సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల విమానాలను ఫ్రైటర్లుగా మార్చే సరికొత్త ప్రాజెక్టు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్రంగా ప్రారంభమైంది. ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని కల్పిస్తున్న బోయింగ్–737 విమానాన్ని ఫ్రైటర్‌గా మార్చనున్నారు. ఈ మేరకు విమానాశ్రయంలో మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్ హాలింగ్ (ఎంఆర్‌ఓ) సేవలు అందజేసే జీఎమ్మార్ ఎయిరో టెక్నిక్ (జీఏటీ)కి, బోయింగ్ సంస్థకు మధ్య తాజాగా ఒప్పందం కుదిరింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు తరువాత అతిపెద్ద ఎయిర్‌పోర్టుగా సేవలందిస్తున్న హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలోనే మొట్టమొదటిసారి విమానాల మార్పు రంగంలోకి అడుగుపెట్టినట్లయింది.
ఈ తరహా కన్వర్షన్ సాంకేతిక పరిజ్ఞానం అమలులో చైనా, బ్రిటన్, కోస్టారికా తరువాత నాలుగో స్థానంలో హైదరాబాద్ నిలిచినట్లు ఎయిర్‌పోర్టు అధికారవర్గాలు తెలిపాయి. ఈ ఒప్పందం మేరకు బోయింగ్ –737 నుంచి బోయింగ్ –800 వరకు ప్రయాణికుల విమానాలను బోయింగ్ కన్వర్టెడ్ ఫ్రైటర్స్ (బీసీఎఫ్)గా మార్పు చేయనున్నారు. ఈ ఏడాది నుంచి రానున్న ఐదేళ్లలో 30 విమానాలను ఫ్రైటర్లుగా అభివృద్ధి చేయనున్నారు.
ఒప్పందం ప్రతిష్టాత్మకం
విమానాల కన్వర్షన్ కోసం బోయింగ్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్ హాలింగ్ కేంద్రాల నుంచి బిడ్‌లను ఆహా్వనించగా చివరకు హైదరాబాద్ ఎయిర్‌పోర్టులోని ఎంఆర్‌ఓకు ఈ కాంట్రాక్ట్ లభించడం విశేషం. రానున్న రోజుల్లో బోయింగ్ సరుకు రవాణా రంగంలో తన సేవలను మరింత విస్తృతం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సుమారు 75 ఫ్రైటర్లను బోయింగ్ అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.
దీంతో ఎయిర్ కార్గోలో ఇది 6.3 శాతం వరకు విస్తరించనుందని పేర్కొన్నారు. మరోవైపు ఈ–కామర్స్ రంగం పెద్దఎత్తున అభివృద్ధి చెందిన దృష్ట్యా హైదరాబాద్ నుంచి అమెరికాతోపాటు వివిధ దేశాలు, మన దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు మధ్య ఫ్రైటర్స్ డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. కోవిడ్ దృష్ట్యా అంతర్జాతీయంగా రాకపోకలు తగ్గుముఖం పట్టడంతో పలు ఎయిర్‌లైన్స్ సరుకు రవాణా రంగంలోకి తమ సేవలను మార్పు చేశాయి. ఈ క్రమంలోనే బోయింగ్ సైతం ఈ రంగంలో విస్తరణకు చర్యలు చేపట్టింది. బోయింగ్ సంస్థ గత 40 ఏళ్లుగా ప్రయాణికుల సేవలో ఉంది.
ఎంఆర్‌ఓలదే భవితవ్యం
ప్రపంచవ్యాప్తంగా విమానాల మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాలింగ్(ఎంఆర్‌ఓ) సేవలకు గొప్ప భవిష్యత్తు ఉందని జీఎమ్మార్ ఎయిరో టెక్నిక్ సంస్థ సీఈవో అశోక్ గోపీనాథ్ వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తాము ఎంఆర్‌ఓ సేవలను అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి అన్ని ప్రధాన అంతర్జాతీయ నగరాలకు కార్గో సేవలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment