జెట్ ఎయిర్‌వేస్ విమానంలో ఆక్సిజన్ మాస్క్‌లు ధరించిన ప్రయాణికులు
ముంబై: పైలట్ల తప్పిదం వల్ల దాదాపు 30 మంది విమాన ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. గురువారం ముంబై నుంచి జైపూర్‌కు 166 మంది ప్రయాణికులతో వెళ్తున్న జెట్ ఎయిర్‌వేస్ విమానంలో ఒక్కసారిగా పీడనం తగ్గడంతో పలువురు ప్రయాణికుల ముక్కుల్లోంచి, చెవుల్లోంచి రక్తం రావడంతో అంతా ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విమానంలోని ఎయిర్ ప్రెషర్ బటన్స్ ఆన్ చేయకపోవడం వల్ల ఈ దారుణం జరిగింది. ఏం జరుగుతుందో తెలియక ఉక్కిరిబిక్కిరైన ప్రయాణికులంతా ఆక్సిజన్ మాస్క్‌లు ధరించారు.
కొద్దిసేపటికి తప్పు తెలుసుకున్న పైలట్లు టేకాఫ్ అయిన 23 నిమిషాల అనంతరం విమానాన్ని తిరిగి మళ్లీ ముంబై విమానాశ్రయంలో దించారు. చెవులు, ముక్కుల నుంచి రక్తం వచ్చిన ఐదుగురు ప్రయాణికులకు తాత్కాలికంగా వినికిడి సమస్య ఏర్పడిందని(బారోట్రామా), రెండు వారాల్లో కోలుకుంటారని ముంబైలోని బాలాభాయ్ నానావతి ఆస్పత్రి వైద్యులు తెలిపారు. వారి ఆరోగ్య పరిస్థితి సాధారణంగా ఉండడంతో వైద్య పరీక్షల అనంతరం డిశ్చార్జ్ చేశారు.
ఘటనపై దర్యాప్తునకు ఆదేశం
ఈ ఘటనకు బాధ్యులైన పైలట్లను విధుల నుంచి తప్పించారు. విమాన ప్రమాద దర్యాప్తు విభాగం(ఏఏఐబీ)చే విచారణకు ఆదేశించింది. విమానం ఇంజిన్లు ఆన్ చేసే ముందు క్యాబిన్‌లోని ఒత్తిడి నియంత్రణను సరిచూసుకోవడం పైలట్ల బాధ్యతని, వారి నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన జరిగిందని ఏఏఐబీ అధికారి తెలిపారు. విమానం ఎగరడానికి ముందు ‘బ్లీడ్’ స్విచ్‌ను ఆన్ చేయడం సిబ్బంది మరిచిపోయారని, దాంతో క్యాబిన్‌లో ఒత్తిడి నియంత్రణ కాలేదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) తెలిపింది.
బోయింగ్ 737 విమానం క్యాబిన్‌లో ప్రెషర్ లోపం వల్ల ముంబైకి తిరిగి వచ్చిందని, పైలట్లను విధుల నుంచి తప్పించామని, దర్యాప్తు కొనసాగుతోందని జెట్ ఎయిర్‌వేస్ అధికార ప్రతినిధి తెలిపారు. ‘మొత్తం 166 మంది ప్రయాణికుల్లో 30 మంది ఇబ్బంది పడ్డారు. కొందరికి నోటి నుంచి, చెవుల నుంచి రక్తం వచ్చింది. కొందరు తలనొప్పితో ఇబ్బంది పడ్డారు’ అని చెప్పారు. ప్రయాణికులకు క్షమాపణలు చెప్పిన జెట్ ఎయిర్‌వేస్.. ప్రయాణికుల్ని వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ‘ఒక్కసారిగా గాలి ప్రెషర్ తగ్గింది. వెంటనే ఆక్సిజన్ మాస్క్‌లు ధరించాం. చెవుల్లో తీవ్రమైన నొప్పి ఉందని చాలా మంది ఫిర్యాదు చేశారు’ అని ఉద్యోగి ప్రశాంత్ శర్మ తెలిపారు.
30 లక్షల పరిహారం ఇవ్వాలి: బాధితుడు
తనకు జరిగిన నష్టానికి రూ. 30లక్షల పరిహారంతో పాటు, ఎకానమీ క్లాస్ టికెట్‌పై బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించేందుకు 100 వోచర్లు ఇవ్వాలని వినికిడి లోపంతో ఇబ్బందిపడుతున్న ప్రయాణికుడు ఒకరు డిమాండ్ చేశారని ఎయిర్‌లైన్స్ సిబ్బంది వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment