కాక్పిట్లో పైలట్ పోకిరీ వేషాలు
విధి నిర్వహణలో ఉన్న సమయంలో ఎయిర్ హోస్టెస్ని తన పక్కన కూర్చోమన్న ఓ పైలట్ ఉద్యోగం ఊడింది. కాక్ పిట్లో చీఫ్ ఎయిర్ హోస్టెస్ని తన పక్కన కూర్చోమన్నందుకు, స్పైస్ జెట్ పైలట్ని విధుల్లోంచి తొలగించింది. ఫిబ్రవరి 28న బోయింగ్ 737 విమానం కోల్కతా నుంచి బ్యాంకాక్ వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. విమానం తిరుగు ప్రయాణంలోనూ పైలట్ ఎయిర్ హోస్టస్ను వేధించడం ఆపలేదు. అదే సమయంలో కో-పైలెట్ టాయిలెట్కు వెళ్లాడు. అతనికి కాక్ పిట్లోకి చాలా సేపటి వరకు లోపలికి రావడానికి పైలెట్ అనుమతి ఇవ్వలేదు.
ఈ ఘటనపై ఎయిర్ హోస్టస్ ఫిర్యాదు మేరకు స్పైస్ జెట్ విచారణ ప్రారంభించింది. అంతే కాకుండా తనతో అసభ్యకరంగా పదజాలంతో పైలెట్ దూషించాడని ఎయిర్ హోస్టస్ ఫిర్యాదులో పేర్కొంది. ఘటనపై సిబ్బంది అభిప్రాయాలు సేకరించిన తర్వాత సదరు పైలెట్ను స్పైస్ జెట్ సస్పెండ్ చేసింది. పూర్తి స్థాయి విచారణ జరిగిన తర్వాత దోషిగా తేలితే పైలెట్ లైసెన్స్ను కూడా రద్దు చేస్తామని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) తెలిపింది.