెప్పారు. ప్రయాణికులకు క్షమాపణలు చెప్పిన జెట్ ఎయిర్వేస్.. ప్రయాణికుల్ని వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ‘ఒక్కసారిగా గాలి ప్రెషర్ తగ్గింది. వెంటనే ఆక్సిజన్ మాస్క్‌లు ధరించాం. చెవుల్లో తీవ్రమైన నొప్పి ఉందని చాలా మంది ఫిర్యాదు చేశారు’ అని ఉద్యోగి ప్రశాంత్ శర్మ తెలిపారు. 30 లక్షల పరిహారం ఇవ్వాలి: బాధితుడు తనకు జరిగిన నష్టానికి రూ. 30లక్షల పరిహారంతో పాటు, ఎకానమీ క్లాస్ టికెట్‌పై బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించేందుకు 100 వోచర్లు ఇవ్వాలని వినికిడి లోపంతో ఇబ్బందిపడుతున్న ప్రయాణికుడు ఒకరు డిమాండ్ చేశారని ఎయిర్‌లైన్స్ సిబ్బంది వెల్లడించారు. -
క్యూబాలో ఘోర విమాన ప్రమాదం!
హవానా: క్యూబాలో శుక్రవారం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ప్రభుత్వ విమానయాన సంస్థ క్యూబానాకు చెందిన ఓ విమానం రాజధాని హవానాలోని జోస్ మార్టి విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే కూలిపోయింది. ప్రమాదం సమయంలో విమానంలో 104 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బంది ఉండగా ఎంతమంది మరణించిందీ కచ్చితంగా తెలియరాలేదు. బోయింగ్ 737 రకం విమానం హవానా నుంచి హోల్గ్యిన్ పట్టణానికి వెళ్తుండగా హవానాకు దగ్గర్లోనే పంట పొలాల్లో కూలి కాలిపోయింది. ప్రమాదం వల్ల దట్టమైన పొగ కమ్ముకున్న ఆ ప్రాంతానికి సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. క్యూబా అధ్యక్షుడు మిగ్యుల్ డియాజ్–కేనెల్ ప్రమాద స్థలాన్ని పరిశీలించి, మరణించిన వారి సంఖ్య భారీగానే ఉంటుందని చెప్పారు. -
కీచక పైలట్‌కు ఉద్వాసన
న్యూఢిల్లీ: ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన కమాండర్ స్థాయి పైలట్‌ను స్పైస్‌జెట్ సంస్థ శనివారం విధుల నుంచి తొలగించింది. ఫిబ్రవరి 28న కోల్‌కతా-బ్యాంకాక్ విమానంలోని కమాండర్.. ఎయిర్ హోస్టెస్‌ను కాక్‌పిట్‌లో కూర్చోవాలని వేధించాడు. అంతేకాకుండా తన సహచర పైలట్‌ను తాను చెప్పేంత వరకు లోనికి రావొద్దని బెదిరించాడు. క్యాబిన్ సిబ్బంది పట్ల దురుసుగా, అసభ్య పదజాలంతో మాట్లాడాడు. మరుసటిరోజు ఎయిర్ హోస్టెస్ ఫిర్యాదు చేయగా, విచారణ జరిపిన స్పైస్‌జెట్ కమిటీ.. కమాండర్‌ను దోషిగా తేల్చింది. లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013 ప్రకారం పైలట్‌పై చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. -
కాక్‌పిట్‌లో పైలట్ పోకిరీ వేషాలు
విధి నిర్వహణలో ఉన్న సమయంలో ఎయిర్ హోస్టెస్‌ని తన పక్కన కూర్చోమన్న ఓ పైలట్ ఉద్యోగం ఊడింది. కాక్ పిట్లో చీఫ్ ఎయిర్ హోస్టెస్‌ని తన పక్కన కూర్చోమన్నందుకు, స్పైస్ జెట్ పైలట్‌ని విధుల్లోంచి తొలగించింది. ఫిబ్రవరి 28న బోయింగ్ 737 విమానం కోల్‌కతా నుంచి బ్యాంకాక్ వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. విమానం తిరుగు ప్రయాణంలోనూ పైలట్ ఎయిర్ హోస్టస్‌ను వేధించడం ఆపలేదు. అదే సమయంలో కో-పైలెట్ టాయిలెట్‌కు వెళ్లాడు. అతనికి కాక్ పిట్లోకి చాలా సేపటి వరకు లోపలికి రావడానికి పైలెట్ అనుమతి ఇవ్వలేదు. ఈ ఘటనపై ఎయిర్ హోస్టస్ ఫిర్యాదు మేరకు స్పైస్ జెట్ విచారణ ప్రారంభించింది. అంతే కాకుండా తనతో అసభ్యకరంగా పదజాలంతో పైలెట్ దూషించాడని ఎయిర్ హోస్టస్ ఫిర్యాదులో పేర్కొంది. ఘటనపై సిబ్బంది అభిప్రాయాలు సేకరించిన తర్వాత సదరు పైలెట్‌ను స్పైస్ జెట్ సస్పెండ్ చేసింది. పూర్తి స్థాయి విచారణ జరిగిన తర్వాత దోషిగా తేలితే పైలెట్ లైసెన్స్‌ను కూడా రద్దు చేస్తామని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) తెలిపింది. -
రష్యాలో విమాన ప్రమాదం, 50 మంది మృతి
స్థానిక ఎయిర్ లైన్ కు చెందిన బోయింగ్ 737 విమానం ల్యాండింగ్ సమయంలో ప్రమాదానికి గురైన ఘటనలో 50 మంది మృతి చెందారు. ఈ విమానంలో 44 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నట్టు ప్రాథమిక సమాచారం. ఈ దుర్ఘటన వెస్టర్న్ తతర్స్ఠాన్ సమీపంలో చోటుచేసుకుంది. మాస్కో డమోదేద్వ్ ఎయిర్ పోర్ట్ నుంచి వస్తున్న విమానం కజన్ లోని ఓల్గాలో 7.25 ప్రమాదానికి గురైంది. రన్ వేను ఢికొట్టడంతో మంటలు అంటుకున్నాయని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గురి కావడానికి ముందు మూడు సార్లు ల్యాండింగ్ అవటానికి ప్రయత్నం జరిగింది అని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.